Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతీ ఉపాధ్యాయుడి హృదయంలో చెరిగిపోని గుర్తులు. నిజంగా ఇది ఏ ఒక్కరి ముచ్చట్లు కావు. మన పిల్లల అందరి ముచ్చట్లు. ప్రతీ తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు అధ్యయనం చేయవలసిన గొప్ప పాఠ్యపుస్తకం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు, కొత్తగా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోయే ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఓ గైడ్ లాగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మంచి ఉపాధ్యాయుడు తన శిష్యులను జ్ఞానవంతులయ్యోలా శ్రమించడంతో పాటు వారికి ఏదైనా సమస్య వస్తే వెన్నుతట్టి నడిపించడంలో భాగస్వామ్యమవుతారు. విద్యార్థులకు విద్యతో పాటు విచక్షణ నేర్పిస్తారు. ఆ విచక్షణే పిల్లల్ని మంచి వైపు నడిపిస్తుంది. ఇది ఏ పాఠ్యపుస్తకాలలో లభించదు. ఉపాధ్యాయుడి హృదయంలో ఉంటుంది. అటువంటి నిండు హృదయం గల ఉపాధ్యాయురాలు, రచయిత్రి సమ్మెట ఉమాదేవి అనుభవాల నుంచి ఇటీవల వెలువడిన పుస్తకమే 'మా పిల్లల ముచ్చట్లు'. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవంతో తన పాఠశాల పిల్లలతో ఉన్న ఎన్నో అనుభవాలను అనుభూతులను ఈ పుస్తకం ద్వారా మనందరికి పంచే గొప్ప ప్రయత్నం చేసింది. తన సర్వీసులో వివిధ పాఠశాలలో బోధించే క్రమంలో పల్లెలను, అడవులను, పంటచేలను, పూలను.. ఇలా
ప్రకృతినంతా గమనిస్తూ అక్కడి పిల్లల వైఖరులు, దృక్పథాలను లోచూపుతో పరిశీలన చేసి తన అనుభవాలన్నింటినీ ఒక దగ్గర గుదిగుచ్చింది. రచయిత్రి ఇప్పటికే 'అమ్మ కథలు', 'రేలపూలూ' తండా వాసుల కథలు (ఇటీవలనే ఈ పుస్తకానికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం' లభించింది) లాంటి కథా సంకలనాలు అచ్చువేసిన అనుభవంతో ఈ సంపుటిని తీసుకొచ్చారు.
ఈ పుస్తకంలో దాదాపు రెండొందలకు పైగా ముచ్చట్లు ఉన్నాయి. ప్రతీ ముచ్చట అందరిని చదివించేటట్లు ఆసక్తిగా కొనసాగింది. మొత్తంగా పరిశీలించినట్లయితే ఈ సంపుటి వివిధ రకాల పిల్లల మనస్తత్వాలను, వారి ఆలోచనలను, అమాయ కత్వాన్ని, ఉపాధ్యాయులు పిల్లల పట్ల అనుసరించవలసిన వైఖరులతో పాటు పాఠశాలలకు సంబంధించిన అనేక అంశాలను స్పృశిస్తూనే ముఖ్యంగా విద్యా వ్యవస్థలోని లోటు పాట్లను సున్నితంగా ప్రశ్నిస్తుంది. 'మనుషులు ఉంటేనే నాలుగుగోడల గది ఇల్లవుతుంది.. పిల్లలున్నప్పుడే బడి చైతన్యమవుతుంది' అంటూ 'జే గంట' శీర్షికతో మొదలైన ముచ్చట 'ఉద్యోగ విరమణానంతరయానం' వరకు తన
అనుభవాలను ప్రవాహంలా అక్షరీకరించింది. 'అస్తిత్వం' అంటే వారి కులం, మతం, భాష మాత్రమే కాదు.. వారు చదివిన పాఠశాల కూడా. పాఠశాలను అందరూ ఒక అస్తిత్వ ఆస్తిగా భావించి దాని అభివృద్ధికి పాటుపడాలని రచయిత్రి కోరుకుంటున్నది. చాలా ఆశ పడుతున్నది. పాఠశాలలో అన్ని వసతులు సక్రమంగా ఉన్నప్పుడే విద్యాబోధన ఎటువంటి అడ్డంకులు లేకుండా
నడుస్తుంది. దాని కోసం ప్రభుత్వం నిధుల మంజూరీ పట్ల సరైన చర్యలు తీసుకోవాలని.. సమాజం, తల్లిదండ్రులు కూడా పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రచయిత్రి అభిప్రాయపడుతోంది. ప్రతి ఒక్కరూ పాఠశాలను సొంత ఆస్తిగా భావించి అవసరమైన వసతుల కల్పనలో పాలు పంచుకున్నప్పుడే అది నిలబడుతుంది. అలా కాకపోతే రచయిత్రి అన్నట్టు 'ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోనూ బడి పిల్లలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చదువుకునే పరిస్థితులు అలాగే కొనసాగుంటాయి. వాస్తవానికి పిల్లల బాల్యమంతా ఆటలతో ముడిపడి ఉంటుంది. కానీ చాలా బడులలో కనీసం క్రీడా స్థలాలు లేవు. ఉన్నా అవి అంతగా ఆడుకోవడానికి అనువుగా లేవని ఉమాదేవి తన అనుభవ పూర్వకంగా వెల్లడించింది. దీనివల్ల పిల్లలు కలిసిమెలిసి ఆడుకునే ఆటల బంగారు బాల్యపు అనుభూతులను ఎన్నింటినో కోల్పోతున్నారని ఆమె ఆవేదన చెందింది. 'క్రీడాస్థలం లేకుంటే అది బడి కాదు.. ఆ పిల్లలది బాల్యం కాదు' అనే విషయాన్ని స్పష్టత పరుస్తూ విద్యా వ్యవస్థలోని లోపాలను ఈ పుస్తకంలో అనేకచోట్ల సుతిమొత్తగా వ్యక్తపరిచింది. ఇప్పటికే తండాల్లో మారుమూల ప్రాంతాల్లో తగిన ప్రయాణ సౌకర్యాలు లేవు. ప్రాథమిక తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూల్‌కు వేరే ప్రాంతానికి వెళ్లాలంటే వారికి దినదిన గండమే. బస్సు సౌకర్యం కావాలంటే గిట్టుబాటు ఏమీ ఉండదని, రోడ్డు బాగాలేదని సమాధానం అధికారుల దగ్గర లభిస్తున్నది. మరీ.. విద్యార్థుల సంగతి ఎట్లా? అంటూ 'ఎన్నో ఏండ్ల స్వతంత్ర చరిత్రలో గ్రామాల ప్రగతి అక్కడే ఆగిపోయినందుకు మనసులో చెప్పలేనంత కలత ఉందని, అది ఇప్పటికీ తనను వెంటాడుతుందని' ప్రకటించడం రచయిత్రి సామాజిక దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఇటీవల చిన్నారి వైష్ణవి లేఖపై స్పందించిన జస్టిస్ రమణ గారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి బస్సు సౌకర్యం కల్పించాలని ఉత్వరులు జారీ చేయడం మనందరికి తెలిసిన విషయమే. విద్యహక్కు చట్టంపై ఉన్న గౌరవంతోనైనా మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు బస్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.
'వీరి వీరి గుమ్మడి పండు.. వీరి పేరు ఏమిటి' అనే శీర్షికలో పిల్లల పేర్ల గురించి ఉమాదేవి ప్రస్తావిస్తూ పిల్లల పేర్లు మార్చేసి అందమైన పేర్లు పెట్టే హక్కు ఎవరిచ్చారని ఆక్రోశాన్ని వెలిబుచ్చింది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో మల్లమ్మ, రాజమ్మ, చంద్రయ్య, ఏసోబు, మస్తాను, మరియమ్మ, సైదులు, పెంటమ్మ, పెంటయ్యలాంటి పేర్లు ఎక్కువగా ఉంటాయి. అవి వాళ్ల దేవతలవో, వారి సామాజిక వర్గంలోనివో జాతిలోనివో కావచ్చు. ఆ పేర్లు వారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అలాంటప్పుడు దానికి విరుద్ధంగా పేర్లు మార్చడం వారి అస్తిత్వాన్ని కొల్లగొట్టడమే అవుతుందని.. 'మనం సాంకేతికంగా ఎదగాలి. ఆధునికతను అలవర్చుకోవాలి. కానీ మన సంస్కృతిని విస్మరించకూడదని హితబోధన చేసింది. 'పల్లె దుకాణాలు-
చిరుతిండ్లు' శీర్షికలో రచయిత ఒక మోసపూరిత వ్యాపారాన్ని బట్టబయలు చేయడంతో పాటు పిల్లలకు అవసరమైన వస్తు సామాగ్రి ఊర్లలో సరిగా లభించడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. అనేక పాఠశాలల దగ్గరలో ఉన్నటువంటి దుకాణాలలో చాలా చౌకబారు రంగులు వేసిన చాక్లెట్లు, నిల్వ నూనెలతో చేసిన చక్రాలు, పాపుడాలు పుష్కలంగా దొరుకుతున్నాయని దానికితోడు పాన్ పరాగ్, మాణిక్ చంద్ లాంటి హానికరమైన ప్యాకెట్స్ కట్టకట్టలుగా అమ్ముతున్నారని, వాటిని కొనుక్కొని తినడం పిల్లలకు ఒక వ్యసనంగా మారిందని రచయిత్రి చెబుతున్నది. 'దుకాణంలో ఎప్పుడంటే అప్పుడు ఇవన్నీ దొరుకుతాయి కానీ.. పిల్లలకు అవసరమైన ఒక నోట్సు గాని, ఒక గమ్ బాటిల్ గాని, పలకలు, బలపాలు లాంటి వస్తువులు దొరకపోవడం చాలా దురదృష్టకరమనీ.. 'బడి నందనవనంలో సీతాకోకచిలుకల్లా అమ్మాయిలు తిరగడం వరకు బాగానే ఉన్నా హార్మోన్లలో తేడావల్లనో, మారుతున్న కాలంలో వస్తున్న రకరకాల తిండ్ల ప్రభావం వల్ల చాలా చిన్న వయసులోనే వ్యక్తురాళ్ళవుతున్న వాళ్లకు ఆ సమయంలో వాడాల్సిన లోదుస్తులు, నాప్కీన్స్లు అందుబాటులో లేకపోవడం ఎటువంటి అభివృద్ధిని సూచిస్తుందని రచయిత్రి ఆవేదనతో ప్రశ్నించడం అందరూ ఆలోచించాల్సిన అంశంగా చెప్పొచ్చు.
అంగన్వాడీలు బడి ప్రాంగణంలో ఉండడం గొప్ప ప్రయోజనంతో కూడుకున్న నిర్ణయమే కానీ అలా మిళితం చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఆ పాఠశాలలకు కావాల్సిన అదనపు గదులు కూడా కట్టాలని అప్పుడే 'ఒకే బడి ఒకే ప్రాంగణం'లోకి చిట్టిపొట్టి చిన్నారులంతా నిశ్చితంగా తిరగ గల రోజులు వస్తాయని ప్రభుత్వానికి సూచన చేసింది. మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు పదవ తరగతి పరీక్షలకు నాలుగు నెలల ముందు మండల ,జిల్లా కార్యాలయానికి వెళ్లి ఒక్కటికి పదిసార్లు తిరిగి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాల్సి వస్తుందని అలా కాకుండా గ్రామ సహాయ అధికారి సహకారంతో ఆ పాఠశాలలో చదివే మూడొందల నుంచి నాల్గొందల మంది విద్యార్థులకు ఒక మూడు రోజుల్లోనే ఆయా పత్రాలు ఇవ్వొచ్చనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలోని మధ్యాహ్న భోజన విషయంలో 'నగర పిల్లలకు గ్రామీణ పిల్లలకు ఆకలిలో తేడా ఉంటుందని.. పల్లె పేద పిల్లలకు కడుపునిండా తిండి పెట్టాలని, పిల్లల కోసం ఇచ్చే ఉచిత యూనిఫాం నాణ్యమైనది ఉండాలని రచయిత విద్యాశాఖకు విన్నవించడం సమంజసమైన విషయం. ప్రభుత్వ పాఠశాలలలోని ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను గురించి ప్రస్తావిస్తూ ఉమాదేవి అనేక వాస్తవాలను బహిర్గతం చేసింది. ఇంగ్లీష్ మీడియం మేము చెప్తామని భాష చేసి పిల్లలను బడికి రప్పించుకుంటున్నారనీ, మీడియం స్థానంలో 'ఇంగ్లీష్ మీడియం' అని రాసి ఉంటుందే తప్ప ఆ బడులకు ఇంగ్లీష్ మీడియం రంగు, రుచి, వాసన లేదని దానికి అనేక కారణాలు చెబుతూ ఆ లోపాలను అధిగమించుటకు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ, అవగాహన కల్పించాలని అన్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే అందరూ ఎంతో గౌరవంగా చూసేవారు. ఇప్పుడా నమ్మకం నిలబెట్టుకోవాలంటే సిలబస్‌లో ప్రకారం పాఠాలు చెప్పడమే కాకుండా స్ఫూర్తిని నింపి విద్యలో లీనమయ్యేలా చేయగలగాలనీ, విద్యార్థులు ఫెయిల్ అవుతున్న సందర్భంలో 'ప్రతి ఓటమి విజయం కోసం మరో ప్రయత్నం చేయ్యాలనే అవసరం తెలుపుతుంటుందనే' విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యోలా ఉపాధ్యాయులు చెప్పాలని వారి గురుతర బాధ్యతను రచయిత్రి గుర్తు చేస్తుంది. తను ఎక్కడ పనిచేసిన ఉపాధ్యాయుని కంటే పిల్లల కేర్ టీచర్‌గా బాధ్యత వహించడం, ఆంగ్ల పాఠాల కంటే.. ఆత్మవిశ్వాసాన్నిచ్చే బతుకు పాఠాలు చెప్పడం అనేది ఉపాధ్యాయులందరికి గొప్ప ప్రేరణ కలిగించే అంశం. మా పిల్లలు.. పిల్లలూ అంటూ సర్వీస్ అంతా వాళ్ళ ప్రపంచంగా గడిపిన ఉమాదేవి సర్వీస్ అనంతరం ఆ పిల్లలను వదిలి రావడం నిజంగా ఒక పెద్ద పెనుగులాట అని చెప్పొచ్చు. పుస్తకంలో
'ఆలంబన' శీర్షిక మనల్ని తట్టిలేపుతుంది. నిజానికి తల్లులను కోల్పోయిన పిల్లల పరిస్థితి ఊహించు కుంటేనే బాధనిపిస్తుంది. ''దేవుడా అమ్మలకు అర్ధాయుష్షునిస్తే ఆ పిల్లల పరిస్థితి ఏమిటి? నా రచన సరిగ్గా కుదరకపోతే తిరగరాస్తుంటా. నాలా నువ్వెందుకుండవ్..?' అంటూ దేవుడిని ఆర్తిగా ప్రశ్నించిన రచయిత్రి ఆ సమయంలో ఎంత పెయిన్‌కు గురయిందో! వైష్ణవి అమాయకత్వం, ఐశ్వర్య కథ, దొంగ వాచ్ లు, రాజేష్ (అపూర్వ సోదరుడు), మా సంపత్ నవ్వాడు, వసంత లహరి, ఓ అమ్మాయి బతుకు నడక, ఉమర్ బీ కథనం లాంటి ఎన్నో శీర్షికలు మనల్ని ఆకట్టుకుంటాయి. అందరిని ఆలోచింప చేస్తాయి 'పలకరిస్తే కబుర్లు పోగులు పోస్తుంది', 'మా చిన్నోళ్ళు.. నీలి చందమామలు', 'ఆ తల్లులు పూల రథాలు' లాంటి వాక్యాలు పాఠకుల మదిని దోచుకుంటాయి. ప్రతి శీర్షికలో ఫొటోలు చాలా ముద్దుగా ఉన్నాయి. వాటిలో చాలా వరకు బడి పిల్లలే తీయడం, పుస్తకాని అందమైన ముఖ చిత్రం అందించింది కూడా బడి పిల్లవాడే కావడం ఇక్కడ పెద్ద విశేషం.
వృత్తిపై నిబద్ధత, పిల్లలపై అమితమైన ప్రేమ.. ఈ రెండు విలువలు ఉన్న ఉపాధ్యాయుడు నేటి సమాజానికి ఎంతో అవసరం. ముందుమాటలో 'వరప్రసాద్' గారు చెప్పినట్లుగా 'కేవలం ఉద్యోగం, జీవితమనే పరిమిత స్థాయిలో జడంగా బతికేసే ఉపాధ్యాయులుగా కాకుండా ఆదర్శంగా ప్రేరణ ఇచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశయం కోసం ఉపాధ్యాయుల నిర్మాణం జరగాలి'. అలా జరిగినప్పుడే విద్యార్థులలో విద్య, మానవీయ విలువలు పెరగడంతోపాటు వారు అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో కొనసాగుతారు. అటువంటి వృత్తి ధర్మాన్ని ఉమాదేవి పరిపూర్ణంగా నిర్వహించారు కాబట్టే ఈ సమాజానికి తను ఓ మంచి పుస్తకాన్ని అందివ్వగలిగింది. రచయిత్రి అన్నట్లు మొత్తానికి ఇవి కథలు కావు. అనేక ముచ్చట్లు, ఊసులు, జ్ఞాపకాలు. ప్రతీ ఉపాధ్యాయుడి హృదయంలో చెరిగిపోని గుర్తులు. నిజంగా ఇది ఏ ఒక్కరి ముచ్చట్లు కావు. మన పిల్లల అందరి ముచ్చట్లు. ప్రతీ తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు అధ్యయనం చేయవలసిన గొప్ప పాఠ్యపుస్తకం. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులకు, కొత్తగా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టబోయే ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఓ గైడ్ లాగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విశేష ఆదరణ పొందుతున్న ఈ పుస్తకం ఈ నెలలో మలి ముద్రణకు వెళ్తున్నది. ఇంతటి మంచి పుస్తకాన్ని సమాజానికి అందించిన ఉమాదేవి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ పుస్తకం కావలసిన వారు కింది చిరునామాలో సంప్రదించవచ్చు.
- సమ్మెట ఉమాదేవి,
3-2-353 సెకండ్ ఫ్లోర్,
ఆర్పీ రోడ్, సికింద్రబాద్,
సెల్: 9849406722
- బిల్ల మహేందర్
9177604430