Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక అంశాలను అత్యంత ప్రతిభావంతంగా చెప్పడం అనే కళ తెలిసిన 'అమ్మమ్మ' ఇందిరమ్మ. సాధారణ అంశాలను తన కథలకు వస్తువులుగా ఎన్నుకుని దానిని అత్యంత ప్రతిభావంతంగా పిల్లలకు నచ్చేట్టుగా, అందులోనూ ముచ్చట పెట్టినట్టు కథ చెప్పడం ఈ 'కథల అమ్మమ్మ'కు బాగా తెలుసు. నిజానికి వీరి కథలు మనం పుస్తకం చదువుతున్నట్టుగా కాక అమ్మమ్మ, నానమ్మ చెబితే ప్రత్యక్షంగా వింటున్నట్టు ఉంటాయి.
'బాల సాహిత్యం లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. ఈ భూమ్మీద బాల్యం మొదలైనప్పుడే బాల సాహిత్యం కూడా మొదలైంది. మనిషి తొలిసారి మాట్లాడడం తెలిసిన నాటి నుంచే పిల్లల కోసం కథలూ పాటలూ పుట్టినయి' అంటారు యం. అయోధ్యారెడ్డి. తొలి నాళ్ళ నుంచి సామాజిక, సాంస్కృతి కోద్యమాల్లో పాల్గొన్న ఇందిరాదేవి పదిహేనేండ్ల వయస్సులోనే 1934లో అష్టావధానం చేశారు. రచనల్లో బాల్య వివాహాలను ఖండించిన ఇందిరాదేవి సెప్టెంబర్ 22, 1919న హన్మకొండలో పుట్టారు. 1937లో నిజామాబాద్లో జరిగిన 'ఆంధ్రమహిళా సభ'కు అధ్యక్షత వహించారు. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో 'నషర్'గా పిలువబడిన దక్కన్ రేడియోలో తెలుగులో ప్రసంగించిన తొలి మహిళ ఇందిరాదేవి. 'గిరి' పేరుతో కథలు రాసిన నందగిరి వెంకటరావు, ఇందిరాదేవి భర్త.
ఆంధ్ర యువతీ మండలి వ్యవ స్థాకుల్లో ఒకరైన ఈమెకు 'బాలనందం'తో కూడా సన్నిహిత సంబంధాలుండేవి. వీరి కథలను తెలంగాణ సాహిత్య అకాడమి 'అమ్మమ్మ కథలు' పేర ప్రచురించింది,
ఇవి తొలుత రేడియోలో పిల్లల కోసం చెప్పిన కథలు. ఆనాటి బాల బాలికలను అలరించిన రసగుళికలు. పిల్లలకు చక్కని ఆదర్శవంతమైన జీవన మూల్యాలతో కూడిన మార్గనిర్దేశనం చేయడం, వారిలో నైతిక ప్రవర్తన పెంచడం దిశగా ఉపయోగపడేందుకు ఈ కథలను రాశారు. అనేక అంశాలను అత్యంత ప్రతిభావంతంగా చెప్పడం అనే కళ తెలిసిన 'అమ్మమ్మ' ఇందిరమ్మ. సాధారణ అంశాలను తన కథలకు వస్తువులుగా ఎన్నుకుని దానిని అత్యంత ప్రతి భావంతంగా పిల్లలకు నచ్చేట్టుగా, అందులోనూ ముచ్చట పెట్టినట్టు కథ చెప్పడం ఈ 'కథల అమ్మమ్మ'కు బాగా తెలుసు. నిజానికి వీరి కథలు మనం పుస్తకం చదువుతున్నట్టుగా కాక అమ్మమ్మ, నానమ్మ చెబితే ప్రత్యక్షంగా వింటున్నట్టు ఉంటాయి.
పిల్లలకు ఏ విషయాన్నయినా నచ్చేటట్టు, మనసుకు హత్తుకునేట్టు చెబితే దానిని శ్రద్ధగా వింటారు. మనం చెబుతున్న విషయాన్ని ఆకలింపు చేసుకుంటారు. అటువంటి కథే 'బద్ధకాల బుద్ధావతారం'. ఆడుతూ, పాడుతూ ఉండాల్సిన పిల్లలు బద్ధకిస్తే ఆరోగ్యపరంగా జరిగే ఇబ్బంధుల్ని చక్కగా చెబుతూనే సోమరితనం అన్ని రోగాలకు కారణం అనే విషయాన్ని పిల్లలకు చక్కగా చెప్పే కథ. ఒక సోమరి బుద్ధావతారానికి వాళ్ళమ్మ పిండి వంట చేసేందుకు 'దుకాణానికి వెళ్ళి చక్కెర తెమ్మని' చెబుతుంది. సోమరి బుద్ధావతారం 'అమ్మో! అంత దూరమా' అని తప్పించుకోవాలని చూస్తాడు. తీపి వంటలు పెట్టను అనేసరికి వెళ్ళేందుకు సిద్ధమై బయలుదేరుతాడు. కొద్ది దూరం పోయాక 'సమీపంలోని అమ్మ స్నేహితురాలి ఇంటికి వెళ్ళి కొద్దిగా చక్కర తెస్తాను' అయిపోతుంది. అనుకుని వెళ్ళి 'అత్తా! అమ్మ మిమ్మల్ని అడిగి చక్కర తెమ్మంది' అని అడుగుతాడు. 'సరే! కానీ నాకో చిన్నపని చేయి' అంటూ వాడిని సమీపంలోని కొండమీద ఉన్న తన అన్నయ్య వద్దకు సీసా తెమ్మని పంపుతుంది, అక్కడికి వెళ్తే అతను కాస్త దూరంలో ఉన్న తన స్నేహితుని దగ్గర నుంచి దారం తెమ్మని పంపుతాడు. అక్కణ్ణుంచి మరో చోటుకి. ఇలా మన బుద్ధావతారం వెళ్ళాల్సిన దుకాణం కంటే ఎక్కువ దూరం, అంతకంటే ఎక్కువగా కష్టాలు పడి చివరకు ఇంటికి చేరుకుంటాడు. ఆలస్యానికి కారణం తల్లికి చెప్పి సోమరితనం, అలసత్వం వల్ల బుద్ధావతారం ఎన్ని తిప్పలు పడ్డాడో చెబుతూనే 'రేపటి పనిని ఇవ్వాళ చెయ్యి, ఇవ్వాళ్టి పని ఇప్పుడే చెయ్యి' అన్న కబీర్ వచనాలకు అక్షరచిత్రంగా నిలుస్తుందీ కథ. ఇందిరాదేవి తన కథల్లో నీతి, నిజాయితీ వంటి అంశాల్ని సందేశంగా అందించేందుకు భూమికగా మలచుకున్నారు. 'పూర్తివాటా' కథ అలాంటిదే. రచయిత్రి జానపద కథల్లోని జంతు పాత్రలలాగే తన కథల్లో కూడా జంతువులతో మాట్లాడిస్తుంది. అలాంటి కథే 'సింహం పిల్ల-శీనయ్య కూతురు'. ఒక సాధారణ బాలిక అడవికి వెళ్ళి సింహంతో స్నేహం చేస్తుంది. ఆటలు ఆడుతుంది, చక్కగా పాటలు పాడుతుంది. ఇవన్నీ పిల్లలకు నచ్చకుండా ఎలా ఉంటాయి మరి. మొదటి నుంచి మానవుడు జంతువులను మచ్చిక చేసుకుంటున్నాడు. తన అవసరాలకు వాడుకుంటున్నాడు. ఇందులో క్రూర జంతువైన సింహాన్ని మచ్చిక చేసుకోవడాన్ని, అందులోనూ 'పాపం, పుణ్యం ఏమీ తెలియని' పిల్లలు దేనినైనా సాధిస్తారని చెబుతుంది. ఇందిరాదేవి కేవలం సరదా సరదా అంశాలో, పిల్లల్ని నవ్వించే విషయాల్నో తన కథల్లో రాయలేదు. ప్రతి అక్షరం వెనుక ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాసినట్టుంటాయి ఆవిడ కథలు. వీరి చాలా కథలు హేతుబద్ధ ఆలోచన మనిషిని అభివృద్ధిపథం వైపుకు ఎలా నడిపిస్తాయో చెబుతాయి. నందగిరి ఇందిరాదేవి విలక్షణ కథా రచయిత్రి. సమాజసేవకురాలు. తెలంగాణా తొలితరం రచయిత్రల్లో విధుషీమణి. తొలితరం రచయితలందరి లాగే బాధ్యతగా పిల్లల కోసం రాసారు. పిల్లల కోసం అత్యంత సులభమైన శైలిలో ఆసక్తికరంగా రాయడం వీరి శైలి. కథానికల్లో ఎంత సున్నితమైన సంబంధాలను, లోతైన భావోద్వేగాలను ఎంతగా చిత్రించారో అంతే అద్భుతంగా పిల్లల కథలు రాసారు. తెలంగాణ బాల సాహిత్య చరిత్రలో ఈ 'అమ్మమ్మ కథలు' ఒక కొత్త చేరిక. నేటి పిల్లలకు చక్కని తాయిలం.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548