Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యవసాయంలో మహిళల పాత్రకు గుర్తింపునిస్తూ నిర్వహించిన కార్యక్రమాల్లో 'వ్యవసాయ స్త్రీలు' ఒకటి. గేయాలు, 'రత్నప్రభ' కలం పేరుతో కథలు రాశారు.'చిట్టి ముత్యాలు' బాల గేయ సంపుటి. 'ఆర్ధ్ర హృదయం' కవితా సంపుటాలు సుశీలాదేవికి పేరుతెచ్చిన పుస్తకాలు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అన్ని ప్రక్రియలను ప్రోత్సహించడానికి పురస్కారాలను ప్రారంభించగా 1966లో సుశీలాదేవి బాలల గేయాలు 'చిట్టి ముత్యాలు'కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 'బాల సాహిత్య పురస్కారం' లభించింది.
అరవై, డెబ్బయ్యవ దశకాల్లో మనకు పిల్లల కార్యక్రమాలనగానే మొదటగా గుర్తు కొచ్చేది 'బాలానందం'. 'బాలా వినోదం విందాం బాలల్లారా! రారండి' అన్న పిలుపు వినగానే ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళమైనా ఉరికొచ్చి రేడియోల ముందు చెవులురిక్కించి కూర్చునేవాళ్ళం. నేటి ప్రముఖ రచయితలెందరో తొలినాటి వెలుగులను బాలనందం నుంచి అందుకున్నవాళ్ళే. ముఖ్యంగా న్యాయపతి రాఘవరావు దంపతులు, తురగా జానకీరాణి వంటి ఎందరో ఈ దిశగా గొప్ప కృషిని చేశారు. ఇదే సమయంలో నల్లగొండ ప్రాంతం నుంచి హైదరాబాద్ రేడియోలో వినిపించిన స్వరం గంగరాజు సుశీలాదేవి గారిది.
'పుట్టినది మట్టిలో కలిసి గిట్టుకొరకా?/ నాకు కావలె జన్మ సార్ధక్య యశము' అంటూ గేయరూపాత్మక ఆత్మకథలో చెప్పుకున్న స్వాతంత్య్రానంతర బాల సాహితీమూర్తి గంగరాజు సుశీలాదేవి రేడియో కార్యక్రమాల రూపకర్తగా, బాలగేయకర్తగా, బాలల నాటక, కథా రచయిత్రిగా సుపరిచితులు. 1939 ఆగస్టు, 27న నేటి జనగామ జిల్లా సిద్దెంకిలో పుట్టారు. 'బొమ్మరిం టాటలాడెడి ప్రాయముననె/ అత్త వారింటిలో కాలు పెట్టవలసె' అంటూ తొమ్మిదేండ్ల ప్రాయంలోనే గంగరాజు హన్మంతరావుతో జరిగిన తన వివాహాన్ని గురించి చెప్పుకున్నారు తన ఆత్మకథలో. బాల్యంలో వివాహం జరిగినా అది సుశీలాదేవి సృజనకు ఎక్కడా ఆటంకం కాలేదు.
'రేడియో అక్కయ్య' తురగా జానకీరాణి ప్రోత్సాహంతో 'ఆకాశవాణి'కి పాటలు రాశారు సుశీలాదేవి. ఇప్పటికీ ఆకాశవాణిలో మిక్కిలి ప్రాఛుర్యాన్ని పొందిన 'ఈ మాసపుపాట', 'ఈ పాట నేర్చుకుందాం' కార్యక్రమాల్లో వీరి లలితగేయాలు ప్రసారమయ్యాయి. గ్రామీణ వాతావరణంలో పుట్టి పురిగిన గంగరాజు సుశీలాదేవికి వ్యవసాయం గురించి, వ్యవసాయ పద్ధతుల గురించి బాగా తెలుసు. ఈ అంశాల మీద పలు రేడియో ప్రసంగాలు చేశారు. మహిళాభ్యుదయం వల్లే సమాజ పురోభివృద్ధి అని నమ్మిన వీరు మహిళలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను రేడియోలో నిర్వహించారు. ముఖ్యంగా వ్యవసాయంలో మహిళల పాత్రకు గుర్తిం పునిస్తూ నిర్వహించిన కార్యక్రమాల్లో 'వ్యవసాయ స్త్రీలు' ఒకటి. గేయాలు, 'రత్నప్రభ' కలం పేరుతో కథలు రాశారు.'చిట్టి ముత్యాలు' బాల గేయ సంపుటి. 'ఆర్ధ్ర హృదయం' కవితా సంపుటాలు సుశీలాదేవికి పేరుతెచ్చిన పుస్తకాలు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అన్ని ప్రక్రియలను ప్రోత్సహించడానికి పురస్కారాలను ప్రారంభించగా 1966లో సుశీలాదేవి బాలల గేయాలు 'చిట్టి ముత్యాలు'కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 'బాల సాహిత్య పురస్కారం' లభించింది. 'గంగిరెద్దు చూడరా/ఎంతో బాగుందిరా/గండోలు ఊగించే/డూ డూ బసవన్న రా!/ఇంటింటను చక్కగా/తన విద్దెను చూపునురా/దయా ధర్మ బిక్షను గొని/దీవించి పోవునురా!' అంటూ గంగిరెద్దుల ఆటను చక్కగా బాలల కళ్ళకు కట్టినట్టు గేయంలో అక్షరచిత్రాలు గీస్తారు సుశీలాదేవి. 'విద్యార్థీ వినరా! హితము తెలిసికొనరా!/విద్య ఒక్కటే నీకు తరిగిపోని ధనమురా!' అంటూ చక్కని హితబోధ చేస్తూ రాసిన వీరి బాలగేయాలు లలిత గేయాల్లా లలితంగా ఉంటాయి. అమ్మమాట లాగా, కమ్మని తెలుగు పాటలాగా భాసిస్తాయి. 'మొక్కై వంగనిదే మానై వంగునా' అన్న మాట మనకు తెలిసిందే, అందుకే ఎదిగే దశలోనే పిల్లలకు చక్కని సంస్కారం నేర్పాలన్న తపన వీరి రచనల్లో అణువనువునా కనిపిస్తుంది. అ దిశగానే 'నీ ప్రగతియే దేశానికి సుగతిరా! నీ ఉన్నత సంస్కారమె జాతి పురోగతిరా!' అంటారు. 'చిట్టి ముత్యాలు' 1964-65 మధ్య రాశారు సుశీలాదేవి. తాను 'చిట్టి చిట్టి ముత్యాలతో / కట్టిన యీ సరం / అన్నయ్యకు అంకితం' అంటూ రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావుకు అంకితం చేశారు.
సరదాగా పాడుకునే గేయాలేకాదు చక్కని హేతువు కలిగిన గేయాలనూ రాశారు సుశీలాదేవి. వీటిలో 'గుడికెందుకే అమ్మా' అన్న గేయం ఆలోచింపజేసే గేయం. 'గుడికెందుకే అమ్మ గుడికెందుకే / గుడిలోని బొమ్మకూ ముడుపెందుకే' అంటూ తల్లిని ప్రశ్నిస్తాడు అబ్బాయి. ప్రశ్నించడమే కాక తనకు బడిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను మననం చేసుకుంటూ, తల్లికి వివరిస్తాడు. 'దీన మానవులలోన దేవుంటాడని/మానవుని సేవయే మాధవుని సేవయని/చదువుకున్నానమ్మ పాఠాలలోన/నిన్నే నిత్యము పూజింతునమ్మ' అంటూ రాతి బొమ్మల్లోన కాదు తల్లిలోనే దైవమున్నాడని చెబుతాడు. 'తెల్లావు దూడ/తెల్లావు దూడ/ బుల్లి మా దూడ / తెల్లావు దూడ', 'ముద్ద మందారమ్ము/ విరిసింది నేడు' వంటి లయాత్మకమైన గేయాలతో పాటు 'వనమహోత్సవం' వంటి ప్రత్యేక అంశాలపట్ల పిల్లలో చేతనను కలిగిస్తూ రచనలు చేశారు. 'మీ అమ్మ ప్రేమతో/ మిము పెంచులాగ/చిన్న మొక్కలను మీరు/పెంచుకుంటేను' ఏపుగా పెరిగి సంతోషాన్ని కలిగిస్తాయంటారు. చక్కని బాల సాహిత్యాన్ని, లలితగీతాల్ని, పిల్లలకోసం, మహిళల కోసం పలు రచనల్ని చేసిన రచయిత్రి సుశీలాదేవి.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548