Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలను ఈ ఉద్యమంలో భాగం చేయడానికి, సాంస్కృతికంగా వారిని చైతన్యవంతుల్ని చేయడానికి సాగించిన ఆంధ్రమహాసభ సాంస్కృతిక ఉద్యమంలో నాయకుడిగా ఉండి నిజాం ప్రభుత్వ పాలన పట్ల నిరసన తెలిపారు. భూస్వామ్య, నిరంకుశ ప్రభుత్వ పోకడలను అవలంభించిన నైజాం పాలనకు వైముఖంగా, రజాకార్ల రాక్షస కృత్యాలను నియంత్రించేందుకు ప్రజలంతా సాయుధులై సాగించిన సాయుధపోరాటంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్ళారు.
రంగారెడ్డి జిల్లా స్వాతంత్య్ర సమరయోధులలో కొండా వెంకట రంగారెడ్డి, మందుముల నరసింగరావు, మర్రి చెన్నారెడ్డిల తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి వెంకటరావు.
జననం:
తొలితరం తెలంగాణ కథా రచయితగా, ఆంధ్రమహాసభకు నాయకుడిగా, సాయుధపోరాట సమరయోధుడిగా కీర్తిని గడించిన నందగిరి వెంకటరావు 1909 సం|| జూలై నెల 22వ తేదీన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలోని పూడూరు అనే గ్రామంలో జన్మించారు.
హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ విమోచనోద్యమం జరుగుతున్న సంక్లిష్ట సమయంలో తన వంతుగా నిరసన తెలిపారు. ఆ తర్వాత న్యాయవిద్య చదివి, జిల్లా సెషన్స్ జడ్జీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత బీహారులోని ధన్ బాద్లో లేబర్ కోర్టులో ప్రిసైడింగ్ అధికారిగా తొమ్మిది సం|| లు పని చేశారు. ప్రసిద్ధ రచయిత్రి నందగిరి ఇందిరాదేవి వీరి సతీమణి.
స్వాతంత్య్రోద్యమం
భారత స్వాతంత్య్రోద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు లేవదీసిన నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్నారు. ప్రజలను ఈ ఉద్యమంలో భాగం చేయడానికి, సాంస్కృతికంగా వారిని చైతన్యవంతుల్ని చేయడానికి సాగించిన ఆంధ్రమహాసభ సాంస్కృతిక ఉద్యమంలో నాయకుడిగా ఉండి నిజాం ప్రభుత్వ పాలన పట్ల నిరసన తెలిపారు. భూస్వామ్య, నిరంకుశ ప్రభుత్వ పోకడలను అవలంభించిన నైజాం పాలనకు వైముఖంగా, రజాకార్ల రాక్షస కృత్యాలను నియంత్రించేందుకు ప్రజలంతా సాయుధులై సాగించిన సాయుధపోరాటంలో పాల్గొని అరెస్టయి జైలుకు వెళ్ళారు. నిజాం సంస్థాన ప్రజలను ప్రభుత్వం పట్ల జాగరూకుల్ని చేయడానికి వారికి విద్య తాలూకు ప్రాముఖ్యతను తెలపడానికి నాటి సంఘోద్ధారకులు ప్రారంభించిన గ్రంథాలయోద్యమంలో తన భాగస్వామ్యాన్ని చేపట్టారు. స్త్రీ విద్య గురించి ప్రచారం చేశారు.
సాహిత్యం
తెలుగు జాతి ప్రజలు అనాదిగా కొనసాగిస్తున్న సాహిత్య సంప్రదాయం సమ్మేళనాలు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది నాడు యావత్ తెలుగు ప్రాంతంలో, ఇతర దేశాలలో నివసించే తెలుగు వారు కవి సమ్మేళనం జరపడం ఆనవాయితీ. కానీ తొలిసారిగా 1935 సం||లోనే ప్రథమ అఖిలాంధ్ర కథకుల సమ్మేళనాన్ని నందగిరి వెంకటరావు హైదరాబాదులో నిర్వహించారు. ఇటువంటి కొత్త ఒరవడి ఇతను ప్రవేశపెట్టారు. తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషా సాహిత్యాలంటే అభిమానం. 'గిరి' కలం పేరుతో కథలు రాశారు.
వెంకటరావు కథకుడిగా సుప్రసిద్ధుడు. నాటి సమకాలంలో ఉన్న కథా వస్తువులను పట్టుకొని కథలుగా వాటికొక ఆకారం ఇచ్చారు. ఇతను రాసిన కథలు కొన్ని సంకలనాలలో చోటుచేసుకున్నాయి. ఈయన రాసిన 'సితార' (1928) కథ ఇతని తొలి కథ అని తెలుస్తుంది. ఇది వట్టికోట ఆళ్వారుస్వామి సంకలన కర్తగా వచ్చిన 'పరిసరాలు'లో చోటుచేసుకుంది. ఆ తర్వాత 'జరిగిన కథ' (సుజాత-మాస, మే,1929), కామాక్షి (సుజాత-మాస,సెప్టెంబర్, 1929), ప్రేమపూజ (సుజాత-మాస, ఏప్రిల్, 1929), ఇంద్ర (సుజాత-మాస, జనవరి,1930), పటేల్గారి ప్రతాపం (గోలకొండ-మాస, జూలై, 1930), గన్నేరు పూలు (భారతి-మాస, ఆగస్టు, 1933), ఒహరకం (భారతి-మాస, జూలై, 1933), ప్రతిఫలం (భారతి-మాస, మే, 1933), రంభ (భారతి-మాస, ఆగస్టు, 1935), కుసుమం (భారతి-మాస, నవంబర్, 1935), కావేరి (భారతి-మాస, ఫిబ్రవరి, 1935), దృక్పథం (ఉదయిని-మాస, మే, 1936) వంటి కథలు రాశారు. ఈ కథలలో కొన్ని చారిత్రక ఇతివృత్తంలో ఉన్నాయి. ఇందులో ప్రతిఫలం అనే కథను నవల అని అణా గ్రంథమాల ప్రకటించింది.
ఈ విధంగా రచయిత అనే వ్యక్తి తాను జీవించినది ఏ కాలమైనా అది ఎంతటి సంక్లిష్ట పరిస్థితి అయినా ఆ కాలాన్ని, ఆ సంక్లిష్టాన్ని తను సృజించే సాహిత్యంలో పొందుపరుస్తారు. అలాంటి వారిలో నందగిరి వెంకటరావు ఒకరు. తానున్న నిజాం ప్రభుత్వ కాలంలో ప్రజలు నిత్యం సాహిత్య, సాంస్కృతికంగా, ఉద్యమాలను కొనసాగిస్తూ నిరంకుశ ప్రభుత్వం వైదొలగాలని పోరాటం చేసేవారు. అలాంటి పోరాటానికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని వెంకటరావు 'పటేలు గారి ప్రతాపం' అనే కథలో తెలిపారు.
హైదరాబాదు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొంటూ, మరింత మందిని పాల్గొనేలా చేస్తూ సాహిత్యం రాసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. వారిలో నందగిరి వెంకటరావు ఒకరు. తెలంగాణ జాతీయోద్యమానికి తొవ్వలో దివ్వెలుగా వెలిసిన వారందరూ కీర్తించదగిన మహానుభావులు.
పై విధంగా ఒక పక్క ఉద్యమం చేస్తూ జైలు శిక్షకు గురై, న్యాయవాద వృత్తిని చేపట్టి, కథల ద్వారా ప్రజలలో నూతన భావాన్ని నింపిన వెంకటరావు మార్చి 18, 1985 సం||లో తుదిశ్వాస విడిచారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542