Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుస్తకం ఓ మంచి నేస్తం. ఊసుపోవడానికి కొందరికి, విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరికొందరికి సాయపడు తుంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునే దారిలో చేయి పట్టుకుని నడిపించే సాధనము పుస్తకం. మనో వికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో నిజమైన నేస్తం.. పుస్తకం. పుస్తకాలు వచ్చాకే మానవజీవన గమనంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచ పుస్తక దినోత్సవం
ఏప్రిల్ 23 పుస్తక దినోత్సవం. సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616 సంవత్సరంలో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా ఈ పుస్తక దినోత్సవం నిర్వహించు కోవడానికి ఒక కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహౌత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్ 23 వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది.
ప్రముఖ జర్మన్ రచయిత కాఫ్కా ఒక మిత్రునికి ఇరవ య్యేళ్లప్పుడు రాసిన ఉత్తరంలో ఇలా అంటాడు ''మనల్ని గాయ పరిచి, తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి. మన తలమీద మొట్టి నిద్రలేపకపోతే ఎందుకిక పుస్తకాలు చదవటం? ఆనందం కోసమా! అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం. నిజమైన పుస్తకాలు వేరు. అవి ఒక విపత్తులా, మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా, అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా, ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి. మనలో గడ్డకట్టుకు పోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి.'' అంటారు.
కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు కొదవేలేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ వంటి ఎన్నో సాధనాలు వచ్చినా, ఆన్ లైన్ గేమ్స్, చిత్రవిచిత్రమైన రకరకాల వ్యాపకాలు సమస్తం చేతిలోనే ఉండే రోజులు వచ్చినా పుస్తకం విలువ ఏమాత్రం చెక్కుచెదరలేదు.
పుస్తకం అంటే విజ్ఞాన భాండాగారం. మహాసముద్రంలాంటిది. కాని నేడు సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్ది ఇంటర్నెట్, వాట్సాప్ సంభాషణలతో పసి పిల్లాడి నుంచి పెద్దల వరకు విలువైన కాలాన్ని వధా చేస్తున్నారే గానీ ఎవ్వరూ కూడా మంచి పుస్తకం చదవటానికి మక్కువ చూపటం లేదు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో కథలు పుస్తకాలు చదివే అలవాటు చేస్తే అదే అలవాటుగా మారి యువతరం అన్ని విషయాల్లో పోటీపడినట్లే పుస్తకాలు చదవటంలో పోటీపడతారు. ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో డిజిటల్ లైబ్రర్సీ కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ బుక్స్‌ని ఈ బుక్స్ చదువుకునే రోజులివి.
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో.. ఉరుకుల పరుగుల జీవితంలో పుస్తక పఠనం తగ్గిపోయింది. ఏదైనా చదవాల్సి వస్తే ఆన్లైన్లోనో, కిండిల్ నోట్లోనో చదువుతున్నారు. పుస్తకాలను పట్టుకొని చదవడం ప్రజలు మర్చిపోతున్నారనే చెప్పాలి. అందుకే పలు స్వచ్ఛంద సంస్థలు తమకు తోచినట్టుగా ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే కొందరు ఆర్టిస్టులు రోడ్డుపై 'పుస్తకాల నది' ఏర్పాటు చేశారు. పుస్తక పఠనంపై ఆసక్తి, అవగాహన పెంచేందుకు స్పెయిన్‌కి చెందిన 'లుజింటెరప్టస్' అనే సోషల్ ఆర్టిస్టు బందం కెనడాలోని టొంరొంటోలో రద్దీ రహదారిపై ఈ వినూత్న కార్యక్రమం నిర్వహించింది. దాతలు ఇచ్చిన దాదాపు 10వేల పుస్తకాలను రాత్రివేళ రహదారులపై పర్చారు. 'లిటరేచర్ వర్సెస్ ట్రాఫిక్' పేరుతో రహదారుల్ని పుస్తకాల నదిలా మార్చేశారు. ఇది చూపరుల్ని బాగా ఆకట్టుకుంది. పుస్తక పఠనం ఇష్టమైనవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చని, ఫొటోలు తీసుకోవచ్చని, ఇంటికి తీసుకెళ్ళవచ్చుననీ ప్రకటించారు. దీంతో ఆ దారిలో వెళ్తున్న వారు, ఇరుగుపొరుగు వారు తమకు నచ్చిన పుస్తకాలను తీసుకెళ్ళారు. తెల్లవారేసరికి రోడ్డు ఖాళీ అయిపోయింది. ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించారు.
''చిరిగిన చొక్క అయినా తొడుక్కోగానీ మంచి పుస్తకం కనుక్కో'' అని కందుకూరి అన్నట్లు ఒక మంచి పుస్తకం ఒక మంచి జీవితానికి భరోసా.
- అనంతోజు మోహనకృష్ణ
8897765417