Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేవానంద్ రొమాంటిక్ హీరోగా జనాన్ని ఆకట్టుకున్నారు.
బాలీవుడ్ స్వర్ణయుగంలో అందమైన నటుడిగా పేరు తెచ్చుకున్న
దేవానంద్ తన స్టైల్‌తో బాలీవుడ్‌కు కొత్త భాష్యం నేర్పించారు.
అప్పటిదాకా దిలీప్ కుమార్ లాంటి మెథడ్ యాక్టర్, రాజ్‌కపూర్
లాంటి షో మ్యాన్ల సీరియస్ యాక్టింగ్ నడుస్తున్న కాలంలో
దేవానంద్ తన స్టైల్‌తో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహం ఇచ్చారు.
తన తోటి హీరోలు యాభై ఏండ్లకే తమ వయసుకు తగ్గ పాత్రల్లోకి
మారిపోగా, దేవానంద్ మాత్రం ''రాఖీ, పర్వీన్ బాబీ, హేమామాలిని,
ముంతాజ్, టినా మునిమ్'' వంటి హీరోయిన్స్‌తో కలసి పలు
విజయాలు సాధిస్తూ రొమాంటిక్ హీరోగానే సాగడం విశేషం.
బాలీవుడ్ లో 'స్టైల్‌కింగ్' అని పేరు సంపాదించిన తొలిస్టార్ హీరో దేవానంద్. రొమాంటిక్ హీరోగా దేవానంద్ సాగిన వైనం ఈ నాటికీ అభిమానుల మదిలో చెరిగిపోకుండా నిలచి ఉంది. ఆ రోజుల్లో దేవానంద్ స్టైల్స్ చూసి ఆయనను అభిమానించిన అందాల భామలెందరో ఉన్నారు. అలాగే అబ్బాయిలు దేవానంద్ స్టైల్స్‌ను అనుకరిస్తే తమకు అమ్మాయిలు పడిపోతారని అనుకునేవారు. ప్రత్యేక రీతిలో మాట్లాడుతూ, క్రౌచ్, టైట్ ప్యాంటు, మెడ చుట్టూ స్కార్ఫ్, తలపై బ్యాగ్ టోపీతోపాటు, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్‌లను కలిపి రొమాన్స్‌నీ, భగప్రేమనీ ఒక స్థాయికి తీసుకెళ్ళిన ఎవర్ గ్రీన్ హీరో దేవానంద్.
1923 సెప్టెంబర్ 26న గురుదాస్ పూర్ 'షకర్ గడ్'లో దేవానంద్ జన్మించారు. దేవానంద్ పూర్తి పేరు 'ధరమ్ దేవ్ పిషోరీమాల్ ఆనంద్'. తండ్రి పిషోరీలాల్ న్యాయవాదిగా పని చేసేవారు. దేవ్ లాహోర్ ప్రభుత్వ కళాశాలలో ఇంగ్లీషులో బీఏ ఆనర్స్ చేసిన దేవ్ మాస్టర్స్ చేయాలనుకున్నాడు కానీ, తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో, బ్యాంకు తదితర వాటిలో ఉద్యోగం చేయాలని ప్రయత్నించాడు. ఉద్యోగం ఏది రాకపోవడంతో 1943 జూలైలో లాహోర్ నుంచి ఫ్రాంటియర్ మెయిల్లో థర్డ్ క్లాస్ టికెట్ కొని బొంబాయి చేరుకున్నాడు. బొంబాయిలో దేవానంద్ అకౌంటెన్సీ సంస్థలో గుమస్తాగా 85 రూపాయల జీతం కోసం పనిచేశారు. ఆ తర్వాత మిలటరీ సెన్సార్ ఆఫీసులో నెలకు నూట అరవై రూపాయలు జీతం కోసం పనిచేయడం కూడా దేవ్ జీవితంలో ఒక విశేషం. దేవ్ నలుగు అన్నదమ్ముల్లో పెద్దవాడు మన్మోహన్ ఆనంద్ తండ్రిబాటలోనే పయనిస్తూ అడ్వకేట్ వృత్తి స్వీకరించారు. ఇక రెండో అన్న చేతన్ ఆనంద్ చిత్రసీమలో అడుగు పెట్టారు. వీరిద్దరి తరువాత అందరికంటే చిన్నవాడయిన విజయానంద్ సైతం చిత్రసీమలో అడుగుపెట్టి దర్శకునిగా తనదైన ప్రతిభను కనబరిచారు. దాంతో దేవానంద్ సైతం సినిమా రంగంవైపే అడుగులు వేశారు.
'హమ్ ఏక్ హై' చిత్రంతో నటుడిగా..
''దాదముని''గా పిలవబడే 'అశోక్ కుమార్' చిత్రం ''అచ్యుత్ కన్య'' సినిమాలో అశోక్ కుమార్ నటన చూసి దేవానంద్‌కు కూడా నటునిగా మారాలన్న అభిలాష కలిగింది. విచిత్రంగా అశోక్ కుమారే 1946లో దేవ్‌కు 'హమ్ ఏక్ హై' చిత్రంలో అవకాశం ఇచ్చాడు. అశోక్ కుమార్ దేవానంద్‌ను ఒక సినిమా సెట్స్‌లో చూసి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. 'హమ్ ఏక్ హై' సినిమా హిట్ కావడంతో దేవానంద్ తారాపథం లోకి దూసుకెళ్ళారు. 1948లో రూపొందిన 'జిద్ది' దేవ్‌కు హీరోగా గుర్తింపు సంపాదించి పెట్టింది. ఆ తరువాత ఆ నాటి మేటి అందాలతార, గాయని సురయ్యాతో కలసి దేవానంద్ నటించిన ''విద్య, జీత్, షాహిర్, అఫ్సర్, నీలి, సనమ్, దో సితారే'' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఆ సమయంలోనే దేవానంద్ తన సోదరులతో కలసి 'నవ్ కేతన్' బ్యానర్ స్థాపించారు. ఆ పతాకంపై పలు మరపురాని చిత్రాలను రూపొందించారు. నవ్ కేతన్ సంస్థ నిర్మించిన 'బాజీ' చిత్రంతో గురుదత్ను దర్శకునిగా పరిచయం చేశారు. 'జాల్', 'సిఐడి' చిత్రాల్లో గురుదత్ దర్శకత్వంలోనే నటించారు దేవ్. దిలీప్ కుమార్‌తో కలసి దేవానంద్ 'ఇన్సానియత్' అనే జానపద చిత్రంలో నటించారు. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన 'పల్లెటూరి పిల్ల' రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. యన్టీఆర్ పాత్రను దేవానంద్ పోషించారు. తన తమ్ముడు విజయానంద్ దర్శకత్వంలో దేవానంద్ హీరోగా ఆర్.కె.నారాయణ్ పుస్తకం ఆధారంగా తీసిన 'గైడ్' చిత్రానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం భారతదేశం తరపున ఆస్కార్ అవార్డు కోసం పంపబడింది. తరువాత విజయానంద్ నిర్దేశకత్వంలో దేవ్ నటించిన ''జువెల్ థీఫ్, జానీ మేరా నామ్'' సైతం సూపర్ హిట్స్‌గా నిలిచాయి. 'ప్రేమ్ పూజారి'తో దేవానంద్ దర్శకునిగా మారారు. దేవ్ దర్శకత్వంలో రూపొందిన 'హరే రామ హరే కృష్ణ' సూపర్ హిట్‌గా నిలచింది. ఈ సినిమాతో 'జీనత్ అమన్' స్టార్ హీరోయిన్ అయిపోయింది. 1950లలో దేవానంద్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. దాంతో 'రాజ్ కపూర్', 'దిలీప్ కుమార్'తో కలసి దేవానంద్ హిందీ చిత్రసీమ త్రిమూర్తులలో ఒకరిగా వెలిగారు. 1960లలో దేవానంద్ రొమాంటిక్ హీరోగా జనాన్ని ఆకట్టు కున్నారు. బాలీవుడ్ స్వర్ణయుగంలో అందమైన నటుడిగా పేరు తెచ్చుకున్న దేవానంద్ తన స్టైల్‌తో బాలీవుడ్‌కు కొత్త భాష్యం నేర్పించారు. అప్పటిదాకా దిలీప్ కుమార్ లాంటి మెథడ్ యాక్టర్, రాజ్ కపూర్ లాంటి షో మ్యాన్ల సీరియస్ యాక్టింగ్ నడుస్తున్న కాలంలో దేవానంద్ తన స్టైల్‌తో ప్రేక్షకులకు కొత్త ఉత్సాహం ఇచ్చారు. తన తోటి హీరోలు యాభై ఏండ్లకే తమ వయసుకు తగ్గ పాత్రల్లోకి మారిపోగా, దేవానంద్ మాత్రం ''రాఖీ, పర్వీన్ బాబీ, హేమామాలిని, ముంతాజ్, టినా మునిమ్'' వంటి హీరోయిన్స్‌తో కలసి పలు విజయాలు సాధిస్తూ రొమాంటిక్ హీరోగానే సాగడం విశేషం. 'దేశ్ పర్ దేశ్' తరువాత దేవానంద్ పలు చిత్రాలు రూపొందించినా అవేవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. 2011 సంవత్సరం 88 ఏండ్ల వయసులో తన చివరి సినిమా ''చార్జ్ షీట్''లో నటించి, 'ఎవర్ గ్రీన్ హీరో'గా ఇమేజ్ను సంపాదించి పెట్టుకున్నారు. దేవానంద్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దర్శకుడు 'గురుదత్'తోపాటు, నటులు శతృఘ్న సినాÛ, జాకీ ష్రాఫ్, జీనత్ అమన్, టీనా మునిమ్, టబు వంటి పలువురు నటులను పరిచయం చేశారు.
దేవ్ సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు
దేవానంద్ చాలా సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి. మొదట్లో హిందీ పేర్లు ఉన్నా రాను రాను ఇంగ్లీష్ పేర్లు ఎక్కువయ్యాయి. 1954లో వచ్చిన టాక్సీ డ్రైవర్‌తో ఆ ప్రక్రియ మొదలైంది. దాదాపు పాతిక పైన సినిమాలు ఇంగ్లీష్ పేర్లతో ఉంటాయి. అందులో ముఖ్యమైనవి, బాగా హిట్ అయిన చిత్రలు ''సి.ఐ.డి, జువెల్ థీఫ్, గైడ్, గాంబ్లర్, పేయింగ్ గెస్ట్, లవ్ మేరేజ్, డార్లింగ్ డార్లింగ్, వారెంట్'' వంటివి ఉన్నాయి. చివరి నాలుగు సినిమాలు ''సెన్సర్, లవ్ ఎట్ టైమ్స్ స్క్వేర్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, చార్జి షీట్'' సినిమాలకు కూడా ఇంగ్లీష్ పేర్లే ఉండడం విశేషం. దేవానంద్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టభద్రుడు కావడం వల్లనే ఇదంతా జరిగిందో లేక యాదృచ్ఛికమో చెప్పలేం.
హిట్ సినిమాలను నిరాకరించిన దేవ్
దేవానంద్ తన జీవిత కాలంలో అనేక హిట్ సినిమాలను నిరాకరించారు. అందులో 'జంగ్లీ, తీస్రీ మంజిల్' లాంటి సినిమాలు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్‌ను తారాపథంలోకి తీసుకెళ్లిన 'జంజీర్' సినిమా కూడా మొదట దేవానంద్కే ఆఫర్ చేయబడింది. దేవానంద్ చిత్రమైన మనస్తత్వం ఉన్నవారు. అందుకే ఆ సినిమా దర్శకులతో విభేదాలు వచ్చినందువల్ల ఆ సినిమాలు చేయలేదు.
దేవ్ సినిమాల్లో పాటలన్నీ హిట్
దేవ్ సినిమాల్లో చాలా వరకు హిట్ పాటలే ఉంటాయి. సినిమా బాగా ఆడకపోయినా పాటలు బాగుండటం, కేవలం పాటల వల్లనే సినిమాలు బాగా ఆడటం, దేవానంద్ సినిమాల విశిష్టత. జెవెల్ థీఫ్ లోని ''దిల్ పుకారే ఆరె అరె అరె'', కాలా బజార్ లోని ''ఖొయా ఖొయా చాంద్'', సీ.ఐ.డీ లోని ''ఆంఖో హి ఆంఖో మె ఇషారా'', గైడ్ సినిమాలోని ''గాతా రహే మెరా దిల్'', ప్రేం పూజారిలోని ''ఫూలొంకే రంగ్ సే'', డార్లీంగ్ డార్లింగ్ సినిమాలోని ''ఐసే న ముఝే తుం దేఖో'', తెరే ఘర్ కే సామ్నే లోని ''దిల్ క భన్వర్ కరే పుకార్'', జానీ మేరా నాం లోని ''పల్ భర్ కే లియే కోయి హమే ప్యార్'', హం దోనో లోని ''అభి నా జావో చోడ్ కర్'' హరే రామ హరే కృష్ణ లోని ''ఫూలోంకా తారోంకా సబ్ కా కహెనా'' వంటి అనేక పాటలు ఇప్పటికీ చాలా మంది నోట జాలువారుతునే ఉన్నాయి.
దేవానంద్‌ను అనుకరించిన ఎస్పీ బాలు
ప్రత్యేకమైన ఒక హెయిర్ స్టైల్ దేవానంద్ సొంతం. నుదుటిపైన వెంట్రుకలను ఒక కుప్పగా కుదించి దువ్వుకోవడం దేవానంద్ స్టైల్. ఆ కాలపు యువత చాలా కష్టపడి అలా దువ్వుకునే వారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా దేవానంద్‌లా వెంట్రుకలకు కందెన పూసి మరీ కుప్పగా దువ్వుకునే వాడట. 1961 వచ్చిన ''జబ్ ప్యార్ కిసీసే హొతా హై'' సినిమాలో ''జియా హో జియా హో జియా కుచ్'' పాట పాడుకుంటూ ఆ హెయిర్ స్టైల్‌ని కొంతకాలం అనుకరించాడట. ఈ విషయాన్ని ఈ టీవీ ''ఝుమ్మంది నాదం'' ప్రోగ్రాంలో బాలసుబ్రమణ్యం స్వయంగా చెప్పారు.
జీనత్ మీద మనసు పడ్డ దేవ్
సురయ్యాతో ప్రేమ విపలమైన కొన్నాళ్ళకి దేవానంద్ 'జీనత్ అమన్' మీద మనసు పడ్డాడు. అతను తన ఆత్మకథ 'రోమాన్సింగ్ విత్ లైఫ్'లో ఇలా వ్రాసుకున్నారు. ''ఒకరోజు నేను జీనత్‌తో ప్రేమలో పడ్డానని గ్రహించాను. ఆమెకి నా ప్రేమని తెలియజేయడానికి నేను తాజ్ హోటల్ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసాను. అంతకు ముందు మేమిద్దరం కలిసి పార్టీకివెళ్ళాము. అక్కడ, జీనత్‌కు మొదట రాజ్ కపూర్ స్వాగతం పలికారు. అపుడు జీనత్ వంగి అతని పాదాలను తాకడానికి ప్రయత్నించింది. దాంతో వారి మధ్య చాలా సాన్నిహిత్యం ఉందని నేను భావించాను. రాజ్ నా ముందు జీనత్ని మందలించారు, 'నువ్వు ఎల్లప్పుడూ తెల్లని దుస్తులు ధరిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.' అని. అప్పుడే నాకు అన్పించింది జీనత్ నాకు పూర్వపు జీనత్ కాదని. వెంటనే జీనత్‌కి మీరు ఎంజారు చేయండి.. నేను వెళ్ళిపోతున్నానని చెప్పాను. జీనత్ మనం వేరే చోటికి వెళ్లాలి అని చెప్పిన, సమస్య లేదు అని చెప్పాను. నేను అక్కడ నుంచి లేచి బయటకు వచ్చాను''. దీని తరువాత దేవానంద్ జీనత్ అమన్ వైపు చూడలేదు.
''మిస్టర్ ఆనంద్''
అని పిలవడాన్ని నచ్చని దేవ్
తొలిసారి ''సి.ఐ.డి'' చిత్రంలో దేవానంద్‌తో కలిసి నటించిన వహీదా రెహ్మాన్ ఆయనతో కలిసి మొత్తం ఏడు సినిమాల్లో నటించారు. దేవానంద్‌కి వహీదా రెహ్మాన్ అంటే ఎనలేని అభిమానం. దేవానంద్‌ని 'మిస్టర్ ఆనంద్' అని పిలవడం ఆయనకు నచ్చేది కాదు. అయితే వహీదా రెహ్మాన్ సెట్స్‌కి వెళ్లినప్పుడల్లా, అలవాటు ప్రకారంగా ఒకసారి గుడ్ మార్నింగ్ 'మిస్టర్ ఆనంద్' అని చెప్పడంతో, దేవానంద్ అటు.. ఇటూ చూస్తూ, ఎవర్ని అని అడిగాడు. నేను నీతో మాట్లాడుతున్నానని వహిదా చెప్పడంతో, మీరు నాకంటే పెద్దవారు, చాలా సీనియర్, ఎంతో పెద్ద స్టార్. మీతో పాటు, నాతో నటించే సీనియర్ నటీమణులు నన్ను సర్, మిస్టర్ ఆనంద్ అని పిలిస్తే నేను కలిసి పని చేయలేనని వహీదాకు చెప్పాడు. ఇక అప్పటి నుంచి వహీదా అతడిని 'దేవ్' అని పిలవడం అలవాటు చేసుకున్నారట.
రంగుల లోకం నుంచి రాజకీయాల్లోకి..
దేవానంద్ 1979లో నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్పిఐ)ని స్థాపించారు. నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్ ఆయనకు మద్దతుగా నిలిచింది. 1980లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 500కు పైగా స్థానాల్లో పోటీ చేసి ఓటమిపాలైంది ఎన్.పి.ఐ పార్టీ. తదనంతరం మారిన రాజకీయాల నేపథ్యంలో దేవానంద్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే, అందుకు దేవానంద్ నిరాకరించి, తరువాత ఆ పార్టీని రద్దు చేసారు.
పలువురు రాజకీయ నేతలతో స్నేహం
నేపాల్ మహారాజా మహేంద్ర, భారత మాజీ రక్షణ మంత్రి కృష్ణ మీనన్, పాకిస్తాన్ నాటి ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ దేవానంద్‌కు సన్నిహితులు. అటల్ బిహారీ వాజ్‌పేయితో బస్సులో లాహోర్‌కు తీసుకెళ్లినప్పుడు నవాజ్ షరీఫ్‌తో మొదటి సమావేశం జరిగింది. బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందు, వాజ్‌పేయి నవాజ్ షరీఫ్‌ను ఇండియా నుంచి ఏమి తీసుకురావాలని అడిగాడు, దానికి నవాజ్ బస్‌లో దేవానంద్‌ని తీసుకు రావాలని చెప్పాడట. ఆ తరువాత దేవానంద్ లండన్ వెళ్లేటప్పుడు నవాజ్ షరీఫ్ కూడా దేవానంద్‌ని కలవడానికి అక్కడకు చేరుకునేవారు.'నవాజ్ షరీఫ్'కు హైడ్ పార్క్‌లో ఉన్న తన సొంత విల్లాకు విందు కోసం దేవ్‌ను ఆహ్వానించేవారు.
88 ఏండ్ల వయసులో కూడా సినిమాలో నటించిన దేవ్
దేవానంద్ 2011 సంవత్సరం 88 ఏండ్ల వయసులో కూడా తన చివరి సినిమా ''చార్జ్ షీట్''లో నటించి బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన శకాన్ని సృష్టించి, ఎవర్ గ్రీన్ హీరో అనిపించుకున్నాడు. భగ ప్రేమికుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన దేవానంద్, నిజజీవితంలో కూడా భగ ప్రేమికుడు. నటి సురయ్యాతో ప్రేమ విఫలమై, నిజజీవితంలో కూడా భగప్రేమికుడే అయ్యారు. అరవై సంవత్సరాల సినీ జీవితంలో రొమాన్స్‌కు కొత్త భాష్యం చెప్పి, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో హీరోగా చేశారు, హిట్ సినిమాలు తీశారు, ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. చివరి వరకు సినిమాలు చేస్తూ, 2011 డిసెంబర్ 3న తన 88వ ఏట లండన్‌లో ఒక హోటల్ రూమ్‌లో కన్నుమూశారు. దేవ్ మాత్రం జనంమదిలో ఈ నాటికీ 'స్టైల్ కింగ్'గానే మిగిలి ఉన్నారు.
(డిసెంబర్ 3న వర్ధంతి సందర్భంగా)
దేవానంద్ 110 చిత్రాల్లో నటించారు. 19 చిత్రాలను డైరెక్ట్ చేశారు. 35 చిత్రాలను నిర్మించారు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. 1993లో ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 1996లో స్క్రీన్ వీడియోకాన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం భారతీయ సినిమాకు దేవానంద్ చేసిన సేవలకు గుర్తింపుగా 2001 లో పద్మభూషణ్, 2002 లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది. దేవ్ అక్కినేని నాగేశ్వరరావు నెలకొల్పిన జాతీయ అవార్డును 2006లో అందుకున్నారు. ఇలా ఆయన కీర్తికిరీటంలో ఎన్నెన్నో మేలిమి అవార్డులు రత్నాలుగా నిలిచాయి.
సురయ్యతో ప్రేమాయణం ...
దేవానంద్, సురయ్యాల ప్రేమాయణం బాలీవుడ్లో అత్యుత్తమ ప్రేమ కథలలో ఒకటి. తొలి చిత్రం సమయంలోనే సురయ్యాను దేవ్ బోట్ ప్రమాదం నుంచి రక్షించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆమె అప్పటికే పెద్ద స్టార్. ఆమె దగ్గర పెద్ద కార్లు ఉన్నాయి. అప్పుడప్పుడే నటుడిగా స్థిరపడుతున్న దేవానంద్ సురయ్యా కంటే వయసులో చిన్నవారు. అయిన వారి మద్య ప్రేమ రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. కానీ, ఈ ప్రేమ పెళ్లి దశకు చేరుకోలేకపోయింది. మతాలు వేరు కావడంతో సురయ్యా అమ్మమ్మ 'బాద్షా బేగం' వారి పెండ్లికి అంగీకరించలేదు. అంతకు ముందే సురయ్యాకు ఓ డైమండ్ రింగ్ వేలుకు తొడిగారు దేవ్. ఆమె అమ్మమ్మ దేవ్ తొడిగిన వజ్రపు ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయాలని పోరు పెట్టడంతో ఆ ఉంగరాన్ని దేవానంద్‌కు తిరిగి ఇచ్చివేయగా, దేవ్ చివరిసారిగా ఆమెను ప్రేమగా చూసి సముద్రపు అలల్లోకి ఆ ఉంగరాన్నివిసిరేసి బరువెక్కిన మనసుతో తిరిగి చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సురయ్యా మాత్రం దేవ్‌నే భర్తగా భావించి జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయింది. తరువాత దేవానంద్ తనతో పలు చిత్రాల్లో కలసి నటించిన హీరోయిన్ కల్పనా కార్తిక్‌ను పెళ్ళాడాడు. సురయ్యాను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మతం అడ్డంకి క్రిష్టియన్ అయిన కల్పనను చేసుకోవడానికి మాత్రం అడ్డంకి కాలేదు.
నెహ్రూతో సమావేశం
1947 తర్వాత హిందీ సినిమాలపై ఆధిపత్యం వహిస్తున్న ముగ్గురు నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్, రొమాన్స్‌తో ప్రజల హృదయాలను పాలించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఒకసారి మా ముగ్గురిని పిలిచారని, 'రోమాన్సింగ్ విత్ లైఫ్' అనే తన ఆత్మకథలో దేవానంద్ ఇలా వ్రాసుకున్నాడు. 'మేము నెహ్రూ దగ్గరికి వెళ్ళినపుడు ఆయన మా ముగ్గురిని కౌగిలించుకున్నారు. అతను అనారోగ్యంతో నడుస్తున్నారు, కానీ వెంటనే మానసిక స్థితికి వచ్చారు. దీనిని సద్వినియోగం చేసుకున్న రాజ్ కపూర్, 'పండిట్ జీ , మీరు ఎక్కడికి వెళ్లినా మహిళలు మీ వెంట పరుగెత్తేవారని మేము విన్నాం' అనే ప్రశ్నను లేవనెత్తారు. అపుడు నెహ్రూ తన ప్రసిద్ధ చిరునవ్వును వ్యాప్తి చేస్తూ, 'మీలాగా నేను ప్రజాదరణ పొందలేదని అనడంతో, వెంటనే నేను కూడా అడిగాను, 'మీ అద్భుతమైన చిరునవ్వు లేడీ మౌంట్ బాటెన్ హృదయాన్ని గెలుచుకుంది కాదా? అని, వెంటనే 'నెహ్రూ ముఖం ఎర్రగా మారింది, కానీ ఆయన నా ప్రశ్నను ఆస్వాదించి, నవ్వుతూ... 'నా గురించి ఈ కథలు విని ఆనందించాను' అని చెప్పారు. దిలీప్ కుమార్ 'అయితే 'లేడీ మౌంట్ బాటెన్' మీరు ఆమె బలహీనత అని ఒప్పుకున్నారు.' అనగానే నెహ్రూ నవ్వుతూ 'నేను ఈ కథలను నమ్మాలని ప్రజలు కోరుకుంటున్నారు' అని అన్నారు. ఈ విషయాలనీ దేవ్ ఆత్మ కథలో వివరంగా వ్రాసుకున్నారు.
-పొన్నం రవిచంద్ర,
9440077499