Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ప్రాచీనగ్రామం సోమారంలో చేసిన చరిత్ర అన్వేషణయాత్రలో కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం శ్రీరామోజు హరగోపాల్ తోపాటు కవి, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్, పూర్వవిద్యార్థులు రవీందర్, కమలాకర్, సోమారం మాజీ సర్పంచ్ వెంకటయ్య, ఆ పొలం రైతు చంద్రారెడ్డి 'సిమ్ములోని పాటిగడ్డ'లో చారిత్రక ఆధారాలను సేకరించారు. అక్కడ ఒక బురుజు దిబ్బ, గోడల పునాది రాళ్ళు, 16x12x4 అంగుళాల కొలతలతో పెద్ద ఇటుకల కుప్ప, పెద్దకుండ పెంకులు, సానరాయి ముక్క, నూరుడురాళ్ళు అగుపించాయి. వేణుగోపాల్ ఈ ప్రదేశంలో లభిస్తున్న వస్తు విశేషాలను చూసి, తప్పకుండా ఇక్కడ తవ్వకాలు జరపాలి. ఎంతో విశేషమైన ప్రాచీనచరిత్ర దొరుకుతుంది అన్నారు.
ఈ వూరిలో మూడుచోట్ల కనపడుతున్న పాటిగడ్డలలో ఒకటైన 'సిమ్ములోని పాటిగడ్డ' అనే ప్రదేశంలో శాతవాహనుల కాలంనాటి ఇటుకలు, మట్టిపాత్రల పెంకులు, మట్టిపూసలు, అమ్మదేవత టెర్రకోటబొమ్మ లభించాయి.
(అక్కడ పొలం దున్నుతున్నపుడు లభించినదని ఆ రైతు కొడుకు, టీచర్ కొలీగ్ దశమంతరెడ్డిసార్ ఇచ్చినది)
వ్యవసాయం కోసం దున్నడంవల్ల ఇపుడా స్థలమంతా ఆనవాళ్ళను కోల్పోతున్నది. సిమ్ములోడు అంటే చిముకుడు అంటే శ్రీముఖుని (శ్రీముఖ శాతకర్ణి) పేరుమీద ఏర్పడ్డ ఈ గ్రామం అతి ప్రాచీనమైంది. తొలి శాతవాహన చక్రవర్తి పేరుమోసిన వూరు పాటిదిబ్బయి పోయింది. ఆనవాళ్ళను వెలికితీసే పని చేయకపోతే ఒక ప్రాచీన చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది.
అమ్మదేవత
హరప్పా-మొహంజెదారొ తవ్వకాలలో టెర్రకోట (కాల్చిన బంకమట్టి) బొమ్మలు, కంచుబొమ్మలు దొరికినవి. కాని, రాతి బొమ్మలు తక్కువగా లభించినవి. తెలంగాణలో అమ్మదేవతల బొమ్మలు దొరికింది అరుదు, పుల్లూరు బృహత్సిలాసమాధిలో దొరికిన 'మానవరూపశిల' అమ్మదేవత. సోమారం గ్రామంలో లభించిన టెర్రకోటబొమ్మ అమ్మదేవతే.
ఈ మట్టిబొమ్మ నగ ప్రతిమ. బొమ్మకు వక్షోజాలు, ఉదరం, చేతులు, కాళ్ళు అగుపిస్తున్నాయి. పొట్ట ఎత్తును బట్టి ఆమె గర్భవతి అని తెలుస్తున్నది. కుడిచేయి కడుపుమీద పెట్టుకున్నది. వేళ్ళు విప్పారి ఉన్నాయి. కాళ్ళను వేరు చేస్తూ సన్నని గీత కనిపిస్తున్నది. తలలేదు కనుక ఈ టెర్రకోట బొమ్మ బలివ్వబడిన స్త్రీ ప్రతిమనా? సందేహం కలుగుతున్నది. ఆనాటి విశ్వాసాలకు ప్రతీకగా ఈ అమ్మబొమ్మ అగుపిస్తున్నది.
ఈ అమ్మ దేవత టెర్రకోటబొమ్మ ఎత్తు 7.5 సెం.మీ., వెడల్పు 4 సెం.మీ., మందం 2 సెం.మీ.
మరొకచోట వూరికి 1 కి.మీ.దూరంలో పాతకోట అని పిలిచే పాతవూరడుగు వుంది. అక్కడ కోటగోడల శిథిలాలు, ఆంజనేయుడు, పోచమ్మగుడి వున్నాయి. సోమారం గ్రామంలో చండికాంబ సహిత శివాలయం, అందులో వినాయకులు, లింగాలు, హనుమంతుడున్నారు. గుడికి దక్షిణాన కోనేరుంది. ఈవూరిలో నిజాంకాలం నాటి మట్టి, రాతిగోడల గడి వుంది. లోపల శిథిలమైన ఇల్లుంది. చతురస్రాకారపు రాతివరలతో కట్టిన బావివుంది. 400యేండ్ల కింద నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతపు రైతులను ఇక్కడికి రప్పించి వారిచేత తమభూములను నిజాం సేద్యం చేయించాడని ఆవూరి రైతు కీ.శే.రాజిరెడ్డి చెప్పారు.
క్షేత్రపరిశోధన, ఫోటోగ్రఫీ, విషయ రచన:
- శీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం