Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలాగ పెద్ద పెద్ద పట్నాలు పల్లెలు, అడవులు, వాగులు, వంకలు, డొంకలు చూసి వద్దామని బయల్లేరేరు నారదుడూ తుంబురుడూ.
వీళ్ళిద్దరి పేర్లు ఇవే గానీ వీళ్లు పురాణ పురుషులేం కాదు. ఇప్పటి మామూలు మనుషులే.
'ఈ పట్నం చాలా పెద్దదిలా కనిపిస్తున్నది' అన్నాడు నారదుడు చెవిలో చూపుడు వేలు పెట్టి కెలుకుతూ.
'అవును సుమా! ఇక్కడ చూడవలసిన వింతలూ విశేషాలు చాలా ఉన్నట్టున్నాయి' అన్నాడు తుంబురుడు తలని ఐదు వేళ్ళతో గోక్కుంటూ.
'తలని అలాగ బరబరా గీకేయకు. ఉన్న నాలుగు పోచలూ రాలిపోగలవు. తల నొప్పిగా ఉంటే వేడి వేడి టీ తాగుదాం పద' అంటూ ఎదురుగ్గా కనిపించిన 'కేఫ్' వైపు నడిచాడు నారదుడు. అనుసరించాడు తుంబురుడు.
ఇద్దరూ రెండు కప్పులు వేడి వేడి టీ గొంతులో పోసుకుని సేదతీరారు. డబ్బులివ్వబోతే హౌటేలు వాడు తిరస్కరించాడు. 'మేం టిఫిన్లకి డబ్బు తీసుకుంటాం కానీ టీ కి తీసుకోం. అలా గోడ మీదికి చూడండి' అన్నాడు.
ఇద్దరూ తలలతో పాటు కళ్ళూ పైకి ఎత్తి చూశారు. గోడ మీద ఫ్రేం కట్టిన పెద్దఫొటో ఆ ఫొటోలో కదలకుండా ఓ పెద్ద మనిషీ ఉన్నారు.
'ఎవరాయన?' అనడిగారిద్దరూ రెండు గొంతులతో ఏక శబ్దంతో.
'ఆయన తెలీదా? ఆయనే రుక్మాంగదుడు. ఈ పట్నపు ప్రభువు. ఆయన పుణ్యమా అని జనం ఉచితంగా టీలు తాగుతున్నారు' అన్నాడు హౌటల్ యజమాని.
'అదేవిటి?' అని అసంకల్పితంగా మళ్ళీ తల గోక్కున్నాడు తుంబురుడు.
'వేడి తేనీటి పథకం... ఈ పథకం ఆ మహానుభావుడి చలవే' అంటూ డబ్బు లెక్క చూసుకోడం మొదలెట్టాడు హౌటల్ వోనర్.
మిత్రులిద్దరూ బయటకు వచ్చారు. మెల్లిగా రుక్మాంగదుడి పథకాల తడాఖా తెల్సి వచ్చింది ఇద్దరికీ. మధ్యాహ్న భోజన పథకంలో ఉచితంగా మెక్కారు. సాయంత్రం వేళ కాస్త ఉషారుగా మజా చేసుకుందామని బారులో దూరారు. పెగ్గు తాగితే పెగ్గు ఫ్రీ అన్నాడు బేరర్. అదేమిటంటే గోడమీది రుక్మాంగదుడి ఫొటో చూపించాడు. ఉచిత మందు పంపిణీ పథకం అని కిసుక్కున్నవ్వాడు బేరర్.
వీళ్ళిద్దరికీ ఎదురుగ్గా వచ్చి కూచున్న 'ప్రభుత్వ పోషకుడు' ఒకడు రెండు రౌండ్లు తర్వాత పట్నం చరిత్రా భూగోళం విపులంగా వివరించాడు నారదుడికీ తుంబురుడికీ జమిలిగా. ఉచిత వేడి తేనీటి పథకం, ఉచిత మందుల పంపిణీ పథకంతో పాటు స్త్రీల పథకం, బాలల పథకం, యువకుల పథకం, నిరుద్యోగుల పథకం, వృద్ధుల పథకం, బియ్యపు పథకం, పాల పథకం, పెరుగు పథకం, పెళ్ళి పథకం, చావు పథకం, దగ్గు పథకం, తుమ్ము పథకం, తలనొప్పి పథకం, ఇలాగ లెక్కకు మించినన్ని పథకాలతో రుక్మాంగదుడు పట్నానికి తిరుగులేని ప్రభువయ్యాడని ముద్దుముద్దుగా మందమైన లుక్తో వివరించడంతో పాటు ఇక్కడ జనానికి చేయడానికి పన్లేమీ లేవని అన్నీ ఉచితంగా దొరకడం వల్ల టీవీలు, మొబైళ్ళ చాటింగులూ వాట్సప్పుల్లో కులాసాగా గడిపేస్తున్నారని సెలవిచ్చాడు.
'ఆహా! ఏమి భాగ్యము ఈ నగరములోనే మనమూ సెటిలైపోతే పనీ పాటా లేకుండా ఉచిత పథకాలను అనుభవిస్తూ బాగా బలిసి పోదాం' అన్నాడు నారదుడు. బలవడానికి తనకూ అభ్యంతరం లేదన్నాడు తుంబురుడు.
విశాలమైన మైదానంలో ఎన్నికల ప్రచార సభ జరుగుతున్నదని విని రుక్మాంగదుడ్ని చూద్దామని వెళ్ళారు మిత్రులిద్దరూ.
వేదిక మీది మైకు ముందున్న ముఖాన్ని ఫొటోల్లో చూసి ఉండటాన్ని రుక్మాంగదుడిగా తేల్చుకున్నారు.
'అమ్మలారా! అయ్యలారా! అక్కలారా! చెల్లెళ్ళరా అందరికీ వందనాలు. ఎన్నికలు రాబోతున్నవి. నన్ను పదవసారి ఎన్నుకోవల్సిన బాధ్యత మీ అందరిదీ. ఇది వరకే అనేక అనుచిత క్షమించాలి. ఉచిత పథకాలు ప్రవేశపెట్టాను. అయితే ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా మీకు కడుపు నిండదు నాకు తెల్సు. అందుకే ఈ సారి ఒక సరికొత్త ఆలోచన చేశాను. అది వింటే ఇక మీరు నన్నే శాశ్వతంగా ఎన్నుకుంటారు. 'అల్లా ఉద్దీన్ అద్భుతదీపం' గురించి వినే ఉంటారు. మీరు ఏది కోరితే అది చిటికెలో అందిస్తుంది. అది మీకు అందితే పథకాలతో అసలు పనే ఉండదు. అందుకే దేశ విదేశాల నుండి సైంటిస్టులను, మంత్రవేత్తలను పిలిపించాను. వారు ఒకటికాదు పట్నంలో ప్రతి ఇంటికీ ఒక అల్లాఉద్దీన్ అద్భుత దీపం తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇంటింటికో అద్భుత దీపం అందిస్తాం! దీపం మీకు ఓటు నాకు! అంటూ ఉపన్యాసం ముగించాడు రుక్మాంగదుడు. చప్పట్లు మోగాయి.
నారదుడు, తుంబురుడు అల్లాఉద్దీన్ అద్భుత దీపం కోసం ఆ పట్నంలోనే సెటిలైపోయారు.
- చింతపట్ల సుదర్శన్, 9299809212