Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజంగా ఎప్పుడైతే అట్టడుగు వర్గాల ప్రజలు అక్షరాలతో దోస్తి జేస్తరో, అప్పుడు మనయొక్క హక్కులు విధులు అన్ని తెల్సుకోగల్గుతరు. అక్షరాలే అన్ని సమస్యలకు ఆయుధం. అవనిశ్రీ చిన్నతనం నుండి తన చుట్టు ఉన్న సమాజాన్ని, నడుస్తున్న కాలాన్ని తన మనసులో రికార్డు చేసుకొని, చదివితే తప్ప ప్రశ్నించే నేర్పు అలవడదని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి అక్షరంలో ధిక్కార స్వరమై బహుజన వర్గాల పక్షాన గొంతెత్తి నినదిస్తున్నడు.
నా గొంతు వెలవాడల పొద్దు
నా అక్షరం ఆకలిమంటల కాగడ
నా కవిత్వం సబ్బండ జాతుల ఆత్మగౌరవం
- అవనిశ్రీ
కవి అంటే జనం ఆకలికేకల ఆర్తనాదాలను గుండె చప్పుడుగా వినిపించాలె. అన్యాయం దేశం నెత్తిన కూర్చొని ఏలుతుంటే, ప్రశ్నై పాడె గట్టాలె. అరాచకం దొరతనం నియంతృత్వం పట్టపగలే ప్రజల గుండెల మీద కుంపటై మండుతుంటే, కవి కలం అక్షరాల వర్షమై సల్లార్చాలె. కులం, వివక్షత, వెట్టిచాకిరి దేశం పునాదుల కింద ఎడతెరిపి లేకుండా కండ్లను గమ్మి పారుతుంటే, కవి హృదయమై మూడోకన్ను దెరిసి రహస్యాలను విప్పి జెప్పాలే. కవి అంటేనే నికచ్చిగా, నిర్భయంగా ప్రజలపక్షమై గొంతెత్తెవాడు. కవి అంటే కాలానికి భరోస నిచ్చేవాడు. ఆకలి పొద్దులను హృదయం మిద్దెమీద వాక్యాలుగా ఆరబోసుకునే వాడు. పొక్కలి లేసిన పేదొళ్ళ గుడిసెవోకిట్ల ముగ్గై మురిసెటోడు. సమసమాజ ఆకాంక్షను కలగనెటోడే కవి. గట్లా యదార్థ జీవితాల ఎతలను ఎల్లగక్కుతూ, అట్లాంటి కవిత్వాన్ని అందిస్తూ, కలం మొనలతో కలుపు మొక్కలను చెలుగుతూ, దొరతనం మీద, బానిసత్వం మీద ఎక్కుపెట్టిన ధిక్కార కవిత ఖడ్గం అవనిశ్రీ.
అవనిశ్రీ కవిత్వం పేదలపక్షం. తన అక్షరాల నడక సామాజిక చైతన్యం. నా బహుజన జాతులకు బాసటగా గొంతెత్తడమే నాకు సంతృప్తి అంటూ జధిక్కార ఖడ్గంజ కవితా సంపుటిని సాహితీ సమాజానికి అందించాడు. ఇంతకుముందే మట్టికుదురు, ఆపతి పుస్తకాలను వెలువరించాడు. అవనిశ్రీ ధిక్కార ఖడ్గం కవితాసంపుటి శ్రామిక కులాల ,శ్రామిక వర్గాలపై దోపిడికి వ్యతిరేకంగా రాయబడింది. తరాలు మారిన మారని ఆధిపత్య భావజాలానికి బానిసలైన ఉత్పత్తి కులాల వారికి కనువిప్పు కలిగించి, స్ఫూర్తిని రగిలించే కవితలు చాలా ఉన్నాయి.
ధిక్కార ఖడ్గం కవితాసంపుటిలో నలభై కవితలున్నాయి. ఏ కవితను ముట్టుకున్న పేదలపక్షమై దొరల గుండెలో బాకై, వెలివాడలలో వెన్నెలపొద్దై పొడుస్తయి.
నా మట్టిజీవుల కథలను, ఒట్టిపేగుల అరుపులను, సచ్చుపడిన దేహాల ధీనత్వ గుండెకోతలనురాస్తాను కానీ, దొరల గడిల ముందర ఎంగిలి బొక్కలకు ఆశపడి వాళ్ళకాళ్ళకాడ నా కలాన్ని కాన్కే పట్టనని నిర్భయంగా చెప్పి ఆత్మగౌరవాన్ని చాటిండు. అచ్చంగా పల్లెటూర్లలో మాట్లాడే మాటలనే కవిత్వమై పలకరించిండు. ప్రతి అక్షరం ధిక్కారమే. ప్రతిమాట కవి మౌనంలోంచి తన అనుభవంలోంచి కండ్లెమ్మట దుంకిన సజీవ సన్నివేశాలనే మాట్లాడించిండు కవి.
పల్లెమీద పాడెమీద, గూడెం మీద గుండెల మీద పెత్తనాల జెండాలెగరకూడదంటే బడుగులకు, బలహీన వర్గాలకు ఏమికావలెనో నాలుగు వాక్యాలలో చెప్పి గుండెనిండా ధైర్యం నూరిపోస్తుండు.
బడుగులకు అక్షరాల
కండువలు కప్పాలి
బలహీనులకు మేధస్సుల గుండెలివ్వాలి
పీడుతులకు న్యాయస్థానాల
పాలు తాపాలి
తాడితులకు ధైర్యవచనాల కంకణాలు తొడిగించాలి
(పుట - 23)
నిజంగా ఎప్పుడైతే అట్టడుగు వర్గాల ప్రజలు అక్షరాలతో దోస్తి జేస్తరో, అప్పుడు మనయొక్క హక్కులు విధులు అన్ని తెల్సుకోగల్గుతరు. అక్షరాలే అన్ని సమస్యలకు ఆయుధం. అవనిశ్రీ చిన్నతనం నుండి తన చుట్టు ఉన్న సమాజాన్ని, నడుస్తున్న కాలాన్ని తన మనసులో రికార్డు చేసుకొని, చదివితే తప్ప ప్రశ్నించే నేర్పు అలవడదని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి అక్షరంలో ధిక్కార స్వరమై బహుజన వర్గాల పక్షాన గొంతెత్తి నినదిస్తున్నడు.
''వాక్యం ఉరికంబంపై ఉదయించిన స్వప్నం
అక్షరం అడవిలో
దారితప్పిన పిల్ల
కవిత్వం కండ్లెమ్మట కారుతున్న పచ్చినెత్తురు ''
(పుట - 33)
కవి వాస్తవికతను మనసు అచ్చుతో గుద్దితే గిట్లనే ఉంటది. నిర్భందం నిలువరించిన చోట వాక్యం పురివిప్పుకొని ఆడుతది. గమనం గమ్యం చీకటిలోకి నెట్టివేయబడినప్పుడు కండ్లనిండ పచ్చినెత్తురే కవిత్వమై రాలుతుందంటడు.
కవికి ఆత్మగౌరవం ఎక్కవ. నిర్భంధించిన, అవమానించిన, ఆకలిని తన ఇంటి గడపముందే కట్టేసిన, దొర నీ ఇంటికి నా తెగిపోయిన పాతచెప్పును కూడ రానియ్యనంటడు.
నాకు బుక్కబువ్వ దొర్కనినాడు
నా బత్కును నిట్టనిలువునా
ఖూని చేసుకుంటాను గానీ
నీ బరిబత్తల బంగ్లాకాడికి
నేను కాదు కదా
నా తెగిపోయిన పాతసెప్పును కూడా
రానివ్వను
(పుట -51)
ధిక్కార ఖడ్గం కవితాసంపుటిలో నలభై కవితలున్నయి. దేనికదే ప్రత్యేక శైలిలో రాయబడింది. ధిక్కారం అభ్యుదయ భావాల సమ్మేళనం ఇది. ఇందులో దొర ఏలుబడిలో మగ్గిన ఎన్నో వాడల ఆత్మగోస ఉంది. పల్లె నుండి పట్నం వరకు బహుజనజాతులు ఏ విధంగా అణచబడుతున్నారో, ఏ విధంగా బానిసత్వంలో మగ్గుతున్నరో, దోపిడికి గురౌతున్నారో తెలియజేస్తూ, విముక్తి గీతావళి రచించాడు. రాస్తే కవిత్వం గిట్లనే రాయాలి అనిపించేలా ఉంది ధిక్కార ఖడ్గం. కవి ఇక్కడ బహుజనుల గుండెచప్పడై మాట్లాడిన సందర్భాలే ఎక్కవగా ఉన్నాయి. అవార్డుల కోసమో, రివార్డుల కోసమో రాసిన కవిత్వం కాదు ఇది. ప్రజల ఆర్తనాదాలను వినిపించే హృదయగోస ఈ కవిత్వం. ప్రతికవి చదవాల్సిన పుస్తకం. కవిత్వం ఇందులో అంతర్లీనంగా కనిపిస్తది. విషయ ప్రధానంగా చెప్పబడిన ఈ కవిత్వంలో ప్రకృతిలోని వస్తువులను ప్రతీకలుగా కాక, మనుష్యులను సద్విన వ్యక్తిగా కవి వారి జీవితాలనే ప్రతీకలుగా వాడిండు.
వేల కంఠాలను తెగకోసిన కత్తికూడ, పిడికెడు అక్షరాలు రాసిన కలానికి వంగి వంగి సలాం జేసేలా ధిక్కార గొంతుకై, ధిక్కార ఖడ్గాన్ని అందించాడు అవనిశ్రీ. ప్రజాకవులు, ప్రజాకళలు సృష్టి ఉన్నంతవరకు అజరామరం. ధిక్కార ఖడ్గం కూడా చరితార్థం.
ప్రతులకు
అవనిశ్రీ
దాసరిపల్లి :గ్రామం
మల్దకల్ : మండలం
జోగులాంబ గద్వాల జిల్లా,ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభించును
- బోల యాదయ్య, 9912206427