Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగంలో 1992లో చేసిన ఢెభ్బై ఒకటవ సవరణ కారణంగా కొంకణి, మణిపురి, నేపాలి భాషలకు
మన రాజ్యాంగంలో చోటు దొరికింది. అలా భారత రాజ్యాంగం గుర్తించిన భారతీయ భాషల సంఖ్య అప్పుడు
పద్దెనిమిదికి చేరింది. తరువాత మరొకొన్ని సవరణల అనంతరం ఆ సంఖ్య ఇప్పుడు ఇరవై రెండుకి చేరింది.
సిక్కిం రాష్ట్రంలో, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్‌లోని కాలింపోంగ్ జిల్లాలలో అధికార భాషగా నేపాలిని
గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాలలో నెపాలి మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. అందుకే నేపాల్ దేశంలో నిర్మించిన
నేపాలీ సినిమాలను కూడా భారతీయ సినిమా ఆదరిస్తుంది. ఈ నేపథ్యంలోనే ''ఆమా'' అనే నేపాలీ సినిమాను
ఇక్కడ పరిచయం చేయడం జరుగుతుంది.
2020లో రిలీజ్ అయిన ఈ సినిమాకు దీపేంద్ర. కె. ఖనాల్ దర్శకత్వం వహించారు. ఇందులో మిథిలా శర్మ,
సురక్ష్యా పాంతా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మధ్య కాలంలో స్త్రీ ప్రధాన సినిమాలలో అంతర్జాతీయంగా
వచ్చిన సినిమాల మధ్య కూడా ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇతర భారతీయ భాషల్లో వచ్చే భారీ సినిమాల
ముందు గర్వంగా తల ఎత్తుకుని నిలబడే సత్తా ఉన్న మంచి సినిమా ఇది.
ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల కాని ఇక్కడి పిల్ల కాదు అన్నది తరాలుగా వస్తున్న మాట. కొడుకు ఉంటే పున్నామ నరకం నుండి తప్పిస్తాడని, వద్దాప్యంలో తోడు అవుతాడని నమ్ముతారు అందరు. పెళ్ళి చేసుకుని పరాయి ఇంటికి వెళ్ళిపోయే కూతురు తమ కుటుంబానికి, వద్దాప్యానికి ఆసరా అవదని కొన్ని సార్లు అవకూడదని కూడా అనుకుంటారు సగటు మనుషులు. కూతురిని గవర్నమెంటు స్కూల్లో లేదా అత్తెసరు చదువుల్లో పెట్టి కొడుకు కోసం తలకు మించి అప్పులు చేసి అవస్థలు పడతారు తల్లిదండ్రులు. ఇప్పుడు రోజులు మారి కూతురి కోసం కూడా చదువు పరంగా ఖర్చు పెట్టవలసిన అవసరం వచ్చింది తల్లిదండ్రులకు. అయినా ఇప్పటికీ తమ చరమదశలో కొడుకుపై ఆధారపడాలనుకుంటారు తప్ప కూతురు తమకు ఆధారం అవడం జీవితంలో చాలా చిన్న తనంగా భావిస్తారు. సమాజం కూడా కొడుకు నీడలో ఉన్న తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం కూతురిపై ఆధారపడే తల్లిదండ్రులకు ఇవ్వదు. అలాంటి సందర్భంలో ఒక కుటుంబంలో కూతురు తన తల్లిదండ్రుల పట్ల తన బాధ్యత ఎలా నిర్వర్తించిందో చెప్పిన కథ ''ఆమా''.
యజ్ఞ ప్రసాద్ ఆర్యల్ అనే ఒక వ్యక్తికి ఇద్దరు పిల్లలు. కూతురు ఆర్తికి వివాహం అవుతుంది. ఆమె భర్తతో ఖాట్మండులో ఉంటుంది. ఒక చిన్న స్కూల్లో టీచర్‌గా పనిచేస్తూ ఉంటుంది ఆర్తి. భర్త మనీష్ ది చిన్న ప్రైవేట్ ఉద్యోగం. వీరితో పాటు ఆ ఇంట్లో మనీష్ నానమ్మ ఉంటుంది. ఆర్తి అన్న అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఎంతో ఖర్చు పెట్టి ఆస్థి తాకట్టు పెట్టి కొడుకుని అమెరికా పంపిస్తారు తల్లిదండ్రులు. ఒక రోజు తమ పల్లెటూరి ఇంట్లో ప్రమాదవశాత్తు కింద పడిపోతాడు యజ్ఞ ప్రసాద్. అతని తలకి బలమైన దెబ్బ తగులుతుంది. ఆ ఊరిలో అందరూ వలస వెళ్ళిపోయాక అక్కడ మిగిలిపోయిన కుటుంబాలలో అందరూ వద్దులే. అందువలన ఎవరి సహాయం లేక, ఆర్తి తల్లి ఒక్కతీ ఆంబులెన్స్‌లో భర్తను ఆ స్థితిలో ఖాట్మండు పెద్ద ఆసుపత్రికి తీసుకువస్తుంది. ఆర్తికి తల్లి ఫోన్ చేసి విషయం చెప్పగానే, ఆమె ఇంట్లోంచి ఉన్న పళంగా ఆంబులెన్సు వద్దకు పరిగెత్తుకు వస్తుంది.
ఇక్కడ ఖాట్మండులోని వైద్య వ్యవస్థను డైరెక్టర్ చూపిస్తారు. ఆంబులెన్స్ లో వచ్చిన మనిషి మూడు హాస్పిటల్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక దాంట్లో చేర్చుకోమంటారు. మరో చోట స్ట్రైక్ జరుగుతూ ఉంటుంది. చివరకు ఖరీదైన మరో ప్రైవేట్ హాస్పిటల్లో చేరుస్తారు యజ్ఞ ప్రసాద్‌ని. మనీష్ కూడ ఆఫీస్ నుండి వచ్చి వీరికి తోడుగా అన్ని పనులు చూసుకుంటాడు. ఇక హాస్పిటల్లో ఖర్చుకు అంతుండదు. ఆ స్థితిలో తల్లిని ఒంటరిగా అక్కడ ఉంచలేక ఆర్తి అన్ని భాద్యతలు తీసుకుంటుంది. ఉన్నంత వరకు డబ్బు పోగు చేసి హాస్పిటల్లో అడ్వాన్సు కడతారు. రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్ వచ్చిన వెంటనే హాస్పిటల్‌కు పరుగున వచ్చి వాలిపోతుంది ఆర్తి. ఆమె భర్త ఆఫీసు పని, ఈ హాస్పిటల్ పని రెండు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు.
ఆర్తికి మనీష్‌కి పిల్లలుండరు. టెస్ట్‌ట్యూబ్ పద్ధతిలో ప్రయత్నించాలంటే చాలా ఖర్చు అవుతుందని ముందుగా దాని కోసం డబ్బు పోగు చేసుకుంటూ ఉంటారు. వీరి ట్రీట్మెంట్ మొదలుపెట్టవలసిన డేట్ కూడా డాక్టర్ నిర్ణయిస్తుంది. ఈ లోపు ఆర్తి తండ్రి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాడు. రెండో ఆపరేషన్ చేయవలసి వస్తుంది. అతని కళ్ళు ఆ దశలో కూడా అమెరికాలో ఉన్న కొడుకును చూడాలని వెతుకుతూ ఉంటాయి. ఎన్ని ఫోన్లు చేసినా కొంత డబ్బు పంపించడం తప్ప, కొడుకు ఇండియాకు రాడు. డాక్టర్లు పేషంటు పరిస్థితి వివరించి చెబుతున్న ప్రతి సారి మీకు కొడుకు లేడా అని అడుగుతూనే ఉంటారు. అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్న ఆర్తిని పట్టించుకోవాలని, ఆమెతో విషయం చర్చించాలని ఎవరికీ అనిపించదు.
ఆర్తి తల్లి భర్తకు రెండోసారి ఆపరేషన్ జరిగాక చాలా భయపడుతుంది. అల్లుడు ఎంత చేస్తున్నా అతనితో అన్నీ చెప్పుకోలేదు. ఆ సమయంలో పక్కన ఉండవలసిన కొడుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా తాను రాలేననే చెబుతాడు. ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. హస్పిటల్లో బిల్ పెరిగిపోతుంది. ఈ లోపు ఒక యువ డాక్టర్ వీరి పరిస్థితి చూసి అసలు విషయం ఆర్తి తల్లికి చెబుతాడు. ఆర్తి తండ్రి బ్రైన్డెడ్ అని, అతన్ని వెంటిలేటర్ మీద ఉంచడం వలన ఊపిరి తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నాడని, అతను తిరిగి కోలుకోడని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వారికి ఇప్పుడు అవసరమని చెబుతాడు. ఈ విషయం పెద్ద డాక్టర్లకు తెలిసినా డబ్బు కోసం వారెవ్వరూ వీరికి నిజం చెప్పరు. హాస్పిటల్లో బిల్ పెంచడానికి వారు మౌనంగా ఉండిపోతారు. ఆర్తి, ఆమె భర్త, తల్లి అందరూ పేషంట్ బతికి వస్తే చాలని ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నిజం తెలిసిన తరువాత ఆర్తి అన్నకు ఫోన్ చేస్తుంది. అప్పుడు కూడా మీకు ఏం అనిపిస్తే అది చేయమని తాను వచ్చే పరిస్థితులలో లేనని చెబుతాడు ఆ కొడుకు. పైగా తల్లికి తనను క్షమించమని, అర్థం చేసుకొమ్మని చెబుతూ నిర్ణయం తీసుకునే భాద్యత ఆమెకే అప్పగిస్తాడు. అలాంటి విపత్తులో ఆర్తి మాత్రమే తల్లి చేయి పట్టుకుని ఉంటుంది. ఆ రాని కొడుకు గురుంచి ఎదురు చూస్తూ బాధపడుతూ చివరకు వెంటిలేటర్ తొలగించడానికి సంబంధించిన కాగితాలపై సంతకం చేస్తుంది ఆర్తి తల్లి.
బిల్లు కట్టలేదని ఆర్తి తండ్రి శవాన్ని మార్చురీకి మారుస్తారు. అక్కడ ఏదో వి.ఐ.పి శవం వచ్చిందని మార్చురిలో అతని శవాన్ని తీసుకొచ్చి అక్కడే కారిడాల్లో పడేస్తారు సిబ్బంది. భర్తను ఆ స్థితిలో చూసి అసహాయంగా ఏడుస్తూ ఉంటుంది ఆర్తి తల్లి. బిల్లో కంసెషన్ ఇమ్మని, లేదా అంతక్రియలు చేసుకుని ఊరికి వెళ్ళి ఆస్థి అమ్మి బిల్లు కడతామని ఎంత బతిమాలినా హాస్పిటల్ యాజమాన్యం అంగీకరించదు. కొడుకు తానింక డబ్బు పంపలేనని చేతులెత్తేస్తాడు. వీరి చుట్టాలు కొంచెం సహాయం చేసినా, ఆ డబ్బు సరిపోదు. ఆర్తి ఉద్యోగం వదిలేస్తుంది. తల్లి దగ్గరే ఉండిపోతుంది. ఈ లోపు ఆమె ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన తేది వస్తుంది. భర్తతో డాక్టర్ వద్దకు వెళ్ళిన అర్తి అక్కడ ఉండలేక తిరిగి ఇంటికి వస్తుంది. తన నగలు, ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బు తండ్రి శవాన్ని విడిపించడానికి తీసుకెళుతుంది. భర్త కాదన్నా ముందు ఒక బిడ్డగా తన కర్తవ్యాన్ని నెరవేర్చి తరువాత తాను తల్లి అవడం గురించి ఆలోచిస్తానని బలంగా చెబుతుంది. అప్పటిదాకా ఆమెతో విభేదించే ఆ ఇంటి పెద్దావిడ ఈ విషయంలో ఆర్తికి అండగా నిలుస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్న తన కొడుకు, తన భవిష్యత్తు ఆ పెద్దామెలో కూడా ఆలోచనలను రేకెత్తిస్తాయి.
హాస్పిటల్లో భర్త శవాన్ని డోర్ గుండా చూస్తూ ఉంటుంది ఆర్తి తల్లి. నేల మీద ఉన్న శవాన్ని ఎలుకలు కొరుకుతూ ఉంటాయి. వాటిని తోలుతూ రాత్రంతా ఏడుస్తూ ఉన్న ఆమె ఆ డోర్ దగ్గరే గుండె ఆగి మరణిస్తుంది. హాస్పిటల్ బిల్లు కట్టి తండ్రి శవం కోసం వచ్చిన ఆర్తి తల్లి శవాన్ని చూసి కూలబడిపోతుంది. ఆ ఇద్దరినీ ఆంబులెన్సులో వారి స్వస్థలానికి చేరుస్తుంది.
ఊరివారి మధ్య ఆ తల్లి తండ్రులకు అంతక్రియలు నిర్వహిస్తుంది ఆర్తి. చివరకు ఆ కర్మ చేసినందుకు శ్మశానంలో స్నానం చేసి గుండు చేయించుకుని ఆ సమయంలో ఆ దంపతులకు కొడుకుగా మారుతుంది. ఆడపిల్లల పట్ల అతిగా వివక్ష చూపే నేపాల్ దేశంలోని సంస్కతి, సాంప్రదాయాల మధ్య ఒక కూతురు తన తల్లిదండ్రుల కోసం, తన ఉద్యోగం, కాపురం, మాతత్వాన్ని పణంగా పెట్టి అందరినీ ఎదిరించి చివరకు వారికి కొడుకుగా తలకొరివి పెట్టడం చూసేవారిలో చాలా ఆలోచనలను రేకెత్తిస్తుంది.
ఏ సమయంలో కొడుకు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారో ఆ సమయంలో కొడుకులు ఉండే పరిస్థితులు ఇప్పటి తరంలో లేవు. అందరి ప్రాధ్యాన్యతనలు ఒకేలా ఉండవు. ఈ కథలో ఆ కొడుకు వివాహం ప్రసక్తి రాదు. కాబట్టి కోడలిపై నెపం వేయలేం. అతను ప్రయత్నించినా డబ్బు సమకూర్చలేక పోతాడు. పోనీ కోడుకుగా ఆ సమయంలో చనిపోతున్న తండ్రికి చివరిచూపు చూసుకునే అవకాశాన్ని, తల్లికి మానసిక ధైర్యాన్ని అందించలేకపోతాడు. తన కోసం సర్వం అమ్ముకున్న అ తల్లిదండ్రులు ఎదురు చూస్తారు అని తెలిసినా తన భవిష్యత్తును ఒదులుకుని ఆరిపోతున్న వారి జీవితాల కోసం రాలేనని స్పష్టంగా చెబుతాడు ఆ కొడుకు. మరో పక్క ఆర్తికి తల్లిదండ్రుల పట్ల పూర్తి భాద్యత లేనట్లుగానే ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రవర్తిస్తారు. ఆమె తల్లి కూడా ఇబ్బందిగానే ఆర్తిని సహాయం అడుగుతుంది. ఆర్తి పక్కన ఉన్నప్పుడు ఆ కొడుకు కోసమే కొట్టుకుంటూ ఉంటుంది ఆమె మనసు. ఒక నిముషం స్పహలోకి వచ్చిన తండ్రి కూతురి భుజాల మీదుగా కొడుకు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. కొడుకు కనపడక నిరాశతో నలిగిపోతాడు కాని కూతురు పక్కన ఉన్న ఉత్సాహం ఆ కళ్లల్లో చివరి సమయంలో కూడా కనిపించదు. దగ్గర లేని బిడ్డ కోసం ఒక తండ్రి పడుతున్న ఆవేదనగా దీన్ని తీసుకున్నా ఆ ఆవేదనను కూతురు అర్థం చేసుకుంటుంది కాని కొడుకుకి అది పెద్ద విషయంగా అనిపించదు. తన శక్తికి మించి తన వారిని ఆదుకుంటుంది ఆ కూతురు. ఆడపిల్లలు తల్లిదండ్రుల ఆఖరి క్షణాలలో పనికిరారని చెప్పే సమాజం ముందు, తానే గుండు గీయించుకుని సాంప్రదాయబద్దంగా అంతక్రియలు నిర్వహిస్తుంది.
కొడుకు, కూతురు అన్న వివక్ష కన్నా మనల్ని నిజంగా ప్రేమించి, మన పట్ల తమ కర్తవ్యం నెరవేర్చే పిల్లలను పిల్లలుగా చూడగలిగి, వారికి ఆ ఆవకాశాన్ని ఇవ్వగలిగే వాతావరణాన్ని ఏర్పరచ గల స్థితిలో పెద్ద తరంవారు ఉండవలసిన అవసరాన్ని ఈ సినిమా సూచిస్తుంది. తండ్రి ట్రీట్మెంట్ కోసం నాన్న దాచుకున్న రెటైర్మెంట్ డబ్బు వాడదాము అని ఆర్తి తల్లిని అడిగినప్పుడు, ఆ డబ్బు కూడా కొడుకుని అమెరికా పంపడం కోసం ఉపయోగించాం అని తల్లి చెబుతుంది. అప్పటిదాకా ఆ సంగతి అర్తికి తెలియదు. ఆ డబ్బుపై తనకు హక్కు ఉండదా? ఉండదనుకున్నా, ఆ డబ్బు తండ్రి అన్న కోసం ఖర్చు పెడుతున్నప్పుడు ఆ విషయం ఆర్తికి తెలియవలసిన అవసరం లేదా? ఇంటికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొడుకు, కూతురి మధ్యలో ఇంత వివక్ష ఎందుకు చూపుతారు తల్లిదండ్రులు? ఇది ప్రతి ఇంట్లో ఎక్కడో ఏదో సందర్భంలో కనిపించే విషయమే. తల్లి తండ్రులకు కూతురు పెళ్ళి అయిన తరువాత పరాయిది అన్న భావమే ఎక్కువ ఉంటుంది. ఏ ముఖ్య నిర్ణయాలు ఆమెకు తెలియకుండానే పుట్టింట్లో జరిగిపోతాయి. ఆమెకు ఆ ఇంటి వారు కొన్ని పరిధులు నిర్ణయిస్తారు. ఆ పరిధిలలోంచే ఆమె తన బంధాన్ని నిలుపుకోవలసిన పరిస్థితులను కల్పిస్తారు. అందువలనే అవసరం ఉన్నప్పుడు ఆ కూతురి సహాయం తీసుకునే సమయంలో ఈ పరాయి భావాన్నే, పుట్టింటి వారు చూపిస్తారు. ఆడపిల్లలను ఎంతగా పరాయివాళ్లను చేస్తారో, కొడుకులను అంతగా తమతో పెట్టుకోలేని పరిస్థితుల మధ్య నలిగిపోతున్న ముసలి తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కనిపిస్తారు. సాంప్రదాయం పేరున, పద్ధతి పేరున చూపే ఈ వివక్ష ఇప్పుడు ఆ ముసలి తల్లి తండ్రులనే ప్రమాదంలోకి నెట్టి వేస్తుందని దీని కోసం అయినా ఆడపిల్లల విషయంలో సాంప్రదాయపు సడలింపులు అవసరం అని ఆలోచించమని సూచించిన సినిమా ''ఆమా''
సినిమాలో హాస్పిటల్లో మరో పాత్ర కనిపిస్తుంది. పుట్టిన బిడ్డ ఇన్‌క్యుబేటర్‌లో ఉంటే ఆ బిడ్డను దూరం నుండి చూస్తూ నలిగిపోయే ఒక తల్లిని ఈ కథకు అవసరం లేకున్నా దర్శకులు చూపిస్తారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఇరుకుటుంబాలు వెలి వేస్తే, భర్త దుబారులో ఉద్యోగం కోసం వెళితే ఒంటరిగా ఆ బిడ్డ బతకడానికి చేస్తున్న పోరాటాన్ని నిస్సహాయం గా గాజు అద్దాల బైటి నుండి చూస్తూ ఆ బిడ్డ ప్రాణాల కోసం ఆరాటపడే మరో అమ్మ, ఈ సినిమాలో వచ్చే మరో ముఖ్య పాత్ర. చనిపోతున్న తండ్రి వద్దకు తానొచ్చినా పెద్దగా చేసేది ఏం ఉంటుంది అనుకునే కొడుకులకు సమాధానంగా దర్శకులు ఈ పాత్రను సష్టించారనిపిస్తుంది. ఆ బిడ్డ తన గర్భం నుండి బైటపడిన వెంటనే ఇన్క్యూబేటర్లో చేరితే బైట ఉండి నేనేం చేయగలను? అని ఆ తల్లి అనుకోదు. ఆ బిడ్డ కోసం హాస్పిటల్ లో ఒక మూల, అవస్థలు పడుతూ గాజు తలుపుల మధ్య బిడ్డను చూసుకుంటూ తోడుగా ఉండిపోతుంది. ఇది తల్లి మాత్రమే చేయగల పని. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయి తనను ఆ స్థితికి తెచ్చిన తల్లిదండ్రుల ఆఖరి సమయంలో అలా వారి కోసం తాను బైట నిలవడం తన కర్తవ్యం అన్న చిన్న విషయాన్ని మర్చి పోతాడు. ప్రాక్టికల్‌గా ఉండడం బిడ్డలకు సాధ్యం అవుతుందేమో కాని తల్లికి కాదు... అందుకే ఈ సినిమాకు 'ఆమా' అన్న పేరు పెట్టారు దర్శకులు. నేపాలీ భాషలో అమా అంటే అమ్మ అనే అర్థం. తల్లి ప్రేమను మర్చిపోయే పిల్లలకు ఒక సందేశంలా, తల్లిగా మారగల కూతుర్లను సాంప్రదాయం పేరుతో పుత్ర వాత్సల్యం వెనుక మరచిపోవద్దని చెప్పిన మంచి సినిమా ''ఆమా''
ఈ సినిమాలో తల్లి పాత్రను చేసిన మిథిలా శర్మ, నేపాల్‌లో ఒక గొప్ప నటి, నాట్యకారిణి కూడా. తల్లి పాత్రలో ఆమె చూపించిన ఆ వేదన, భర్త శవాన్ని ఎలుకలు పీక్కు తింటున్నప్పుడు, తలుపు అవతల నిస్సహాయంగా ఆ ఎలుకలను తోలే ప్రయత్నం చెస్తున్నప్పుడు ఆమె ఆ పాత్రలో జీవించిన విధానం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. ఇక ఆర్తి పాత్రలో సురక్ష్య పాంతా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాలో చర్చకు రావల్సిన మరో ముఖ్యమైన విషయం వైద్య రంగంలో జరుగుతున్న స్కాంలు. పేరుకి పెద్ద హాస్పిటల్ కాని అక్కడ మందులుండవు. అర్ధరాత్రి పేషేంట్‌కి మందుల కావాలని కుటుంబీకులకు చెప్పడం, తెలియని ఊరిలో ఆ తల్లి పడుతూ లేస్తూ, వర్షంలో వీధుల చుట్టూ తిరగడం, డబ్బు లేక ఇబ్బంది పడడం, బ్రెయిన్ డేడ్ అయిన వ్యక్తిని వెంటిలేటర్ మీద పెట్టి విషయం చెప్పకుండా బిల్ పెంచడం, ముందు హాస్పిటల్లో పేషేంట్ చేర్చడం కోసం కుటుంబసభ్యులు ఎదుర్కోవలసిన సమస్యలు ఇవన్నీ ఈ సినిమా చర్చకు పెడుతుంది. ప్రజలకు వైద్య సేవలను సక్రమంగా అందించలేక ఘోరమైన చర్యలకు పాల్పడుతున్న వైద్యరంగం పట్ల ఆలోచనను కలిగిస్తుంది.
- పి.జ్యోతి, 9885384740