Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలూ! 'సినారె' తఖల్లుస్తో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న 'మహాకవి' పూర్తి పేరు డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి. నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ పక్కనే ఉన్న హనుమాజీ పేటలో జులై 29, 1931న పుట్టారు. సింగిరెడ్డి బుచ్చమ్మ-మల్లారెడ్డి సినారె తల్లితండ్రులు. ఏడవ తరగతి చదువుతున్నప్పుడే 'ఒకనాడు ఒక నక్క, ఒక అడవి లోపల / పొట్టకోసరమెటో పోవుచుండె' పద్యం రాసిన సినారె సినీ కవిగా మూడు వేలకు పైగా సినిమా పాటలు రాశారు. ఎనభై అయిదుకు పైగా కావ్యాలు రాశారు. 1989లో 'విశ్వంభర' కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం 'పద్మభూషణ్'తో సత్కరించింది. రెండు విశ్వవిద్యాలయాలకు వైస్-చాన్స్‌లర్‌గా పనిచేసి 1997లో రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డారు. 1993 నుండి చివరిశ్వాస వరకు తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులుగా సేవలందించారు.
విద్యార్థిగా ఉర్దూలో విద్యాభ్యాసం చేసిన సినారె బాల్యం నుండే తెలుగులో రచనలు చేశారు. తొలి కావ్యం 'నవ్వని పువ్వు' నుండి 'కలం అలిగింది' వరకు చేసిన రచనల్లో పిల్లల కోసం రాసినవి అనేకం ఉన్నాయి. వేలాది సినిమా పాటు రాసిన సినారె సినిమా పాటల్లో బాలల కోసం, బాలల గురించి రెండు వందలకు పైగా గేయాలు రాశారు. బాల్యం నుండే పిల్లలకు సంస్కారాన్ని, విలువలను నేర్పేందుకు డా.దాశరథితో కలిసి పిల్లల కోసం 'బొమ్మల బాల భాగవతం', 'బొమ్మల బాల రామాయణం' రాశారు. పెద్ద పిల్లలకు, పెద్దలకు భాగవత భక్తిసుధను, పోతన పద్యాల మాధుర్యాన్ని అందించేందుకు 'మందార మకరందాలు' పేరుతో పోతన పద్యాలకు వ్యాఖ్యానం రాశారు.
బాలల కోసం సినారె గేయాలతో పాటు పలు నృత్య, గేయ నాటికలను రాశారు. సినారె రాసిన 'సమతా ఫలం' నాటికను 1953లో తెలంగాణ రచయితల సంఘం, సిరిసిల్ల శాఖ ప్రచురించిన 'చిరుగజ్జెలు' సంకలనంలో అచ్చువేసింది. తరువాత దీనినే ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమి 'తోటతల్లి' పేరుతో ఏడిద కామేశ్వరరావు సంపాదకత్వంలో తెచ్చిన సంకలనంలో చేర్చి ప్రచురింది. ఇందులో రాము, సోము, భీములతో పాటు తోట కూడా ఒక పాత్రే. ఆ పాత్ర ద్వారా మనుషులందరూ సమానమనే మాటను చాటిచెబుతారు సినారె. అంతేకాకుండా తోట భూమాతకు సంకేతంగా కూడా అనుకోవచ్చు. కథలో భూమాత ఫలాల మీద అధికారం నాదే అని భీము విర్రవీగుతాడు. చివరకు తోట చేసిన బోధనలతో పిల్లలంతా ఏకమై భీముని పని బడతారు. అంతా కలిసి సమతాఫల సాధనకోసం ఉద్యమించి భీమునికి గర్వభంగం కలిగిస్తారు. 'భూమాతకు మీరొకరె / పుట్టి పెరిగినారా?/ అందరామె అదరమ్ము / అందుకొనగలేరా?' వంటి చక్కని సంభాషలు, 'పిల్లల్లార రారండి / బిరబిరాన చేరండి / అల్లరి చేయక రండి / ఆనందించగ రండి' అంటూ పిల్లలను ప్రేమించే తోటతల్లి మాటలు ఈ రూపకాన్ని మిక్కిలి రక్తికట్టించాయి.
తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కలిగించిన కవి నారాయణ రెడ్డి. అంతే కాక తెలంగాణ భాషను సగౌరవంగా పాటల పల్లకిలో ఎక్కించి వెండితెర మీద ఊరేగించారాయన. 'గోగులుపూసే.. గోగులుగాసే ఓ లచ్చ గుమ్మాడి', 'ఓ ఒ జంబియా' వంటి పాటలు అందుకు ఉదాహరణలు. తెలుగు సినిమాల్లో బాలల కోసం, బాలల గురించి, బాలల నేపథ్యంతో అనేక గీతాలు రాశారు సినారె. 1973లో వచ్చిన జీవన తరంగాలు సినిమాలోని 'పుట్టిన రోజు పండుగే అందరికి - మరి / పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ' అనే గీతం దాదాపు అందరం విన్నదే, విని ఆనందించిందే. ఈ కోవలోనే దాదాపు మూడు వందల వరకు బాలల కోసం గీతాలు రాశారాయన. తాతా మనవడు సినిమా 1973లో వచ్చింది, అందులోని 'ఈ నాడే బాబూ నీ పుట్టిన రోజు ఈ యింటికు / ఈ యింటికే కొత్త వెలుగు వచ్చిన రోజు' అనేది గొప్ప గీతమే కాదు, సందేశాత్మకం కూడా. 'చిన్నిబాబు ఎదిగితే కన్నవారి కానందం / నెలవంక పెరిగితె నింగికే ఆనందం' అంటారు ఇందులో కవి.
'గున్నమామిడీ కొమ్మ మీదా / గూళ్లు రెండున్నాయి / ఒక గూటిలోనా రామచిలకుంది / ఒక గూటిలోన కోయిలుంది', 'ఇది మా దేశం / ఇదే మా దేశం / బాపూజీ కలగన్న దేశం / సమసమాజ నిర్మాణం చేసే / బాల పౌరులు వెలసిన దేశం' వంటివి సినారె బాలల కోసం రాసినవి. లాలిపాటలు, జోలపాటలు కూడా సినారె రాశారు. వాటిలో 'ముద్దుల మా బాబు నిద్దురోతున్నాడు -ఉష్ / సద్దు చేశారంటె ఉలికులికి పడతాడు / గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు / మా చిన్ని కృష్ణయ్య లోకానికే వెలుగు' గీతం మిక్కిలి ప్రసిద్ధమే కాక అందరి నాల్కల మీద ఉంది. స్వాతి ముత్యం సినిమాలోని 'లాలీ లాలీ లాలీ / వటపత్రసాయికి వరహాల లాలి / రాజీవనేత్రునికి రతనాల లాలి / మురిపాల కృష్ణునికీ ఆ...' మనకు తెలిసిందే. పైన ప్రస్తావించిన బాల గీతాలే కాక 'చిట్టీ పొట్టీ పాపల్లారా-చెంగుచెంగున రారండి', 'చిన్నారి పాపల్లారా', 'చిన్నారి బాలల్లారా! రారండ్రీ' వంటివి మరికొన్ని ప్రసిద్ద బాలల గేయాలు. జూన్ 12, 2017 న మహాకవి డా.సి. నారాయణ రెడ్డి కన్ను మూశారు.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548