Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మర్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? మన దేశంలోని ఈ ప్రదేశాలను అస్సలు మిస్ చేయకండి.. మిమ్మల్ని ఆహ్లాదపరిచే కొన్ని ముఖ్యమైన వేసవి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా...
వేసవికాలం మొదలైంది.. గడిచిన రెండేండ్లు పైగా కరోనాతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత పరిస్థితులు కాస్త అనుకూలంగానే ఉన్నాయి. ఇక బయటికి వెళ్లి మనలోని భారాన్ని దించి ప్రకృతి మాత ఒడిలో సేదతీరాలని చాలా మంది మనస్సుల్లో ఉండే ఉంటుంది కదా... అందుకు సుందరమైన, నిశ్శబ్ద ప్రదేశంగా ఉండే పర్యాటక స్థలాన్ని చూడాలని అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం.....
డార్జిలింగ్: డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్‌లోని కొండలలో ఉన్న నగరం. ఇక్కడికి వెళ్లి ఈ వేసవి సెలవులను బాగా ఆహ్లాదంగా గడపవచ్చు. ఈ నగరం చుట్టూ కాంచన్‌జంగా శ్రేణి, అందమైన తేయాకు తోటలు ఉన్నాయి. డార్జిలింగ్‌లో వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటుంది. నగరం చుట్టూ ఉన్న పచ్చని తోటలు, అడవుల గుండా రైలు ప్రయాణం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు ఇదొక సుందర ప్రదేశమనే చెప్పవచ్చు.
ఔలి: మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ స్కీ గమ్యస్థానాలలో ఔలి ఒకటి. ఇది యాపిల్ తోటలు, పైన్ చెట్లకు నిలయం. ఔలిలో ట్రెక్కింగ్, స్కీయింగ్, రోప్‌వే రైడింగ్, వివిధ అడ్వెంచర్ ఈవెంట్లకు వెళ్లవచ్చు. అంతేకాదు, ఆహ్లాదకరమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు. అడ్వెంచర్లను ఇష్టపడే వారు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు.
మున్నార్: కేరళలోని పశ్చిమ కనుమల మీద ఉన్న ఒక సుందరమైన పర్యాటక ప్రదేశం. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. వేసవి అంతా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది పచ్చని కొండలతో చుట్టుముట్టిన ప్రాంతం. మున్నార్ ప్రాంతం వృక్షజాలం, జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది.
షిల్లాంగ్: మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఈశాన్య ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ చూడడానికి పచ్చటి పరిసరాలు, సరస్సులు, జలపాతాలు ఉన్నాయి. షిల్లాంగ్‌లో ఎలిఫెంట్ ఫాల్స్, షిల్లాంగ్ పీక్, స్వీట్ ఫాల్స్, ఉమియం లేక్ వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇది వేసవికి అనువైన అద్భుతమైన పర్యాటక నగరం.
లడఖ్: ఉత్తర భారతదేశంలోని ముఖ్యమైన హిల్ స్టేషన్లలో లడఖ్ ఒకటి. నేటి యువతలో చాలా మందికి లడఖ్ ఒక కల. దక్షిణాదిలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్తరాదికి పర్యాటకం కోసం వెళ్ళడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం. ఎత్తైన పర్వత శ్రేణుల్లో భాగం కావడంతో ఇక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఇక్కడ చాలా సాహసాలు చేయవచ్చు, టిబెటన్ సంస్కృతిని ఆస్వాదించవచ్చు. జాన్స్కర్ వ్యాలీ, పాంగ్కాంగ్చో లేక్, చో మోరిరి, హెమిస్ నేషనల్ పార్క్‌లలో విహరించొచ్చు.