Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేయిమైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అలా మొదలైన ఒక యువకవి బోల యాదయ్య సాహిత్య ప్రస్థానంలో పదో అడుగు 'శిథిల స్వప్నం' పాలమూరు సాహితీ సంస్థ ప్రచురణలు సంస్థ ప్రచురించిన 'ప్రేమ మొగ్గలు' సిరీస్ కవితా సంపుటాలలో అగ్రశ్రేణిలో నిలిచే మొగ్గల సంపుటి ఇది.
మూడు పాదాలలో ముగిసే మొగ్గలు ప్రక్రియ మినీ కవితకు మరో రూపం. 'శిథిల స్వప్నం' మొగ్గలన్నీ అందమైన భావ కవిత మొగ్గలే. విరహం, బలిపీఠమెక్కిన, పెళ్ళి పీఠాన్ని ఎక్కని ప్రేమ, జ్ఞాపకాలు, బాధ, ఎడబాటు అలా పూలరేకుల్లా మీద పడుతూ మొగ్గల అభిషేకంలో పాఠకుడిని ముంచెత్తుతాయి. ముగ్ద మనోహరమైన మొగ్గలు మిత్రుడు యాదయ్యవి. పువ్వుగా విరియని అందం .. తటాలున కథనం మారడం ,మాండలికం, శిష్ట వ్యవహారిక పదాలు పోటిపడుతూ తచ్చాడటం పాదాలంతా చూస్తాం. ఇవ్వన్ని ఈ మొగ్గల ముగ్దత్వాన్ని మరింత పెంచాయి. నలభై పేజీల పుస్తకంలో 108 అందమైన మొగ్గల శతకంలా విరబూశాయి. భావకవిత ధార పాఠకుడిని కట్టి పడేస్తుంది.
'' నీ కురుల నిండా వాడని గులాబీ నై
నిత్యం నీ వెంట నడవాలనుంది
నేల నువ్వైతే వెన్నెల పువ్వును నేను''
అంటూ ప్రణయ కవిత్వం పలికిస్తాడు కవి.
''నా మదినెంత లోతు తవ్వినా
నీ జ్ఞాపకాలే బయట పడ్డయి
తవ్విన చోటల్లా నీ రూపమే దర్శనం'' అంటాడు
ఈ ప్రణయ కవితా మొగ్గలను తన శ్రీమతి బోల లలితమ్మకు అంకితమిచ్చిన కవి తన కవిత మొగ్గలను ప్రణయార్చనకే వాడి ప్రయోజకత్వం చేకూర్చాడు. ఈ సంపుటాన్ని పరిచయం చేస్తూ జనజ్వాల ఇలా అంటారు ''ప్రేమ ఎంత అద్భుత పదం'' అని పరవశించారు. ''ప్రేమ మౌనంగా ప్రారంభమై నదిలా పారుతుంది'' అన్న భీంపల్లి శ్రీకాంత్ మాటలు రూపం దాల్చిన కవితలు ఇవి.
ఈ మొగ్గలు యువకవులకు ప్రేరణగా నిలుస్తాయి. ఇప్పటి వరకు పది పుస్తకాలు వెలువరించిన కవి బోల యాదయ్య అభినందనీయుడు. భవిష్యత్తులో యదార్థ జీవన దృశ్యాల చిత్రీకరణను ఈ కవి నుంచి ఆశించవచ్చు.
- ఊరబావి, 8639994533
బోల యాదయ్య
ఇంటి నం 1-87
గ్రామం-: ధర్మాపూర్
మండలం/ జిల్లా :
మహబూబ్ నగర్
9912206427