Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సహవాసదోషం' నాటకం తమకు తెలియకుండానే చెడు
సాంగత్యంతో తప్పు అలవాట్లపాలవుతున్న పిల్లలను ఎలా
చక్కదిద్దాలో తెలిపేది. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా వివరించే
నాటకం ఇది. 'గాంధీ తాతయ్య', 'ఇందిరా ప్రియదర్శిని'
పేర పిల్లల కోసం రెండు జీవిత చరిత్రలు రాశారు. 1958-66
వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు. సరస్వతీదేవి రచనల్లో
ఎక్కువ కథలే అయినా బాలల కోసం రాయడంలో నిబద్ధత
కనబడుతుంది. బాల సాహిత్య చరిత్రలో మైలురాయిగా
నిలిచే 'బాలబంధు' ఇల్లిందల సరస్వతీదేవి.
కథా సాహిత్యంతో పాటు బాల సాహిత్యాన్ని తమ బాధ్యతగా రాసి 'బాలబంధు' పురస్కారం అందుకున్న కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత, రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవి. జూన్ 15,1918న నర్సాపురంలో పుట్టిన సరస్వతీదేవి మెట్టినిల్లు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని తెలకవరం. పదేండ్ల వయసులో ఇల్లిందల రామారావు భార్యగా హైదరాబాద్ చేరిన సరస్వతీదేవి గృహిణిగా బాధ్యతలను నిర్వ హిస్తూనే రచయిత్రిగా, సంఘసేవకురాలిగా పాత్రను నిర్వహించారు. పోలీస్ చర్య తరువాత హైదరాబాద్ దక్కన్ రేడియో ఆలిండియా రేడియోగా మారింది. తన తొలి రచనలను రేడియోలో చదవడం ప్రారంభించిన సరస్వతీ దేవి 1936 ప్రాంతంలో ఎల్లాప్రగడ సీతా కుమారితో కలిసి, రంగమ్మా ఓబుల్ రెడ్డి అధ్యక్షులుగా ఆంధ్ర యువతీ మండలి స్థాపించి కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది.
'రచనా వ్యాసంగమే ఆరాధ్య దైవం'గా భావించిన సరస్వతీదేవి ఆనాటి హైదరాబాద్ ముఖ్యమంత్రి వెల్లోడి భార్యతో సూచనతో జైలు విజిటర్‌గా అక్కడి స్త్రీల సమస్యల గురించి వాకబుచేసి వారికి అన్ని సౌకర్యాలు అందేవిధంగా పనిచేశారు. వృద్ధాశ్రమాలకు వెళ్ళి సహాయం చేస్తూనే ఆంధ్రపత్రికలో 'వనితా లోకం' శీర్షిక ద్వారా స్త్రీలకు ఉపయోగించే వ్యాసాలు రాసింది. 'కళ్యాణ కల్పవల్లి', 'జీవన సామరస్యము', 'నారీ జగత్తు', 'వెలుగుబాటలు', 'వ్యాస తరంగిణి', వెలుగుకు నోచుకోని తెలంగాణా ప్రాంతపు వ్యక్తుల విశిష్టతను తెలిపేందుకు 'తేజో మూర్తులు' గ్రంథాలు వెలువరించారు. వీరి వంద కథల సంపుటి 'స్వర్ణ కమలాలు'కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు, 1982లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డులు లభించాయి.
'పిల్లలకు కథలు చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడల్లా కొత్త కథలు సేకరించి చెప్పినా ఎప్పుడో ఒకప్పటి ప్రతి తల్లికి పిల్లలు కథ చెప్పమంటే 'ఏం కథ చెప్పాలి?' అన్న ప్రశ్న కలుగుతుంది. ఈ విషయాన్ని తెలిపే ఆంగ్ల గ్రంథాలు చదివాక ఎటువంటి కథనైనా పిల్లలకు ఉత్సుకత కలిగిస్తూ, ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఎలా చెప్పాలో తెలుసుకున్నాను. పిల్లలతో మాట్లాడు తున్నట్టుగా వ్రాయడమే బాల సాహిత్యానికి అవసరమైన శైలి అని గ్రాహ్యమైంది' ఈ పద్ధతిలోనే తాను బాల సాహిత్యాన్ని సృజించానని చెప్పుకున్న సరస్వతీదేవి. పిల్లలకోసం కథలు, జీవిత చరిత్రలు, నాటికలు రాశారు.
పిల్లలకు నీతిని, జీవన రీతిని బాల్యం నుంచే నేర్పాలన్నది వీరి అభిప్రాయం. పిల్లలకు ఉపయోగపడే అనేక సామెతలను చిన్నారి హృదయాలకు హత్తుకునే విధంగా కథల రూపంలో సులభశైలిలో రాసిన సరస్వతీదేవి వాటిని 'ఉత్తర కుమార ప్రజ్ఞలు' పేరుతో ప్రచురించారు. తన రచనలు కేవలం తమాషాగా, సరదాగా చదువుకునే విధంగా ఉండడంతో పాటు పిల్లల్లో చక్కని ప్రవర్తన, నడవడి, ఉత్తమ గుణగణాలు, అలవాట్లు అలవరచుకునే విధంగా బాలల రచనలు ఉండాలని, అప్పుడే శీలవంతమైన సమాజం నిర్మాణమవుతుందని సరస్వతీదేవి నమ్మకం. 'ఉత్తర కుమార ప్రజ్ఞలు' ఐదు సామెతలను ఆధారంగా చేసుకుని, వివరిస్తూ రాసిన ఐదు కథల సంపుటి. కథలు రాయడమనే విద్యలో ప్రతిభావంతురాలైన సరస్వతీదేవి సామెతల కథలను చెప్పటానికి తనదైన పద్దతిని ఏర్పరచుకున్నారు. కథ మొదలుపెట్టడం ఒక సంఘటనను వివరించడంతో ప్రారంభించి ఆ సామెతను కథ రూపంలో వివరించేందుకు చక్కని భూమికను ఏర్పాటు చేస్తారు రచయిత్రి. దానిపైన తరువాత విలక్షణమైన కథనంతో ఆ కథను పూరించి పిలలకు నచ్చే విధంగామలుస్తారు. 'భగీరథ ప్రయత్నం', 'శల్య సారథ్యం', 'ఉత్తర కుమార ప్రజ్ఞలు', 'ఎగదీసిన బ్రహ్మహత్య-దిగదీసిన గో హత్య' ఇందులోని కథలు. వీరి మరో పిల్లల కథా సంపుటి 'అదృష్టవంతులను చెరిపేవారు లేరు'. ఇది ఎనమిది కథల సంపుటి. ఇందులోని 'మూడు పిల్లి కూనలు' కథ తురగా జానకీరాణి సంపాదకత్వంలో నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 'బంగారు పిలక' సంకలనంలో వచ్చింది. సరస్వతీదేవి తన కథల్లో జంతువులను ప్రధాన పాత్రలుగా మలిచి ఈ కథలు రాసారు.
పిల్లలకోసం నాటికలు కూడా రాసారు సరస్వతీదేవి. 'బాలవీరులు' నాటికలు రామాయణంలోని లవకుశుల కథ. కాగా ధుర్యోధనుని గర్వభంగానికి సంబంధించింది 'అపకారికి ఉపకారము' నాటకం. ఇదే కోవలో ఛత్రపతి శివాజీకి సంబంధించిన విషయానికి చెందిన 'దేవుడి మహిమ' నాటకం. ఇంకా 'బొమ్మలపెళ్ళి' నాటకాలు ఆకర్శించే ఇతివృత్తానికి సంబంధించినవి. 'సహవాసదోషం' నాటకం తమకు తెలియకుండానే చెడు సాంగత్యంతో తప్పు అలవాట్లపాలవుతున్న పిల్లలను ఎలా చక్కదిద్దాలో తెలిపేది. పిల్లల మనస్తత్వాన్ని చక్కగా వివరించే నాటకం ఇది. 'గాంధీ తాతయ్య', 'ఇందిరా ప్రియదర్శిని' పేర పిల్లల కోసం రెండు జీవిత చరిత్రలు రాశారు. 1958-66 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు. సరస్వతీదేవి రచనల్లో ఎక్కువ కథలే అయినా బాలల కోసం రాయడంలో నిబద్ధత కనబడుతుంది. బాల సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే 'బాలబంధు' ఇల్లిందల సరస్వతీదేవి.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548