Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడు దశాబ్దాల స్వర రాగ గంగాప్రవాహం ఆమెది. ఆమె గాత్రానికి మురిసిపోని మది లేదు. ఎన్నో అద్భుతమైన పాటలకు ప్రాణం పోసి, సంగీతానికి సరిహద్దుల్లేవని నిరూపిస్తూ తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న 'ఇండియన్ నైటింగెల్ లతా మంగేష్కర్' నర్గీస్ నుండి ప్రీతి జింటా వరకు అనేకమంది నటిమణులకు పాటలు పాడింది. అది యుగళ గీతమైనా... జానపదమైనా...గజల్ గానమైనా..ఖవ్వాలి రాగమైనా ....భక్తి గీతమైనా ఆమె గొంతులో అలవోకగా సాగాయి... ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టిన అపురూప గాన గీతిక లతా మంగేష్కర్ 1948 నుంచి 1978 వరకు 50వేలకు పైగా పాటలు పాడిన ఏకైక గాయనిగా 'గీన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లో పేరు సంపాదించుకుని, గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వంచే 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న వంటి అత్యున్నత పురాస్కారాలు అందుకున్న లతా మంగేష్కర్ వ్యక్తిగత జీవితం మాత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది.
లతా 1929 సెప్టెంబరు 28న సుప్రసిద్ధ సంగీతకారుడు 'దీనానాథ్ మంగేష్కర్' కు పెద్ద కుమార్తెగా జన్మించింది. ఆమె బాల్యమంతా కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. ఐదో ఏటనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లతా, ఆ తర్వాత ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్ వద్ద శిష్యరికం చేసింది.. 13 ఏండ్ల వయసులోనే 1942లో తండ్రి చనిపోవడంతో అప్పటి నుంచే కుటుంబ పోషణ భారం లతాపై పడింది.దీంతో సినీరంగంలోకి ప్రవేశించి లతా మంగేష్కర్ మొదటి సారిగా మరాఠి చిత్రంలో పాడారు. అయితే ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి ఆమె పాటను తొలగించారు. లతా కెరియర్ మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత 1943లో చిముక్లా సుసార్, 1944లో గజెభావు చిత్రాలలో నటించింది. 1946లో జీవన్ యాత్ర, 1948లో మందిర్ వంటి చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురయాలు గాయనీలుగా వెలుగుతున్నారు.
గులాం హైదర్ ప్రోత్సహంతో లతా గాయనిగా తన ప్రస్థానాన్ని 1947లో 'మజ్ బూర్' చిత్రంతో 'దిల్ మేరా తోడా' పాట పాడారు. అయితే ఈ పాట విన్న వారంతా లతాను విమర్శించారు. ఆ విమర్శలను చాలెంజ్‌గా తీసుకున్న లతా ఉర్దులో సంగీత శిక్షణ తీసుకున్నారు. దేశ విభజన కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్‌లు పాకిస్థాన్ వెళ్లడం, ఆ సమయంలో నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడంతో లతా గాయనిగా ఉన్నత శిఖరాల్ని అందుకోవడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా అవకాశం కల్పించగా, ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్ర లతా పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. సినీ నేపథ్య గానంలో శిఖరాగ్రాన చేరిన లతాకి 'మహాల్' సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆయేగా ఆయేగా.. పాటతో లతా దశ తిరిగింది. 'మహాల్' సినిమా హిట్ కావడంతో లతాకి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆగ్', 'శ్రీ 420', 'చోరి చోరి', 'హైవే నెంబర్ 44', 'దేవదాస్' వంటి చిత్రాలు లతాని బాలీవుడ్లో తిరుగులేని గాయనిగా నిలబెట్టాయి.;;1960లో నౌషాద్ అలీ సంగీతంలో వచ్చిన 'మొఘల్-ఏ-ఆజమ్' సినిమాలో పాడిన 'ప్యార్ కియాతో డర్నా క్యా పాట' లతా మంగేష్కర్ ఖ్యాతిని శిఖరాగ్రానికి;చేర్చింది. సంగీతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన లతా 1990లో సొంత ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ఈ సంస్థ గుల్జార్ దర్శకత్వంలో 'లేఖిని' మూవీ తీశారు. ఈ మూవీలో పాడిన పాటకు గానూ లతాకి నేషనల్ అవార్డు వరించింది. రాజశ్రీ ప్రొడక్షన్లో లత పాడిన పాటలు బాలీవుడ్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ''మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్'' సినిమాల్లో.. లతా పాడిన పాటలను హమ్ చేయని సంగీతాభిమాని లేరంటే అతిశయోక్తి కాదు.ఈ తరం హీరోయిన్స్ కు సరిపోయే గళం ఆమె సొంతం. తరాలు మారినా.. చెక్కు చెదరని ఆ స్వరానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మణిరత్నం, షారూఖ్, రెహ్మన్ కాంబీనేషన్ లో వచ్చిన 'దిల్ సే' సినిమాలో 'జియా జిలే' పాట లతా స్వరం అందించిన సర్వ కళల్లో ఒక్కటి.
లతా మంగేష్కర్ సినీ నిర్మాతగా 1953లో మరాఠీలో 'వాదల్', 1954లో 'కాంచన్ గంగా', హిందీలో 'ఝూంఝుర్', 'లేకిన్' చిత్రాలను నిర్మించారు. ఆమె సంగీత దర్శకురాలిగా 'రాంరాంపహునా', 'మొహిత్యాంచి మంజుల', 'మరాఠా టిటుకమేల్ వాలా', 'స్వాథూ మాన్ సే' వంటి కొన్ని చిత్రాలకు పనిచేశారు. ఎన్నో అద్భుత గీతాలకు తన స్వరంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన లతా మంగేష్కర్ 2009లో వచ్చిన 'జైల్' సినిమాలోని 'డాటా సున్ లే' అనే పాటతో తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఆ తర్వాత అన్నీ గజల్స్, భక్తి పాటలే పాడారు. 2010 నుంచి వచ్చిన పాటల్లో సాహిత్యం బాగోలేదని, పైగా బూతు పాటలు ఎక్కువవుతున్నాయని ఎన్నోసార్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సినిమాలకు పాటలు పాడటం ఆపేశానని పలు సందర్భాలలో పేర్కొన్నారు.
తెలుగులో పాడింది మూడు పాటలే
ఏడు దశాబ్దాలకు పైగా ఎన్నో భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతా మంగేష్కర్‌కు తెలుగు సినీ పరిశ్రమతో మాత్రం అనుబంధం తక్కువ అనే చెప్పాలి. ఎందుకో మరి లతా తెలుగులో తక్కువగానే పాటలు పాడారు. ఇంకా చెప్పాలంటే కేవలం మూడు పాటలే అయినా కూడా అవి ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాయి. 1955లో ఏఎన్నార్, సావిత్రి నటించిన సుసర్ల దక్షిణామూర్తి సంగీతంలో వచ్చిన 'సంతానం' చిత్రంలో 'నిదురపోరా తమ్ముడా' లతా పాడిన తొలి తెలుగు పాట. ఆ పాట ఇప్పటికీ నిత్య నూతనమే. ఆమె స్వరంలో పాట వింటుంటే నిద్ర వచ్చేస్తుందంతే. అంత మనోహరంగా ఆ పాటను పాడారు లతా మంగేష్కర్. ఆ తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించగా సాలూరి రాజేశ్వరరావు సంగీత సారధ్యంలో వచ్చిన 'దొరికితే దొంగలు' సినిమాలో 'శ్రీ వేంకటేశా..' అనే పాటను ఆలపించారు. ఇక తెలుగులో చివరి సారిగా పాడిన పాట 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'ఆఖరి పోరాటం' సినిమాలోని 'తెల్లచీరకు' పాటను ఎస్పీ బాలసు బ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ మూడు పాటలు మినహా లతా తెలుగులో మరే పాటలు పాడలేదు. ఆమెతో పాడించాలని ప్రయత్నించినా కూడా కుదర్లేదు.
జీవితాంతం ఒంటరిగానే జీవించిన లతా
లతా మంగేష్కర్ లైఫ్‌స్టైల్ చాలా భిన్నమైనది. ఆమె తోబొట్టువులయిన మీనా, ఆశా భోంస్లే, ఉషా, హృదయనాథ్లు పెళ్లి చేసుకున్నా.. లతా మాత్రం పెళ్లికి దూరంగానే ఉన్నారు. జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉన్నారు. తన చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను ఆమె భుజాన వేసుకున్నారు. నలుగురు తోబుట్టువుల మంచి చెడ్డలను ఆమే చూసుకున్నారు. కెరీర్‌తో పాటు, కుటుంబ బాధ్యతలతో ఆమెకు పెళ్లి గురించి ఆలోచించే సమయమే లేక, జీవితాంతం ఒంటరిగానే జీవించింది. ఇందుకు కారణం ఏమిటని చాలా మంది ఆమెను ప్రశ్నించారు. కానీ, పెళ్లిపై ఆమె ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పలేదు. అయితే, ఆమె ఒంటరిగా ఉండి పోవడానికి కారణం.. బిజీ లైఫ్, కుటుంబ బాధ్యతలు మాత్రమే కాదని, ఓ ప్రముఖ క్రికేటర్‌తో ప్రేమే కారణమని ఒక కథ ప్రచారంలో ఉండగా, లతా గాయనిగా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి దోహదపడిన ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్రతో ప్రేమకథ అసంపూర్ణంగా మిగిలిపోయి ద్వేషంగా మారడం వల్లేనన్న మరో కథనం కూడా ఉంది. వీటితో పాటు ప్రముఖ సంగీత విద్వాంసుడు భుపేన్ హజారికతో సంబంధం ఉందనే వార్తలు వెలువడ్డాయి. హజారిక మాజీ భార్య ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లతాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్లపై లతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హజారిక సన్నిహితురాలు, దర్శకురాలు కూడా ఈ విషయాన్ని ఖండించారు. ఇలా హైప్రోఫైల్ వ్యక్తులతో ఆమెకు ప్రేమ కథలు ఉన్నట్టు ఆ రోజుల్లో ప్రచారం జరిగింది. అయితే, ఏరోజు కూడా ఆమె వాటి గురించి మాట్లాడలేదు. రంగుల ప్రపంచంలో ప్రేమ, పెళ్లిల్లు, స్పర్థలు, వివాదాలు సాధారణమే. సాధారణంగా లతా మంగేష్కర్ చాలా మృదువైన స్వభావం గలవారు. ముక్కుసూటి మనిషి కూడా. సౌమ్యంగా ఉండే ఆమె వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. దీంతో, ఆ వార్తలు తర్వాత కనుమరుగయ్యాయి. 2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమెకు దీనికి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురైంది. మీ జీవితంలో ఉన్న ఆ లక్కీ వ్యక్తి ఎవరు? అని ఆమెను అడగ్గా... కొన్ని విషయాల గురించి కేవలం మన మనసుకు మాత్రమే తెలుసని... ఆ విషయాన్ని తనలోనే ఉంచుకోనివ్వాలని ఆమె చెప్పారు. పెళ్లి, పిల్లలు లేకుండా జీవితానికి సంపూర్ణత్వం ఉండదనే మరో ప్రశ్నకు సమాధానంగా... ప్రజలు ఎన్నో మాట్లాడుకుంటుంటారని... అలాంటి వాటిని పట్టించు కోకూడదని అన్నారు. వాటిని పట్టించుకుంటూ పోతే జీవితాన్ని సంతోషంగా గడపలేమని చెప్పారు. నెగెటివ్ ఎనర్జీలను మన దగ్గరకు రానివ్వకూడదని, తాను ఎప్పడూ ఇదే చేశానని తెలిపారు. మరో ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ మాట్లాడుతూ, 'పెళ్లి ఎందుకు చేసుకోలేదని అందరూ నన్ను అడుగుతుంటారు. దీనికి సమాధానంగా నేను ఏం చెపుతానంటే... దేవుడు నాకు ఒక పని ఇచ్చాడు. ఆయన ఇచ్చిన పనితో నేను చాలా తృప్తిగా ఉన్నా. అందరి మాదిరిగానే నాక్కూడా కొన్ని బాధాకరమైన అనుభవాలు ఉన్నాయి. అయితే నా బాధలు తాత్కాలికమే. నేను భరించలేనిది ఏదైనా ఉందా అంటే... ఇతరులు బాధపడుతుంటే నేను చూడలేను. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా నేను ఆనందంగా ఉంటా' అని చెప్పారు.
పట్టుదల, అహం, గెలవాలన్న మొండితనం లతా నైజం
లతాలో తెలిసిన మనిషి ఎంత ఉన్నదో.. తెలియని మనిషి అంతే ఉన్నది. పట్టుదల, గెలవాలన్న మొండితనం. తన సామర్థ్యం తనకు తెలుసు కనుక మిగిలిన వారు అక్కర్లేదన్నంత అహం. పొగడ్తలు ఆమెకే. విమర్శలూ ఆమెకే. లతా చిన్నా పెద్ద; తగాదాలు పెట్టుకోని సంగీత దర్శకులు లేరు. సి.రామచంద్ర, ఎస్.డి.బర్మన్లను ఆమె కొన్నాళ్లు బారుకాట్ చేసింది. పాట పాడి రెమ్యూనరేషన్ తీసుకున్నాక ఇక దాని సంగతి పట్టించుకోవాల్సిన పని లేదు అని రఫీ అభిప్రాయం. కాని రికార్డులు అమ్ముడైనంత కాలం రాయల్టీ ఇవ్వాల్సిందే అని లతా వ్యాపారసూత్రం. తన మాటను పడనివ్వడం లేదని రఫీతో కొన్నాళ్లు పాడటం మానేసింది. ఆమె దగ్గర చాలా పదునైన వ్యంగ్యం ఉంది. శంకర్; జైకిషన్లోని శంకర్ గాయని శారదతో పాటలు పాడించడం ఆమెకు ఇష్టం లేదు. శారద, శంకర్ సన్నిహితం అని ఆమెకు తెలుసు. 'ప్రేమ గుడ్డిదని తెలుసుగాని చెవిటిదని మొదటిసారి తెలుసు కున్నాను' అని కామెంట్ చేసింది శారద అపస్వరాలను శంకర్ భరిస్తున్నాడు అనే అర్థంలో.., తండ్రి మరణించి కుటుంబం నానా కష్టాల్లో ఉండగా చెల్లెలు ఆశా భోంస్లే తమ మేనేజర్ గణపత్ రావు భోంస్లేతో పెళ్లి పేరుతో వెళ్లి పోవడం లతా అసలు సహించలేదు. ఎన్నో ఏండ్లు ఆశాను దూరం పెట్టింది. భర్త ఇంటి నుంచి ఆశా పారిపోయి వచ్చినా కనికరించలేదు. వాళ్లిద్దరూ డ్యూయెట్స్ పాడాల్సి వచ్చినప్పుడు లతా ఆశా ముఖం చూడకుండా డైరీ అడ్డు పెట్టుకుని పాడేది. క్యాబరే పాటలు చేస్తున్న నటి 'హెలెన్' తనకు లతా పాడదు కాబట్టి ఆశాను గాయనిగా నిలబెట్టింది.
ముంబైలో కొత్త గాయనీలు వీరి ప్రాభవం వల్ల ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లతాకు భయపడి ఇండిస్టీ కొత్త గాయనిలకు అవకాశం ఇచ్చేదీ కాదు. దీంతో ఆ రోజుల్లో ''సుమన్ కల్యాణ్‌పూర్, హేమలత, వాణి జయరామ్'' దాదాపుగా ముంబై ఖాళీ చేశారు. గాయని నాజియా హసన్ 'ఆప్ జైసా కోయి మేరే జిందగీ మే ఆయే' పాడితే ఆ ఫ్రెష్‌నెస్‌కు నాజియా దుమారానికి లతా బెంబేలెత్తిందని అంటారు. లతా 'అనురాధా పౌడ్వాల్' కు అవకాశాలు రాకుండా చూసిన, టి సిరిస్ 'గుల్షన్ కుమార్' అండతో నెగ్గుకొని వచ్చింది. లతా కొంత దారి ఇచ్చింది అల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తిలకే. ఇప్పటి కాలంలో శ్రేయ ఘోషాల్, సునిధి చౌహాన్ ఇష్టం అని ఆమె చెప్పుకుంది. లతా తన పాటలు తాను వినదు... తప్పులు కనపడతాయని. ఎప్పుడైనా తానే పాడిన మీరా భజన్స్ మాత్రం వింటానని చెప్పుకుంది.;లతా తన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఫ్లై ఓవర్ వేయడానికి ఒప్పుకోలేదు... ట్రాఫిక్ అంతరాయం అని. ముంబై ఖాళీ చేస్తాను అనంటే ప్రభుత్వం వెనక్కు తగ్గింది.;ఇంత మొండితనం ఉన్న లతా అంతే మొండితనంతో తండ్రి పేరున 'దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్, ను కట్టి ప్రజలకు అప్పజెప్పింది.
లతా మంగేష్కర్‌ను వరించిన అవార్డులు
1947 సంవత్సరంలో 'మజ్ బూర్' సినిమాతో గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన లతా మంగేష్కర్ అతి తక్కువ కాలంలోనే తన ప్రతిభతో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు. అలా వేలాది పాటలు పాడిన లతా మంగేష్కర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు గాన కోకిలగా పేరు దక్కించుకున్న లతా మంగేష్కర్ భారతీయ సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు భారత అత్యున్నత పురస్కారమైన 'భారత రత్న' అవార్డుతో సత్కరించింది. అలాగే పద్మ భూషన్, పద్మ విభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు జాతీయ అవార్డులు ఆమెను వరించాయి. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, 15 బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ స్పెషల్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మీ తర్వాత భారత ప్రభుత్వం నుండి ఎక్కువ అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలిగా కీర్తి గడించారు. 1989లో సంగీత నాటక అకాడమీ, ఖైరాఘర్లోని ఇందిరా కళా సంగీత విశ్వవిద్యాలయం, కొలాÛపూర్ లోని శివాజీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లను సైతం అందుకున్నారు. ఏడు దశాబ్దాల కెరీర్లో భారతీయ సంగీత పరిశ్రమకు ఆమె చేసిన సహకారం నైటింగేల్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఆఫ్ ది మిలీనియం, క్వీన్ ఆఫ్ మెలోడీ వంటి గౌరవ బిరుదులను పొందింది. 2009లో మంగేష్కర్‌కు ఫ్రెంచ్ లెజియన్ ఆఫ్ హానర్, ఫ్రాన్స్ అత్యున్నత స్థాయి అధికారి బిరుదు లభించింది. 2012లో ఔట్లుక్ ఇండియా గ్రేటెస్ట్ ఇండియన్ పోల్‌లో మంగేష్కర్ పదవ స్థానంలో నిలిచారు. 1984లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమె గౌరవార్థం లతా మంగేష్కర్ అవార్డును నెలకొల్పింది.;మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1992 లో లతా మంగేష్కర్ పేరిట అవార్డును ఏర్పాటు చేసింది.
అందరికంటే అధిక రెమ్యునరేషన్
లతా మంగేష్కర్ 1950ల కాలంలో ఒక్కో పాటకు సుమారు 500 రూపాయల పారితోషికాన్ని అందుకునేవారట. అప్పట్లో ఆశా భోస్లే సహా పేరున్న నాటి గాయనీ, గాయకులకు సైతం 150 రూపాయలు ఇచ్చేవారట. కానీ ఆ సమయంలో కూడా లతాకి అందరికంటే అత్యధిక రెమ్యునరేషన్ ఇచ్చేవారని స్వయంగా ఆశా భోస్లే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మొదట్లో 25 రూపాయలతో ప్రారంభమైన లతా సంపాదన. వందల కోట్లకు చేరుకుంది. ఆమెకు ముంబై సహా పలు కొన్ని నగరాల్లో విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు ఉన్నాయి. లతా చనిపోయే నాటికి ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 300 కోట్లకు పైగానే ఉందని సమాచారం.
-పొన్నం రవిచంద్ర, 9440077499