Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదిహేనవ యేట తొలి కృతిగా పిల్లల కోసం రచించిన పుస్తకం 'బాలగీతాంజలి'. ఇది 1956లో తొలి ముద్రణ పొందింది. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ సౌజన్యంతో, నీలా జంగయ్య సాహిత్య రజతోత్సవ కానుగా పునర్ముద్రించారు. సారస్వత పరిషత్ నిర్వహించిన విశారద పరీక్ష పాసై, తరువాత ఉద్యోగం చేస్తూనే బి.ఒ.యల్., ఎం.ఒ.యల్ డిగ్రీలు చదివారు. తొలుత భాషోపాధ్యాయులుగా పనిచేసిన వీరు, తరువాత తెలుగు అకాడమిలో ఉద్యోగం చేశారు.
'తెలుగు బాలలకు తెలుగె యందమురన్న / పలువురెన్నియన్న పాటియేమి? తెలుగుబాల వెలుగు కళల వెన్నెల జిల్కు / వినర తెలుగుబాల వినుతశీల!'
ఇది కవి నీలా జంగయ్య అభిమతం. 'కవిరత్న' నీలా జంగయ్య పిబ్రవరి, 2 1939న నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకాలోని ఇదంపల్లిలో పుట్టారు. తల్లితండ్రులు నీలా రాములమ్మ-రాజయ్యలు. పదిహేనవ యేట తొలి కృతిగా పిల్లల కోసం రచించిన పుస్తకం 'బాలగీతాంజలి'. ఇది 1956లో తొలి ముద్రణ పొందింది. అంతర్జాతీయ బాలల సంవత్సరం 1979 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ సౌజన్యంతో, నీలా జంగయ్య సాహిత్య రజతోత్సవ కానుగా పునర్ముద్రించారు. సారస్వత పరిషత్ నిర్వహించిన విశారద పరీక్ష పాసై, తరువాత ఉద్యోగం చేస్తూనే బి.ఒ.యల్., ఎం.ఒ.యల్ డిగ్రీలు చదివారు. తొలుత భాషోపాధ్యాయులుగా పనిచేసిన వీరు, తరువాత తెలుగు అకాడమిలో ఉద్యోగం చేశారు. ఇంటర్, డిగ్రీ పాఠ్య గ్రంథాల సవరణ మొదలుకుని, సాహిత్య కోశాలు తయారు చేయడంలో పాల్గన్నారు.
'...కోట్ల వ్యయంచేసి దేవాలయాలు కడతాం, అట్లే ముందు పిల్లలకు పాఠశాలలు కూడా నిర్మించాలెనన్న తహతహ కూడా పెద్దలకు కలిగి ఉండాలి. పిల్లలకు పుస్తకాలు కూడా రూపొందించాలె' అన్నది జంగయ్య ఆలోచనధారకు నిదర్శనం. పిల్లల పట్ల, పిల్లల చదువుల పట్ల ఆయనకున్న ప్రేమకు తార్కాణం. ఉపాధ్యాయునిగా ఉత్తమ ఆలోచనలు కలిగిన కవి నీలా జంగయ్య తన రచనల్లోనూ దానిని ప్రతి ఫలింపజేశారు. '...ప్రగతిశీలమైన దేశాలు పిల్లలనే లక్షణాలుగా తీసుకొని భావి జీవితానికి బాటలు వేసుకొంటాయి' అన్నది వీరి అభిప్రాయం. అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన జంగయ్య 'వైశ్యకుల దీపిక' అనే బుర్ర కథ రాశారు. 'బతుకు బాటలో పాటల మూట' వంటి గేయ కృతులు, 'చిత్కళ' అనే పేరుతో గేయ కావ్యం రాసిన కవిరత్న నీలా జంగయ్య పిల్లలకోసం పద్యాలతో పాటు గేయాలు రాసినప్పటికీ వాటిని పుస్తకంగా తేలేదు.
నీలా జంగయ్య బహు గ్రంథకర్త. 'బుచ్చిలింగ పద్యాలు', 'రామలింగ పద్యాలు', 'శారదాంబ పద్యాలు', 'చిద్విలాసం' వంటి శతకాలు, 'జ్ఞానమందిరం', 'ఆవేదన', 'విప్లవ స్వరాలు', 'మహా ప్రపంచం' 'దర్శనం', 'కాంతిచక్రం', 'కన్యకా పరమేశ్వరి చరిత్ర', 'మాణిక్య ప్రభు చరిత్ర' మొదలగు నలభైకి పైగా గ్రంథాలు రాశారు. వీరి తొలి కృతి అయిన 'బాలగీతాంజలి' పుస్తకం నూటా ముప్పై పద్యాల 'నీతి చంద్రిక'. ప్రతి పద్యంలో దేశభక్తి, మాతృభాష పట్ల ప్రేమ కనిపిస్తుంది. 'మానవులకు సత్య మహిమంబు జయమిచ్చునట / సత్యమును పలుకలేనివాడే పాపి' అంటూ సత్యాన్ని సతతం కీర్తించే జంగయ్య 'పండితులును క్రింద నుండగ నల్పుండు / పీఠమెక్కి నిలువ పెద్దయగునె / కొతికొమ్మనుండ దంతికే మెగ్గురా / వినర తెలుగుబాల వినుతశీల!' అని భర్తృహరి పద్యాన్ని అత్యంత సరళంగా పిల్లల కోసం చెబుతారు.
పిల్లలకు నీతులను, లోక రీతులను తన పద్యాల్లో చెప్పిన కవి, పిల్లల కోసం నీతి శాస్త్రం మొదలుకుని భర్తృహరి వంటి అనేకమంది కవులు రాసిన శ్లోకాలను తెలుగులో అనువాదంగా ఈ పద్యాల్లో అందించారు కవి. 'విష్ణుకన్న, విశ్వేశ్వరుకన్న / తల్లితండ్రె మనకు దైవసమములు / పుడమియందు మనకు పూజ్యులు గురువులు / వినర తెలుగుబాల వినుతశీల!', 'కష్టసుఖము లిలను కావడి కుండలు / కలిమిలేములెవరికైన వచ్చు / కొన్నాళ్ళు చీకటి / వినర తెలుగుబాల వినుతశీల!', 'సజ్జనునకు చదువు సద్భూషణంబురా / విద్యవలన నరుడు విమలుడగును / ఘనతనిచ్చి విద్య ఘనులతో సరిదూచు / వినర తెలుగుబాల వినుతశీల!' వంటి పద్యాలు వీరి రచనా పటిమకు నిదర్శనాలుగా నిలిస్తే, 'ఆకలైనవేళ నంబలే అమృతంబు / చలికి దొరకు బొంతె శాలువగును / అనుభవించి చెప్పినట్టీదీవాక్యంబు / వినర తెలుగుబాల వినుతశీల!' అంటూ తాను స్వయంగా అనుభవించానని చెప్పడం గౌరవాన్ని కలిగిస్తుంది.
'సత్యముననె నరుడు సర్వజ్ఞుడనిపించు', 'పరుల కుపకరింప నిరుపమ పుణ్యంబు', 'భక్తులందు దేశభక్తుడు గాంధిరా', 'సుతుని వెల్గు తల్లి మతివెల్గు విద్యరా', 'వేషభాషలందు విద్య భూషణంబురా', 'శాంతి తల్లి మనకు-సద్వర్తనము తండ్రి / దయయె గురుడు- సూనృతమ్మె దైవ / మఖిల సద్గుణములె- ఆత్మబంధువులురా / వినర తెలుగుబాల వినుతశీల!' వంటి పద్యపాదాలు పిల్లలకు కవి అందించే తాయిలాలుగా కనిపిస్తాయి. జీవించి ఉన్నంత కాలం సాహిత్యమే లోకంగా బతికిన 'కవిరత్న' నీలా జంగయ్య, 'వాసవి సాహిత్య పరిషత్తు' స్థాపించి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. 27 నవంబర్, 1991న కన్ను మూశారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548