Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయి తరపు నుంచి కట్న కానుకలు ఏమీ ఆశించకపోవడం, ఆమెను ప్రేమగా చూసుకోవడం, తన భార్యకు ఏలాంటి కష్టం కలగకూడదని ఆలోచించడం ఈ పాత్ర స్వభావం. తనను నమ్మి తనతో వచ్చిన తన భార్యకు పూర్తిగా అండగా నిలబడ్డాడు మల్లిక్. ఆమె అభిరుచులను, ఆలోచనలను గౌరవించాడు. ఆమె ఇష్టాలను, అభిష్టాలను తీర్చడానికి సిద్ధపడ్డాడు. ఆమె ఇష్టానికి అనుగుణంగా ఆర్ధికంగా ఆమె స్వంతంగా ఎదగడానికి తోడ్పడ్డాడు. ఇలాంటి పాత్రలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి.
సాహిత్య ప్రక్రియల్లో నవలకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని నవల ద్వారా వివరంగా చెప్పడానికి అవకాశముంటుంది. వివరంగా విషయాన్ని చదవాలనకునే వారు నవలను ఇష్టపడతారు. నవలలు అనేక అంశాలతో పాఠకులను ఆకట్టుకుంటాయి. కొన్ని నవలలు ఇతివృత్తం ద్వారా, మరికొన్ని నవలలు శైలి ద్వారా, ఇంకొన్ని నవలలు సంభాషణల ద్వారా ఇలా రకరకాల పద్దతులలో రచించిన నవలలు పాఠలకులను ఆకట్టుకుంటాయి. అయితే స్వాతి శ్రీపాద రచించిన శిశిర వసంతం నవల పాత్రల రూపకల్పన ద్వారా పాఠకులను అలరిస్తుంది.
ఈ నవలలోని పాత్రలు, పాత్రల పేర్లు సహజంగా ఉంటాయి. పాత్రల స్వభావం, ప్రవర్తన, నడత పాఠకులను ఆకట్టుకుంటాయి. నవలలోని ప్రతిపాత్ర మన పక్కింటివాళ్లో, మన ఎదురింటి వాళ్లో, మన కాలనీలోని వాళ్లో అన్నట్టుగా ఉంటాయి. మనకు పరిచయం ఉన్నట్టుగా, మనల్ని పలకరించినట్టుగా అనుభూతి కలుగుతుంది.
ఈ నవలలో మల్లిక్ కథానాయకుడు, నిర్మల కథానాయకి. విశ్వనాథం, సరస్వతి, విశాలాక్షి, ప్రధాన పాత్రలు. కౌసల్య, అహల్య, వనజ, సోని పాత్రలు కూడా ముఖ్యమైనవే. ఇక శ్రీనివాస్, వకుళ, పరుశురామయ్య, రామాచారి, చిన్న స్వామి, అమరేశ్వరి లాంటి మరికొన్ని పాత్రలు మనకు సందర్భాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి.
ఈ నవలలోని పాత్రలను రచయిత్రి విభిన్నంగా రూపొందిం చారు. మంచి పాత్రలే కాదు చెడు పాత్రలు కూడా ఈ నవలలో కనిపిస్తాయి. అంతేకాదు రకరకాల మనస్తత్వాలతో రూపొందిన పాత్రలు సమాజంలో నిజంగా ఉండే పాత్రలు ఈ నవలలో మనకు కని పిస్తాయి. నవలలో నేతకార్మికులు ప్రధానంగా ఉంటారు. అలాగని నేతకార్మికుల జీవన శైలిని ఈ నవలలో సంపూర్ణంగా ఆవిష్కరించలేదు. రెండు నేత కార్మికుల కుటుంబాల మధ్య సాగే బంధాల, అనుబంధాల కథా గమనమే ఈ నవల ప్రధాన ఇతివృత్తం. ఇతివృత్తం ఏదైనా ఇందులోని పాత్రలు మంచితనం పంచడంలో, అప్యాయతలు, అనురాగాలు చూపించడంలో పోటీపడతాయి. అసూ యలు, ఈర్షలు, స్వార్ధాలు చూపించే పాత్రలు కూడా ఈ నవలలో కనిపించడం విశేషం.
మల్లిక్
ఇందులో మల్లిక్
కథా నాయకుడు. కథానాయ కుడికి ఉండవలసిన లక్షణా లన్నీ మల్లిక్ పాత్రలో పొందు పరిచారు రచ యిత్రి. తన స్నేహితు డైన విశ్వనాధం చెల్లిలికి పెళ్లి కుదిరింది. ఆ పెళ్లికొడుకు ఇదివరకే ఓ పెళ్లి చేసుకొని పిల్లలకు తండ్రి అని చివరి నిముషంలో తెలియడంతో
పెళ్లికూతురు ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అదే ముహుర్తానికి అందరి ఆమోదంతో ఆ అమ్మాయికి తాళికట్టడం మల్లిక్ పాత్ర గొప్పతనం.
అమ్మాయి తరపు నుంచి కట్న కానుకలు ఏమీ ఆశించకపోవడం, ఆమెను ప్రేమగా చూసుకోవడం, తన భార్యకు ఏలాంటి కష్టం కలగకూడదని ఆలోచించడం ఈ పాత్ర స్వభావం. తనను నమ్మి తనతో వచ్చిన తన భార్యకు పూర్తిగా అండగా నిలబడ్డాడు మల్లిక్. ఆమె అభిరుచులను, ఆలోచనలను గౌరవించాడు. ఆమె ఇష్టాలను, అభిష్టాలను తీర్చడానికి సిద్ధపడ్డాడు. ఆమె ఇష్టానికి అనుగుణంగా ఆర్ధికంగా ఆమె స్వంతంగా ఎదగడానికి తోడ్పడ్డాడు. ఇలాంటి పాత్రలు మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి భర్త నాకూ ఉంటే బాగుండేదని అనేకమంది ఆడపిల్లలు కోరుకునే విధంగా మల్లిక్ పాత్రని చిత్రించారు.
తల్లికి కొడుకుగా భార్యకు భర్తగా అత్తకు అల్లుడిగా అన్నివిధాల అందరికి తగిన విధంగా మసలుకున్న మల్లిక్ పాత్ర పాఠకులందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.
నిర్మల
ఈ నవలలో ఈమె కథానాయకు రాలు అయినంతమాత్రన సోకులు, షికార్లు, ఆర్భాటాలు ఏమీ ఉండవు. సగటు అమ్మాయిలాగానే సాదాసీదాగా ఉంటుంది. నెమ్మదస్తురాలు. గారాభంగా పెరగడం వలన ఇంటర్ తప్పింది. బాధ్యతలు ఏమీ లేకపోవడంతో ఆలస్యంగా నిద్రలేస్తుంది. అలా అని బద్దకంగా ఏమీ ఉండదు. బట్టలు ఉతుకుతుంది. మనసుపుడితే వంటచేస్తుంది. మిగతా సమయంలో పత్రికలు చదువుకోవడం, తన ఈడు పిల్లలతో సినిమాలు చూడడం ఆమె అభిరుచులు. నిర్మల ఇంటర్ తర్వాత టైలరింగ్‌లో డిప్లోమా చేసింది.
సినిమాల్లోలాగా, కమర్షియల్ నవలల్లోలాగా నిర్మల పాత్రను రూపొందించలేదు రచయిత్రి. సహజసిద్ధంగా అందరికీ పరిచయం ఉన్నట్టుగా రోజూ మన కళ్లముందు తిరిగే పాత్రలా నిర్మల మనకు కనిపిస్తుంది. ఈ పాత్రకు ఆధునికమైన పేర్లుగానీ పెట్టకుండా సంప్రదాయంగా సాదాసీదాగా నిర్మల అని పెట్టడం సహజత్వానికి దగ్గరగా ఉంది.
నిర్మలకు పెళ్లి సంబంధం కుదరడం, అతడు ప్రభుత్వ ఉద్యోగి అని తెలసి ఆశలు, ఆశయాలు ఏమీ లేకుండా పెళ్లికి ఒప్పుకున్న నిర్మలలు మనకు ఎందరో కనిపిస్తారు. వచ్చిన పెళ్లికొడుకు మోసగాడని, ఇదివరకే అతనికి ఒకటికి మించి పెళ్లిళ్లు జరిగాయని తెలిసి నిర్మల మనస్తాపం చెందడం, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడంలో నిర్మల పాత్ర స్వభావం వ్యక్తమవుతుంది. కథానాయకి అంటే మోసగించిన వాడికి ఎదురుతిరగడం, తగినబుద్ధి చెప్పడం చైతన్యమూర్తిలా ప్రవర్తిస్తుందని అందరూ భావిస్తారు. కానీ రచయిత్రి ఈ పాత్రను విభిన్నంగా చిత్రించడం అభినందనీయం.
ఇలాంటి సమయంలో ఆదర్శంగా నిలిచి తనకు తాళికట్టిన మల్లిక్‌తో అత్తారింటికి సాగిపోవడం నిర్మల పాత్రలోని సహజ లక్షణం.
తన ఇష్టానికి అనుగుణంగా అన్నీ జరుగుతుండడం, తనకు సినిమాలకు షికార్లకు తిప్పడం, తనను ఇష్టాంగా చూసుకోవడంతో నిర్మల మనసు కరిగిపోవడం ఆమె సున్నిత మనస్తత్వానికి అద్దం పడుతుంది. సినిమా చూస్తూ తనను, తన భర్తను కథానాయకి, కథానాయకుడుగా ఊహించుకునే సాధారణ మనస్తత్వం నిర్మలది. అత్తమ్మను అమ్మలా చూసుకునే స్వభావం నిర్మలది.
నిర్మల పక్కింటి వనజతో షాపింగ్‌కు వెళ్లింది. తనపాపకు గౌను కొందామని రమ్మంటే మోహమాటపడి వెళ్లింది నిర్మల. కొన్ని పాత్రలు ఇలాంటి చిన్నచిన్న సంఘటనలతోనే జీవిత సత్యాలను తెలుసుకోగలుగుతాయి. నిర్మలకు కూడా అదే జరిగింది. అక్కడ ఒక గౌనుకు చెప్పిన ధర వెయ్యిరూపాయలు. టైలరింగ్‌లో డిప్లామా చేసి ఖాళీగా ఉన్న తను వెంటనే మనసులోనే లెక్కలు వేయడం మొదలుపెట్టింది. బట్టకు రెండువందలు, కుట్టుకు రెండువందలు, ఇంకో వంద అదనంగా వేసుకున్నా మొత్తం 5వందలు. వెయ్యిరూపాయాలకు అమ్మడమంటే సగానికి సగం లాభం. దారి పొడుగునా అదే ఆలోచిస్తూ ఉంది. సగానికి సగం లాభం కాకపోయినా కొంత తగ్గించినా మంచి ఆదాయమే వస్తుంది కదా ! పుట్టింట్లో ఇలాంటి ఆలోచన రాలేదు నిర్మలకు. అంత అవసరం కూడా అనిపించలేదు.
బతుకు తెరువుకోసం తన భర్త పూణె వెళ్లడం వలన తనకు తెలియకుండానే నిర్మలలో ఇలాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఆమె జీవితాన్ని మంచి మలుపు తిప్పుతుందని ఆమె ఊహించలేదు. నిర్మల కోరిక ప్రకారం తన అత్తమ్మ భారమైనా కూడా వాయిదాల పద్దతిలో మంచి కుట్టుమిషన్ కొని పెట్టింది. రెడీమెడ్ దుస్తులు కుట్టడానికి కావలసిన సరంజామా అంతా కొనితెచ్చుకుంది. తనకు తెలిసిన విద్యేకాబట్టి గౌనులు మొదలయినవి కొన్ని కుట్టి పెట్టుకుంది. ఆ వీధిలో అమ్మలక్కలందరినీ కలిసింది. వాళ్లకు జాకెట్లు ఓ పది రూపాయాలు తక్కువకే కుట్టిస్తానని తన వైపుకు తిప్పుకుంది.
నిర్మల సరదగా మొదలు పెట్టిన కుట్టుపని నెమ్మది నెమ్మదిగా విస్తరించింది. ఆ నోటా ఈ నోటా నిర్మల బాగా కుడుతుందని, తక్కువ ధరకేనని ప్రచారం అయింది. నిర్మల తీరిక లేకుండా అయిపోయింది. బట్టలు కుట్టడంతోపాటు కుట్టడంలో శిక్షణ తరగతులు కూడా ప్రారంభించింది. ఇల్లు సరిపోక మరో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుంది. ఇలా తను అభివృద్ధి పథంలో సాగిపోతుంది.
ఇలా నిర్మల పాత్ర పదిమందికి ఆదర్శప్రాయంగా నిలబడింది. కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఇలాంటి పాత్ర రూపకల్పన ఈ నవలకే వన్నె తెచ్చింది. తన ఆలోచనా శక్తిని పెంచుకొని అందరిని అబ్బురపరిచింది నిర్మల పాత్ర.
విశ్వనాథం
ఈ నవలలో మిగితా కొన్ని పాత్రలలాగే విశ్వనాథం పాత్రను కూడా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు రచయిత్రి స్వాతి శ్రీపాద.
కేవలం రైళ్లో పరిచయమైన మల్లిక్‌ను ఆ ఒక్క పరిచయంతోనే స్నేహితుడిగా భావించుకొని సహాయం అందించేది విశ్వనాథం పాత్ర. ఉద్యోగం వెతుక్కోవడం కోసం తమ ఊరికి వస్తున్న ఆ వ్యక్తికి అక్కడ నా అన్నవాళ్లెవరూ లేకపోవడంతో తన ఇంటికి తీసుకువెళ్లి తిండిపెట్టి, మిల్లుకి తీసుకువెళ్లి ఉద్యోగం ఇప్పిస్తాడు విశ్వనాథం. ఇంట్లో పెళ్లికెదిగిన చెల్లెలు ఉన్నందున ఆ మిత్రుడిని ఇంట్లో ఉంచుకోకుండా వేరేగది అద్దెకు వెతికి పెట్టాడంటే విశ్వనాథం తన కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.
ఆ కొద్దిపాటి పరిచయంతోనే అతనికి సహకరించడం, సలహాలివ్వడం విశ్వనాథంలోని మంచి గుణం. కుటుంబ బాధ్యతల్లో భాగంగా తన చెల్లి భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాడు. మంచి సంబంధం చూశాడు. సరిగ్గా పెళ్లి సమయానికి ఆ పెళ్లికొడుకు మోసగాడని ఇదివరకే పెళ్లయిందని, పిల్లలున్నారని విశ్వనాథంకు తెలిసిపోయింది. తన సహాయాన్ని పొందిన మల్లిక్ ఆ ముహుర్తానికే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. చెల్లెలు ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకొని మల్లిక్‌పై ఆమె అభిప్రాయాన్ని కనుక్కొని పెళ్లి జరిపించాడు. అంతటి క్లిష్ణ పరిస్థితుల్లో కూడా సరైన నిర్ణయం తీసుకునే విధంగా విశ్వనాథం పాత్రను తీర్చిదిద్దారు.
చెల్లెలికి పెళ్లి అయిన తర్వాత స్నేహితుడి స్థానాన్ని బావగా తన హృదయంలో పదిల పరచుకొని గౌరవించాడు విశ్వనాథం. తన బావ వద్దన్నప్పటికీ పెట్టుపోతలు, కట్న కానుకల విషయంలో ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకున్నాడు. పెళ్ల యిన తర్వాత కూడా చెల్లెలికి డబ్బు రూపం లోనే కాకుండా అనేక రూపాల్లో సహాయం అంది స్తూ ఉండే విశ్వనాథం పాత్ర పాఠకులందరికి నచ్చి తీరుతుంది.
అత్తారింటికి వెళ్ళిన చెల్లెలు ఎలా ఉందని కూడా అడగలేదంటే తన బావ మల్లిక్ మీద తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. విశ్వనాథం ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు అమ్మ, చెల్లెలు, తనకు మూడుభాగాలు చేసి చెల్లెలి భాగం డబ్బు చెల్లెలికి పువ్వుల్లో పెట్టిచ్చే అన్నయ్యలు ఈ రోజుల్లో అరుదుగా కనిపిస్తారు. తల్లి రక్తమాంసాలు పంచుకొని పుట్టినవారు ఆడపిల్ల అయిన, మగవాడైనా ఆస్తి కూడా సమానంగా పంచుకోవాలనే విశ్వనాథం ఆలోచనకు పాఠకులందరు సలాం చేస్తారు. ఇంతటి ఆదర్శవంతమైన పాత్రను సృష్టించిన రచయిత్రి నిజంగా అభినందనీయురాలు.
శాలక్షి
ఈ నవలలో విలువులున్న మరో పాత్ర విశాలక్షి. కొడుకు చెప్పాపెట్టకుండా ఓ అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే ఏమీ ప్రశ్నించకుండా ఆ అమ్మాయిని, కోడలిగా స్వీకరించి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది విశాలక్షి. అంటే కొడుకు మీద తనకున్న నమ్మకం ఈ పాత్రలో వ్యక్తమవుతుంది. కొడలిని కుతురిలా చూసుకుంటుంది. ఇలాంటి వాళ్లు ఈరోజుల్లో కనిపించరు. కోడలితో ఇంటి పనులన్నీ చేయించుకుంటూ అష్టకష్టాలు పెడుతూ పెత్తనం చెలాయించే అత్తలున్న ఈ కాలంలో కోడలికి స్వేచ్ఛనిచ్చి తన ఇష్టానుసారం మసలుకోమని చెప్పే అత్తపాత్రను చాలా సహజంగా, పలువురు మెచ్చుకునే విధంగా సృష్టించింది రచయిత్రి. కోడలి అభివృద్ధికి అన్ని విధాలా సహకరించింది. కోడలు ఎదుగుదలకు విశాలక్షి ఎంతగానో సహాయం చేసింది. నిర్మల భర్త మల్లిక్ అంటే తన కొడుకు చనిపోతే కోడలు మోడులా ఉండి పోకుడదని అష్ట కష్టాలుపడి కోడలికి మరోపెళ్లి చేసి ఆదర్శ మహిళగా నిలబడింది విశాలక్షి పాత్ర.
సరస్వతి
ఈమె విశ్వనాథంకు, నిర్మలకు తల్లి. ఈ పాత్రను కూడా గౌరవప్రదంగా తీర్చిదిద్దారు రచయిత్రి. ఉద్యోగం వేటలో విశ్వనాథం వెంట వచ్చిన మిత్రుడికి ఎవరూ, ఏంటి అని అడగకుండా సాదరంగా ఆహ్వానించి లంచ్‌బాక్స్ కూడా పెట్టివ్వడం ఆమె ఉదారతకు నిదర్శనం.
కూతురు నిర్మలకు చూసిన సంబంధం ఆఖరి నిముషంలో వరుడు మోసగాడని తెలిసింది. అలాంటి సమయంలో పెళ్లికొడుకు ఇదివరకే పెళ్లిచేసుకున్న అమ్మాయికి సరస్వతి బుద్దిమాటలు చెబుతుంది. నయానో, భయానో భర్తను మార్చుకోవాలని హితబోధ చేస్తుంది. అలాంటి బాధాకరమైన సమయంలో కూడా అన్యాయమైపోతున్న ఓ ఇల్లాలికి బాధ్యతగా నాలుగు మంచి మాటలు చెప్పగలగడం సరస్వతి ఆలోచనా విధానాన్ని వ్యక్తీకరిస్తుంది. అలాంటి సమయంలో కూడా తన కూతురికి ఏమీ కాదని దేవుడే మాకు మేలు చేస్తాడని మాట్లాడడం ఆమెలోని ధైర్యాన్ని సూచిస్తుంది. ఆత్మహత్యకు ప్రయత్నించిన కూతురు చెంపచెళ్లుమనిపించి ధైర్యం చెప్పడం సరస్వతి పాత్రలోని గొప్పతనం.
కూతురు, అల్లుడు తొలిపండుగకు రాలేకపోతున్నందున సరస్వతి తన కొడుకుతో పాటు కూతురి ఇంటికే వచ్చారు. అత్తవారింట్లో కూతురు ఎక్కువగా కష్టపడుతుందేమోనని తల్లి సహజమైన లక్షణాన్ని బయట పెట్టింది. ఎంతబాగున్నా తల్లికళ్లకు పిల్లలు అలా కనిపిస్తారు. అది సరస్వతిలోని మాతృప్రేమ.
ఇలా శిశిర వసంతం నవలలో పాత్రలు కనిపించడమే కాదు తమతో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతారు పాఠకులు. మిగితా పాత్రలను కూడా పాఠకులకు నచ్చే విధంగా మెచ్చే విధంగా సృష్టించడం రచయిత్రి ప్రతిభకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.
- డా|| సయ్యద్ ఆఫ్రీన్ బేగం 9908028835