Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయోద్యమం, నైజాం వ్యతిరేక ఉద్యమం, తెలుగు భాష పరిక్షణ ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు గ్రంథాల యోద్యమం ఊపు నిచ్చింది. గ్రంథాల యాలు విజ్ఞాన దీపికలు గానే కాకుండా భావదాస్యానికి, బానిసత్వానికి వ్యతిరే కంగా ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపడానికి, పోరాట పటిమను దేశభక్తిని ప్రబోధించేటానికి, సంఘీభావానికి కేంద్ర బిందువు లయ్యాయి.
నాడు నల్లగొండ జిల్లా చిలుకూరు నందు 1941లో ఎనిమిదవ ఆంధ్ర మహాసభ జరిగింది. తొలుత ఈ మహా సభలను బేతవోలులో నిర్వహించాలను కున్న కొన్ని రాజకీయ కారణాల వల్ల చిలుకూరుకు మార్చడం జరిగింది. దీనికి కమ్యూనిస్టు ఉద్యమనేత రావి నారాయణ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. అప్పటికే నాయకులు మితవాదులు, అతి వాదులుగా చీలిపోవడంతో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకున్నది. అధ్యక్షులు రావి నారాయణరెడ్డి గారు ప్రసంగిస్తూ కౌలు సమస్యలు, వెట్టిచాకిరి, రైతుల సమస్యలు, స్త్రీల సమస్యలు వంటి అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. రావి నారాయణరెడ్డి అధ్యక్ష కాలంలో ఆంధ్ర మహాసభ తరుపున విద్య వారం 1941 (అక్టోబర్ 19 నుంచి 25 వరకు), బేగారి వారం 1941 (డిసెంబర్ 25 నుంచి 1942 జనవరి 1 వరకు నిర్వహించారు) జిల్లాల వారీగా గ్రామాలు విస్తృ తంగా పర్యటిస్తూ విద్యాలయాలు నెలకొల్పాలని, గ్రంథాలయాలు స్థాపిం చాలని ప్రచారం నిర్వహించి రైతులకు, దినసరి కూలీలకు, కార్మికులకు, విజ్ఞానాన్ని పంచి వారిని చైతన్యవం తుల్ని చేసేందుకు ప్రయత్నం చేశారు.
అందులో భాగంగా రైతులకు విజ్ఞానం అందించాలనే తపనతో అష్టమ ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో చిలు కూరులో రావి నారాయణ రెడ్డి చేతుల మీదుగా చిలుకూరులో ''రైతు గ్రంథా లయం'' అంకురార్పణ జరిగింది. అష్టమ ఆంధ్రమహాసభలకు వాలంటీర్లు గా పనిచేసిన దొడ్డా నర్సయ్య, మంత్రి ప్రగడ వెంకటేశ్వరరావు, సంక్రాత్రి రామయ్య వంటి యువకులు జనంలో విజ్ఞానం అందించాలని తృష్ణ వారికి కలిగిందే తడువుగా తమ ఊరిలో ఉన్న సర్కార్ ముసాఫిర్ బంగ్లాలలో ఒక గదిని ఆక్రమించి ఒక చిన్న గ్రంథాలయంను ఏర్పాటు చేశారు.
తొలుత ఈ గ్రంథాలయంలో అణా గ్రంథమాల గ్రంథాలు, కొన్ని రాజకీయ గ్రంథాలు, గోల్కొండ పత్రికలు, వార పత్రికలు, ఉర్దూ పత్రికలు మాత్రమే వచ్చేవి. ఆ గ్రంథాలయంలో నిత్యం వ్యవసాయం పైన , రైతుల సమస్యల పైన, బానిస వ్యవస్థ పైన చర్చలు జరుగుతుండేవి. ఈ గ్రంథాలయానికి స్థలాన్ని కీర్తిశేషులు అమర నాయిని రంగారావు (దేశ్ముఖ్), అలివేలు మంగమ్మ దానంగా ఇచ్చారు. ఈ స్థలం కొత్త పాత ఊరు మధ్య కూడలిలో ఉన్నది. చిలుకూరు ప్రాంతంలోని సాహిత్యకారులు, జాతీయోద్యమ నాయకులు, యువకులు అందరూ కలిసి చందాలు సేకరించి వారపత్రికలను, మాస పత్రికలను, దిన పత్రికలు తెప్పించి ప్రజలకు అందుబాటులో ఉంచే వారు. వారిలో దొడ్డ నర్సయ్య, సంక్రాంతి రామయ్య, మంత్రిప్రగడ రామారావు, అత్తలూరి రామయ్య, ధరణి కొండయ్య తదితరులు అందరూ కలిసి అప్పటికి గ్రంథాలయోద్యమ నాయకులైనా అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఈ ప్రాంత వాసి అయిన కోదాటి నారాయణరావు, పిలుపు నందుకుని గ్రంథాలయ అవసరాన్ని గుర్తించి నూతన పక్కా భవనం కొరకు ప్రయత్నం చేయ సాగారు. తొలుత ఈ గ్రంథాలయంలోని గ్రంథ సంపద 600 మాత్రమే, తరువాత 1960వ దశకంలో మూడు వేలు పైచిలుకు పుస్తకాలు, 1970వ దశకం ఆరు వేల పై చిలుకు, పుస్తకాలు అందుబాటులో ఉండేవి.
1959 మార్చి 23వ తేదీన నాటి కార్మిక శాఖ స్థానిక పరిపాలన శాఖ మంత్రి దామోదరం సంజీవయ్య గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1964 నాటి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు క్రీస్తు శేషులు గును గుంట్ల చిన్న అప్పయ్యచే భవన శంకుస్థాపన జరిగింది. భవన నిర్మాణం, గ్రామ పెద్దలు కలిసి సహాయ సహకారాలతో యువకులు రాళ్ళు, ఇటుకలు పేర్చి శ్రమదానంతో గ్రంధాలయాన్ని సొంతంగా నిర్మించు కున్నారు. దీనికి బాపూజీ గ్రంథాలయంగా నామకరణం జరిగింది.
1972 ఏప్రిల్ 16న గ్రంథాలయ డైరెక్టర్ కె.వి.వి సుబ్బారావ, అప్పటి కలెక్టర్ కే ఒబయ్యాలచే శాఖ గ్రంధాలయం గా ప్రారంభోత్సవం చేశారు. 1991- 92లో అప్పటి సర్పంచ్ కస్తూరి అంజయ్య గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం 80 వేల రూపాయలు ఇచ్చారు. అదే సమయమున పాత భవనానికి పదివేల రూపాయలతో అప్పటి మండల అధ్యక్షుడు దొడ్డ నారాయణ రావు మండల నిధులతో రిపేరు చేయించారు. దాతలు బీరువాలు, కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, టీవీ సెట్, గోడ గడియారాలు, రేడియోలు, పుస్తకాలు మొదలగు వాటిని సమకూర్చారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలు గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు . అనేక సామాజిక, సాహిత్య, వైజ్ఞానిక సమావేశాలను నెలవుగా కొనసాగుతున్నదీ గ్రంథాలయం.
నిజాం నిరంకుశ పాలనకు, దాష్టీకానికి వ్యతిరేకంగా గన్నును ఎక్కుపెట్టి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన దొడ్డా చిలుకూరు గ్రంథాలయ రజతోత్సవం ద్వారా విజ్ఞాన ఉద్యమానికి నాంది పలికాడు. దోడ్డా నర్సయ్య అధ్యక్షతన1997 ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో గ్రంథాలయ రజితోస్వం 133 మంది సభ్యులతో 33 కమిటీలతో ఘనంగా నిర్వహించారు. వీటికి ప్రధాన కార్యదర్శి గుజ్జుల వీరారెడ్డి చక్కటి సేవలందించారు.
మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, వావిలాల గోపాలకృష్ణయ్య ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు తుర్లపాటి కుటుంబరావు, వేణు, పల్లి చందర్ రావు,లు పాల్గొన్నారు. రజితోత్సవాల సంచికను బాల గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంగ్లేయులు దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అదేవిధంగా నల్లవారు తమ పబ్బం గడుపుకోడానికి ప్రజల మధ్య కుల మత ప్రాంతీయ వైషమ్యాలను చేపడుతున్నారని పచ్చటి గ్రామాలను ముక్కలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంథాలలో చెందిన యువకులు నాటు జాతీయోద్యమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించారు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రసంగించారు. మిర్యాలగూడ శాసనసభ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, నాటి మున్సిపల్ చైర్మన్ జట్టుకొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు సభ అనంతరం ''రైతు భారతం'' నాటకంను ప్రదర్శించారు
రెండవ రోజు దొడ్డ నారాయణ రావు, నాటి తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ నాయని కృష్ణకుమారి, జిల్లా పరిషత్ చైర్మన్ రవి కుమార్ తదితరులు పాల్గొని గ్రంథాలయాల ఆవశ్యకత ప్రభుత్వ విధానాలు గురించి మాట్లాడారు. నాటి ఎంపీ ధర్మభిక్షం మాట్లాడుతూ గ్రంథాలయం వల్లనే నేను ఇంత స్థాయికి ఎదిగాను అని, టి కాంతారావు మాట్లాడుతూ విష సంస్కృతి వ్యాప్తి చేస్తున్న టీవీల వల్ల యువత భవిత చెడిపోతుందని గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు కోదాటి నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లో గ్రంధాలయం ఉండాలని ఒకవేళ లేకపోతే ఆత్మలేని శరీరంగా కనబడుతుందని తెలిపారు.
చివరి రోజున కోదాడ శాసనసభ సభ్యులు వెనేపల్లి చందర్ రావు అధ్యక్షత వహించారు. వీరగంధం వెంకట సుబ్బా రావు హరికథ గానం చేశారు... ఈ సమావేశానికి ఎలిమినేటి మాధవ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు ఆరుట్ల కమలాదేవి, బోయ జంగయ్య, సూర్యాపేట ఎమ్మెల్యే ఆకారపు సుదర్శన్ పాల్గొన్నారు.
1960 నుంచి 2005 వరకు నిత్యం ఈ గ్రంధాలయం దిన దిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతూ రెండు వందల మంది పాఠకులు ఈ గ్రంథాలయానికి వచ్చేవారు. ప్రస్తుతం 700పైచిలుకు శాశ్వత సభ్యులు ఈ గ్రంథాలయానికి కలరు. ప్రస్తుతం 10 దినపత్రికలు పదిహేను వారపత్రికలు, పన్నెండు మాస పత్రికలు, ఈ గ్రంథాలయానికి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో 10000 గ్రంథ సంపద అందుబాటులో ఉన్నది ప్రాచీన తెలుగు సాహిత్యం మొదలుకొని, కమ్యూనిజం, సోషలిజం, జాతీయోద్యమ, సాహితీవేత్తల, రాజకీయ
నాయకులు జీవిత చరిత్రలు, వివిధ భాషల పుస్తకాలు, సాంఘిక, రాజకీయ, ఆర్థిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఏవైతే అవసరమో గుర్తెరిగి వాటిని (పోటీ పరీక్షలు కావలసిన పుస్తకాలు ఉద్యోగ సోపానం, ఇండియా టుడే, విజేత కాంపిటీషన్, వివేక్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన, ఎంప్లారు మెంట్ న్యూస్) ఇలా తేప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నాడు రైతులకు, మధ్య తరగతి ప్రజలకు విజ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రస్తుతం నిరుద్యోగ యువ తకు విజ్ఞానం అందించే కల్పతరువుగా మారింది.
ప్రస్తుతం ఈ గ్రంధా లయం పరిస్థితి కాంతివిహీనంగా ఉన్నది అను కున్నంత స్థాయిలో సేవలందించడంలో వెనుకంజలో ఉంది దానికి కారణం ఆర్థిక వనరుల కొరత, భౌతిక వనరుల సమస్య (కొత్త బిల్డింగ్ నిర్మించాల్సిన అవసరం ఉన్నది), గ్రంథ పాలకుల లేమి, ప్రస్తుత పాఠకులకు కావలసిన పుస్తకాలు, ఉచిత ఇంటర్నెట్ సదుపాయం ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది.
ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథ సంపదనంతా ఆధునీకరణ చేయవలసిన అవసరం ఉన్నది ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పాఠకులకు ఏమైతే అవసరము వాటిని అందించవల సిన బాధ్యత గ్రంథాలయ నిర్వాహకులకు పైన ఉన్నది అదేవిధంగా ఆ గ్రంధాల యంలో ఉన్న అద్భుత జ్ఞాన సంపదను డిజిటల్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్నది. ఇలాంటి గ్రంథాలయంను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించి దీనిని పరిశోధన కేంద్రంగా ఉన్నతీకరించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు స్పందించవలసిన అవసరం ఉన్నది.
అప్పటికీ ఇప్పటికీ నల్లగొండ జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాల్లో చిలుకూరు గ్రంథాలయం యొక్క పాత్ర ఆజరామం.
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327