Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్నా తమ్ముడూ అనుబంధాలు జెండాలు రంగులూ నినాదాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొందరు తిక్క మనుషులు రాజులవుతారు. కొందరు రాజులయ్యాక తిక్క మనుషులవుతారు. అబద్ధవర్మలు, అసత్యవర్మలూ అప్పటిలాగే ఇప్పుడూ ఉన్నారు. తిమ్మరాజులూ, తిక్క రాజులూ లేక పోలేదు.
రాజులన్నాక తిక్క అనేది ఒక లక్షణం ఉండటం అసహజమేమీ కాదు. నాకు తిక్కవుంది కానీ దానికో లెక్క ఉంది అనే రాజులు లేకపోలేదు. అయితే తిక్కకు లెక్కే ఉండదు. తిక్కతిక్కే రాజురాజే!
ఇలాగే లెక్కలేని తిక్క ఉన్న రాజు అబద్ధ వర్మ. ఈయన వంశపారంపరపర్యంగా రాజైనవాడేం కాదు. ఒకానొక రాజ్యంలో రాజు లెక్కలేనంత తిక్క కారణంగా జనాన్ని కాల్చుకోకుండానే తింటుండ డంతో జనం ఊరుకోలేక ఎదురుతిరిగారు. అలాగే ఎదురు తిరిగిన వాళ్ళంతా కల్సి తిక్క రాజును చావగొట్టి చెవులు మూయకుండానే రాజ్యం పొలిమెరలు దాటించారు.
రాజులేని రాజ్యం ఉండనే ఉండదు కదా. తిరగబడ్డ వాళ్ళల్లో ఒకరు అందరికంటే ముందు పరుగు పరుగున వెళ్ళి రాజుసింహాసనం మీద కూచుని ఇది నా సీటు. దీని మీద జేబురుమాలు కలర్ కండువా వేసింది నేనే కనుక నేనే రాజుని అని ప్రకటించుకున్నాడు.
ఇలాగే సెల్ఫీ తీసుకున్నాక తిక్కరాజే అబద్ధవర్మ. అయితే అబద్ధ వర్మతో పాటు సింహాసనం దరి దాపుల్లోకి చేరుకున్నావారు మేం ఎక్కడ కూచోవాలి అని అరిచిగీపెట్టారు. అబద్ధవర్మతో పాటు సింహాసనానికి బాగా దగ్గరగా వచ్చిన అసత్యవర్మ తను కూడా రాజుగారి సింహాసనం మీద కూచుంటానని మొండికేశాడు.
అబద్ధవర్మ అది అసంబద్ధమన్నాడు ఒక సీటు మీద ఇద్దరు కూర్చోవడం కుదరదని అసత్యవర్మను సముదాయించాడు. నా సింహాసనం ప్రక్కనే నీకూ ఓ సీటు ఏర్పాటు చేయస్తానన్నాడు. ఏడ్చే మొగానికి తుడిచే తుండుగుడ్డ అనుకున్న ఆ సత్యవర్మ సింహాసనం కుడివైపు సీటు కావాలని పట్టు బట్టాడు. అబద్ధ వర్మ అందుకు ఎగిరి గంతేసి అసత్యవర్మను కావలించుకుని మనిద్దరం అన్నదమ్ములం. మనది అన్నదమ్ముల అనుబంధం అన్నాడు.
తన తిక్కకు ఓ లెక్క వుండని, కబుర్లతో కాలక్షేపం చేస్తూ అరచేతిలో లేని వైకుంఠాన్ని ఉందని బుకాయిస్తూ రాజ్యం ఏలసాగాడు అబద్ధవర్మ. అయితే తను కుడి ప్రక్కన సీటులో కూచున్న అసత్యవర్మ ఏనాడైనా తన కొంప ముంచేస్తాడన్న అనుమానం అబద్ధవర్మను పీడించసాగింది. తనను సింహాసనం మీది నుంచి కిందికి తోసేసి అసత్యవర్మ రాజయినట్టు పీడకలలు కూడా వచ్చినయి. ఈ ఆత్మక్షోభ భరించలేక అసత్య వర్మ సీటును, కుడివైపు నుంచి ఎడమకు మార్చాడు. ఇది కొంత 'సేఫ్'గా ఉంటుందనుకున్నాడు కాని కలలు రావడం ఆగలేదు.
ఇక నాడు అబద్ధవర్మ దర్చారుకువచ్చే టప్పటికి అసత్యవర్మ సింహాసనం మీద కూచుని ఉన్నట్టనిపించి అబద్ధవర్మ గుండె గుభిల్లుమంది. 'సోదరా ఇది తగునా నేను లేకుండా చూసి సింహాససం ఎక్కితివా? అనడిగాగు. లేదన్నయ్య సింహాసనం కుషన్ మెత్తగా ఉన్నదీ లేనిదీ చూశాను అంతే నాలుగు కాళ్ళూ సనిగ్గా ఉన్నదీ లేనిదీ పరిశీలించాను. అంతే అన్నాడు అసత్యవర్మ.
అబద్ధవర్మ తిక్క హద్దులు దాటి పోయింది. లాభం లేదు. తమ్ములుంగారు సింహాసనం కింద గ్యాసుపొయ్యి మంట పెట్టేట్టుగా ఉన్నారు అనుకున్నాడు. కుడీ వద్దు ఎడమా రద్దు . ఇక్కడెక్కడా వీరిని కూర్చోనివ్వద్దు అనుకున్నాడు. రాజు తల్చుకుంటే కేసులకు కొదవలేదు కదా!
అసత్యవర్మ మీద దుమ్మూ ధూళీ చెత్తా చెదారమూ చల్లాడు. ఉన్నవీ లేనివీ కల్పించి పో పొమ్మని పొగ పెట్టాడు. అబద్ధ వర్మ ఆగడాలకు అడ్డుకట్టు పడే రోజు వస్తుందని శాపనార్థాలు పెడుతూ అసత్యవర్మ కోట దాటాడు.
కోట దాటిన అసత్యవర్మ అడవికి వెళ్ళి ముక్కు మూసుకుని ఒంటి కాలు మీద తపస్సు చెయ్యడు కదా! జనం ఉన్నారు కదా! జనం ఎప్పుడు ఎవరి వెంట వుంటారో ఎవరికి జై కొడతారో ఎవరికెరుక. అసత్యవర్మ కుడివైపు కుర్చీ ఎడమవైపు సీటూ ఎలాగు కూచున్నవే కనుక ఏకంగ సింహాసనం వైపు రాకూడదనేం లేదు కదా!
అన్నా తమ్ముడూ అనుబంధాలు జెండాలు రంగులూ నినాదాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. కొందరు తిక్క మనుషులు రాజులవుతారు. కొందరు రాజులయ్యాక తిక్క మనుషులవుతారు. అబద్ధవర్మలు, అసత్యవర్మలూ అప్పటిలాగే ఇప్పుడూ ఉన్నారు. తిమ్మరాజులూ, తిక్క రాజులూ లేక పోలేదు.
- చింతపట్ల సుదర్శన్, 9299809212