Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మ జోల పాట సమాధి దాకా సాగుతుంది' అంటారు ఓ సినీ గేయకవి. నిజమే... మన చిన్నతనంలో అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ.. ''చందమామరావే జాబిల్లి రావే'' అంటూ చల్లని వెన్నెల్లో అన్నమయ్య గీతం పాడి వినిపించేది. కాన్వెంట్లో చేరాక అందరు పిల్లలతో కల్సి ''ట్వింకిల్... ట్వింకిల్ లిటిల్ స్టార్!'' అనే ఆంగ్ల కవి జానీ టేలర్ పాటను పాడిన బాల్యంలోని ఆట పాటల అనుభవాల అనుభూతులు అందరికి ఉన్నాయి. వానలో తడవడం, కాగితపు పడవతో ఆడుకోవడం సింగిడి చూసి గెంతులు వేస్తారు. కాని నేటి తరానికి ముఖ్యంగా గత రెండేళ్ళుగా కరోనాతో దూరం అయ్యే స్థితి వచ్చింది. ఆన్లైన్ పాఠాలు... బడికి దూరంగా ఆట పాటలకు దూరంగా ఇంటికే పరిమితమయ్యారు. ఫేస్బుక్, ట్విట్టర్, స్మార్ట్ఫోన్ గేమ్స్, గూగుల్ సెర్చిలకు అలవాటు పడిన పిల్లలు. పుస్తక పఠనం... స్నేహం, పెద్దలపట్ల గౌరవభావం... వృద్ధులపై దయ, సేవాభావం నేటి తరం పిల్లల్లో తగ్గిపోతుంది. పుస్తక పఠనం ద్వారా సృజనాత్మకత, మేథో వికాసం, దేశభక్తి, విజ్ఞానాభివృద్ధి, సేవాతత్వం అలవడతాయి.
మహాత్మాగాంధీకి 'హరిశ్చంద్రుని' కథ ఎంతో ప్రేరణనిచ్చింది. పిల్లలకు బాలసాహిత్య పుస్తకాలు రేవులోని నావలకు దారి చూపే దీపస్థంభం లాంటివి. పిల్లల సాహిత్యంలో ఆది గ్రంథం ''పంచతంత్రం''. కాశ్మీర్ రాజ్యంలో రాజు తన కుమారులకు నీతి కథలు బోధించాలి అని విష్ణుశర్మను కోరడంతో.. ''పంచతంత్రం'' కథలు వెలువడాడ్డయి. ఇవి పర్షియా, అరేబియా, జర్మనీ, ఫ్రాన్స్, ఆఫ్రికా, స్సెయిన్, ఆంగ్లబాషా సాహిత్యాల ద్వారా విశ్వవ్యాప్తం అయ్యాయి. ఈ విషయాన్నే మాక్స్ ముల్లక్ ''మైగ్రేషన్ ఆఫ్ ఫే బుల్స్' గ్రంథంలో నమోదు చేశాడు.
పాశ్చాత్యుల టామ్ అండ్ జెర్రీ, లయన్కింగ్, లాంటి జంతు విషయ పుస్తకాలు, టీవీ సీరియల్స్, వీడియోలు ఏదైనా వీటికి మూలం మన 'పంచతంత్రమే'. నీతి శతకాలు, రామాయణం, భారతం, భాగవతం, లాంటి పురాణ గాథలు, దేశభక్తి, దైవభక్తి బాలల్లో ప్రేరేపించే అద్భుత సాహిత్యం మన దేశంలో మఖ్యంగా మన తెలుగునాట 17 శతాబ్దిలోనే వెెలువడింది. ఐరోపాదేశాల్లో సిండ్రిల్లా కథలు, పశ్చిమ ఆసియాలో ''ద అరేబియన్ నైట్స్ '' కథలు ఉత్తర అమెరికాలో '' ది నెర్గోఫోక్ స్టోరీస్', 'అంకుల్ రేమూస్' కథలు బహుళ ప్రాచుర్యం పొందాయి. అవి నేటికీ ఎవర్ గ్రీన్ లిటరేచర్గా నిలిచాయి. బాలల మనసులు గెలిచాయి. పిల్లల్ని ఉత్తమోత్తమ పౌరులుగా తీర్చి దిద్దటంలో పుస్తకాల పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.
1850 సంవత్సరంలోనే పరవస్తు చిన్నయసూరి ''నీతి చంద్రిక'' , ''బాలవ్యాకరణం'' రాసారు. పాఠ్యాంశాల్లో మనమంతా చదివిన ''మిత్రలాభం'', ''మిత్రబేధం''- కథలు విశిష్టమైనవి.
1900లో ఆంధ్ర వాల్మీకిగా ప్రశిద్ధుడైన ''వావికొలను సుబ్బారావు'' తొలిసారి పిలల కోసం సులభమైన శైలిలో ''ఆర్యకథానిధి'' అనే కథా సంపుటి రాసారు. ఆ తరువాత కాలంలో వేటూరి ప్రభాకర శాస్త్రి ''బాలభాష'' అనే పిల్లల గేయాలు రాసారు. వెంటక పార్వతీశ్వర కవులు ''బాలగేయాలు'' రాసారు. ''నర్తనబాల'' అంటూ నాట్యాన్ని పిల్లలకు పరిచయం చేసి వారిలో నాట్యంపై ఆసక్తి పెంచారు నటరాజ రామకృష్ణ.
1940 నాటికి ఆంధ్ర పత్రికలో నాటి సంపాదకుడు భాషావేత్త గిడుగు సీతాపతి 'భారతి' పత్రిక ద్వారా 'బాలానందం' శీర్షిక ద్వారా బాల సాహిత్యాన్ని ప్రోత్సహించారు. ఇదే శీర్షికతో ఆకాశవాణి కార్యక్రమాలు చేసింది.
ఈ కాలంలోనే జోనాధన్ స్వీప్ట్ రాసిన ''గాలివర్స్ ట్రావెల్స్'' (1726)ను కాళ్ళకూరి హన్మంతరావు కమలాకర్ వెంకటరావులు అనువాదం చేశారు. జాక్ లండన్ 1903లో రాసిన ''ది కాల్ ఆఫ్ ది వైల్డ్'' అనే సాహస గాథóల్ని ''ప్రకృతి పిలుపుగా'' కొడవటిగంటి కుటుంబరావు అనువదించారు. లియో టాల్స్టాల్స్ ''ఏబీసీ బుక్'' రాసారు. చింతాదీక్షితులు ''లక్క పిడతలు'' రాసారు. కొడవగంటి 1947లో ''చందమామ'' పత్రిక నాగిరెడ్డి సారధ్యలో తెచ్చారు. 'హరిరు బీ చెర్స్టోవ్' రచించిన 'అంకుల్ టామ్ కెబిన్' నవల అమెరికా బానిసవ్యవస్థను కూల్చినదిగా పేరొందిది. ఇది పిల్లలూ, పెద్దలూ చదవాల్సిన గొప్ప పుస్తకం.
జి. సురమౌళి' కలిసి బ్రతుకుదాం (1958) నవల భారత ప్రభుత్వంచే ఉత్తమ రచనగా ఎంపికైన గొప్ప పుస్తకం సినారే ''బాలల బొమ్మల భాగవతం'' యశోదారెడ్డి 'నక్క బావ'' , ''పేదరాశి పెద్దమ్మ కథలు'' పిల్లల్ని అలరించేవి.1977 లో ఆంధ్రప్రదేశ్లో బాల అకాడమీ, 1998లో బాలల కోసం ''నంది నాటకాలు'' ఏర్పాటు చేశారు.
బాలల వికాసం కోసం అద్భుతంగా కృషి చేసిన వారు న్యాయపతి రాఘవరావు-కామేశ్వరి దంపతులు. మన హైదరాబాద్ నారాయణగూడలో పెద్ద కార్యాలయమే ఏర్పాటు చేశారు. నవ్య సాహితీ ఏటా నృత్య సంగీతం పోటీలు నిర్వహిస్తుంది. రమాచారి ఎందరికో పాటలు-శాస్త్రీయ సంగతంలో శిక్షణ యిస్తున్నారు.
నెహ్రూచే నెలకొల్పిన నేషనల్ బుక్ ట్రస్ట్ బాలల కోసం ఎన్నో వందల పుస్తకాలు గత 70 ఏండ్లుగా ప్రచురిస్తుంది. బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'బాల సాహిత్య పరిషత్' కృషి ని ఏటా కొత్తగూడెంలో నిర్వహించే బాలోత్సవం వారి కృషిని, 'బాల చెలిమి' ద్వారా వేదకుమార్ ప్రత్యేక సాహిత్య కృషిని మనం చెప్పుకోవాలి. ఇది కేవలం విహాంగ వీక్షణంలా క్లుప్తంగా బాలల దినోత్సవ సందర్భంలో సాహిత్య కారులు (తొలినాటి) కృషి రేఖామాత్ర పరిశీలనే .. వేల మంది కవులు -కథకులు రచనలు అలాగే బాల సాహిత్య అవార్డు గ్రహితలు పేరు పేరునా జిల్లాల వారిగా సంపుటాలు తేవాల్సినంత చరిత్ర వుంది. స్థలాభావం. సమయం చూడాలి కదా మరోసారి సమగ్రంగా చర్చించుకుందా.
- తంగిరాల చక్రవర్తి, 9393804472