Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్గుల స్వాతంత్య్రంపై అభిలాషతో, జాతిపై మమకారంతో ఏ పదవులకు ఆశ పడకుండా నిజాయితీగా వ్యవహరించి జాతీయోద్యమానికి తన అశేషమైన సహకారాన్ని అందించారు. రజాకార్ల పైశాచిక కృత్యాల వల్ల, పోలీసు చర్య వల్ల ప్రాణ, ఆస్థి నష్టం బారిన పడ్డ దీనులకు, ఆర్తులకు అండగా ఉండేందుకు శ్రీ జాఫర్ హుసేన్ కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీయే 'సలామతీ'. ఈ కమిటీ తరపున బూర్గుల హైదరాబాదులోని పలు కుటుంబాలను పరిశీలించి వారికి పెన్షన్ ఇప్పించేందుకు కృషి చేశారు.
పురుషులైనా, స్త్రీలైనా మరెవరైనా ఒకే మాదిరిగా పుడతారు. కానీ, పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు మాత్రం సంఘం ప్రోత్సాహంతో, తమాసక్తితో, సంఘోద్ధరణ కృషితో తయారు కాబడతారు. తన ఆదికాలం నుంచి అంత్యకాలం వరకు నోరు విప్పి చెప్పితే కన్నీళ్లురాకుండా ఉండలేని బాధలు దేశం కోసం, దాస్య విముక్తి కోసం అనేకం పడ్డారు. జైలుకెళ్లారు. దీన ప్రజల సంక్షేమం కోసం, అనేక ప్రాంతాలు తిరిగారు. తిరిగిన ప్రతీ చోట నుంచి జ్ఞానాన్ని పొంది అసమాన సాహిత్యం సృజించి, ముఖ్యమంత్రియై కీర్తించబడిన మహోన్నతుడు, జాతీయవాది, స్వాతంత్య్ర వీరుడు ఇతను.
జననం
1899 , మార్చి 13న పుట్టింది అమ్మమ్మగారి ఊరైన పడకల్ గ్రామంలో. ఇది కల్వకుర్తి తాలూకాలో ఉంది. పెరిగింది, చదివింది అంతా మాత్రం తన స్వంత ఊరైన బూర్గులలో. రంగనాయకమ్మ, నరసింగరావులు తల్లిదండ్రులు.
విద్యాభ్యాసం
తన స్వగ్రామంలోనే ఆరవ తరగతి వరకు సాగించారు. ఆ తర్వాత 1911లో హైదరాబాదుకు వెళ్లి ధర్మవంత్ పాఠశాలలో 7వ తరగతిలో చేరి ఉత్తీర్ణత అయి బొంబాయిలో మెట్రిక్ రాసిన అనంతరం నిజాం కాలేజి నుంచి ఇంటర్మీడియట్ పట్టా పొందారు. ఘోఖలే స్థాపించిన పూనా ఫెర్ఘూసన్ కాలేజి నుంచి బి.ఏ పట్టానూ పొందారు. ఆ తర్వాత బొంబాయిలో 1921లో 'లా' పరీక్షలో ఉత్తీర్ణత అయ్యారు. తన ఇంట్లోనే ఉర్దూ, ఫారసీ భాషలను నేర్చుకున్నారు.
ఉద్యమం
17 ఏండ్ల ప్రాయంలోనే దేశ సేవ పట్ల ఇష్టతను పెంచుకున్నారు. 1916లో స్థాపించబడ్డ ‘Young men’s association’కి వామన్ నాయక్ అధ్యక్షుడయితే ఈయన కార్యదర్శి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో హైదరాబాదులో మరీ నిరంకుశంగా వ్యవహరించిన నిజాం ప్రభుత్వం ప్రజలపై అనేక ఆంక్షలు విధించి వాళ్ళను మాటలున్న మూగ వాళ్ళను చేసింది. కానీ రామకృష్ణారావు మాత్రం ప్రజలలో జాతీయ భావాలు పుట్టించడానికి కృషి చేశారు 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభకు బూర్గుల వెళ్లి అక్కడ తనదైన కృషిని అందించారు. 1938లో స్టేట్ కాంగ్రెసు స్థాపనకు ఒక కమీటిని ఏర్పాటు చేశారు. దానికి కన్వీనర్‌గా బూర్గుల ఉన్నాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ నిర్భంధానికి నిరసనగా వారం తర్వాత హైదరాబాదులో బూర్గుల విక్టరీ ప్లే గ్రౌండ్లో సత్యాగ్రహం చేసినపుడు పోలీసులు అరెస్టు చేశారు. 1947 మే 8న జయప్రకాష్ నారాయణ హైదరాబాదులో రఘునాథ బాగ్‌లో ఉపన్యసించడానికి ముందే నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించి నగర బహిష్కరణకు ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు సాయంత్రం రఘునాథ బాగ్‌లో సభ ఉందని ప్రకటన రావడంతో అక్కడికి వెళ్ళిన బూర్గుల పోలీసులచే అరెస్టు కాబడ్డారు.
నిజాం రాజు 1947లో అటు పాకిస్తాన్ లోను, ఇటు భారతదేశంలోనూ చేరక స్వాతంత్య్రాన్ని ప్రకటించు కున్నారు. ఈ స్వాతంత్య్ర ప్రకటనను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని బూర్గుల ప్రతిపాదించారు.
బూర్గుల 1923లో తన న్యాయవాద వృత్తిని మొదలు పెట్టి 'అజ్గర్ దారెట్ల' అనే లాయర్ వద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ విధంగా ఆరంభించిన తన వృత్తిలో ఇంతకింతకు ఎదుగుతూ అనేక మందికి మార్గదర్శకుడయ్యారు. వారిలో పీ.వి. నరసింహారావు కూడా ఒకరు.
జాతీయోద్యమాన్ని నీరుగార్చేందుకు నిజాం ఎన్నో వ్యూహాలు పన్నినా అందుకు ఎవరు సిద్ధం కాలేరు. ఉద్యమాన్ని ఆపేస్తే ఉపాధ్యాయ, మంత్రి పదవి ఇస్తానని నిజాం రెండు సార్లు మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కాని బూర్గుల స్వాతంత్య్రంపై అభిలాషతో, జాతిపై మమకారంతో ఏ పదవులకు ఆశ పడకుండా నిజాయితీగా వ్యవహరించి జాతీయోద్యమానికి తన అశేషమైన సహకారాన్ని అందించారు. రజాకార్ల పైశాచిక కృత్యాల వల్ల, పోలీసు చర్య వల్ల ప్రాణ, ఆస్థి నష్టం బారిన పడ్డ దీనులకు, ఆర్తులకు అండగా ఉండేందుకు శ్రీ జాఫర్ హుసేన్ కన్వీనర్‌గా ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీయే 'సలామతీ'. ఈ కమిటీ తరపున బూర్గుల హైదరాబాదులోని పలు కుటుంబాలను పరిశీలించి వారికి పెన్షన్ ఇప్పించేందుకు కృషి చేశారు.
సాహిత్యం
పండితరాజ పంచామృతం (అనువాదం), శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, సారస్వతవ్యాస ముక్తావళి, cultural synthesis of India, Random reflections, సౌందర్యలహరి, కనక రాధస్తవం, ఆంధ్ర మహాభాగవతం (హిందీ సమీక్ష), శ్రీ క్రష్ణాష్టకం, కవుల హృదయం, పుష్పాంజలి, నర్మద్ గీతాలు, దశావతర కీర్తనలు, గాంధీ మహాత్ముని గ్రామీణ పథకం, కృష్ణ శతకం, నేను నా దైవం, మృణాళిని (నాటిక), తెరతీయగా రాదా... వంటి పలు గ్రంథాలను, వ్యాసాలను అనేకం రాశారు. 1952 జనవరిలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి లక్ష్మణ్ రెడ్డి బారెట్ల అనే ప్రత్యర్థిపై గెలిచి సభ్యుల ఏకగ్రీవంతో ముఖ్యమంత్రి అయి నాలుగున్నర సం||ల పాటు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించి హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రఖ్యాతిగాంచిన బూర్గుల సెప్టెంబర్ 14 , 1967లో తీవ్ర అనారోగ్యంతో అమరుడయ్యారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542