Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వండుకోవడానికి భేషుగ్గా మండేదీ, నరుక్కోవడానికి తేలిగ్గా ఉండేదీ అయిన చెట్టు కోసం వెదికి పట్టుకున్నాడు చేతిలో గొడ్డలి ఉన్నవాడు.
మరణ శిక్షను అమలు జరుపుకోవచ్చు అంటూ తల వంచుకు నిలబడ్డది చెట్టు. చెట్టు మొదట్లో గొడ్డలి గాటు పెట్టేడు మనిషి.
బుస్సుమన్న చప్పుడు వినిపించి గొడ్డలి జారవిడిచి అడుగు వెనక్కి వేశాడు మనిషి. ఎక్కడ్నించి అక్కడికి వచ్చిందో అక్కడే ఎంత సేపట్నించీ వెయిట్ చేస్తూ ఉండో కాని పాము ఒకటి పడగెత్తి బుసకొట్టింది. బుసకొడుతూ పడగెత్తింది. అడుగు వెనక్కి వేసిన మనిషి జారవిడిచిన గొడ్డలి అందుకున్నాడు. 'తొందరపడకు అడుగు కదపకు' అన్నది పాము. 'నేను మామూలు కట్టెలు కొట్టే వాణ్ణికాను' అన్నాడు మనిషి.
'అనుకున్నాను ముఖం చూసి. నీ పేరేమిటి?' అన్నది పాము.
'నన్ను సత్యవంతుడంటారు. రాచపుట్టుక పుట్టిన వాణ్ణి' అన్నాడు సత్యవంతుడు.
'అయితే నేను వచ్చింది నీ కోసమే. నిన్ను మృత్యువుకి అప్పగించే పని మీద వచ్చాను' అన్నది పాము.
'నువ్వు నన్ను కాటేసేలోపు నేను నిన్ను రెండు ముక్కలు చెయ్యగలను' అన్నాడు సత్యవంతుడు.
'నేను మామూలు పాముని కాదు. నీ మృత్యుపాశాన్ని నా వెనకే నీ పంచప్రాణాల్ని 'ప్యాక్' చేసుకుపోవడానికి మృత్యువు సిద్ధంగా ఉన్నాడు' అన్నది పాము.
పాము అన్నట్టుగానే దాని వెనక నల్లటి నీడ కనిపించింది. చిక్కటి చీకటిలాంటి ఆ నీడను చూడగానే వంట్లో వణుకు పుట్టుకొచ్చింది సత్యవంతుడికి. 'అంత ప్రాణభయం ఎందుకు. ఎవడైనా చావడానికే కదా పుడతాడు' అంది పాము.
'మృత్యువును చూసి భయపడని వాడు ఉండడు. ఒకసారి చూశాక యిక భయం ఉండదు. నాకూ భయం లేదిప్పుడు కానీ అటు చూడు నా భార్య పరుగెత్తుకు వస్తున్నది' అన్నాడు సత్యవంతుడు.
'ఆమె వస్తే మాకేం? మా పని మేం చేసుకుపోతాం' అన్నది పాము.
'ఆమె సంగతి మీకు తెలీదు. నన్ను తీసుకుపోనీదు' అన్నాడు సత్యవంతుడు.
'టీవీలో సీరియళ్ళు చూసి వచ్చేసరికి ఆలస్యమైంది. మళ్ళీ సీరియళ్ళ టైముకు వెళ్ళిపోవాలి. తెచ్చింది తిని కదలండి' అంది ఆమె.
ఎంత గుండె ధైర్యం ఇక్కడ నేనూ మృత్యువూ నించున్నా మొగుడు ఒక్కడే ఉన్నాడు అన్నట్టు మాటాడుతోంది' అనుకున్న పాము 'డ్యూటీ ఫస్ట్' అనుకుని సత్యవంతుడ్ని కాటేసింది.
దబ్బుమని నేలమీద పడిపోతున్న సత్యవంతుడి తల వళ్ళో పెట్టుకుని భార్య పాముని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది.
'ఊరికే నోరు నొప్పి పుట్టేట్టు ఏం అరుస్తావు. కానీ నీ 'హబ్బీ' ప్రాణాలు కవర్లో పెట్టుకుపోనీ!' అన్నాడు మృత్యువు. 'నేనెవరో నీకు తెలీదు. సీరియళ్ళ సావిత్రి అంటే చెబుతారులే. నాతో పరాచికాలు వద్దు. నేను నా మొగుడి ప్రాణాల్ని టీవీ సీరియళ్ళనీ వదులుకోలేను. నువ్వు పో ఇక్కడ్నించి' అంది సావిత్రి.
ఈమెతో ఆర్గ్యుమెంటు లాభం లేదని సత్యవంతుడి ప్రాణాలు కవర్లో పెట్టుకుని బయల్దేరాడు మృత్యువు, నీడలా.
సావిత్రి నీడలాంటి మృత్యువును ఫాలో అయింది నీడలా. నీడనే నీడలా వెంటాడుతున్న సావిత్రిని వొదిలించుకుందుకు ఏదో ఓటి చెయ్యక తప్పదనిపించింది మృత్యువుకి.
ఎన్నో ఏళ్ళనుంచి సీరియళ్ళు చూసి చూసి కళ్ళు అపుపడకుండా పాయిన ఆమె అత్తమామలకు సీరియళ్ళు స్పష్టంగా కనిపించడానికి నేత్రదానం చేశాడు మృత్యువుడు. మధ్య మధ్య రిపేర్ల కారణంగా టీవీ సీరియళ్ళు మిస్సవుతున్న ఆమె జననీ జనకులకు అసలు రిపేరు రానటువంటి టీవీ ఒకటి ప్రదానం చేసేడు మృత్యువుడు.
అయినా తృప్తిపడక అయిపోని సీరియల్లా వెంటపడింది సావిత్రి.
మొగుళ్ళ మీద పగబట్టే పెళ్ళాల్ని కోడళ్ళ మీద పగబట్టే అత్తల్ని అక్కల మీద పగబట్టే చెల్లెళ్ళని, భార్య ఉండగానే భర్త కొంపలో దూరే ఆడాళ్ళను, రౌడీలను మెయిన్టైన్ చేసే ఆడ విలన్లను చూసే ఖర్మ తప్పిందని సత్యవంతుడు ప్రాణాలకు మృత్యువు పాకెట్లో సంతోషించే అవకాశం పోయింది.
సకుటుంబ సమేతంగా ఇప్పుడు టీవీలో వస్తున్న వో సీరియల్ని సావిత్రి భర్తతో ముగింపు వరకూ చూసే వరర యిచ్చి నాలుక్కరుచుకున్నాడు మృత్యువు.
సత్యవంతుడి ప్రాణాల పాకెట్ను పట్టుకుని వెనక్కి వచ్చేసింది సీరియళ్ళ సావిత్రి.
ఫలానా సీరియల్ ముగింపును వరంగా కోరుకున్నదంటే భర్త సత్యవంతుడు నూటపాతికేళ్ళు ఆపైనా గ్యారంటీగా బికే ఛాన్సన్నమాట అనుకుని టీవీ ఆన్ చేస్తూ నవ్వుకుంది సావిత్రి.
-చింతపట్ల సుదర్శన్,
9299809212