Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రాంతంలో ప్రజలను నిజాం అరాచకాల నుంచి సాంస్కృతికంగా మేల్కొల్పడానికి ఏర్పడిన ఆంధ్రమహాసభ మొదటి, రెండవ సమావేశాలకు వర్మ హాజరయ్యారు. బ్రతకడానికి ఉపాధి దొరకని కాలంలో ఉద్యోగం లభించినా అటు సమాజానికి, ఇటు వృత్తి ధర్మానికి సరైన న్యాయం చేయలేక పోతున్నానే భావనతో ఉద్యోగాన్ని వదులుకున్నాడే కాని తాను నమ్మిన సిద్ధాంతాన్ని కాదు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, సామాజిక నాయకుడిగా ఉంటూ, నిరంతరం సంఘ సంస్కరణను కోరుకున్న భాగ్యరెడ్డి వర్మ, నవలలో కూడా నాయకుడిగా పాత్రను ధరించుకున్నారు.
''చుక్క పొడవక ముందే మానవ సమూహం మేల్కొనాలి. పొడుగువాళ్ళు పొట్టివాళ్ళ నెత్తి కొట్టక ముందే పొట్టివాళ్ళు పొడుగువాళ్ళు కావాలి. పక్క వేయక ముందే పదిమందిని కదిలించాలి. హరిజనంలోకి అంతా చొచ్చుకు రావాలి. అహర్నిశలు అందరి క్షేమం కోసం పరితపించాలి''. ఈ వాక్యాలకు సరిగ్గా కుదిరేటి వ్యక్తియే భాగ్యరెడ్డి వర్మ గాంధీ, అంబేద్కర్లు వెలుగులోకి రాకముందే నిరంకుశ రాజ్యంలో చీకటిని మింగి తానే వెలుగై ప్రసరించిన మహౌన్నత వ్యక్తి మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ.
ఆయన 1888 మే 22న హైదరా బాద్లో తండ్రి వెంకయ్య, తల్లి రంగమాంబ దంపతులకు జన్మించారు. బాగయ్యగా ఉన్న పేరును తమ కుల గురువు సూచనా మేరకు తల్లిదండ్రులు భాగ్యరెడ్డిగా మార్చారు. బాగయ్య నుంచి భాగ్యరెడ్డికి భాగ్యరెడ్డి నుంచి భాగ్యరెడ్డి వర్మగా మారడానికి ఆయన చేసిన సామాజిక సేవయే ప్రధాన కారణం. ఇతను జాతీయోద్యమ కాలంలో అనేక సంస్థలలో పనిచేశారు. అందులో ఒకటి ఆర్య సమాజం. వైదిక సమాజానికి గాను ఆయన చేసిన సేవలకు 1913లో 'వర్మ' అనే బిరుదును ప్రముఖ ఆర్య సామాజికులు బాజీ కృష్ణారావు అందించారు.
వర్మ బారిస్టర్ సోదరులకు సహాయకుడిగా ఉంటూ అక్కడే పఠనంలో, చిత్రలేఖనంలో ఆసక్తి పెంచుకున్నారు. ఈ అనుభవంతోనే ఆదిహిందూ భవన నిర్మాణానికి రూపకల్పన చేశారు.
సాంఘిక కార్యక్రమాలు జాతీయోద్యమం జరుగుతున్న కాలంలోనే 1912లోనే 'అహింసాసమాజ్' అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ తరపున జంతుబలికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అహింసాయుత సమాజం కోసం కృషి చేశారు అంతకుమునుపే 1908లోనే మాంసాహారానికి, జంతుబలులకు దూరంగా ఉన్న వ్యక్తి. తనకు 18 ఏండ్ల వయసున్నప్పుడే 'జగన్మిత్రమండలి' అనే సంస్థను స్థాపించారు. సామాజిక, ఆర్ధిక పరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న దళితులను, ఇతర సామాజిక వర్గాల వారిని చైతన్యపర్చడానికి తపనపడ్డారు. ఈ మండలికి అనుబంధంగానే 1910లో 'ధర్మ ప్రచారినీ సభ' అనే మరో సంస్థను స్థాపించారు.
తాను చేసిన సామాజిక సేవలలో పాఠశాలల స్థాపన ఒకటి. తెలుగు భాషకు జీవమే లేని కాలంలో పాఠశాలలు పెట్టి దానిలో స్థానిక భాషను ప్రవేశపెట్టేలా కృషి చేసిన ఆదర్శమూర్తి వర్మ. ఈ విధంగా మొత్తం 26 బడులను స్థాపించి వేల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపారు. తెలుగు భాషకు ప్రోత్సాహం లేని గడ్డు పరిస్థితులలోనే భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన బడులను నిర్వహించడానికి స్వయంగా ప్రభుత్వమే ముందుకు వచ్చి బోధనా భాషగా తెలుగును అంగీకరిస్తూ 1934లో తన ఆధీనంలోకి తీసుకుంది.
తెలంగాణ ప్రాంతంలో ప్రజలను నిజాం అరాచకాల నుంచి సాంస్కృతికంగా మేల్కొల్పడానికి ఏర్పడిన ఆంధ్రమహాసభ మొదటి, రెండవ సమావేశాలకు వర్మ హాజరయ్యారు. బ్రతకడానికి ఉపాధి దొరకని కాలంలో ఉద్యోగం లభించినా అటు సమాజానికి, ఇటు వృత్తి ధర్మానికి సరైన న్యాయం చేయలేక పోతున్నానే భావనతో ఉద్యోగాన్ని
వదులుకున్నాడే కాని తాను నమ్మిన సిద్ధాంతాన్ని కాదు. అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, సామాజిక నాయకుడిగా ఉంటూ, నిరంతరం సంఘ సంస్కరణను కోరుకున్న భాగ్యరెడ్డి వర్మ, నవలలో కూడా నాయకుడిగా పాత్రను ధరించుకున్నారు. 1917 నవంబర్ 4,5,6,లలో బెజవాడలో జరిగిన 'ఆది ఆంధ్ర మహాసభ'కు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ మహాసభకు అయ్యదేవర కాళేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీ నారాయణ, మంగిపూడి వెంకటశర్మ వంటి వారు హాజరయ్యారు. ఇక్కడ భాగ్యరెడ్డి వర్మ పోషించిన పాత్రను ఉన్నవ తన 'మాలపల్లి' నవలలో వెంకటరెడ్డి పాత్రగా చిత్రీకరించారు.
ఆర్యసమాజ దీక్ష ద్వారా పొందిన 'వర్మ' అనే బిరుదును 1931లో లక్నోలో జరిగిన ఆదిహిందూ రాజకీయ సదస్సులో కొందరి ప్రతినిథుల అభ్యంతరం మేరకు బిరుదును వదులుకున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అస్పృశ్యతా నివారణోద్యమం అణగారిన వర్గాల వాళ్ళను స్వాతంత్య్ర సమరంలో పాల్గొనేలా చేసిది. 1930లో జరిగిన మొదటి ఆంధ్రమహాసభ సమావేశంలో భాగ్యరెడ్డి వర్మ వేదికెక్కి అస్పృశ్యతా నివారణ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే కొందరు పెద్దలు వ్యతిరేకించారు. అయినా రెడ్డి, వారిని పట్టించుకోకుండా తన ప్రతిపాదన పెట్టి వేదిక దిగడమే కాకుండా ఈ ఆంధ్ర మహాసభలకు అనుబంధంగా 'ఆది ఆంధ్ర సభలు' కూడా నడిపారు. నిమ్న వర్గాల ప్రజలకు రాజకీయ రంగంలో తగినన్ని స్థానాలు కావాలని భాగ్యరెడ్డి ఆశించారు. దీనికి పర్యవసానంగా మాంటేగు-చేమ్స్ ఫర్డ్ సంస్కరణల కమిటీలో నిమ్నజాతులకు ప్రతినిధిగా భాగ్యరెడ్డి సభ్యులుగా ఉన్నారు. పత్రికా సేవ 1931లో భాగ్యనగర్ పత్రికను ప్రారంభించారు. దీని హైదరాబాదు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల గురించి ఈ పత్రికలో సంపాదకీయం రాస్తుండేవారు. ఇది నిమ్న జాతుల అభ్యున్నతి పాటుపడిన అత్యున్నత పత్రిక అని చెప్పవచ్చు.
పదుల సంఖ్యలో పాఠశాలలు ప్రారంభించి, అంతకు మించి సాంఘిక సంస్థలు స్థాపించి, వేలమందికి విద్యాదానం చేసి ప్రజాభివృద్ధి కొరకు పరితపించిన భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న ఈ లోకాన్ని వీడారు.
- ఘనపురం సుదర్శన్, 9000470542