Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1999లో ఒరిస్సా ప్రాంతాన్ని కన్నీళ్ళతో ముంచిన తుఫాను పదివేల మంది ప్రాణాలను హరించడమే కాకుండా, ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. ఇప్పటికీ ఆ విషాదాన్ని మోస్తూ, భరిస్తూ, జీవిస్తున్న వారు చాలా మంది ఒరిస్సా రాష్ట్రంలో కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటి ప్రకతి వైపరిత్యాలను తట్టుకుని జీవితాన్ని పునః ప్రారంభించాలని ఆశపడ్డ వారికి, మానవ స్వార్ధం పెద్ద అడ్డుగోడగా నిలుస్తుంది. కొన్నిసార్లు భయంకరమైన ప్రకతి వైపరిత్యం కూడా మనిషి సాటి మనిషి మనసుకు చేసే గాయాల ముందు చిన్నదిగా అనిపిస్తుంది. తొంభై తొమ్మిదిలో వచ్చిన తుఫాను వైపరిత్యాన్ని దాటుకుని జీవించాలనుకున్న సామాన్య జనం ఎన్నో రాజకీయ, సామాజిక, లైంగిక, సాంస్కతిక, ఆర్ధిక అసమానతలను ఎదుర్కొంటూ తమ ఉనికి కోసం నిత్య పోరాటం చేయవలసి వచ్చింది. అటువంటి పరిస్థితులలో జీవించిన ఒక స్త్రీ కథ ''కథంతరా''. 2007లో వచ్చిన్ ఈ ఒరియా సినిమాలో అను చౌదరి పోషించిన పాత్ర పేరు కల్పన. ఈ సినిమా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా బహుమతులు గెల్చుకుంది. 1999లో వచ్చిన తుఫాను చేసిన భీభత్సం భయానకం. ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతంలో జీవిస్తున్న హిందూ బెంగాలీ శరణార్ధుల జీవితాలను ఇది మూలాలలో పెకిలించి వేసింది. దేశ విభజన కాలంలో తూర్పు బంగ్లాదేశ్ నుంచి భారతదేశం వలస వచ్చారు కల్పన పూర్వీకులు. ఆమె తండ్రి ఇక్కడే పుట్టి ఈ నేలనే తన జన్మ భూమి అనుకుని జీవించాడు. కాని అతను జీవించి ఉన్నంత కాలం అతన్ని పరాయివానిగానే చూసారు ఆ ఊరి వారు. అతనికి జన్మించిన కల్పనకు ఆ ఊరి తప్ప మరేమీ తెలీదు. మత్స్యకారుడైన భర్తతో ప్రశాంతంగా ఆ ఊరిలో జీవిస్తుండేది. ఈ సమయంలో ఆ ప్రాంతాన్ని ముంచెత్తుతుంది ఆ భయంకర తుఫాను. కల్పన కుటుంబంలో అందరూ మరణిస్తారు. కల్పన ఒక్కతే అనుకోకుండా బ్రతుకుతుంది. కొన ఊపిరితో ఉన్న ఆమె నీటీలో శవాలను గాలిస్తున్న వారికి దొరుకుతుంది. ఆమె చిన్నప్పటి స్నేహితుడు అక్షయ తప్ప మరెవ్వరూ పరిచయం లేని వ్యక్తుల మధ్య ఆమె ఒక రెస్క్యూ కాంప్‌లో కొంత సమయం గడుపుతుంది. కాంప్‌లో ఉన్నప్పుడే తల్లితండ్రులు చనిపోయిన ఒక చిన్న బిడ్డకు చేరువవుతుంది. కాని ఇంతలో ఆ బిడ్డను కొందరు వచ్చి దత్తతకు తీసుకువెళ్ళి పోతారు. కల్పన మళ్ళి ఒంటరిది అవుతుంది. గవర్నమెంటు తరుపున కొందరు, కొన్ని ఎన్.జీ.వోలు, కొందరు కార్యకర్తలు, వీరి పునరావాస కార్యక్రమాలు మొదలెడతారు. ఇలాంటి సందర్భం లోనే ఆమె ఫొటో ఒకటి పత్రికలో వస్తుంది. ఆమెను కలవడానికి, ఇంటర్వ్యూ తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. తనను ఓ మనిషిలా కాక ఒక వస్తువుగా ప్రత్రికలో రాసే కథకు సరిపోయే సరుకుగా చూసే వ్యక్తులను ఆమె కలవడానికి నిరాకరిస్తుంది.
కల్పన కాంప్‌లో ఉన్న సమయంలోనే ఆమెకు వదిన వరస అయ్యే రూప కూడ తుఫాను నుండి ప్రాణాలతో బయట పడిందని తెలుసు కుంటుంది. తన ఒంటరి జీవితానికి ఒక తోడు దొరికిందని సంతోషిస్తుంది. గవర్నమెంట్ అప్పటికే రూపకు కొంత పింఛను ఇస్తూ ఉంటుంది. ఒంటరిగా జీవించలేని రూప మరో వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. కాని అతను కేవలం ఆమెకు లభించే పించను కోసమే వివాహం చేసుకున్నాడని రూపకి తరువాత తెలుస్తుంది. అతన్ని భరించడం ఇక ఆమెకు తప్పదు. ఆమె అవస్థను మౌనంగా, సానుభూతితో చూస్తూ ఉంటుంది కల్పన. వీరికి ఒక రెండు గదుల ఇల్లు ఊరి చివర కట్టిస్తుంది ప్రభుత్వం. ఒంటరిగా ఉండే స్త్రీలను చులకనగా చూసే ఆ ఊరిలోని పోకిరి మూక అసభ్యమైన చూపులతో మాటలతో వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీటన్నిటి మధ్య, గతాన్ని పక్కకు తోసి జీవించాలని ప్రతి రోజూ పరిస్థితులతో యుద్ధం చేస్తుంది కల్పన. ఆమె తండ్రి బెంగాల్ ప్రాంతపు వాడయిన కారణంగా ఆమెకు రావలసిన పించను రాదు. దాని కోసం కల్పన అఫీసుల చుట్టూ తిరుగుతూ, ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ లోపు ఎన్.జీ.వో లు చూపిన చిన్న పనులు చేసుకుంటూ ఉంటుంది. రాత్రి పూట ఒంటరిగా ఉన్న ఆమె ఇంటిలోకి మగవారు దొంగచాటుగా వస్తూ, కిటికీలో నుండి ఆమెను గమనిస్తూ ఉంటారు. తాను పుట్టి పెరిగిన ఊరు తనది కానట్టు, ఆ మనుషులు తన వారు కానట్టూ, ప్రతి ఒక్కరిని అనుమానంగా చూస్తూ తనను తాను కాపాడుకుంటూ దేశం కాని దేశంలో ఉన్నట్లు ఆమె తాను అన్ని సంవత్సరాలు బ్రతికిన ఊరిలో ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది.
దీపాంకర్ బంగ్లాదేశ్‌లో పని చేస్తున్న ఒక రిపోర్టర్. తుఫాను భాదిత ప్రాంతాలను కవర్ చేయడానికి తన టీంతో ఆ ఊరు వస్తాడు. అందరిలాగే అంతకు ముందు పత్రికలో అనుకోకుండా వచ్చిన కల్పన ఫొటో కారణంగా ఆమె గురించి తెలుసుకుని ఆమెను ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటాడు. కాని అతను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కల్పన అతనితో మాట్లాడడానికి ఒప్పుకోదు. అప్పటికే ఈ ఇంటర్వ్యూలన్నీ చేసే వారి కోసం తప్ప తమకేం లాభం తీసుకురావని పైగా వీటి వలన వచ్చే తలనొప్పులనేకం అని కల్పన తెలుసుకొంటుంది. అందుకే ఆమె ఎవరితోనూ మాట్లాడనని భీష్మించుకుని కూర్చుంటుంది. దీపాంకర్ నిరాశతో వెళ్ళిపోతాడు. కాని కొన్ని నెలల తరువాత అతను అదే ప్రాంతానికి మళ్ళీ రావలసి వస్తుంది. ఈ సారి జీవన పోరాటంలో అలసిన కల్పన అతనికి కనిపిస్తుంది. అప్పటికే రూప భర్త మోసం తెలియడం, తన ఊరే తనను అనాధను చేయడం, ఇలాంటి అనుభవాలతో కల్పన నిరాశలో కూరుకుపోతుంది. దీపాంకర్ ఆమె అందానికి ముగ్దుడవుతాడు. ఆమెను వివాహం చేసుకుంటానని తనతో ఢాకా తీసుకువెళతానని చెబుతాడు. తన జీవితం ఎలాగూ బాగు పడదని కల్పనయినా ఈ పరిస్థితుల నుండి బయట పడితే చాలని అనుకుంటుంది రూప. రూప భర్త కల్పనపై కన్నేసిన విషయం కూడా వారిద్దరికీ తెలుసు. ఇలాంటి ప్రమాదాల నుండి తప్పించుకోవడానికయినా వివాహం చేసుకుంటానని వచ్చిన దీపాంకర్‌తో వెళ్ళిపొమ్మని రూప, కల్పనను బలవంత పెడుతుంది. కల్పన కూడా ఆ ప్రాంతం నుండి, బాధించే గతం నుండి తప్పించుకోవాలి అనుకుంటుంది. దీపాంకర్‌తో ఢాకా వెళ్ళిపోతుంది.
అక్కడికి వెళ్ళిన తరువాత కల్పన మొదటి రెండు రోజులలోనే తాను ఆ పరిస్థితులలో ఉండలేనని అర్థం చేసుకుంటుంది. తాను పుట్టిన ఊరు తనని నిరాదరించినా అక్కడ తనకు లభించిన కాస్త ప్రశాంతత కూడా మరెక్కడా తనకు దొరకదని ఆమెకు తెలుస్తుంది. ఢాకా ఆమెను భయపెడుతుంది. దీపాంకర్ తనను వివాహం చేసుకుని కెరియర్లో ఎదగాలని ప్రయత్నిస్తున్నాడని, ఒక తుఫాను భాధితురాలిగా, వితంతువుగా, తానెప్పటికీ అతని దష్టిలో కెరియర్‌కు ఉపయోగపడే కథ మాత్రమే అన్నది ఆమెకు అర్ధం అవుతుంది. తనతో ఫోటోలు దిగి అవి పబ్లిసిటి కోసం ఉపయోగించుకోవాలని చూసే దీపాంకర్ కేవలం వత్తిలో ఎదుగుదల కోసమే తనను వివాహం చేసుకో దలచాడని తెలిసినప్పుడూ ఇక అక్కడ ఉండలేకపోతుంది. తిరిగి ఒంటరిగా తన ఊరు చేరుకుంటుంది.
ఇప్పుడు ఆమె ఊరిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్ధులుగానే ఆమెను ఆమెలాంటి వారిని ఎంచి, వారిని ముప్పై రోజులలో తిరిగి బంగలాదేశ్ వెళ్ళిపొమ్మని గవర్నమెంటు ఆర్డర్ రిలీజ్ చేస్తుంది. ఎన్ని విషమ పరిస్థితులను ఎదుర్కుని అయినా తాను అక్కడే ఉంటానని, తన జన్మభూమి నుండి తనను మరెవ్వరూ వేరు చేయలేరని ఒంటరి పోరాటానికి నిశ్చయించుకుంటుంది కల్పన. అయితే ఇక్కడ సినిమాను కొంత నాటకీయంగా ముగిస్తారు దర్శకులు హిమాంశు శేఖర్. కల్పనను నీటి నుంచి తుఫాను సమయంలో రక్షించిన అక్షయ ఆమెను ఇంతకాలం ప్రేమిస్తూ ఉన్నాడని తెలుసుకుని అతనితో కలిసి జీవించాలని కల్పన తీసుకునే నిర్ణయంతో కథను ముగిస్తారు దర్శకులు. ఈ పాయింట్ అంత సహజంగా అనిపించదు. ముగింపు ఇలా ఉండకుండా ఉంటే బావుండును అనిపిస్తుంది. ఇది సినిమాలోని రియలిజాన్ని దెబ్బతీసినట్లు అనిపిస్తుంది.
ఈ సినిమాకు హిమాంశు శేఖర్ కథను సమకూర్చి దర్శకత్వం వహించారు. తుఫాను బాధితుల జీవితాలను మానవతాకోణంలో చూపించే ప్రయత్నం చేసిన మంచి సినిమా ఇది. ఇటువంటి వైపరిత్యాల తరువాత, బాధితులతో వారికి సహాయం అందించే నెపంతో, సమాజం ప్రవర్తించే విధానంలో చాలా హిపొక్రసి ఉంటుంది. వారి మనసుకు అయిన గాయాన్ని పించన్ల పేరుతో, మారు వివాహాల పేరుతో, దత్తత పేరుతో చుట్టూ ఉన్న వారు శాసిస్తూ ఉంటారు. ఇక ఎన్.జీ.వోల పేరుతో వచ్చేవారు వీరిని చూసే విధానంలోనే పెద్ద లోపం ఉంటుంది. వారి కథలకు ఆ బాధితులు పనికివచ్చే ముడి సరుకులా కనిపిస్తారు తప్ప, వారు గాయపడిన మనసుతో అల్లాడుతున్న వ్యక్తులుగా ఎవరికీ తోచదు. బాధితుల పేరు చెప్పుకుని తమ ఈగోలని, ప్లాల్స్ ప్రిస్టైజ్ని, తప్తి పరుచుకుంటూ తమ వత్తి పరంగా తాము ఎదగాలనే ప్రయత్నమే తప్ప, తాము మనుష్యులతో వ్యవహరిస్తున్నాం అన్న కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూల పేరుతో వారి కథలను కన్నీళ్లను తమ ఉన్నతికి మెట్లుగా మార్చుకుందామని ప్రయత్నించే వీరంతా ఈ బాధితులలో మనుష్యుల పట్ల ఏవగింపుని కలిగిస్తారు.
ఇక సర్కారు ఇచ్చే పించన్లు ఈ స్త్రిలకు వరమవుతాయో శపమవుతాయో చెప్పలేం. ఆ డబ్బు కోసం వారిని ఉపయోగించుకోవాలని ప్రయత్నించేవారు ఈ వయసులో ఉన్న వితంతువుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదే ఊరిలో ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వారు మరొకరి దయాధర్మం పై బ్రతకడం ఎంత కష్టమో ఎవరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. అసలు అలాంటి ఆలోచనే చుట్టూ ఉన్న వారికి రాదు. ఇక ఈ వైపరిత్యాలనుండి బయటపడి ఒంటరయిన మహిళల జీవితం ఇంకా దుర్భరంగా మారుతుంది. వీరికి ఎటువంటి రక్షణ దొరకదు. ఇక ఈ కథలో కల్పనకు శరణార్ధి అనే మరో అదనపు కష్టం కూడా తోడవుతుంది. అయినా ఆమె చివర్లో అదే ఊరిలో ఉండి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచు కోవడానికి వ్యవస్థతో పోరాడాలని నిశ్చయించుకుంటుంది. తానెప్పుడూ చూడని, వినని దేశానికి తన తాత అక్కడి వాడు అన్న మిషతో పంపించే ప్రయత్నం చేస్తూ, తుఫాను చేసిన గాయాలను, మిగిల్చిన ఒంటరితనాన్ని మించి, తనదంటూ అస్థిత్వం కూడా లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్న సమాజాన్ని రాజకీయ పరిస్థితులను ఒంటరిగా ఎదుర్కోవడానికి కల్పన సిద్ధపడుతుంది.
కల్పన కథను పోలిన ఎన్నో కథలు ఈ తుఫాను బాధితుల మధ్య కనిపిస్తాయి. ఏ మాత్రం సహకరించని పరిస్థితులు, వ్యక్తుల మధ్య అస్థిత్వ పోరాటానికి సిద్దపడిన కల్పనలోని ఆత్మవిశ్వాసం స్పూర్తిదాయకంగా ఉంటుంది. ఆమెకు దీపాంకర్ రూపంలో ఈ కష్టలనుండి పారిపోయే అవకాశం వచ్చినా ఆమె తిరిగి వస్తుంది. దీపాంకర్ దుర్మార్గుడు కాడు. ఈ వ్యవస్థ నిర్మించిన మరో మనిషి. కల్పన ద్వారా కిరెయర్లో ఎదగాలనే అనుకుంటాడు. చాలా మంది వివాహం పేరుతో జీవితంలో ఆర్ధికంగా, సామాజికంగా ఎదుగుదలనే ఆశిస్తారు. దీపాంకర్ కూడా కల్పన అనే ఒక వితంతువును వివాహం చేసుకున్నాననే విషయాన్ని తన ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని చూసాడు. కాని కల్పన ముడి సరుకుగా మిగిలిపోవాలని అనుకోదు. తాను పుట్టి పెరిగిన ఊరిలోనే తన ఉనికి వెతుక్కోవాలని చూస్తుంది. తన అస్థిత్వాన్ని కాపాడు కోవాలని, తన జీవితాన్ని ఆత్మగౌరవంతో నిర్మించుకోవాలని నిశ్చయించుకుంటుంది. అందుకే దీపాంకర్ తో వివాహం కాదని మళ్ళీ తన సమస్యల జీవితం వైపుకే మరలి వస్తుంది. భౌతికమైన సుఖప్రదమైన జీవితం, సామాజిక భద్రత కన్నా తన అస్థిత్వంలోనే తన ఉనికి ఉందని ఆమె తేల్చుకుంటుంది. జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది.
కల్పన పాత్రను దర్శకుడు చాలా బాగా మలిచారు. సినిమా చూస్తున్నంత సేపు ఆ పాత్ర పట్ల గౌరవం కలుగుతుంది. ఆమె తీసుకునే నిర్ణయం ఆమె ఆలోచన, ఆమె ప్రదర్శించే నైతిక బలం చూసి ఆనందిస్తాం. గొప్ప సినీ స్త్రీ పాత్రగా కల్పన గుర్తుకొస్తూనే ఉంటుంది.
- పి.జ్యోతి, 9885384740