Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ రచయిత అయిన ఒక ప్రత్యేక దృక్పథంతో కలాన్ని చేపడతారు. సురవరం కూడా అంతే. సామాజిక అభ్యున్నతి కోసం విభిన్నమైన అంశాలతో వేయికి పైగా వ్యాసాలు రాసారు. సురవరం న్యాయవాద వృత్తిని అయిష్టంగానే చేపట్టినా, పత్రికా సంపాదక బాధ్యతలను మాత్రం విస్మరించలేదు. సురవరం చాలనే రాసినప్పటికీ అందులో కొన్ని మాత్రమే లభించడం లేదు. కొన్ని అముద్రితాలు కూడా ఉన్నాయి. శుద్ధాంత కాంత, ఆరేవీరులు అనే నవలలు, ఉచ్చల విషాదం, భక్త తుకారం, సాంఘిక నాటకం (అసమగ్రం), కొన్ని నాటికలు, అలాగే తన జీవితానికి వెలుగైన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్రతో పాటు బుడ్డా వెంగళ రెడ్డి జీవితాన్నీ రాశారు.
త్రోవలో వెళ్ళేవాడు తోడబుట్టిన వాళ్ళను తిడితే పట్టించుకోకుండా పక్కకు తిరిగేవాళ్ళు ఇప్పుడెందరో ఉన్నారు. పట్టించుకోకపోవడానికి కారణం కుటుంబ కలహాలు కావొచ్చు, మరి ఇతరాలేవైనా కావచ్చును. ఇలాంటి వారి ముందు తన ప్రాంతాన్ని పరాయి వారు తిడితే ఇంకేం పట్టించుకుంటారు. అవును అసలే మాత్రం రోషమే రాదు వారికి. మరి భావోద్వేగాలలో శేషమే మిగిలింది వారికి. అటువంటి వారు దశబ్దాల నుంచి ఉంటూ వస్తున్నారు. కాని ఒక్కరు మాత్రం తన వారినే కాదు, తన ప్రాంతాన్ని, తన భాషను, తన సంస్కృతిని పల్లెత్తి మాట అనిన సహించరు. ఆయన భగ అభిమాని. అతను తల్లినెంత పూజిస్తారో, తన భాషను, ప్రాంతాన్నీ అంతే ప్రేమిస్తారు. అంతలా అభిమానించే ఆ భావాలకు కేంద్ర స్థానమైన వారు సురవరం ప్రతాపరెడ్డి. ప్రతాపరెడ్డి 1896, మే, 28న రంగమ్మ, నారాయణ రెడ్డి దంపతులకు బోరవెల్లిలో జన్మించారు. తెలంగాణ దక్షిణ భాగంలో ఉండడం మూలానా రాయలసీమ వీరికి చుట్టాల ఊరులా ఉండేది. అందుకని ఆయన 1904లో కర్నూలులోని మిషనరీ బడిలో చేరి మాధ్యమిక విద్యకు ముందు వరకు అక్కడే చదివారు. 1913లో నిజాం కాలేజీలో చేరినాక పరీక్షలలో ఉత్తీర్ణత, అనుత్తీర్ణతల మధ్య ఊగిసలాడి, పాసై, 1917లో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో వేదం వెంకటరాయశాస్త్రి సిఫారసుతో బి.ఏలో చేరారు.
నాయకుల ప్రభావం, సామాజిక చైతన్యానికి కృషి
సురవరం విద్యార్థిగా ఉన్నప్పుడే, సురేంద్రనాథ్ బెనర్జీ, గాంధీ, బిపిన్ చంద్రపాల్, సరోజినీ నాయుడు, రవీంద్రనాథ ఠాగూర్ల ఉపన్యాసాలను విన్నారు. ఈ ఉపన్యాసాల ద్వారా ప్రతాపరెడ్డి కొంతమేరకు ప్రభావితమయ్యారు. తానూ భవిష్యత్తులో పోరాడుటకు, తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పుటకు వీరి ప్రసంగాల సమయంలోనే బీజాలు పడి ఉండవచ్చు. హైదరాబాదు ఉద్యమ చరిత్రలో అత్యంత పేరెన్నికగన్న హాస్టల్- రెడ్డి హాస్టల్. దీనిని రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించారు. అయితే దీని నిర్వహణకు ఆయన ఒక సమర్థుడైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. అదే సమయంలో ఒక కేసు నిమిత్తం రామక్రిష్ణారెడ్డితో వచ్చిన సురవరాన్ని చూసి వెంకట రామారెడ్డి, ఇతనే సరైన వ్యక్తి అని భావించి, ఇతను రెడ్డి హాస్టల్ బాధ్యతలు తీసుకుంటేనే కేసు తీసుకుంటానని షరతు పెటారు. అలా అప్రయత్నంగా ఆ హాస్టల్ బాధ్యతలు చేపటారు. సాంస్కృతిక సంఘోన్నతి కోసం సాగిన గ్రంథాలయోద్యమానికి తన తోడ్పాటును అందించారు. 28.5.1928న సూర్యాపేటలో రెండవ గ్రంథాలయ సభను పురస్కరించుకొని సాగిన ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయ వార్షిక సభలకు అధ్యక్షత వహించారు. ఇలా తెనాలి, ఖమ్మం, కర్నూలులో జరిగిన గ్రంథాలయ సభలలో పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం పాటు గోలకొండ పత్రికా సంపాదకులుగా పని చేసిన కాలంలో అనేక వ్యాసాలు రాసి ఒక పాత్రికేయుడిగా తన సామాజిక బాధ్యతను నూటికి నూరుపాళ్ళు నిర్వర్తించారు. సమాజం అభివృద్ధికి నోచుకోవాలంటే దానికి మొదటగా కావాల్సింది విద్యనే అని తలిచి విద్యాలయాలు స్థాపించారు. అందులో ఇప్పటి A.V కాలేజి ఒకటి. దీనిని కె.వి. రంగారెడ్డి, సురవరం, వెంకట రామారెడ్డిలు స్థాపించారు.
తెలంగాణ ప్రజల జీవితాలలో చీకట్లను పారద్రోలడానికి, వారిని ప్రభుత్వం పట్ల జాగరూకుల్ని చేయడానికి సాంస్కృతిక ఉన్నతిని పెంపొందించడానికి ఏర్పడిన ఆంధ్ర మహాసభ నిజాం వ్యతిరేక ఉద్యమ ప్రస్థానంలో కలికుతురాయి. దీని నీడన తెలంగాణ అంతా చేరి దుర్వీనీతికి పాల్పడిన నిజాం సర్కార్ ఎడల పోరాడడానికి సిద్ధమయ్యారు. ఇటువంటి ఆంధ్రమహాసభకు మొదటి ఆధ్యక్షత బాధ్యతను చేపట్టే సదా గొప్ప అవకాశం ప్రతాపరెడ్డికి దక్కింది.
రచనలు : ఏ రచయిత అయిన ఒక ప్రత్యేక దృక్పథంతో కలాన్ని చేపడతారు. సురవరం కూడా అంతే. సామాజిక అభ్యున్నతి కోసం విభిన్నమైన అంశాలతో వేయికి పైగా వ్యాసాలు రాసారు. సురవరం న్యాయవాద వృత్తిని అయిష్టంగానే చేపట్టినా, పత్రికా సంపాదక బాధ్యతలను మాత్రం విస్మరించలేదు. సురవరం చాలనే రాసినప్పటికీ అందులో కొన్ని మాత్రమే లభించడం లేదు. కొన్ని అముద్రితాలు కూడా ఉన్నాయి. శుద్ధాంత కాంత, ఆరేవీరులు అనే నవలలు, ఉచ్చల విషాదం, భక్త తుకారం, సాంఘిక నాటకం (అసమగ్రం), కొన్ని నాటికలు, అలాగే తన జీవితానికి వెలుగైన రాజా బహదూర్ వెంకట రామారెడ్డి జీవిత చరిత్రతో పాటు బుడ్డా వెంగళ రెడ్డి జీవితాన్నీ రాశారు. కథలతో పాటు హైందవ ధర్మ వీరులు, యువజన విజ్ఞానం, రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, గోలకొండ కవుల సంచిక వంటి గ్రంథాలు రాశారు. ఒకానొక పత్రికలో 'తెలంగాణలో కవులు పూజ్యము' అని విమర్శించిన ముడుంబై వెంకట రాఘవ నరసింహచార్యుల మాటను సవాలుగా తీసుకొని నిజామాంధ్రలో తెలంగాణ అంతటా క్షేత్ర పర్యటన చేసి 354 మంది కవులతో ఈ గ్రంథాన్ని వెలికి తీసి సాహిత్య ప్రపంచంలో తెలంగాణకు శిఖర స్థాయిని కల్పించారు. సురవరం జాతీయోద్యమ కవి, సంఘ అభ్యున్నతిని కోరుకున్న మేటి రచయిత, మితవాద ఆలోచనలతో ఉద్యమాన్ని నెమ్మదిగా విస్తరింపచేసిన ప్రభావశీలి. ఎన్నో ఏండ్లుగా పుటలపై తన కలంతో, వేదికలపై తన గళంతో తెలంగాణకు మార్గం చూపిన ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 23న గుండెపోటుతో మరణించారు.
- ఘనపురం సుదర్శన్,
9000470542