Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన ఇంట్లో తాను సంపాదించుకున్నది తిని, తన వారి మధ్య బ్రతకాలని తపన పడే ఒక సాధారణ జీవితాన్ని కూడా అనుభవించలేని స్త్రీ వేదనను ఈ సినిమా మనతో పంచుకుంటుంది. అలారి జీవితంలో గాయపడిన ప్రతి సారి ఎదో ఒక ఆశతో తన జీవితాన్ని పునఃనిర్మించుకునే ప్రయత్నం చెస్తుంది. చెదిరిన గూడును మళ్ళి మళ్ళీ కట్టుకునే ఒక చిన్ని పక్షిలా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఆమెలోని ఆ శ్రమించే నైజం, భాద్యతను విస్మరించని తత్వం, ఆశను నింపుకుంటూ శూన్యంలో వెలుగును చూసే విధానం జీవితాన్ని ఒక స్త్రీ దర్శించే కోణం, ఇవన్నీ ఈ సినిమాలో అలారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎన్నో స్త్రీ పాత్రలను తెరపై చూసి ఉంటాం. ఈ సినిమా చూడండి, స్త్రీ శక్తిని అనుభవించండి. బూడిద నుంచి లేచి వచ్చే ఫినిక్స్ పక్షీ ''అలారి''లో కనిపిస్తుంది. అలారి కల్పిత పాత్రే కావచ్చు.
కాని కోట్ల మంది భారతీయ కుటుంబ స్త్రీలకు ప్రతీక.
''బొడో'' సినో టిబెటియన్ వర్గానికి చెందిన భారతీయ భాష. దేవనాగరి లిపిలోనే రాసే ఈ భాషను మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో మాట్లాడతారు. మన సంవిధానం బోడోను భారతీయ అధికారిక భాషగా గుర్తింపు ఇచ్చింది. అలా గుర్తుంపు పోందిన 22 భారతీయ భాషలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ భాషలో మంచి సాహిత్యం కూడా ఉంది. ఈ మధ్య బోడో భాషలో చక్కని చిత్రాలు వస్తున్నాయి. ''జలారు - ది సీడ్' అన్నది 2019లో వచ్చిన బోడో సినిమా. ఎన్నో అంతర్జాతీయ సినీ ఉత్సవాలలో పాల్గొన్న ఈ చిత్రాన్ని భారతీయ సినిమాలో మరో మంచి సినిమాగా సినీ ప్రేమికులు అంగీకరించాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రజనీ బాసుమాతారి ఈ సినిమాకు రచయిత, నిర్మాత, దర్శకురాలు కూడా. ఎంత ప్రేమతో, భాద్యతతో ఈ సినిమాకు వారు పని చేసారో చెప్పడానికి మాటలు చాలవు. హిందీ చిత్రం ''మేరీ కామ్' లో తల్లి పాత్ర పోషించిన నటిగా వీరిని హిందీ ప్రేక్షకులు గుర్తు పడతారు.
అసాంలో బోడో ప్రాంతపు ప్రజలు నివసించే చోట తొంభైలలో ఎన్నో రాజకీయ అలజడులు రేగాయి. ఎందరో పౌరులు ఆ ప్రాంతాల్లో మరణీంచారు. రజనిగారి భాషలో చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఒక విషాదం అల్లుకుని ఉంది. ప్రతి ఇల్లు రాజకీయ అలజడుల కార ణంగా వారి ఆప్తులలో ఒకరిని కోల్పో యింది. ఆ నేపద్యంలో, ఆ ప్రాంతంలో పెరిగిన రజని అక్కడి పరిస్థితుల ప్రభావానికి ఎంతో లోనయ్యారు. ఈ ఇతివృత్తంతోనే 'జలారు' కథను రాసు కున్నారు. సమయం వచ్చినప్పుడు తన అనుభవాలను రంగరించి సినిమాగా దృశ్య రూపం ఇచ్చారు. ఇందులో రజని, అలారి అనే స్త్రీ పాత్రను పోషించారు. భారతీయ సినిమాలో ఇప్పటి దాకా వచ్చిన శక్తివంతమైన స్త్రీ పాత్రలలో 'అలారి' ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
'అలారి' పాత్ర ద్వారా రాజకీయ అలజడుల మధ్య జీవిస్తున్న కుటుంబ స్త్రీలు భార్యగా, తల్లిగా, కూతురుగా, అత్తగా, స్నేహితురాలిగా, ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కుం టున్నారో, ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేసారు రజని. అంటే బోడొ ప్రాంతంలో ప్రతి స్త్రీ కథగా అలారి పాత్రను తీర్చిదిద్దారు ఆమె. అందుకే ఈ సినిమా అంతమంది మనసులను చేరగలిగింది.
రాజకీయ అల్లర్లకు ఎక్కువగా ప్రభావితమయ్యే వారు సాధారణ ప్రజలు. చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ చిన్న సంతోషాలతో జీవించాలనుకునే అతి సాధారణమైన నాగరికులు ఈ అల్లర్లకి ఎప్పుడూ బలవుతూ ఉంటారు. అలారి తన భర్తతో కొడుకుతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. భర్త ఒక చిన్న పట్నంలో ఉద్యోగస్తుడు. అలారి పిల్లలకు ఇంగ్లీషు పాఠాలు బోధిస్తూ ఉంటుంది. వారికి ఒకడే కొడుకు 'ఎరాక్దో'. పదేండ్ల కొడుకు పుట్టినరోజుకి కేక్ తేవడానికి అలారి భర్త షాపుకి వెళతాడు. షాపు నుంచి బైటకు వస్తున్నప్పుడు మిలటరీ సైనికులు ఎవరో తీవ్రవాదిని వెంబడిస్తూ జనం మధ్య కాల్పు లు జరుపుతూ ఉంటారు. వారి తుపాకి గుండుకి అలారి భర్త బలవుతాడు. షాపు నుంచి బైటకు వచ్చిన ఆ అమాయకుడు సైనికులు కాల్చిన తుపాకి గుండు తగిలి అక్కడే కుప్ప కూలిపోతాడు. భర్త మరణించాక అలారి జీవితం చీకటయిపోతుంది. పట్నంలో ఉండి ఎవరి సహాయం లేకుండా, బిడ్డను ఎలా పెంచుకోవాలో అర్ధం కాదు. అందుకని తన అత్త మామల వద్దకు వస్తుంది. ఆ పల్లెటూరిలో వ్యవసాయం చేస్తూ బిడ్డని పెంచుతుంది. భర్త మరణం తరువాత జరిగే కోర్టు కేసుకి ఆమె వెళ్ళదు. ఇలాంటి మరణాలు సాధారణం అని ఎంచబడుతున్న పరిస్థితులలో, కోర్టు తనకు న్యాయం చేయలేదని ఆమెకు తెలుసు. కాని ఆమె కొడుకు 'ఎరాక్దో' తండ్రి స్నేహితుడితో కోర్టుకు వెళతాడు. మిలటరీ సైనికులకు ఒక వార్నింగ్ ఇచ్చి అది ఒక పొరపాటుగా, దేశ రక్షణలో భాగంగా జరి గిన మరణం అని కోర్టు దృవీకరిస్తుంది. తండ్రి జ్ఞాపకాలతో, అతని లోటూ అనుభవిస్తున్న చిన్న ఎరాక్దో మనసుపై ఇది చాలా ప్రభావం చూపుతుంది. అతనిలో చిన్నప్పటి నుండే ఒక కోపం, కసి బయలు దేరుతాయి.
అలారి బిడ్డ పైనే ప్రాణాలు పెట్టుకుని జీవిస్తూ ఉంటుంది. మిలట్రీ అరాచకం ఇంకా పెరుగుతుంది. గ్రామాలలో యువత చే, మావోల భావాల ప్రభావంతో, తిరుగుబాటు ఉద్యమాలలో పని చేస్తూ ఉంటారు. ఈ లోపున అలారి అత్తా మామలు కూడ మరణిస్తారు. వ్యవసాయం చేసుకుంటూ, బిడ్డకు మంచి జీవితం ఇవ్వాలని అలారి తాపత్రయపడుతుంది. 'ఎరాక్దో' తీవ్రవాద సంస్థల పట్ల ఆకర్షణ పెంచుకుంటున్నాడని తెలిసి, తన జీవితకాలంలో సంపాదించినది అంతా కోడుకు చేతిలో పెట్టి అతన్ని ఊరు వదిలి వెళ్ళిపొమ్మని, ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకొమ్మని బ్రతిమాలుతుంది. మిలట్రీ సైనికులు ఆ ఊరిలో అనుమానం ఉన్న ప్రతి యువకుడిని అరెస్టూ చేస్తూ ఉంటారు. ఎరాక్దోని అలారి కాపాడుకోలేనని తెలుసుకుంటుంది. ఒక రాత్రి డబ్బు బిడ్డ చేతిలో పెట్టి దూరపు బంధువు ఇంటికి వెళ్ళిపొమ్మని పంపిస్తుంది.
మిలట్రీ అరాచకాలను చిన్నప్పటి నుంచి తండ్రి మరణం ద్వారా అనుభవిస్తున్న ఎరాక్దో ముందు పారిపోవాలనుకున్నా, దారిలో కలిసిన ఉద్యమకారుల మిత్రులతో ఉద్యమంలోకి పూర్తిగా వెళ్ళిపోతాడు. ఇక అలారి ఇంటి పై మిలటరి రైడింగులు సాధారణమయిపోతాయి. కొడుకు ప్రాణాలతో ఉంటే చాలని అతన్ని ఎప్పటికీ ఇంటికి రావద్దని అలారి కబురు పంపిస్తుంది. కొన్ని ఏండ్ల తరువాత ఒక రోజు ఇంటికి వచ్చిన కొడుకుని తృప్తిగా వండి పెట్టుకుందామనేంతలో సైనికులు ఇంటి పై దాడి చేసి ఎరాక్దో మిత్ర బృందాన్ని అరెస్టు చేస్తారు. ఎరాక్దో తప్పించుకుంటాడు. అలారి కొడుకు జేబులో నుంచి పడిపోయిన కొన్ని ఫోటోలు చూస్తుంది. వాటి ద్వారా, ఎరాక్దోకి వివాహం అయిందని అతనికి ఒక కొడుకు ఉన్నాడని తెలుసుకుంటుంది.
ఒంటరిగా జీవిస్తున్న ఆమెకు కొడుకు ఎంకౌంటర్ విషయం తెలుస్తుంది. ఆ దుఖం నుంచి కోలుకోలేకపోతుంది. కాని తన కొడుకు బీజం ఈ భూమి మీద ఉందని, ఆ బిడ్డ ఉన్నంత వరకు తనకు కుటుంబం ఉందని, తాను అనాధను కానని ఆమె తనకు తాను నచ్చ చెప్పుకుంటుంది. పక్కింటి స్నేహితురాలి ప్రోద్భ లంతో థారులాండ్లో ఉన్న కోడలితో మాట్లాడుతుంది. కాని ఆ అమ్మాయి సరిగ్గా తనతో మాట్లాడట్లేదని అనిపించి మనవడిని చూడడానికి ఒంటరిగా థారులాండ్ బయలు దేరుతుంది.
దేశం కాని దేశంలో చివరకు అలారి కోడలిని కలుసు కుంటుంది. ఐదు సంవత్సరాల తన మనవడిని చూసి ఆనంది స్తుంది. అది తన కొడుకు అంశం అంటే తన అంశం అని, తాను ఈ ప్రపంచంలో ఒంటరిని కానని సమాధాన పడుతుంది. ఆ బిడను తన కివ్వమని కోడలిని బ్రతిమాలుతుంది. కాని కోడలు ఆ బిడ్డతో జీవిస్తున్న తీరును గమనించి, ఒకప్పటి తన జీవితం ఆమెకు గుర్తుకు వస్తుంది. ఇప్పుడు కోడలికి మిగిలింది కూడా ఆ బిడ్డే అని, వాడే దేశంలో ఉన్నా తన బిడ్డ కాకుండా పోడని సమాధాన పడుతుంది. మనవడి జ్ఞాపకాలతో తిరిగి తన ఊరు చేరుతుంది. ఒంటరిగా జీవిస్తూ తన మనవడితో కోడలితో ఫోనులో సంభాషిస్తూ, దూరంగా పెరుగుతున్న మనవడిలో తన కొడుకు బీజం ఉందన్న తృప్తితో వృద్దాప్యాన్ని ఎదుర్కోవడానికి సిద్దపడుతుంది.
చిన్న వయసులో మిలట్రీ తప్పిదాలకు భర్తను పోగొట్టుకుని భార్యగా అన్నీ సుఖాలకు దూరం అవుతుంది అలారి. బిడ్డపై ఆశతో జీవిస్తుంటే సామాజిక పరిస్థితులు ఆ బిడ్డనూ దూరం చేస్తాయి. బిడ్డ ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంటే చాలని కోరుకుంటుంది. కాని ఆ కోరిక కూడా తీరదు. చివరకు తన బిడ్డకు జన్మించిన కొడుకుతో కలిసి జీవించడానికి కూడా పరిస్థితులు అంగీకరించవు. మొదటి నుంచి ఆమెది ఒంటరి పోరాటమే. ప్రతి పరిక్షను భాద్యతతో ఎదుర్కున్న వ్యక్తి అలారి. భర్త చనిపోతే జీవితం ఎలా అని ఆలోచించుకోవడానికి, బాధపడడానికి కూడా ఆమెకి సమయం ఉండదు. పట్నం నుండి పల్లెకు మారిన జీవితానికి సర్దుకుంటూ, ఉద్యోగం నుండి వ్యవసాయానికి మారి శారీరిక శ్రమకు తనను తాను సిద్దం చేసుకుంటూ కొడుకును బ్రతికించుకోవడానికి పోరాడుతుంది. కొడుకు చదువులో ముందున్నాడన్న సంతోషాన్ని కూడా అనుభవించలేని జీవితం ఆమెది. ఆ కొడుకు బ్రతికి ఉంటే చాలని సైన్యం నుండీ, ఉద్యమకారుల నుండీ బిడ్డను కాపాడుకోవడానికి ఇంకో యుద్దం చేస్తుంది. తల్లి కోసం ఆ కొడుకు ఆవేశాన్నితగ్గించుకుని, ఒక సాధారణ ఉద్యోగస్తుడిలా జీవిద్దాం అనుకునేంతలో రాజకీయ పరిస్థితులు అతన్ని ఉద్యమం వైపుకే నెడతాయి. కొడుకు శాశ్వతంగా తన ఊరి నుండి దూరమయినా కనీసం జీవించి ఉంటే చాలని అలారి ఒంటరి పోరాటానికి సిద్దపడుతుంది. కొడుకును ఎప్పటీకీ చూడకుండా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అంతగా కాపాడుకున్న కొడుకూ మరణిస్తాడు. కొడుకు మరో దేశంలో వివాహం చేసుకున్నాడని తనకో మనవడు ఉన్నాడని ఆమె తన కుటుంబంలోకి మనవడిని ఆహ్వానించాలని తపిస్తుంది. కాని చివరికి ఒంటరిగానే మిగిలిపోతుంది. అదే పాత ఇల్లు, పొలం, ఊరు, అదే ఒంటరి తనం, అదే పోరాటం. అయినా అమె నిరాశను జయిస్తుంది. తన అంశగా మనవడు సురక్షితంగా ఉంటే చాలని సమాధానపడుతుంది.
రాజకీయ, సామాజిక సంక్షోభాన్ని అనుభవించిన ప్రజానికం మధ్య ఉత్తమమైన సాహిత్యం, కళలు జన్మిస్తాయన్నది చరిత్ర చెప్పే విషయం. బోడో భాషలో ఎనభైల నుండి మాత్రమే సినిమాలు తీస్తున్నారు. ఇంత తక్కువ చరిత్ర ఉన్న బోడో సినిమాలో ఇంత గొప్ప చిత్రం రావడానికి కారణం, ఇది ప్రజా నేపద్యం నుండి ఉద్బవించిన కథ అవడం. అలారి పాత్ర ద్వారా బోడో ప్రాంతపు స్త్రీల దృడచిత్తం, వారి పోరాటం, కుటుంబం కోసం వారు చేసే యుద్దం, రాజీపడని తత్వం, ఇవన్నీ చూపిస్తారు రజని. మిలట్రీ చేసే తప్పులు కాకుండా యువత ఉద్యమకారులుగా మారక తప్పని పరిస్థితులను అద్యయనం చేయడానికి కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది. ఈశాన్య రాష్ట్రాలలోని రాజకీయ పరిస్థితులు, సంక్షోభం గురించి తెలియని ఇతర ప్రజలకు అక్కడి ప్రజల కష్టాలను పూర్తిగా విశిదీకరిస్తుందీ సినిమా.
స్త్రీ జీవితం అంతా కుటుంబం చుట్టూ తిరుగుతుంది. భర్త, కొడుకు, తరువాత అతని పిల్లలు ఇదే ఆమె ప్రపంచం. ఈ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆమె చాలా శ్రమిస్తుంది. వారి బాగు కోసం ఎన్ని ప్రయాసలయినా పడడానికి సిద్దపడుతుంది. కాని ఆ కుటుంబ జీవితమే ఆమెకు దక్కని పరిస్థితులను కల్పిస్తున్న సమాజం, రాజకీయాలను ఎలా అర్ధం చేసుకోవాలో తెలియని అయోమయంలో బోడొ స్త్రీ ఇప్పుడు జీవిస్తుంది. తన ఇంట్లో తాను సంపాదించుకున్నది తిని, తన వారి మధ్య బ్రతకాలని తపన పడే ఒక సాధారణ జీవితాన్ని కూడా అనుభవించలేని స్త్రీ వేదనను ఈ సినిమా మనతో పంచుకుంటుంది. అలారి జీవితంలో గాయపడిన ప్రతి సారి ఎదో ఒక ఆశతో తన జీవితాన్ని పునఃనిర్మించుకునే ప్రయత్నం చెస్తుంది. చెదిరిన గూడును మళ్ళి మళ్ళీ కట్టుకునే ఒక చిన్ని పక్షిలా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. ఆమెలోని ఆ శ్రమించే నైజం, భాద్యతను విస్మరించని తత్వం, ఆశను నింపుకుంటూ శూన్యంలో వెలుగును చూసే విధానం జీవితాన్ని ఒక స్త్రీ దర్శించే కోణం, ఇవన్నీ ఈ సినిమాలో అలారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఎన్నో స్త్రీ పాత్రలను తెరపై చూసి ఉంటాం. ఈ సినిమా చూడండి, స్త్రీ శక్తిని అనుభవించండి. బూడిద నుంచి లేచి వచ్చే ఫినిక్స్ పక్షీ ''అలారి'' లో కనిపిస్తుంది. అలారి కల్పిత పాత్రే కావచ్చు. కాని కోట్ల మంది భారతీయ కుటుంబ స్త్రీలకు ప్రతీక.
ఈ పాత్రను మలచేటప్పుడు దర్శకురాలు ప్రతి కోణాన్ని స్పృశించారు. అలారి భర్త స్నేహితుడు ఆ కుటుంబానికి అండగా సలహాలిస్తూ ఉంటాడు. కాని అతని భార్యకు భర్త అలారి కుటుంబం గురించి ఆలోచించడం, సహయపడడం నచ్చదు. కోడుకు తనకు దూరం అయ్యాడని ఆ విషయాన్ని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాలనుకుంటుంది అలారి. కాని ఆ స్నేహితుని భార్య అదే సమయంలో వారిద్దరి మధ్య ఏదో ఉండని గొడవ సృష్టిస్తుంది. కనీసం ఏడవడానికి కూడా అలారికి అవకాశం ఉండదు. పెద్ద దుంగను తన ఇంటికి అడ్డం పెట్టి ఆ దంపతులను ఇంటి బైటకు పంపి ఒంటరిగా చీకటి ఇంట్లోకి వెళ్తున్న అలారిలో, ఈ సీన్ లో కూడా దర్శకులు ఒక బాధితురాలిని కాకుండా యోధురాలినే చూపిస్తారు. ఆమెలో అసహాయత కాకుండా పోరాడాలి అనే దృఢనిశ్చయాన్ని చూపిస్తారు. తన దుఖాన్ని తానొక్కత్తే ఎదుర్కోవడానికి సిద్దపడే అలారి శారీరిక భాష ఈ సీన్ లో ఎంత గొప్పగా ఊంటుందంటే, ఆమె వ్యక్తిత్వానికి మంత్రముగ్దులం అవుతాం.
సినిమా అంతా వెతికిన ఒక్క అసందర్భపు దృశ్యం, ఒక అనవసర విషయం కాని డైలాగ్ కాని కనిపించవు. అంత పక్కా స్క్రీన్ ప్లే తో తీసిన ఈ చిత్రం ఒక స్త్రీ ఆవిష్కరించిన అద్భుతం. ఇలాంటి నేపద్యంతో సినిమాలు తీయడానికి పురుష దర్శకులే సందేహించే సమయంలో ఒక స్త్రీ ఈ కథను రాసుకుని, నిర్మించి, నటించి బోడొ స్త్రీల జీవితాలను దేశం ముందుకు తీసుకువచ్చారు. కొన్ని కథలు స్త్రీలే చెప్పాలి అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే.
- పి.జ్యోతి, 9885384740