Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాదు తొలి మేయరుగా బాధ్యతలు నిర్వహించిన మాడపాటి, ఆంధ్రప్రదేశ్ తొలి విధాన పరిషత్తుకు అధ్యక్షులుగా ఉన్నారు. (1958-64). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ భాషగా తెలుగుకు తగిన స్థానం కల్పించడంలో కృషి చేసినందున 1956 నవంబర్ 4న విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్‌ను ప్రదానం చేసింది.
గాంధీ చూపిని మితవాద బాటలో నడుస్తూ.. స్థానిక సమస్యలకు ఉద్యమంలో పెద్దపీట వేస్తూ... ఆంక్షల మధ్య అవిరామంగా ముందుకు సాగుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి అనధికార వారధిగా ఉంటూ సామరస్య వాతావరణంతో జాతీయోద్యమాన్ని నడిపిన మహిమాన్వితుడు.
జననం, విద్యాభ్యాసం: హైదరాబాదు స్వాతంత్య్రోద్యమంలో హనుమంతరావు చేసిన అచంచల కృషికి తన పట్టుదలకు చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. హైదరాబాదు రాష్ట్ర విముక్తి ప్రదాతలలో ముఖ్య నాయకులుగా విధానపరిషత్తులో సభ్యులుగా ఇలా తన పేరు చిరస్థాయిగా ఉండింది.
బ్రిటిషాంధ్రలోని కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరు గ్రామంలో 1885, జనవరి 22న జన్మించారు. మాడపాటి వెంకటప్పయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు ఇతను రెండవ కుమారుడు. తల్లి వెంకటసుబ్బమ్మ సోదరుడు సూర్యాపేటలో ఉండడం మూలాన, భర్త పోయాక ఈమె కుమారులతో సూర్యాపేటకు వచ్చి సోదరుడి సంరక్షణలో ఉండసాగింది. దాంతో మాడపాటికి ఇక్కడి తెలంగాణతో విడదీయలేని బంధం ఏర్పడింది.
ఇతను సూర్యాపేటలో మూడేండ్లు చదివాక కొన్నాళ్ళు ఇబ్రహీం పట్నంలో, నల్గొండలో చదివి 1898లో ఉర్దూ మిడిల్ పరీక్షలో ప్యాసయ్యారు. ఉత్తరోత్తర హన్మకొండ పాఠశాలలో చేరి ఉత్తీర్ణత సాధిం చారు. ఉర్దూ, పారశీ, తెలుగు మొదలగు భాషలలో పాండిత్యం ఉంది.
ఆంధ్రోద్యమం: హైదరాబాదు సంస్థానం రాజకీయంగా కుంటుబడ్డ కాలం మొదలు స్వాతంత్య్రం వచ్చేవరకు అణిచివేతకు గురైంది. రాష్ట్ర ప్రజలను సాంస్కృతికంగా, రాజకీయంగా జాగరూకుల్ని చేయాలంటే దానికి గ్రంథాలయాల స్థాపన అవసరమని నాటి సమాజ సంస్కర్తలు తలిచారు. దాంతో విప్లవ అసోసియేషన్లుగా భావించబడ్డ గ్రంథాలయాల సభకు నిజాం తన అనుమతిని నిరాకరించారు. ఐనా అనుమతిని కోరడంలో మాడపాటి చేసిన కృషి బహు ప్రశంసనీయమైంది. 1923లో ఆంధ్రజనకేంద్ర సంఘం మొదటి సమావేశానికి కార్యదర్శిగా వ్యహరించారు. ప్రజలను ప్రభుత్వం చేస్తున్న ఆగడాల పట్ల మేల్కొల్పడానికి స్థాపించిన ఆంధ్రమహాసభ మొదటి సమావేశ నిర్వహణకు హనుమంతరావు నానా ప్రయాస పడి అనుమతి పొందారు. యావత్తు తెలంగాణా ప్రజానీకాన్ని ప్రభుత్వం పట్ల అప్రమత్తుల్ని చేస్తూ వారిలో చైతన్యం తీసుకొస్తున్న ''ఆంధ్రమహాసభ, హనుమంతరావు పంతులు గారి దృష్టిలో తెలంగాణా ప్రజల జాతీయోద్యమం'' అని డి.రామలింగం ఉటంకించారు.
ఆంధ్రమహాసభకు అనుబంధంగా మాడపాటి, ఆంధ్రమహిళా సభ పద్ధతిని ప్రవేశపెట్టి దాని ద్వారా స్త్రీ జనోద్ధరణ, స్త్రీల ప్రాథమిక హక్కులు, స్త్రీలలో మనోవికాసం, సంఘసంస్కరణ ఉద్దేశ్యాలను లక్ష్యంగా పెట్టుకొని సభలు జరిపేందుకు కృషి చేశారు.
1935 మార్చి 26వ తేదీన పదమూడు వేల మందితో సిరిసిల్లలో జరిగిన నాల్గవ ఆంధ్రమహాసభకు మాడపాటిని ఆంధ్రమహాసభ సభ్యులు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు.
సాహిత్యం : మాడపాటి రచయిత, కవి. ఇతను రాసిన తొలి గ్రంథం అనువాద ప్రక్రియకు చెందినది. బంకించంద్ర చటర్జీ రాసిన 'ఆనందమఠం'కు అది అనువాదం. 1911లో గ్యారీబాల్డి జీవిత చరిత్ర, అనంతరం రోమక సామ్రాజ్య చరిత్ర (అసంపూర్ణం), బహదూర్ చింతామణి రాసిన 'ఎపిక్ ఇండియా' గ్రంథానికి తెలుగు అనువాదంగా 'క్షాత్ర కాలపు హింద్వార్యులు'(1927) రాశారు. కాశీనాథరావువైద్య రాసిన 'మహాభారత సమీక్ష' పుస్తకాన్ని కూడా 1916 లో అనువాదం చేశారు. చరిత్ర, ఇతరుల సంస్కృతికి సంబంధించిన గ్రంథాలే కాక కథలను కూడా రచించారు. మాడపాటి మొత్తం 13 కథలను సృజించారు. వాటిలో 7 కథలు 'మల్లికా గుచ్చం' పేరుతో 1911లో వెలువడినాయి. తెలుగు వారికి ప్రేమ్ చంద్ రాసిన ఉర్దూ కథలను పరిచయం చేసిన ఘనత మాడపాటికే దక్కుతుంది. 1937 లో ప్రవేశపెట్టిన రాజ్యంగ సంస్కరణలను తెలుపుతూ 'నిజాం రాష్ట్రంలో రాజ్యంగ సంస్కరణలు' అని పుస్తకం రాశాడు. మాడపాటి ఉర్దూలో కూడా చక్కని వ్యాసాలు రాశాడు. కొన్నాళ్ళు 'ముషిరే దక్కన్' అనే దిన పత్రికకు వ్యాసాలూ రాశాడు. తెలంగాణా ఆంధ్రోద్యమ విశిష్టత తెలుసుకోవడానికి ఆయువుపట్టైన 'తెలంగాణ ఆంధ్రోద్యమము' అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగు భాషా సాహిత్యం, చరిత్ర శోధన కొరకు హైదరాబాదులో 'ఆంధ్ర చంద్రికా గ్రంథమాల'ను స్థాపించారు.
పదవులు : 19ఏండ్ల వయసులో వరంగల్లులో ఉద్యోగంలో చేరి ఎనిమి దేండ్లు చేశారు. కొన్నాళ్ళకు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నిజాం ప్రభు త్వంలో అనువాదకుడిగా ఐదేండ్లు చేరారు. ఇంతటితో ఆగక 1917లో మరల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి అప్పటి ప్రముఖ న్యాయవాదియైన రారు విశ్వేశ్వరనాథ్ దగ్గర జూనియర్‌గా చేరారు. 1914-15లో శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి కార్యదర్శిగా ఉన్నారు. హైదరాబాదు తొలి మేయరుగా బాధ్యతలు నిర్వహించిన మాడపాటి, ఆంధ్రప్రదేశ్ తొలి విధాన పరిషత్తుకు అధ్యక్షులుగా ఉన్నారు. (1958-64). ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ భాషగా తెలుగుకు తగిన స్థానం కల్పించడంలో కృషి చేసినందున 1956 నవంబర్ 4న విశ్వవిద్యాలయం గౌరవ డి.లిట్‌ను ప్రదానం చేసింది. ఈ విధంగా హైదరాబాదు రాష్ట్ర జాతీయోద్యమంలో సాంస్కృ తికంగా కృషి చేసినందుకు ప్రజలు ఈయనను హైదరాబాదు గోపాలకృష్ణ గోఖలేగా భావించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇలా ఇంతటి సాంస్కృతిక తొవ్వ దివ్వెగా మారిన మాడపాటి 1970 నవంబర్ 11 న స్వర్గస్తుడయ్యారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542