Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది ఓ ఊరు. ఊరంటే మరీ పల్లెటూరేం కాదు. ఊళ్ళో ప్రవేశించి, ఊరు దాటే వరకూ ఉంటుంది ఓ పొడవాటి రోడ్డు. ఆ రోడ్డు మధ్య నాలుగు వేపులకూ నాలుగు పిల్ల రోడ్లు ఊళ్ళోకి వెళ్తుంటువి.
అక్కడ ఉందది. ఆ నాలుగు రోడ్ల కూడలిలో అదొక విగ్రహం. రాతి చప్టా మీద అంత పొడుగూ పొట్టీ కాని మనిషి నిలబడి ఊళ్లోకి వచ్చే వాళ్ళని సూటిగా చూస్తుంటాడు. ఆ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తయి కళ్లు. ముఖం నుంచి బయటకి వచ్చేట్టుంటయవి. ఉరిమి చూస్తుంటయి.
ఆ విగ్రహం ఊళ్ళో వాళ్ళు చందాలు వేసుకుని భక్తితో కట్టించినదీ పెట్టించినదీ కాదు. అసలా విగ్రహంలో ఉన్న మనిషంటే ఊళ్ళో వాళ్ళందరికీ మామూలు భయం కాదు.
నిజానికి ప్రజలు అభిమానించే గౌవరించే ప్రేమించే వారి విగ్రహాలు పెడ్తులంటారు. కానీ ఆ ఊరి ప్రజలకు ఆ విగ్రహం మనిషి మీద అభిమానం, గౌరవం, ప్రేమ అనేవి లేనే లేవు.
ఆ విగ్రహం తాలూకు మనిషి పరమ దుర్మార్గుడు. అతడు చెయ్యని అకృత్యం లేదు. ఆ మనిషి చేత హింసించబడని కుటుంబమంటూ లేదు. ఇతరుల భూములు లాక్కోవడం, ఆక్రమించడం, ఇచ్చిన రుణాలకు వడ్డీ కింద ఇళ్ళు లాక్కోవడం తట్టుకోలేనంత ఆగ్రహం వచ్చినప్పుడు గుడిశెలూ, గడ్డి వాములు తగలబెట్టించడం వంటివి ఎన్నో చేసి చచ్చాడు. 'హమ్మయ్య' అనుకున్నారు జనం. ఎంత మంది ఉసురు పోసుకున్నాడో, ఎందరు స్త్రీల మంగళ సూత్రాలు పుటుక్కుమనిపించాడో ఊరికి పట్టిన పీడ వదిలిపోయింది అనుకున్నారు.
అయితే ఈ మాట ఆయన కొడుకులిద్దరూ, ఆయన దగ్గర పనిచేసిన రౌడీలూ అనుకోలేదు. తమ తండ్రి ఆ ఊరును మకుటుం లేని మహారాజులా ఏలుకున్నాడని ప్రజల్ని క్రమశిక్షణలో ఉంచాడని, అటువంటి మహానుభావుడికి ఐఊరి నడి మధ్యన అందరికీ కనపడేలా విగ్రహం పెట్టించాలని అనుకున్నారు కొడుకులు. అలా ఆ దుర్మార్గుడు నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహమై నిలబడ్డాడు. ఆయన చేత హింసించబడ్డ జనం దారంట పోయేవాళ్ళు ఆ విగ్రహం వేపు ఈసడింపుగా చూసేవారు. బూతులు తిట్టుకుంటూ వెళ్ళేవారు.
ఒకానొక నాటి ఉదయాన్ని ఎక్కడ్నించి వచ్చిందో ఓ కాకి. పెద్ద మనిషని పట్టించుకోకుండా విగ్రహం తల మీద రెట్ట వేసింది. ఆ తర్వావ మరొకటి తర్వాత ఇంకొకటి ఇలాగ అనేక కాకులు గుంపులు గుంపులుగా వచ్చి విగ్రహం ముఖం కనిపించకుండా చేశాయి.
కొడుకులకు కోపం వచ్చింది. అనుచరులకు ఆగ్రహం వచ్చింది. కాకులన్నిటినీ చంపెయ్యాలనుకున్నారు. ఊళ్ళోకి కాకులు అడుగు పెట్టకుండా రెట్టలు వెయ్యకుండా కట్టడి చెయ్యాలనుకున్నారు. వారి ధాటికి కొన్నాళ్ళు కాకులు కనపడకుండా పోయేవి. విగ్రహాన్ని శుభ్రం చేసి రంగు వేసింతర్వాత మళ్ళీ కావు కావుమంటూ వచ్చి రెట్టల వర్షం కురిపించేవి.
కొడుకులూ అనుచరులూ, పెద్ద మనుషులూ, మామూలు మనుషులు విగ్రహం దగ్గర గుమిగూడారు. విషయం సీరియస్గా చర్చించారు. కొందరు విగ్రహం చుట్టూ విగ్రహం పైనా ఇనుప కంచె బిగించాలనుకున్నారు. కొందరు అలవాటయిన కాకులు రెట్టలు ఏదో విధంగా వెయ్యక మానవు కనుక విగ్రహాన్ని ముక్కలు చేసి ఆ ముక్కల్ని మరలో వేసి పొడి చేసి దేశంలోని పవిత్ర నదులలో ఆ పొడిని కలిపితే పెద్దాయనకు స్వర్గ ద్వారాలు తెర్చుకుంటాయని ఆయన ఆత్మ శాంతిస్తుందని సలహా యిచ్చారు.
కొడుకులకు ఈ మాట నచ్చలేదు. తండ్రి విగ్రహం తొలగించడానికి ససేమిరా అన్నారు. ఈ విషయం మీద ఊరి చివర ఆశ్రమంలో స్వామీజీ సలహా తీసుకుందాం అన్నారెవరో. కొడుకులూ అనుచరులూ సరే అన్నారు. స్వామీజీని సగౌరవంగా విగ్రహం దగ్గరికి రప్పించారు. విగ్రహాన్ని తదేకంగా చూసిన స్వామీజీ కళ్ళు మూసుకుని దివ్యదృష్టిని సారించారు. తర్వాత ఇలా సెలవిచ్చారు. 'కొడుకులూ, తండ్రి మీద ప్రేమతో గౌరవంతో విగ్రహం చేయించారు కాని ఆ విగ్రహానికి కాకి రెట్టల బెడద తప్పడం లేదు. ఇందుకు కారణం మీ నాన్న గారు చేసిన అకృత్యాలే. ఆయన వల్ల చచ్చిన వారి ఆత్మలు కాకులై పగబట్టి విగ్రహం మీద విరామం లేకుండా రెట్టలు కురిపిస్తున్నవి. అందువల్ల విగ్రహాన్ని కూల్చి ముక్కలు చేసి పొడి చేసి నదుల్లో కలపండి. లేకపోతే ఆయన ఆత్మ రెట్టల క్షోభ అనుభవించాల్సిందే' అన్నాడు.
కొడుకులకు స్వామిజీ చెప్పింది నిజమేమోననిపించింది. విగ్రహం కూలింది. ముక్కలయింది. పొడి నదుల్లో కలిసింది. విగ్రహంలో ఉండిన చెడ్డ మనిషి కారణంగా సర్వస్వం కోల్పోయి ఎక్కడెక్కడో తిరిగి స్వామీజీగా మారి ఆ ఊరి చివర ఆశ్రమంలో ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది?
అదేం చిత్రమోకాని విగ్రహం కూల్చేయబడిన తర్వాత ఆ ఊళ్ళో కాకులు పెద్దగా కనిపించలేదు. కావ్ కావ్లు వినిపించలేదు.
- చింతపట్ల సుదర్శన్, 9299809212