Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వారసత్వంగా వస్తున్న కళను ఒడిసిపట్టుకొని వాగ్గేయకారుడిగా ఎదిగిన హనుమంతు ఉర్దూ మాధ్య మంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే, హైదరాబాదు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.
ప్రపంచ పటంపై కొందరు మనుషుల్లాగా జన్మిస్తారు. మరికొందరు మానవ మూర్తుల్లాగా చరిత్ర పుటల్లో నిలుస్తారు. అలాంటి చరిత సృష్టించిన వారిలో సుద్దాల హనుమంతు ఒకరు. మరణం తన చరణం అంచుల దాకా వచ్చినా, పోరాటంలో ఇతరుల రుధిరం ధరణిపై కనబడినా భయానికి పోనీ ధైర్యశాలి, కవి, హైదరాబాదు స్వాతంత్య్ర వీరుడు ప్రజా వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు.
జననం
సుద్దాల హనుమంతు 1910వ సంవత్సరంలో నల్లగొండ జిల్లా పాలడుగు గ్రామంలో లక్ష్మీనరసమ్మ, గుర్రం బుచ్చి రామయ్యలకు జన్మించారు. అనంతరం హనుమంతు సుద్దాల అనే గ్రామంలో స్థిరపడ్డారు. అందువల్ల ఆ గ్రామం పేరుతో సుద్దాల హనుమంతుగా మారి తన ప్రతిభాపాటవాలతో తనకు, ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాడు.
వారసత్వంగా వస్తున్న కళను ఒడిసిపట్టుకొని వాగ్గేయకారుడిగా ఎదిగిన హనుమంతు ఉర్దూ మాధ్య మంలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. చిన్న వయసులోనే, హైదరాబాదు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.
ఉద్యమం
నిజాం విమోచన పోరాటం జరిగే నాటి పరిస్థితులను నిత్య సమీపంగా గమనిస్తూ ఉండడం వలన ఆ ఉద్యమ ఆకాంక్ష దాని ప్రయోజనాలను తెలుసుకున్నారు. తనకున్న ఉద్యమ అవగాహనతో ఆరంభంలో గాంధీని, ఆయన సిద్ధాంతాలను అభిమానించిన సుద్దాల మొదటి సారి భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలో వాలంటీరుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రావి నారాయణ రెడ్డి ప్రసంగం విని ఉద్రేకపూరితుడై కమ్యూనిస్టుగా మారారు. అప్పటి నుంచి ఏనాడు కూడా ఉద్యమాన్ని, ఉద్యమ సాఫల్యతను విస్మరించలేదు. చైతన్యం సన్నగిల్లిన ప్రతీచోట తన పాటతో, ఆటతో ప్రజలలో నూతన పోరాట జవసత్వాలను నింపి నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధమయ్యారు. హనుమంతు హైదరాబాదులో ఉన్నప్పుడు అక్కడి సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై క్రమంగా ఆర్య సమాజం కార్యకర్తగా మారారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను మేల్కొల్పుతూ ఉన్నాడనే నెపంతో హైదరాబాదు స్వాతంత్య్రానికి ఏడాది ముందు, ఆయనపై కనిపిస్తే కాల్చివేత అనే ఆదేశాలు జారీ అయ్యాయి. 1946-48 కాలంలో తీవ్రంగా సాగిన నిజాం విముక్తి ఉద్యమంలో జెండాల ఆవిష్కరణను ఆనాడు గ్రామాలలో భారతీయ ఆత్మ గౌరవానికి ప్రతీక భావించేవారు. అలా హనుమంతు కూడా ఈ కాలంలోనే జాతీయ జెండాను, ఎర్ర జెండాను ఎగురవేసి తన ఆకాంక్షను, స్వాతంత్య్రోద్యమ ఆశయ సూచికను తెలిపారు.
సుద్దాల హనుమంతు సాహిత్య చైతన్యం
నిజాం రాజ్యంలో గ్రామ గ్రామాన కూరుకుపోయిన వెట్టిచాకిరి వ్యవస్థకు ప్రతికూలంగా ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీలు చేసిన చైతన్యంలో భాగంగా హనుమంతు కూడా తన మాట, పాట ద్వారా వెట్టి గురించి చెప్పేవారు. వెట్టి వాళ్ళు పడే బాధ గురించి ఎంత చెప్పినా అది తీరేది కాదని ఆవేదన పడేవారు. జానపద కళారూపాలైన గొల్లసుద్దులు, బుర్రకథ, పిట్టల దొర మొదలైన ఫకీర్ల వేషాలు ధరించి వాటి ద్వారా అసమాన సామాజికతను, దౌర్జన్యపు పాలనను గురించి ప్రజలకు తెలియచేప్పేవారు. ప్రజల భూముల్ని దోచుకొని దొరలుగా చెలామణి అవుతున్న వాళ్లకు కాలం చెల్లుతుందన్న ఆశావాహ దృక్పథంతో ఉండి పోరాటం చేశారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భూములని కోల్పోయిన రైతులకు సానుభూతిగా, వారికి మద్దతుగా తన పాటలతో వాళ్ళను సమాయత్తం పరిచేవారు. వెట్టి, అక్రమ వసూళ్ళు, బేదఖల్లు, దొరల బానిస తత్త్వాన్ని గురించి ఆయన రాయని మాట లేదు. పాడని పాట లేదు.
అభ్యుదయ భావంతో కొనసాగుతున్నప్పటికీ భారతీయ తత్త్వాన్ని తనలో సంలీనం చేసుకొని స్వాతంత్య్రం, విముక్తిని సాధించాలన్న తప నతో పాటను తన స్నేహంగా మలుచుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ సిద్ధాంతాలను, ఆయన ఆలోచనలను గౌరవిస్తూ ఆయనపై సదభిప్రాయాన్ని పెంచుకున్నారు.
ఉద్యోగం
తన గ్రామంలో వెట్టి వాళ్ళ దుస్థితిని చూడలేక హనుమంతు హైదరాబాదుకు వెళ్ళారు. బుద్వేల్లో కొంతకాలం వ్యవసాయ శాఖలో గుమాస్తాగా చేశారు. ప్రభుత్వ నిర్భంధానికి ఆదేశాలు జారీ కాగానే హనుమంతు బొంబాయి వెళ్లి రెండు సం||రాల పాటు అజ్ఞాత జీవనం గడుపుతూనే అక్కడ దర్జీగా పని చేశారు. ఆ నల్లగొండకు తర్వాత తిరిగి వచ్చి =వస్త్రఱర్వతీవస ఎవసఱషaశ్రీ జూతీaష్ఱ్ఱశీఅవత్ణీగా వైద్య వృత్తిలో ఉన్నారు.
రచనలు
యదార్థ భజనమాల (పాటలు), జయధీర్ తిరుమలరావు సంకలన కర్తగా 'సుద్దాల హనుమంతు పాటలు'1983) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి 'సుద్దాల హనుమంతు పాటలు' (1983), వీర తెలంగాణ సాంఘిక యక్షగానం' వంటి అనేక పాటలు గల గ్రంథాల మిశ్రమం ఈ పుస్తకాలు.
తన పాటతో, ఆటతో ఎందరినో మేల్కొల్పి వాళ్ళ జీవితాల్లో కొత్త సూర్యోదయాన్ని నింపిన సుద్దాల హనుమంతు 1982 అక్టోబర్ 10న కన్ను మూశారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542