Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సమాజంలో జీవించడానికి సామాన్యుడు ఎటువంటి భయాలు లేకుండా బ్రతకడానికి ఎన్నో హక్కులు, సదుపాయాలు కల్పించినా వాటిని పట్టించుకోకుండా ఇంకో వ్యక్తి జీవితంలో ప్రవేశించడం తప్పని భావించకుండా అది అధికారంతో వచ్చే హక్కుగా భావించే మనస్తత్వాలు ఇటువంటి దారుణాలకు కారణమవుతున్నాయి.
ఉనికిని కాపాడుకోవడానికి పోరాటం చేస్తూనో లేదా తాము తక్కువన్న భావాన్ని అంగీకరించో ఎలాగో జీవితం గడిపే ప్రజలు మొదటి రకం. స్థిరమైన ఉనికితో పాటు అధికారాన్ని సమాజంలో మొదటి రకం మీద ప్రయోగిస్తూ తమ తప్పులను వారి తప్పులుగా మార్చి, మనుషుల్లో తమను తాము ప్రత్యేకంగా భావించుకుంటూ, ఆ ప్రత్యేకతను మొదటి రకం ప్రజల్లో కులం, మతం, ఆర్థిక వెనుకబాటు వంటి అంశాలతో ముడిపెట్టి వారిని బానిసలుగా చూసే వారు రెండో రకం. ఈ రెండు రకాల ప్రజలు కాకుండా సామాన్యంగా జీవించే ప్రజలు మూడో రకం. మొదటి రకం ప్రజలపై రెండో రకం ప్రజలు చేసిన రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన సంఘర్షణలే ప్రపంచ చరిత్రపు పటంలో విప్లవ స్పూర్తికి సంకేతాలుగా మారాయి. చరిత్రలో అలా నిలిచిపోయి భారతీయ న్యాయ వ్యవస్థలో ఓ ప్రత్యేకతను సంపాదించుకుని, మనిషి ప్రాణానికి విలువ ఉందని, ఆ ప్రాణానికి ఏ కుల, వర్గ వ్యత్యాసాలు ఉండవని స్పష్టం చేసిన జస్టిస్ చంద్రు లాయర్‌గా విజయం సాధించిన ఓ కేసు ఆధారంగా వచ్చిన తమిళ్ సినిమానే 'జై భీమ్.'
భారతీయ న్యాయ వ్యవస్థలో పోలీస్ శాఖ ఎంతో ప్రాధాన్యత ఉన్న శాఖ. సమాజంలో ఏ అనైతిక సంఘటన జరిగినా ఫిర్యాదు చేయడం ద్వారా పోలీసుల వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నిలబెట్టుకోలేని ఎన్నో ఉదంతాలు, అన్యాయాలు ఈ శాఖ వల్ల నాటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉన్నాయి. తప్పుడు కేసులు బనాయించడం, తప్పు చేయకపోయినా ఒప్పించడం వంటివి జరుగుతూనే ఉన్న ఉదంతాలు. ఇటువంటి ఓ సంఘటనే 1995లో జరిగింది.
ఆదివాసీయులైన రాజన్న, సినతల్లి (రాజ్ కన్ను, సెంగని నిజమైన పేర్లు) భార్యాభర్తలు. వారు ఎలుకలు, పాములు పట్టేవాళ్లు. దానితో పాటు ఎన్నో పనులు చేసేవారు. ఆ ఊరిలో పెద్ద ఆసామి ఇంట్లో పాము పట్టడానికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ ఆసామి భార్య తన నగలు ఉన్న అలమరాను పామును చూసిన భయంలో తెరిచే ఉంచుతుంది. ఆ ఇంట్లో ఉన్న పామును పట్టి వెళ్ళిపోతాడు. అదే రోజు ఆసామి వేరే ఊరు వెళ్ళడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో నగల దొంగతనం జరుగుతుంది. రాజన్న గర్భవతి అయిన భార్యని, కూతురును వదిలి ఇటుకలు చేసే పని మీద వేరే ప్రాంతానికి వెళ్తాడు.
ఆ ఆసామి ఇంట్లో దొంగతనం నేరం రాజన్న మీద మోపబడుతుంది. ఆ సమయంలో రాజన్న దొరకకపోవడంతో అతని భార్య, తమ్ముడు కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి వారిని చిత్రహింసలు పెడతారు పోలీసులు. ఆ తర్వాత రాజన్న అక్క పైడితల్లి, మిగిలిన బంధువులను కూడా అవమానించి చిత్రహింసలు పెడతారు. అప్పుడే భార్యను చూడటానికి తిరిగి వచ్చిన రాజన్నను పట్టుకుని, అతనితో పాటు అతని బంధువులైన మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి చిత్రవధ చేస్తారు పోలీసులు. ఆ తర్వాత ఆ ముగ్గురు స్టేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్తారు.
ఆ సమయంలో రాజన్న భార్య తన భర్తకు ఏమైందో తెలుసు కోవడానికి అప్పటికే మానవహక్కులు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న న్యాయవాది చంద్రును కలుస్తుంది. జరిగింది చెప్తుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో నిజాలు తెలుస్తాయి. పోలీసులు చేసిన చిత్రవధకు లాకప్‌లోనే మరణిస్తాడు రాజన్న. ఆ విషయం బయటకు తెలిస్తే తమకు మంచిది కాదని భావించిన పోలీస్ అధికారులు తెలివిగా అతని మరణాన్ని దాచి రాష్ట్ర సరిహద్దుల్లో శవాన్ని పడేసి, మిగిలిన ఇద్దరికీ కూడా ఆ విషయం చెప్పకుండా వారిని కేరళకు తీసుకువెళ్తారు. ఆ మిగిలిన ఇద్దరిలో ఒకరితో అతను పని చేస్తున్న రైస్ మిల్లు యజమానికి ఫోన్ చేయించి తాము స్టేషన్ నుంచి తప్పించుకున్నామని, తమ కుటుంబాలకు ఆ విషయం తెలియజేయమని చెప్పిస్తారు.
ఆ మిగిలిన ఇద్దరిని కేరళలోని ఓ జైల్లో ఉంచుతారు. ఆ దొంగతనం చేసిన దొంగతో చేతులు కలిపి పోలీస్ అధికారి గురు ఆ దొంగతనం చేసిన నగల్లో కొంత లంచం తీసుకుని ఆ నేరాన్ని అమాయకుడైన రాజన్నపై మోపుతాడు. ఇదంతా నిరూపించి ఆ పోలీస్ అధికారులకు శిక్ష పడేలా చేయటమే కాకుండా, సినతల్లికి నష్టపరిహారం, పట్టా భూమి కూడా ఇచ్చేలా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కేసులో ఎంక్వైరీ ఐజి పెరుమల్ సామి పోలీసులు చేసిన తప్పులను తప్పని నిర్భయంగా చెప్పి పోలీసుల్లో నిజాయితీ గల అధికారులకు దర్పణంగా నిలిచారు.
జై భీమ్ దాదాపు మూడు గంటల సినిమా. ఈ సినిమా కోర్ట్ డ్రామా అయినా లాయర్లు తిట్టుకునే, కొట్టుకునే సన్నివేశాలు లేవు. హీరోయిజం లేదు. హీరోయిన్ కేంద్ర పాటలు లేవు. కానీ ఈ సినిమా కథలో చరిత్ర ఉంది. ఆ చరిత్రలోని బాధ ఉంది. ఆ బాధను దిగమింగుతూనే విజయం వైపు నడిచిన స్పూర్తి ఉంది. హీరో సూర్య లాయర్ చంద్రుగా లాయర్‌గా నటించారే తప్ప హీరోగా కాదు. ఈ సినిమాలో పాటలు కూడా ఆదివాసీయుల జీవితాన్ని స్పష్టం చేసే సున్నితత్వం కలిగినవే. పూర్తిగా కథనే హీరోని చేసిన సినిమా ఇది. అందుకే ఈ సినిమాలో రాజన్న, సిన్నతల్లి వెంటాడినంతగా ఇంకెవరూ ప్రేక్షకులను కదిలించ లేరు. చంద్రును చంద్రుగా మాత్రమే ప్రేక్షకులు చూడగలిగారు అంటే దానికి కారణం వాస్తవానికి హీరోయిజం జోడించని గొప్పతనం మాత్రమే. అందుకే ఇది కచ్చితంగా గొప్ప సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసే సినిమాల్లో కూడా ఆ వాస్తవం కన్నా ఆ వాస్తవంలో ఊహాను హైలెట్ చేసే సన్నివేశాలకు ప్రాధాన్యతను ఇచ్చే సినీ మూస నుంచి బయట పడిన సినిమా ఇది.
ఫాల్స్ కేసు బాధితులవ్వడం భారత చరిత్రలో మేధావులు కూడా అనుభ వించారు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణను 50 రోజులు కస్టడీలో ఉంచి అప్పటి వరకు దేశ ప్రగతిలో భాగమైన శాస్త్రవేత్తను కేరళ పోలీస్ వ్యవస్థ దేశద్రోహిని చేసింది. 1994లో జరిగిన ఈ సంఘటన సిబిఐ అబద్ధమని నిరూపిం చింది. 1998లో కేరళ సుప్రీం కోర్ట్ ఆ కేసును కొట్టివేసింది. 2001లో నంబి నారాయణకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. కానీ ఒక్క కేసుతో దేశ భక్తుడు, మేధావి దేశద్రోహిగా మారిన అనుభవాన్ని ఏ నష్టపరిహారం భర్తీ చేయగలదు?
16 సంవత్సరాలు ఢిల్లీ పోలీసులు ప్రేమ్ పాల్ పెట్టిన 18 ఫాల్స్ క్రిమినల్ కేసులు కూడా సంచలనం సష్టించింది. 1991లో తన ఇంట్లో దొంగతనం జరిగిందని ప్రేమ్‌పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వస్తువులు తనకు తిరిగి ఇవ్వని పోలీసుల మీద కేసు ఫైల్ చేసినందుకు ప్రతీకార చర్యగా అతని మీద 18 వేరు వేరు కేసులు దొంగతనం, మానభంగం వంటి తప్పుడు కేసులు బనాయించి 15 ఏండ్లు అతని జీవితాన్ని నాశనం అయ్యేలా చేశారు. ఆ తర్వాత అతనికి నష్ట పరిహారంగా 5.62 లక్షలు చెల్లించాలని తీర్పు వచ్చింది.
ఈ ఫాల్స్ కేసుల వల్ల విలువైన కాలాన్ని, జీవితం మీద నమ్మకాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. గెలిచిన వారి కథలు ఓ 20 శాతం మాత్రమే. కానీ ఆ బాధను అనుభవించి చేయని నేరానికి శిక్షని అనుభవించిన వారు ఎందరో.
ఇలాంటి కేసుల మూలాలు ఆలో చిస్తే నేరస్థులను పట్టుకోలేనితనం వల్ల, ముఖ్యంగా దొంగతనం లాంటి కేసుల్లో దొంగలతో కొన్నిసార్లు అధికారులు కలిసి పోవడం వంటి అంశాలు,పై అధికారుల నుంచి ఒత్తిడి వల్ల ఏదో ఒక విధంగా కేసులు పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని తమకు ఎదురు తిరగని వ్యక్తుల మీద, తమకు ఎదురు తిరిగిన వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టడం సాధారణం అయిపోయింది.
ఈ సినిమా చరిత్ర అయినా చరిత్ర నుంచి వర్తమానం వరకు కొనసాగుతున్న అన్యాయపు వైఖరిని చట్టబద్ధం చేసే యత్నాలకు నిదర్శనం కూడా. లాయర్ చంద్రు లాంటి న్యాయవాదులు ఉన్నారన్న నమ్మకం చట్టం నిర్దోషులకు ఎటు వంటి సహకారం అందిస్తుందో స్పష్టం చేస్తుంది. న్యాయానికి, బాధితుడికి మధ్య ఎన్నో లొసుగులు, సాక్ష్యాలను సష్టించ డాలు, ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని సంశయాలను కలిగించడాలు వంటివి జరుగుతూనే ఉంటాయి.
ఈ సంశయాలు దాటి న్యాయం, న్యాయ పరిధి వంటివి తెలుసుకోవడంతో పాటు సమాజంలోని ప్రతి వ్యక్తి మనిషిగా తనకున్న మానవ హక్కుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సినిమాలో కేసు మొదట రాజన్నకున్న మానవహక్కులను కాపాడటానికి హెబియస్ కార్పస్‌తో మొదలై ఇన్వెస్టిగేషన్ జరుగుతూ నిజాలు బయట పడటంతో హత్య కేసుగా మారింది.
రాజ్యాంగం ఈ సమాజంలో జీవించడానికి సామాన్యుడు ఎటువంటి భయాలు లేకుండా బ్రతకడానికి ఎన్నో హక్కులు, సదుపాయాలు కల్పించినా వాటిని పట్టించుకోకుండా ఇంకో వ్యక్తి జీవితంలో ప్రవేశించడం తప్పని భావించకుండా అది అధికారంతో వచ్చే హక్కుగా భావించే మనస్తత్వాలు ఇటువంటి దారుణాలకు కారణమవుతున్నాయి.
ప్రపంచంలో, దేశంలో, మొత్తం సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినట్టు కనపడినా, సమానతా భావన వినపడినా కానీ వాస్తవంలో ఆధిపత్యవర్గమూ ఆధీనవర్గమూ, పీడించేవాడు పీడితుడు, ఉన్నవాడు, లేనివాడు, అణగదొక్కేవాడు, అణిచివేయ బడుతున్న వారు కొనసాగు తున్న వ్యవస్థలో న్యాయం, చట్టం సంస్కృతి కూడా ఆ మేరకే పని చేస్తుంది. కానీ వున్న అవకాశాలను చైతన్యయుతంగా పోరాడి సాధించు కోవచ్చని నిరూపించి పాఠకులకు ఎంతో ప్రేరణనిచ్చిన సినిమా ఇది.
- శంగవరపు రచన,
8790739123