Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెనిన్పై కాల్చివేత ఉత్తర్వులతో పాటు ఎక్కడ ఉన్న అరెస్టు చేయాలని కమిటీ సభ్యులను నిర్భంధించాలని ఆదేశాలు వెళ్ళాయి. అంతకు ముందే ఈ కుట్రను పసిగట్టిన లెనిన్ 1917 అక్టోబర్ 24న అర్ధరాత్రి పెట్రోగ్రాడ్‌ను హస్తగతం చేసుకున్నారు. స్మోల్నిలోని వింటర్ ప్యాలస్ (పార్లమెంట్) ను 25వ రాత్రి హస్తగతం చేసుకొని మహాత్తర అక్టోబర్ విప్లవాన్ని సాధించారు. ఆ విధంగా విప్లవం విజయవంతం కాగానే మొట్ట మొదట భూమిపై డిక్రి విడుదల చేస్తూ దున్నేవాడికే భూమిపై హక్కు కల్పించారు. ఆ విధంగా విప్లవం విజయవంతం అయింది.
రష్యాలో జార్ చక్రవర్తి అధికారంలో ఉండగా ప్రజలు బానిసత్వంలో మగ్గారు. తమ విముక్తి కొరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేశారు. 1861లో బానిసత్వాన్ని రద్దు చేశారు. అంతకుముందు ఉన్న నోబుల్ వ్యవస్థలో బానిసలు తీవ్రంగా హింసకు గురయ్యారు. మొత్తం ప్రజల్లో మూడో వంతు, రైతుల్లో 50శాతం బానిసలుగా ఉన్నారు. ఈ నోబుల్స్ అనే వారు జార్ చక్రవర్తికి
రక్షణాధికారులుగానూ, పరిపాలనా అధికారులు గానూ పనులు చేసి పెట్టారు. వారికి వచ్చిన ఆదాయంతో బానిసలను పోషించేవారు. బానిసల్లో వస్తున్న అసంతృప్తిని గమనించి వీరికి కొంత స్వేచ్ఛ కల్పించాలని నాటి జార్ చక్రవర్తి ఆశించాడు. అప్పటికే మిత్ర దేశాలతో జరిగిన యుద్ధంలో రష్యా ఓడిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్, టర్కి లతో జరిగిన క్రిమిన్ యుద్ధ ఓటమితో బానిసలకు స్వేచ్చ కల్పించాలన్న వాదన బలపడింది. 1861లో రష్యాలోని మెజార్టి ప్రాంతం బానిస వ్యవస్థను విముక్తి చేస్తూ నోబుల్స్ వద్ద ఉన్న భూములను వీరికి పంపిణీ చేశారు. కానీ నోబుల్స్ మంచి భూములను తామే ఉంచుకున్నారు. భూస్వాములు మూడింట రెండు వంతుల భూమిని ఆక్రమించారు. మిగిలిన మూడో వంతు భూమిని బానిసలకు పంపిణీ చేశారు. ఆ భూమి సాగు ద్వారా బానిసనలకు కనీస తిండి అవసరాలు కూడా తీరలేదు. ఈ భూములను కూడా 100శాతం తాకట్టుపై వారు కొన్నారు. 80శాతం స్టేట్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం, 20శాతం భూస్వాముల నుంచి అప్పు తీసుకుని బానిసలు భూములు కొనుగోలు చేశారు. ఈ అప్పులపై వడ్డీలు తీర్చలేక చాలా మంది బానిసలు భూములు వదులుకున్నారు. ఈ వడ్డీలను గ్రామంలోని కమిటీలు నిర్బంధంగా వసూలు చేశాయి. 1861కి ముందు భూ స్వాములకు బానిసలుగా ఉన్న రైతులు ఆ తర్వాత గ్రామానిక బానిసలుగా మారారు. 1864-71 మధ్య జార్జియాలోనూ, 1892లో కల్మికియాలోనూ బానిసత్వ రద్దు జరిగింది. కానీ వాస్తవ హక్కుదారులుగా లేరు. పంటలు పండే భూములన్నీ నోబుల్స్, కులక్కులు స్వాధీనం చేసుకున్నారు. నాడు రష్యాలో 36.45 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా, 81కోట్ల ఎకరాలు అడవి, 9.28 ఎకరాలు పచ్చికబయిళ్ళుగా ఉంది. జనాభా 12.56 కోట్ల మంది ఉన్నారు. ఇందులో సగం మంది బానిసలు ఉన్నారు. 1826-54 మధ్య 712 రైతు ఉద్యమాలు వచ్చాయి. వీరిని బానిస విముక్తి ద్వారా శాంతపర్చాలని జార్ చక్రవర్తి ఊహించాడు. లక్షల మంది బానిస రైతులు సైబిరియాలోని పచ్చిక బయళ్ళకు వలసలు వెళ్లారు. వ్యవసాయాదాయం సంవత్సరంలో సగం రోజులకు కూడా సరిపోయేది కాదు. ఆర్ధాఆకలికి అలవాటు పడ్డారు. పోరాటాల సందర్భంగా లక్షల మంది బానిసలను సైబీరియా, తుర్కిస్తాన్ ప్రాంతాలకు ప్రవాసాల పేరుతో శిక్షలు విధించారు. పాత కాలపు సాగునీటి వనరులతో చాలా ప్రాంతం ఎడారిగా ఉండింది. గ్రామ కమ్యూన్ (మిర్)కి భూమి అప్పగించారు. ఎవరైనా బానిసలు భూములు కొనుగోలు చేసినచో గ్రామ కమ్యూన్కు బాకీలు చెల్లించాలి. 1905 విప్లవం తర్వాత బానిసత్వం రద్దు అయినప్పటికీ భూములు మాత్రం వీరి చేతికి రాలేదు. తీవ్రమైన చలి కలిగిన రష్యాలో కాళ్లకు బూట్లు లేకుండా, శరీరం నిండా కప్పుకోవడానికి బట్టలు లేకుండా, అర్ధాకలితో వ్యవసాయం సాగించారు. వీరి ఇండ్లు చలిని తట్టుకొగల్గిన స్థితిలో లేవు. ఒకే ఇంట్లో రెండు, మూడు జతలు కలిపి ఉండేవారు. పండుగ రోజున సైతం మంచి భోజనం లభించలేదు. చదువు అనేది వీరు ఎరుగరు. 1914 విప్లవ కాలంలో నోబుల్స్ తమ భూములను బ్యాంకుకు తాకట్టు పెట్టారు. కొందరు మున్సిపాలిటీలకు, వ్యాపారులకు, కులక్కులకు తాకట్టు పెట్టారు. ఈ సందర్భంగా తమకు ఉన్న భూమిలో మూడో వంతు అమ్ముకున్నారు. మరో మూడో వంత కుదువ పెట్టారు. మిగలిన మూడో వంతు చిన్న మొత్తాలు చెల్లించి బానిసలను భూములను తీసుకోమ్మన్నారు. ఆ భూములు తీసుకున్న బానిసలు తమ జీవిత కాలంలో వడ్డీలు చెల్లిస్తూ, బాకీలను వారసత్వంగా కుటుంబాలకు అప్పగించారు. ఆ కాలంలో బానిసలు 11.80 కోట్ల రూబుల్స్ బాకీ పడ్డట్టు నాటి గణాంకాలు చెప్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ఉన్న రష్యాలో విప్లవం తీసుకురావడానికి లెనిన్ కృషి అత్యంత కీలకమైనది. 22 ఏప్రిల్ 1870లో జన్మించిన లెనిన్ విశ్వవిద్యాలయంలో 1887లో న్యాయవాద డిగ్రీ పొందారు. విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నందుకు బహిష్కరించబడ్డాడు. 1893లో సెంట్ పీటర్స్ బర్గ్‌కు మారాడు. జార్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన జైళ్ళలో పెట్టేవారు. లెనిన్ సంపాదకత్వాన 'కార్మికుల లక్ష్యం' పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు చేయడంతో సైబీరియాకు రెండు సంవత్సరాల ప్రవాసం శిక్ష విధించారు. 5 సార్లు తప్పించుకునే ప్రయత్నం చేసిన ఫలితం రాలేదు. 1875లో దక్షిణ రష్యా కార్మిక సంఘం ఏర్పాటు చేశాడు. 1878లో ఉత్తర రష్యా కార్మిక సంఘం సెంట్ పీటర్స్ పరిధిలో ఏర్పాటు అయ్యింది. అప్పటి కమ్యూనిస్టు ప్రణాళిక, జీతం, కూలీ, పెట్టుబడి, శాస్త్రీయ సోషలిజం-ఉహజనితం పుస్తకాలు వెలువడినాయి. 1896లో 30 వేల మంది బట్టల కార్మికుల సమ్మెతో ఆర్థికవాదంపై పోరాటం సాగింది. 1894లో మాస్కోలో కార్మిక సంఘం ఏర్పడింది. రష్యాలో ఏర్పడిన సోషల్ డెమోక్రొటిక్ లెబర్ పార్టీలో అనేక విబేధాలు పెరిగాయి. 'విప్లవ సిద్ధాంతం లేనిదే విప్లవ పార్టీ లేదని' లెనిన్ ప్రకటించాడు. అప్పటికే ఇస్క్రా (నిప్పురవ్వ') పత్రిక నడుస్తున్నది. లండన్‌లో జరిగిన సోషల్ డెమోక్రొటిక్ లెబర్ పార్టీ మహాసభలో బొల్షవిక్కులు, మెన్షవిక్కులుగా పార్టీలో ఏర్పడ్డారు. లెనిన్ బలపర్చిన ఇస్క్రాను 33 మంది బలపర్చారు. (మొత్తం 51 ఓట్లలో) బొల్షవిక్కులు 'ముందడుగు' పత్రిక తెచ్చారు. మరోవైపున రష్యా- జపాన్ యుద్ధం ప్రారంభమైంది. జపాన్‌కు ఇంగ్లాండు సహకరించడంతో జార్ చక్రవర్తి ఓటమి పాలైనాడు. మరోవైపున రైతులు ఉద్యమంగా తిరగబడ్డారు. చక్కెర ప్యాక్టరీలను రైతులు తగలబెట్టారు. కార్మిక-కర్షక మైత్రి ఏర్పడింది. 1905లో కార్మికవర్గ సోవియేట్ల అవతరణ జరిగింది. ఇది 1917 బొల్షవిక్ విప్లవానికి నాంది అయ్యింది. 8 గంటల పని దినానిని ప్రభుత్వానికి పన్నులు చెల్లించ నిరాకరించడం జరిగింది. ఎక్కడ చూసిన సమ్మెలు కొనసాగాయి. 1903లో గ్రామీణ పేదలకు అన్న పుస్తకం ప్రచురించబడింది. 1905 జనవరి 9న సెంట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన 'బ్లడీ సండే' ఘటనలు విప్లవ తూఫాన్ విజృంభించటానికి కారణ భూతం అయినాయి. 1,40,000 మంది విధుల్లో గుమ్మికుడారు. సైన్యానికి కాల్పులు జరపమని ఆర్డర్లు వెళ్ళాయి. ఫాదర్ గఫాన్ జార్‌కు మోమొరాండం ఇస్తామని తీసుకేళ్ళి కాల్పులకు గురిచేయగా 1000 మంది చనిపోయారు. జారుపై దెబ్బకు దెబ్బ తీస్తామని కార్మికులు నినదించారు. 1905 నవంబర్ తొలి రోజుల్లో లెనిన్ పీటర్స్బర్గ్ చేరుకొని విప్లవానికి నాయకత్వం వహించాడు. 8గంటల పనిని అమలు జరిపాయి. వర్కర్స్ ప్రతినిధులతో కూడిన సోవియేట్లు స్థాపించబడినాయి. కానీ జార్‌కు వ్యతిరేకంగా ఇంకా స్థిరమైన కార్మిక-కర్షక మైత్రి ఏర్పడలేదు. రైతులు విప్లవాన్ని అణచడానికే జార్చక్రవర్తికి తోడ్పడారు. కార్మికవర్గ పార్టీలో ఐక్యత లేదు. ఆ విధంగా 1905 పోరాటం విఫలమైంది. ఆ పోరాటాన్ని లెనిన్ డ్రెస్ రిహార్సల్‌గా తీసుకొని బొల్షవిక్కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాడు.
1914 జూలై 28న ప్రథమ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆస్ట్రియా సెర్బియాపై దాడి చేసింది. రష్యాకు వ్యతిరేకంగా ఆగస్టు 1న యుద్ధం ప్రకటించారు. ఫ్రాన్స్ 3వ తేదీన రంగంలోకి దిగింది. మరొక రోజు ఆలస్యంగా బ్రిటన్ ప్రవేశించింది. యూరోఫియన్ యూనియన్ దేశాలన్నింటిలోని సోషలిస్టు పార్టీలు యుద్ధానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా, సెర్బియా, కెనడా, ఆస్ట్రియా, న్యూజిలాండ్ పార్టీలు మాత్రం యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానించాయి. బొల్షవిక్కుల పార్టీ మాత్రం ఈ యుద్ధ విష వలయం నుంచి బయటపడే మార్గం చూపింది. 1914 ఆగస్టులో ప్రారంభమైన ప్రపంచ యుద్ధం 1917 ఫిబ్రవరి- అక్టోబర్ విప్లవాల మధ్య కాలంలోనే రాజకీయ పోరాటాన్ని మరింత తీవ్రంగానూ. సునిశితం చేయాల్సి వచ్చింది. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర యుద్ధంగా మార్చండి అన్న నినాదాన్ని అమలు జరిపారు. ఆ విధంగా రష్యాలో 1917 ఫిబ్రవరిన బూర్జువ విప్లవం జయప్రదమైంది. సోవియేట్లకు అధికారం అంటూ బొల్షవిక్కులు మరో విప్లవానికి తేర లేపారు. జాతులకు విడిపోయే హక్కులతో స్వయం నిర్ణయ హక్కు, అన్ని జాతులకు సమాన హక్కులు అంటూ నినాదం ఇచ్చారు. బొల్షవిక్కు పార్టీని రద్దు చేయడానికి రష్యా పార్లమెంట్ అక్టోబర్ 24-25 తేదీల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మెన్షవిక్కులు అధికారంలో ఉన్న ఆ పార్లమెంట్టు బొల్షవిక్కులను ద్రోహులుగా ప్రకటించి పార్టీని నిషేధించాలని నిర్ణయించుకున్నారు. లెనిన్పై కాల్చివేత ఉత్తర్వులతో పాటు ఎక్కడ ఉన్న అరెస్టు చేయాలని కమిటీ సభ్యులను నిర్భంధించాలని ఆదేశాలు వెళ్ళాయి. అంతకు ముందే ఈ కుట్రను పసిగట్టిన లెనిన్ 1917 అక్టోబర్ 24న అర్ధరాత్రి పెట్రోగ్రాడ్‌ను హస్తగతం చేసుకున్నారు. స్మోల్నిలోని వింటర్ ప్యాలస్ (పార్లమెంట్)ను 25న రాత్రి హస్తగతం చేసుకొని మహాత్తర అక్టోబర్ విప్లవాన్ని సాధించారు. ఆ విధంగా విప్లవం విజయవంతం కాగానే మొట్ట మొదట భూమిపై డిక్రి విడుదల చేస్తూ దున్నేవాడికే భూమిపై హక్కు కల్పించారు. ఆ విధంగా విప్లవం విజయవంతం అయింది.
- సారంపల్లి మల్లారెడ్డి,
9490008666