Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్యాయం, అక్రమాలు, దోపిడీలు, దుర్మర్గాలు... ఎన్నాళ్లని, ఎన్నేళ్లని నిలదీసినది ఈరోజునే.. వేదనలు, రోదనలు అంతరించి పోవాలని వివిధ కులాలు, వర్గాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఖండాలకు అతీతంగా, అంతర్జాతీయంగా.. ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రామిక జనులు ఐక్యంగా నిలిచి, సామ్యవాద సాధనకై కార్మిక వర్గం జరుపుకునే పండుగ దినమే మేడే.
''మార్క్స్ ఏంగెల్స్'' రాసిన కమ్యూనిస్ట్ ప్రణాళికకు ముందే కార్మిక వర్గం తమ భాధలకై పోరుబాటన నడిచి వర్తమానాన్ని మార్చే ప్రయత్నం చేశారు. కాని శ్రమజీవుల సమరానికి ''పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్ళు తప్ప'' అంటూ సిద్ధాంత ఆయుధాన్నిచ్చింది మాత్రం మార్క్సిజమే.
1886 సంవత్సరానికి పూర్వం ఉన్నటువంటి పాశవికమైన పెట్టుబడిదారి విధానం. కార్మికుల హక్కులను ఏ మాత్రం గుర్తించేది కాదు. అయితే పని గంటలను 8 గంటలకు పరిమితం చేయాలనే పోరాటం.. పెట్టుబడిదారి స్థావరాలైన యూరప్, అమెరికాలలో అప్పటికే ఉద్యమ రూపం దాల్చింది.
1886 ఆగస్టులో బాల్టీమర్లో 8 గంటల పనిని డిమాండు చేస్తూ ఒక తీర్మానం చేసిన అమెరికన్ కార్మికుల సదస్సు ఒకటి జరిగింది. ఈ సదస్సు జరిగిన రెండు వారాలలో ''మార్క్స్'' స్థాపించిన అంతర్జాతీయ సంస్థ మొదటి సమావేశం జెనీవాలో నిర్వహించారు. కార్మికులకు రోజు వారి పని గంటలపై చట్టబద్ధ పరిమితి ప్రాథమిక అవసరంగా గుర్తించడం, అది లేకుండా కార్మిక వర్గ విముక్తి, ప్రగతి కోసం సాగించే ఇతర ప్రయత్నాలన్నీ నిరుపయోగంగా తయారవుతాయని, పని దినం ఎనిమిది గంటల దినంగా చట్టరీత్యా నిర్ణయించాలని ఈ కాంగ్రెస్ ప్రతిపాదించింది.
కార్మికవర్గంలో ఒకే డిమాండ్‌ను ఒకే సారి రెండు బందాలు లేవనెత్తడం. సమిష్టి కార్యాచరణకు సౌహార్ద్రతకు వేదికగా నిలిచింది. ఈ విషయం జెనీవాలో కాంగ్రెస్ తీర్మాణం స్పష్టీకరించింది. అయితే ఇది ఆరంభం మాత్రమే.
మార్క్స్ ఏంగెల్స్ ఏర్పరచిన కార్మికవర్గ అంతర్జాతీయ అసోసియేషన్ 1866-86ల మధ్య కార్మికవర్గ ఉద్యమం సామూహిక హత్యలను, ఉరితీతలను ఎదుర్కొంటూ.. అనేక ఇబ్బందుల మధ్య కొనసాగినా దాని పురోగమనం మాత్రం ఆగలేదు. మొదటి అంతర్జాతీయ సంస్థ కార్యకలాపాలు పారిస్ కార్మికుల తిరుగుబాటులో ఉన్నత స్థాయికి చేరాయి. పారిస్ కమ్యూన్ 1871లో ఏర్పడిన మొదటి కార్మికవర్గ రాజ్యం కూడా. కాని పెట్టుబడిదారులు ప్రభుత్వంతో కలిసి కమ్యూనార్ట్స్ని పాశవికంగా సామూహిక హత్యలు చేయడం వలన యూరప్ అంతటా విప్లవ ప్రతిఘాతం గజ్జెకట్టి విలయతాండవం చేయడం. తత్ఫలితంగా లండన్ నుండి అమెరికాకు మొదటి అంతర్జాతీయ సంస్థ కేంద్ర కార్యాలయం తరలించవలసి వచ్చింది.
1876 నాటికి అంతర్జాతీయ సంస్థ తన ఉనికిని కోల్పోయి చరమ ఘట్టానికి చేరుకుంది. కానీ పోరాటం ఆగలేదు, సరికదా! ఇంకా ఉధతమైంది. 1884 అక్టోబర్‌లో అమెరికా, కెనడాల ఆర్గనైజ్డ్ ట్రేడ్ అండ్ లేబర్ యూనియన్ల 4వ మహాసభ జరిగింది. అందులో 1886 మే నుండి 8 గంటల పనిదినంగా ఉంటుందని తీర్మాణం చేశారు. ఒక విధంగా సమ్మె సంప్రదాయం అదే మొదలుగా చెప్పుకోవచ్చు.
ఎంతో మిలిటెంట్‌గా సాగిన చికాగో సమ్మెలో వేలాది కార్మికులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం, అక్కడ యజమానులు, ప్రభుత్వం కార్మికోద్యమాన్ని ఎదురుదెబ్బ తీయాలని నిశ్చయించి, మే 3న కార్మికులపై పోలీసులు జరిపిన దాడిలో ఆరుగురు కార్మికులు ఆహుతవ్వడంతో పాటుగా, ఎందరో గాయపడ్డారు. అందుకు నిరసనగా మే4 న ప్రశాంతంగా నిరసన తలపెట్టగా.. ఆ ప్రదర్శనలో కొన్ని అరాచక శక్తులు కార్మిక నాయకులని అప్రతిష్టపాలు చేయడానికై బాంబుదాడికి పాల్పడటం. 'హే'మార్కెట్ ఘటనలు ప్రత్యక్ష తార్కాణం కాగా, ప్రఖ్యాతి గాంచిన మే మాసంలో 3,4 తేదీలలో జరిగిన ఈ సంఘటనలు.. మే 1వ తేదిన జరిగిన సమ్మెకు- ప్రత్యక్ష ఫలితాలుగా నిలిచాయి.
మే 4న జరిగిన దాడిలో ఒక సార్జంట్ కూలడంతో ఆరంభమైన ఘర్షణలో అనేక మంది పోలీసులు, నలుగురు కార్మికులు మరణించారు. ఈ రక్తతర్పణంతో దాహం తీరని, అధికారగణం ఆల్బర్ట్ వర్ సాన్స్, ఆగస్ట్ స్లైస్, అడాల్ఫ్ ఫిషర్, జార్జి ఏంగెల్స్ అనే కార్మిక నాయకులపై అక్రమ కేసులను బనాయించి ఉరికంబాలకెక్కించారు. అనేకమంది నాయకులకు ధీర్ఘకాలిక జైలు శిక్షలు విధించారు.
8 గంటల పనిదినం కోరినందుకు కార్మిక వర్గంపై సాగే దోపిడిని అదుపులో ఉంచాలని ప్రయత్నించినందుకు పెట్టుబడిదారి న్యాయం నలుగురు కార్మిక నాయకుల జీవితాలనే బలికోరింది.
అదే మరో 'మేడే' విప్లవకర త్యాగ సాంప్రదాయానికి ఓనమాలు దిద్దింది. ఈ కేసు విచారణ అనంతరం మా మాటల కన్నా మా మూగబోయిన గొంతులే రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుందని 1887 నవంబర్11 తేదిన ఉరితీయబోయే ముందు ఆల్బర్ట్ పార్సన్, జార్జ్ ఏంగెల్స్, అడాల్ఫ ఫిషర్లతో.. ''ఆగస్టు స్లైస్'' చివరిగా మాట్లాడిన మాటలు గాలిలో ధూళిలా కలిసిపోలేదు. అతని త్యాగం బూడిదలో పోసిన పన్నీరులా మారలేదు. చీకటిలో చిరు దివ్వెలు వెలిగించినట్లుగా... పురోగమనంలో ఉన్న ఐరోపా కార్మికోద్యమంతో చేతులు కలిపేలా చేసింది.
1889లో పారిస్‌లో జరిగిన సోషలిస్టు అంతర్జాతీయ మహాసభ రెండవ ఇంటర్నేషనల్ మే1వ తేదిని కార్మిక దినోత్సవంగా ప్రకటించింది. ఆ రోజున అన్ని దేశాల్లోని కార్మికులను ఏకకాలంలో తమ కోర్కెలను ప్రకటించాలని ఆదేశించింది. ఆ తరువాత 1890లో లోకానికి శ్రమ విలువ చాటుతూ.. మే1వ తేదీన ఐరోపా దేశంలో తొలిసారిగా కార్మికలంతా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ''మేడే'' గా నిర్వహించుకుంటూనే ఉన్నాం.
మన భారత దేశంలో 80 సం. పూర్వం నుండే ''మేడే'' ఉత్సవాలు జరుగుతున్నాయి. 1920 -1925 సంవత్సరాల మధ్య కాలంలో కమ్యూనిస్టు సోషలిస్ట్ భావాలు భారత్ లోవ్యాప్తి చెంది కార్మికులతో పాటు కర్షకులు సంఘటితమవడంతో ఆంగ్లేయ ప్రభుత్వం భయపడి ప్రజా రక్షణ బిల్లు పేరుతో కేవలం అనుమానంతోనే ఎవరినైనా అదుపులోకి తీసుకోవచ్చని, 1929లో 32 మంది కార్మిక సంఘాల నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం. భాధితులను మహాత్మా గాంధి, నెహ్రూలు మీరట్ జైలులో వారిని పరామర్శించడం చర్చనీయాంశంగా మారడంతో.. అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ తదితర దేశాల నుండి విమర్శలు రావడం వలన ఆ 32 మందిని 1933లో విడుదల చేయక తప్పలేదు.
19వ శతాబ్దంలో సుమారుగా 20 నుండి 30 సంవత్సరాలు కమ్యూనిస్టులు మినహా మరెవ్వరూ మేడే జరిపేవారూ కాదు.
బ్రిటన్‌లోని సంస్కరణవాద ట్రేడ్ యూనియన్ ఉద్యమ ప్రభావం ఉండడంతో ఆ తరువాత కాలంలో కమ్యూనిస్టేతరులు రెండవ ఇంటర్నేషనల్ ప్రభావంతో మేడే నిర్వహణకు పూనుకున్నారు. పశ్చిమ దేశాలకుండే రుగ్మతల కారణంగా 'మేడే' అంతర్జాతీయతా భావంతో పెట్టుబడిదారి విధానాన్ని తుద ముట్టించడమనే లక్ష్యం కారణంగా, ట్రేడ్ యూనియన్ ఉద్యమం సమిష్టిగా 'మేడే' జరుపలేకపోయింది. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఒక భాగపు నాయకత్వం సోషలిజం, రాజకీయాల పేరెత్తడానికే వ్యతిరేకం. ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వంతో ప్రజలు మిలాఖత్ తనాన్ని నిరాకరించగానే 1929లో వారు ఎ.ఐ.టి.యు.సి.ని విచ్ఛిన్నం చేశారు. సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ పోరాటం చేయకూడదు అని షరతు విధించారు.
అలాంటి వారితో కలిసి సమిష్ఠిగా మేడే జరపడం ఎందుకు అసాధ్యమయ్యేదో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
రష్యాలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడైన 'లెనిన్' ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు జరిగేవి. లెనిన్ విప్లవకర ప్రాధాన్యత, తక్షణ ఆర్థిక కోర్కేలను, అంతర్జాతీయ సౌహార్ద్రత సోషలిజం పట్ల చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆలోచింపచేశాయి. మన మనోవాంఛను ప్రకటించడం మాత్రమే సరిపోదు. సోషలిజం లక్ష్యాన్ని చేరుకునేందుకు గాను కార్మిక వర్గం ఎదుర్కొంటున్న నిర్దిష్ట విప్లవ సమస్యలను పట్టించుకోవాలి. అందుకుగాను మేడే సభలలో పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భాగంగా ఈ సమస్యలను లేవనెత్తడం అవసరం అని అన్నారు.
1902లో లెనిన్ నార్తరన్ లీగ్‌కు రాసిన లేఖలో.. మన దేశంలో మేడే ప్రదర్శనలు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రాజకీయ స్వేచ్ఛ కోసం జరిగే ప్రదర్శనగా కూడా తయారైందని కూడా చేర్చి ఉండాల్సింది అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఆ పవిత్ర దినం గురించి అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తి చూపడంతో సరిపోదు. దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. (సంపూర్ణ రచనలు లెనిన్ 6వభాగం పేజినెం.168)
1903లో రానున్న మేడే సందర్భంలో సహితం లెనిన్ ఇదే అంశాన్ని నొక్కి చెప్పారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం సమాజ అభివద్ధితో పాటు శ్రామికులకు ఉపయోగపడాలి కాని పెట్టుబడిదారుల వ్యవస్థలో శ్రామికులపై దోపిడి తీవ్రతకు అవి సాధనాలుగా మారకూడదని, సమ్మెకు దిగడం కార్మికుల చేతిలో చివరి ఆయుధం కావాలని పిలుపునిచ్చారు.
కానీ అటువంటి ఎంతో విలువైన పవిత్రమైన దినాన్ని మన దేశంలోకి చొరబడిన విదేశి అంశంగా భావించిన పలు దేశాలలోని కొన్ని ట్రేడ్ యూనియన్లు క్రమక్రమంగా సిద్ధాంతాలు వేరైనా సాధించాల్సిన లక్యం ఒకటే కాబట్టి రేపటి ఉదయం కోసం అంటూ ''ప్రపంచ కార్మికులారా ఏకం కండి'' అంటూ చేతులు కలుపక తప్పని పరిస్థితి నెలకొంది.
- నరేందర్ రాచమల్ల,
9989267462