Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాలు పడాల్సిన సమయంలో పడ్డం మానేసినయి. మండకూడని టైంలో ఎండలు మండిపడ్డం మొదలెట్టినయి. వాతావరణం కంట్రోల్ తప్పి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నది. ఈ కారణంగా రాజ్యాన్ని కరువూ కాటకమూ జాయింటుగా నమిలేయసాగినయి. తిండిలేక మనుషుల డొక్కలు లెక్క పెట్టుకునే ఎముకల గూళ్ళైనయి. దొంగతనాలు, దోపిడీలు రెచ్చిపోయినయి. రోగాలూ రొష్టులూ ఏడ్పులూ, పెడబొబ్బలతో రాజ్యం అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా మారింది.
ఇక రాజ్యాన్ని ఏలుకోవలసిన రాజు మంచానికి అంటుకు పోయేడు. అదేం మాయ రోగమో ఏ వైద్యుడికీ అంతుపట్టలేదు. మందులకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కషాయాలు, ఖర్చైనవి. మందు బిళ్ళలు రాజావారి కడుపులో అడ్రసు లేకుండా పోయేయి. ఇక రాజావారు కోలుకోవడం కల్ల అని అందరూ అనుకుంటున్న సమయంలో కోటలోనుంచి గొల్లున ఏడుపులు వినిపించేయి.
కష్టాలు వస్తే కుప్పలు తెప్పలుగా వస్తాయన్న మాట నిజమే అయింది. రాజు ఉన్నప్పుడే రాజ్యం వెంటిలేటర్ మీద నడిచేది. ఇప్పుడు రాజ్యం రాజు లేనిదయింది. రాజుగారికి సంతానం లేదు. తను రాజ్యానికి రాజ వంగానే వంశస్తులందరినీ చావ గొట్టాడు రాజు. తన కుమారుడే రాజ్యం చెయ్యాలని తన కుటుంబమే రాచ కుటుంబం కావాలని రాజావారి కోరిక. రాజావారి ఆగడాలు భరించలేక రాజమకుటం తొడుక్కునే అర్హత గలవాడొక్కడూ రాజ్యంలో లేడు. బ్రతికుంటే బజ్జీలమ్ముకునైనా బ్రతకొచ్చని అంతా శంకరగిరి మాన్యాలు పట్టిపోయారు.
ఇప్పుడు రాజ్యానికి రాజనేవాడి అవసరం వచ్చింది. చచ్చినా రాజావారికి సంతానం కలగక ముందే రాణీగారు పరలోకం ప్రయాణమైంది. ఇప్పుడేమిటి కర్తవ్యం అని రాజ్యానికి నమ్మకస్తులుగా ఉన్న మంత్రులూ, ఉన్నతాధికారులూ తలలు బద్దలు కొట్టుకుంటుంటే హిమాలయాల్లో అనేక ఏండ్లు ఒంటికాలుమీద తప్పస్సు చేసి ఎన్నో మహిమలూ కావల్సినంత జుట్టూ, గడ్డమూ పెంచిన బాబా ఒకరు రానే వచ్చారు. వారిచ్చిన సలహా అమూల్యమైనదని అందరికీ వచ్చింది.
ఏనుగుకు దండయిచ్చి ఊళ్ళో వదిలారు. అది ఎవరిమెడలో ఆ దండ వేస్తుందో వారే రాజ్యానికి రాజవుతారని, ఆ రాజావారి ఏలుబడిలో రాజ్యం సుభిక్షమవుతుందని ప్రజల కష్టాలన్నీ తీరుతాయని సెలవిచ్చారు బాబా అయితే తామూ అర్జంటు పని వుందని కాశీకి వెళ్ళిపోయారు.
బాబా మాట జవదాటకూడదని మంత్రులూ, అధికారులూ ఏనుగుకు దండ ఇచ్చి వదిలారు. రాజవ్వాలనుకున్నవారు ఒక్కసారి రాజులమయ్యామా తరతరాల పాటు రాజ్యం తమ తాతసొమ్మవుతుందని కుటుంబ హక్కవుతుందని అనేక మంది మెడలు చాచి ఏనుగు ముందుకు వెళ్ళారు. ఏనుగుకు ఏమనిషి మెడా నచ్చినట్టులేదు. జనంగోలకు బెదిరిపోయి పరుగెత్తుకు వచ్చి ఎదుట నిలబడ్డ గాడిద మెళ్ళో దండ వేసేసింది.
రాజ్యానికి గాడిదరాజయింది. కాదనడానికి లేదు. రాజ్యం కష్టాలు లేకుండా ఉండాలంటే బాబా చెప్పిన మాట తప్పరాదు అనుకున్నారు పెద్దలు.
కొత్త రాజావారికి కాళ్ళు నాలుగు ఉండటం వల్ల సింహాసనంలో కూర్చోలేక పోయారు. గాడిద రాజావారు కూచోవడానికి పాలరాతి దిమ్మె కట్టి దానిమీద మఖమల్ పరుపు పరిచారు. అనుకోవడానికి గుండ్రటి దిళ్ళూ గాలివిసరడానికి పనివాళ్ళూ ఏర్పాటయ్యారు. జడ్కేటగరీ సెక్యూరిటీ ఏర్పాటయింది. అంతా బాగుంది కాని మాట్లాడం రాని గాడిద రాజావారు ఫిర్యాదులెలా వింటారు, సమస్యలెలా పరిష్కరిస్తారు అనుకున్నారు జనం. ఆ విషయంలో రాజు మంత్రులూ ఉద్యోగులూ తమ తెలివిని ఉపయోగించారు.
గాడిద రాజావారు కుడి చెవి కదలికకు, ఎడమచెవి ముడుచు కోవడాని ఇక, నాలుకబయట పెట్టడానికి తోక కుడికీ ఎడమకీ ఊపడానికి అర్థలు కనిపెట్టేశారు. ఆ ప్రకారం రాజాజ్ఞలు అమలు చేయడం మొదలు పెట్టారు. పరిపాలన యథా ప్రకారం కొనసాగింది. రాజులేడనే కొరత లేదు. గాడిద రాజయ్యాడనే బాధలేదు. రాజ్యాన్ని ఏలడం ఇంత ఈజీయా, అధికారం యిస్తే గాడిదైనా రాజ్యం ఏలేయగలదనే విషయం తెల్సిపోయింది. ప్రజలకు. పాలన అంతా మంత్రులూ అధికారులూ చూసుకుంటారు తల ఊపడమో తోక జాడి చ్చడమో గాడిద రాజావారు చేస్తుంటారు అనుకున్నారు.
కాశీ నుంచి తిరిగి హిమాలయాలకు వెళ్తూ బాబాగారు రాజ్యానికి వచ్చారు. తను చేసిన ఏర్పాటు ఎలాగుందో చూద్దామని. గాడిద రాజవటం చూసి కొంచెం 'అప్సెట్' అయ్యారు. కానీ విధి అలా 'డిసైడ్' చేసిందని సర్దు కున్నారు. తనకు గాడిద భాష కూడా వచ్చు గనక గాడిద రాజావారితో రహస్య సమావేశం జరిపారు. గాడిద రాజావారు తన చెవులకీ తోకకీ, ఓండ్ర పెట్టడానికీ ఉద్యోగులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అర్థాలు చెప్తున్నారని అంతా లంచగొండులూ దొంగలూనని వాపోయారు. ఇలాగయితే రాజ్యం వదిలి చాకిరేవుకు వెళ్ళిపోతానని భోరున ఏడ్చారు.
బాబాగారు తమ తపశ్శక్తిని ధారపోసి గాడిద రాజావారికి మనుషుల భాష మాట్లాడ్డం వచ్చేట్టు చేశారు. మాట్లాడ్డం వచ్చిన గాడిద రాజావారు తన కొలువులో నుంచి క్రమ క్రమంగా మను షుల్ని తీసేసి గాడిదలను అపాయింట్ చేశారు. ముందుచూపుతో...
-చింతపట్ల సుదర్శన్, 9299809212