Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తాము విశ్వసించిన సత్యానికి, కృషి చేసే ఆదర్శానికి ప్రమాదం వచ్చినపుడు నిజాయితీపరులు ప్రతిఘటిస్తారు. ద్రోహులు బయట పడతారు. వీరులు పోరాడుతారు. బలహీనులు దిగజారి పోతారు'' అంటారు జ్యూవియస్ ప్యూజిక్... అలా పోరాడే నిజాయితీ పరుడే వనగంటి ఈశ్వర్ కాలంచేసి అప్పుడే సంవత్సరం అయింది.
కామ్రేడ్ వనగంటి ఈశ్వర్ ప్రథమ వర్థంతి సందర్భంగా వారి జీవితం-ఉద్యమ ప్రస్థానంపై పుస్తకం తీసుకొచ్చిన మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాపార్టీ నాయకుల కృషి అభినందనీయం కా|| బి.వి. రాఘవులు, కా|| పి. మధు, కా|| తమ్మినేని వీరభద్రం గారల ముందుమాటలు-ఉద్యమ ఫొటోలు ఈ పుస్తకానికి నిండుతనం తెచ్చాయి. జిల్లా కార్యదర్శిగా రెండు దశాబ్ధాల ఈశ్వర్ గారి కృషి రేపటి తరం కార్యకర్తలకు చక్కటి స్ఫూర్తి కలిగించగలదు. తన ముందు తరాన్ని తన తరాన్ని, నేటి తరాన్ని ఈశ్వర్ ఎర్రబాటలో నడిపించారు. చదువుకున్న మేధావులు తప్పుడు అవగాహనగల సిద్ధాంత భావజాలంతో కొట్టుకుపోయిన సందర్భంలో నిజమైన మార్క్సిస్టు లెనినిస్ట్ పంథా కోసం ఎన్నో అటుపోట్లు ఎదుర్కోంటూ వర్గం పోరాటం ఎలా సాగించాలో వనగంటి ఈశ్వర్ జీవితం మనకు నేర్పుతుంది. దాదాపు 60 ఆధ్యాయాలుగా ఈశ్వర్ ఉద్యమ సహచరులు రాసిన వ్యాసాలతో ఎన్నో విషయాలు, పోరాటాల చరిత్ర ఈ పుస్తకంలో రికార్డు చేశారు. వెల్జాల చంద్రశేఖర్ రాసిన వ్యాసంలో నాటి సి.ఎం. ఎన్‌టిఆర్‌కు ప్రెస్ వారి ద్వారా ముక్కిన బియ్యం సంచి అందించిన వనగంటి ఈశ్వర్ ప్రయత్నం తరువాత కాలంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు, జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు, వలసలు.. అంశాల్ని చూచి చదివి మనం పోరాటాలు ఎలా నిర్దేశించుకోవాలో ఈశ్వర్ చరిత్ర చెపుతుంది. మార్గ నిర్దేశనం చేస్తుంది. అచ్చంపేట-కొల్లాపూర్ ప్రాంతాల్లో నగ్జలైట్లును వినియోగించి భూస్వామ్య శక్తులు సాగించిన మారణహౌమం వారు చేసిన హత్యలు, ప్రజా నేతల అజ్ఞాత వాస జీవితాలు పార్టీని సైద్ధాంతికంగా పోరాటాల ద్వారా ఈశ్వర్ ఎలా నిలబెట్టారో విపులంగా రాసారు. అంబలి కేంద్రాలు, వలస నివారణ, నీటి వనరుల కోసం ఆయన కృషి చాలా గొప్పది. ఎం.ఏ గఫూర్, బి. వెంకట్, జాన్‌వెస్లీ, ఎస్. వినయకుమార్, మా నాన్న అంటూ ఈశ్వర్ రెండవ కుమారుడు నవీన్, రాసిన వ్యాసం, ఆర్. రాంరెడ్డి , వనగంటి నాగేశ్వర్, భూపాల్, టి.సాగర్, ఎండి జబ్బార్, వి. పర్వతాలు మందడి నాగిరెడ్డి, పుట్ట ఆంజనేయులు, ధర్మనాయక్, భాస్కర్‌రెడ్డి, గారలు రాసిన వ్యాసాలు ఈశ్వర్‌గారి కృషిని తెలియజేస్తాయి. 40 సంవత్సరాల పార్టీ పోరాటల కృషి రికార్డు చేశారు.
డా|| వి. వీరాచారి, డి. కృష్ణయ్య కవితలు బాగున్నాయి. స్తబ్థత చీల్చి పోరాట పదునుపెట్టే గొప్ప కృషి కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. కృష్ణయ్య వాస్యం చాలా విలువైనది. ఈశ్వర్ తనకు ఎలా స్ఫూర్తి నిచ్చారో చెప్పారు. పత్రికను ప్రజలకు చేర్చడంతో ఈశ్వర్ కృషి ఆదర్శనీయం. కిల్లె గోపాల్ రాసిన వ్యాసం 1985 నుంచి 2020 దాకా పార్టీ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన వనగంటి ఈశ్వర్ కృషి సమగ్రంగా తెలియజేసిన వ్యాసం. మహిళా ఉద్యమ నిర్మాణంలో ఈశ్వర్ కృషిని లక్ష్మీదేవమ్మ రాసారు. పేపర్బారుగా పని చేసిన వ్యక్తి, జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగి వేలాదిమందికి ఆదర్శంగా నిలిచిన సాధారణ దళిత బిడ్డ ఈశ్వర్ నేటి తరం వారికి నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఉద్యమ విస్తరణకు. సీనియర్లు కొత్త వారిని కలుపుకొని సైద్థాంతిక ఆయుధంతో వర్గ పోరాటాల నిర్మాణం ఎలా చేయాలో చెప్పిన ఆదర్శ జీవితం వనగంటి ఈశ్వర్గారిది. మంచి ప్రయత్నం చేసిన జిల్లా పార్టీ కృషిని అభినందించాలి. ఆదర్శ కామ్రేడ్ ఈశ్వర్‌కు జోహార్లు. ఉద్యమాలకు పునరంకితమే ఆయనకు మన నిజ నివాళి.
- తంగిరాల చక్రవర్తి, 9393804472
ప్రచురణ : భారతకమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
పేజీలు : 180, వెల: లేదు
ప్రతులకు : సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయం
చంద్రమౌళి భవన్- జగ్జీవన్‌రామ్‌నగర్
న్యూ బస్టాండ్ దగ్గర- మహబూబ్‌నగర్
తెలంగాణ రాష్ట్రం. ఫోన్: 9490098761