Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన న్యాయశాస్త్రం తప్ప రాజనీతి శాస్త్రం చదవలేదు కానీ అపర చాణక్యుడు. ఆయన ఆర్ధిక శాస్త్రం అభ్యసించలేదు అయినా అందులో పేరు మోసిన పండితులను అబ్బురపరిచాడు. ఆయన భాష శాస్త్రవేత్త కాదు. అయినా పదికి మించిన భాషలలో పండితుడు. తన అనువాదాలతో 'ఔరా' అనిపించాడు. ఆయన పట్టు పరుపుల్లో పెరగలేడు. సంక్లిష్ట స్థితిగతుల నడుమ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. విద్య కోసం సరిహద్దులు దాటాడు. ఉద్యమం కోసం ఆదర్శాల బాటలు తొక్కాడు. అతనే అతనే.. పాములపర్తి వెంకట నరసింహారావు. ''మౌనేన కలహం నాస్తి''కి సరైన చిరునామా. మన ప్రధానమంత్రి నరసింహారావు.
జననం, విద్య
ఆంధ్ర దేశంలో ప్రజల ఇంటిపేర్లు సాధారణంగా వారు వలస వచ్చిన ఊరి పేర్లతో ఉంటాయి. కొంతమందికి కులాల పేర్లు, వంశ నామాలూ ఉంటాయి. ఇక్కడ పాములపర్తిని ఇంటి పేరుగా కల్గిన నరసింహారావు గారి పూర్వీకులు సిద్దిపేటలోని పాములపర్తికి చెందినవారు. వీరు ఈ గ్రామం నుండి హుజురాబాద్ తాలుకాలోని వంగరకు వలస వెళ్ళారు. పి.వి. నరసింహారావు ఇక్కడే రుక్మాబాయమ్మ, సీతారామారావులకు 1921 జూన్ 28 న జన్మించాడు.
వీరి గురువు రామయ్య పంతులు. ఇతను తన అక్క గారి ఊరైన వరంగల్లులోని వేలేరులో కొంతకాలం చదివాడు. హైస్కూలు విద్యను వరంగల్లులో పూర్తి చేశాడు. ఇక్కడే పి.వి.కి కాళోజి, పాములపర్తి సదాశివరావులు పరిచయమయ్యారు. 1938లో జరిగిన హైదరాబాదు వందేమాతర ఉద్యమం కారణంగా మహారాష్ట్రలోని పూణే ఫెర్గుసన్ కాలేజిలో చేరాడు. అనంతరం నాగపూరులో న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. భారత ఉపరాష్ట్రపతిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ హిదయతుల్లా పి.వి.కి పాఠాలు చెప్పాడు. న్యాయవిద్య అయ్యాక బూర్గుల రామకష్ణారావు వద్ద ప్రాక్టిసు చేశాడు.
స్వాతంత్య్రోద్యమం
హైదరాబాదు సంస్థాన స్వాతంత్య్రోద్యమంలో ఉస్మానియా వందేమాతర ఉద్యమం అనేది ఆంక్షల మధ్య నుండి ఉద్భవించిన యువ జనోద్యమం. ఫలితంగా అనేక మంది కళాశాల బహిష్కరణకు గురయ్యారు. ఈ సంఘటనతో విద్యార్థుల చదువూ ఆగలేదు. లేవనెత్తిన ఉద్యమమూ ఆగలేదు. పైగా ఉధతమైంది. పి.వి. అప్పటికే కాంగ్రెసు కార్యకర్తగా చురుకుగా ఉన్నాడు. ఈ సమయంలోనే, ప్రజలలో రేగిన స్వాతంత్య్ర కాంక్షను, స్వరాజ్య భావనను అంతం చేయుటకు రజాకార్లు, పోలీసులు నిజాం ఆజ్ఞ మేరకు ఉద్యమ ప్రాంతాలలో శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యమ కారులపై హింసాత్మకంగా విరుచుక పడ్డారు. అయినా ఉద్యమ ప్రాబల్యం తగ్గకుండా ఇంకా రెట్టింపు అయ్యింది. ఈ హింసాత్మక దాడు లకు వెరవకుండా కాంగ్రెసు కార్యకర్తలు, కమ్యూనిస్టులు, విముక్తిని కోరే ఇతర ఉద్యమకారులు నిజాం రాష్ట్ర సరిహద్దుల్లో, సంస్థానం లోపల క్యాంపులు నిర్వహించి ప్రతిదాడులకు పాల్పడ్డారు.
''చాందాలో కె.వి. నరసింగరావు ఆధ్వర్యంలో సరిహద్దు పోరాట శిబిరం ఏర్పాటైంది. చాందా పోరాట శిబిరంలో మూడు వందల మంది కాంగ్రెసు కార్యక్తలు భాగస్వాములు అయ్యారు. వారిలో పి.వి. ఒకరు'' (విలక్షణ పి.వి. జీవితం, పుట19) ఈ పోరాట సమయానికి పి.వి పాతికేళ్ళ ప్రాయం దాటిన యువకుడు. ఇతనికి ఆదర్శం, గురువు అయిన రామానంద తీర్థ ప్రభావానికి లోనయి తన దర్శకత్వంలో ముందుకు సాగాడు. తన ఆత్మకథాత్మక నవలలో ఈ పోరాట కాలం నాటి సంఘటనలను తెలిపాడు. ఈ నవలలోని కథానాయకుడు ఆనంద్ రూపంలో పి.వి. మనకు దర్శనమిస్తాడు.
రాజకీయ జీవితం
పి.వి మంథని నుండి నాలుగు సార్లు అసెంబ్లీకి వెళ్ళాడు. 1962లో తొలిసారి అమాత్యుడయ్యాడు. ఇలా రాజకీయ భవిష్యత్తు విస్తతమవుతున్న కొద్దీ న్యాయ, సమాచార, వైద్య- ఆరోగ్య శాఖల మంత్రిగా వ్యవహరించాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలోనే అనూహ్యంగా 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయాలలో వైరం లేకుండా దశాబ్దాల వరకు కొనసాగి భారత ప్రధానమంత్రి అయ్యాడు. అది వరకు లేని భారత రాజకీయ చరిత్రలో ఆర్ధిక సంస్కరణలు చేపట్టి అనేకుల విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎవరికీ తల వంచకుండా, ఎవరిని వంచించకుండా అపర చాణక్యుడిలా తన వ్యూహాలను రచించి రాజకీయ క్షేత్రంలో అమలు పరిచాడు. ఇప్పుడు కొనసాగుతున్న భారత ఆర్ధిక వ్యవస్థకు పి.వి. చేపట్టిన సంస్కరణలే మూలమని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
రచనలు
వీరి స్వగ్రామంలోనే 1970 దశాబ్దంలో తన ఆత్మకథాత్మక నవలైన ''ఇన్ సైడర్''ను ప్రారంభించాడు. విశ్వనాథ సత్య నారాయణ రాసిన 'వేయి పడగలు' నవలను 'సహస్రఫణ్' పేరుతో హిందీ అనువాదం చేశాడు(1968). ఈ నవల వెలిచాల కొండలరావు స్ఫూర్తితో ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యింది. 'హరి నారాయణ ఆప్టే' అనే మరాఠి రచయిత రాసిన ''పన్ లక్ష్యత్ కోన్ ఘేతో'' అనే రచనను కేంద్ర సాహిత్య అకాడమీ కోరిక మేరకు పి.వి. ''అబలా జీవితం'' పేరుతో అనువాదం చేశాడు. 'మాకొద్దీ బతుకు, గొల్ల రామవ్వ' అనే కథలతో పాటు పలు వ్యాసాలూ రాశాడు. పత్రికను నడిపాడు. ఈ 'గొల్ల రామవ్వ' కథలో జాతీయోద్యమ పోరాటంలోని దాడిని తెలిపాడు. సాహిత్యంలో వానమామల వారు సుప్రసిద్ధులు. ఈ వరదాచార్యులు, జగన్నాథచార్యులు ఇద్దరు సోదరులు విడివిడిగా రాసిన వ్యాసవాణి, రైతు రామాయణం అనే కావ్యాలను పి.వి. కే అంకితమిచ్చారు. అలాగే సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త అయిన భద్రిరాజు కష్ణమూర్తి పి.వి. కి గల సాహితీ మిత్రుల్లో ఒకరు. ఇతను రాసిన ''భాష-సమాజం-సంస్కతి'' అనే గ్రంథాన్ని కూడా పి.వి. కే అంకిత మిచ్చాడు.
తెలుగు వాడి రాజకీయ ముద్రను పార్లమెంటులో వేసి, రాజకీయ కురువద్దులచే శభాష్ అనిపించుకున్న అపర ఠీవి మన పి.వి.
- ఘనపురం సుదర్శన్,
9000470542