Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పదరా తమ్ముడు పదరా!/ ప్రగతి పథాన పదరా !' గేయాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఎర్రోజు సత్యం రాసిన అచ్చయిన బాల సాహిత్యం ఎంతుందో, అచ్చుకాని సాహిత్యం కూడా అంతే ఉంది. ఎర్రోజు అకస్మాత్తుగా మరణించడంతో అది అచ్చులోకి రాలేదు. బాల సాహిత్యమే
తన శ్వాసగా, ఆశగా బతికిన కవి ఎర్రోజు సత్యం.
తాను రాయడం ప్రారంభించిన నాటి నుంచి, చివరివరకు బాలల కోసమే తపించి రాసిన కవి, బాల సాహితీవేత్త ఎర్రోజు సత్యం. 6 జులై, 1947న నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో పుట్టిపెరిగారు. ఉద్యోగరీత్యా రాచర్ల బొప్పాపూర్లో ఉన్నారు. యువకవిగా ఎర్రోజు తొలి రచనలు నటరాజ కళానికేతన్ ప్రచురించిన నలుగురు నవకవుల సంకలనం 'కిరణాలు' అచ్చయ్యాయి.
1979 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి 'అంతర్జాతీయ బాలల సంవత్స రం'గా ప్రకటించింది. నటరాజ కళాని కేతన్ ఎల్లారెడ్డిపేట శాఖ కూడా తమ 'బాధ్యత'గా నలుగురు యువకవుల రచన లతో 'ఈ తరం పాటలు' ప్రచురించింది. నలిమెల భాస్కర్, (జనసూర్య), వేముల సత్యనారాయణ, రేగులపాటి కిషన్ రావులతో పాటు ఎర్రోజు సత్యం ఈ నలుగురు కవుల్లో ఒకరు. 'ఈనాటి సాహిత్యంలో పిల్లలకు సంబంధించింది చాలా తక్కువ. ఉన్నదాంట్లో ఎక్కువ భాగం వాస్తవాల్ని వక్రీకరించేవి, సమాజం పట్ల కనీసం అవగాహనను కలిగించనివీ, అబద్దాలని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నవీ వున్నాయి' కాబట్టి వాటన్నిటినీ ఎత్తిచూపడమే కాక పిల్లలకు చక్కని సాహిత్యాన్ని అందించాలన్న దిశగా ఈ గేయ సంకలనం తెచ్చినట్టు ఈ యువకవులు చెప్పుకున్నారు. ఈ పుస్తకాన్ని '...ఈ వ్యవస్థ యొక్క వివిధ విధాల రాక్షస దోపిడీకి బలవుతూన్న పసివాళ్ళకు అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా' అంకింతం చేయడం విశేషం.
1978లో ఎర్రోజు ప్రచురించిన తొలి బాలగేయ సంపుటి 'పిల్లల పాటలు'. ముప్పై అయిదు గేయాలు ఇందులో ఉన్నాయి. అభినవ పోతన వానమామలై అన్నట్లు ఈ గేయాలన్నీ విజ్ఞానం, వినోదం కలగలిసిన రచనలు. అంతేకాక హాస్యం, నీతి కలిసి ఉన్నాయి. ఆరంభంలోనే తల్లితండ్రులు, గురువుల గురించి మంచి గేయాన్ని రాశారు సత్యం. ఈ ముగ్గురికి మహోన్నత స్థానాన్ని కల్పిస్తూ 'దేవుళ్ళు' అంటూ తన అక్షరాలతో కీర్తిస్తారు. 'వీరే ముగ్గురు దేవతలు' అంటారు. కవిగా, నాటకకర్తగా, గేయకర్తగా సుపరిచితులైన వీరు ఆనాడు సిరిసిల్ల తాలూకాలో జరిగే అన్ని సాహిత్య కార్యక్రమాలలో విధిగా పాల్గొనేవారు. ఆకాశవాణిలోనూ వీరి గేయాలు, కవితలు ప్రసారం అయ్యాయి. ఎర్రోజు గారి మరో విశేషం ఆయన తనకు వీలున్నప్పుడల్లా పాఠశాలలకు వెళ్ళి స్వయంగా తన గేయాలని పాడి వినిపించేవారు.
కవి క్రాంతదర్శియే కాదు, ఆశాజీవి. మంచిని కాంక్షించి, మానవత్వాన్ని ఆకాంక్షిచే చైతన్యస్ఫూర్తి. కవి ఎర్రోజు కూడా అదే కాంక్షిస్తారు. అందులోనూ బాల సాహిత్య కవిగా తన లక్ష్యాన్ని చక్కగా చెబుతారు. 'మంచితనం పెంచడమే/నా లక్ష్యం నా లక్ష్యం / ప్రజావళి క్షేమమేనా ప్రాణం నా ప్రాణం' అంటూ ప్రకటిస్తారు. పిల్లలకు వాళ్ళ భాష లోనే ముద్దుముద్దుగా చెప్పడం ఎర్రోజుకు బాగా తెలుసు. 'పరులకు చేయకు అపకారం/ చేయాలెప్పుడు ఉపకారం, ఉపకారం' అంటూ పిల్లలు అలవరచు కోవాల్సిన మంచిగుణాల గురించి, పిల్లలు చేయాల్సిన పనుల గురించి, ఆచరించాల్సిన విషయాల గురించి తన గేయాల్లో చెబుతారు కవి.
వందలాదిగా పిల్లలు పాడుకునే గేయాలు రాసిన సత్యం గేయ కథలు కూడా 'పిల్లల పాటలు'లో రాశారు. అటువంటిదే 'సోమరిపోతు సోమయ్య' గేయరూప కథ. ఇందులోని ఈ చిన్న గేయకథలో చదువంటే ఆసక్తి చూపకుండా, ఎల్లప్పుడు నిదురపోయే సోమరిపోతు సోమయ్యను గురించి చెప్పి 'చదువులో మొద్దు, పనిలో మొద్దు' అయిన సోమరిపోతు ఎవరికీ ముద్దుకాదంటాడు. ఇటువంటిదే ఇందులోని మరో గేయకథ 'గొప్పలు చెప్పే గోపన్న' కథ. ఇది కూడా పిల్లలను ఆలోచింపజేసేదే కాక, ఆచరణాత్మకంగా ఎలా ఉండాలో చెబుతుంది కూడా. సందర్భానుసారంగా గేయాల్లో చక్కని నీతులను, లోకరీతులను బాగా చెప్పిన కవి సత్యం ఎన్నో హాస్యగీతాలు రాశారు. ఎర్రోజు గేయాల్ని వేదికల మీద చక్కగా పాడేవారు.
'పిల్లల పాటలు' పేర రెండు బాలగేయ సంపుటాలు తెచ్చిన ఎర్రోజు 'ఎర్రోజు సాహితీ కిరణాలు' పేర వివిధ ప్రక్రియల్లో రచనలను రెండు భాగాలలో ప్రచురించారు. ఇందులో పిల్లల కోసం గేయాలు, కథలు ఉన్నాయి. 'పాపం సుబ్బారావు', 'బుద్దిచెప్పిన పాలేరు', 'ముర్ఖులు', 'తాత చెప్పిన మంచిమాటలు' మొదలైౖన కథలు 'ఎర్రోజు సాహితీ కిరణాలు' మొదటి భాగంలో ఉన్నాయి. ఇది 1986లో వచ్చింది. ఇవే కాక వచన కవితలు, గేయాలు, జానపద గేయాలు, లలిత గేయాలు, మంగళ హారతి పాటలు', 'మంచిమాటలు' పేరుతో సూక్తులు ఉండడం విశేషం. ఈ ప్రక్రియల్లో ఎక్కవ భాగం బాలలకోసం రాసినవే ఉన్నాయి. ఇందులోని నీతి కథలు, బాల గేయాలు. 'పదరా తమ్ముడు పదరా!/ ప్రగతి పథాన పదరా !' గేయాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఎర్రోజు సత్యం రాసిన అచ్చయిన బాల సాహిత్యం ఎంతుందో, అచ్చుకాని సాహిత్యం కూడా అంతే ఉంది. ఎర్రోజు అకస్మాత్తుగా మరణించడంతో అది అచ్చులోకి రాలేదు. బాల సాహిత్యమే తన శ్వాసగా, ఆశగా బతికిన కవి ఎర్రోజు సత్యం.
- డా|| పత్తిపాక మోహన్ 9966229548