Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా మీద నమ్మకం లేదా? అన్నాడతను. నమ్మకం లేదని కాదు కానీ అందామె జంకుతూ. నిన్ను నమ్మించాలంటే ఏం చెయ్యాలి అన్నాడతను. ముఖంలో 'క్వశ్చన్' మార్కు పెట్టి. ఏం చెయ్యక్కర్లేదు నమ్మించనూ అవసరం లేదు అందామె. ముఖంలో 'ఇంటూ' మార్కు పెట్టి. అలా కాదు మనది మామూలు ప్రేమ కాదు. ఒకళ్ళనొకళ్ళం నమ్మి తీరాల్సిందే. నమ్మకమే ప్రేమ ప్రేమంటేనే నమ్మకం అన్నాడతను ముఖమంతా విచారం పెట్టి. సరే నీ ఇష్టం. నమ్మకమే నీకు ముఖ్యమైతే ఎలా నమ్మిస్తావో నమ్మించు అందామె ముఖమంతా నవ్వు పెట్టి. అతను ఆలోచించాడు. అతని మెదడులో వెలిగిన లైటు బల్బు ముఖంలోనూ వెలిగేసింది.
ఒట్టు... నీ మీద ఒట్టు... ఒట్టు పెట్టుకుంటున్నా ఇకనైనా నన్ను నమ్ము అన్నాడు తను తలమీద చేయి పెట్టుకుని. ఒట్టు అన్న మాట వినగానే ఆమె ఆలోచనలో పడింది. పాపం ఒట్టు పెట్టుకుంటున్నాడు ఇంతకన్నా ఏం కావాలి. ఒట్టంటే ఒట్టే కదా. ఒట్టుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే కదా అనుకుని 'నిజంగా!' అంది కనురెప్పలు వేగంగా అందంగా కదిలిస్తూ. ఒట్టంటే ఒట్టే. నిజంగా నిఝంగా నిజమే. ఒట్టు.. ఒట్టు.. ఒట్టు... ఒట్టు అన్నాడతను గట్టిగా ధీమాగా.
అయితే ఏం చెయ్యమంటావో చెప్పు అందామె. దేనికైనా రడీ అన్నది ధ్వనిస్తూ.
అలా ఆకాశమూ భూమీ కలిపే చోటికి చేయీ చేచీ కలుపుకుని ఆనందంగా హాయిగా సుఖంగా సంతోషంగా నడిచి వెల్దాము అన్నాడతను. ఆమె తల ఊపింది. చేయీ చేయీ కలిపింది. ఆకాశమూ భూమీ కలిశాయి.
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా కట్నం డబ్డు- తీసుకురావమ్మా అంటూ కోడల్ని అత్త పుట్టింటికి పంపేసింది.
మూన్నెల్లు దాటినా కోడలు రాలేదు.. కట్నమూ రాలేదు... కొడుకు అరిచి గీ పెట్టాడు. పోనీలేవే డబ్బు ముఖ్యంకాదు.. వాళ్ళకు స్తోమత లేదు. నేను వెళ్ళి నీ కోడల్ని తీసుకు వస్తాను అన్నాడు కొడుకు. ససేమిరా అంది అత్తయిన తల్లి... బతిమాలాడు కొడుకు. కొండదిగి వచ్చేదేలేదు అంది అత్త. అత్తయిన తల్లకి తెలీకుండా ఫోన్లో భార్యతో మాట్లాడుతూనే ఉన్నాడు కొడుకు. అమ్మను ఒప్పించి తనను తీసుకువస్తానని అంటూనే ఉన్నాడు. నీ మాటలు వినీ వినీ విసుగొచ్చింది... మీ అమ్మ వినే ఘటం కాదు. ఒప్పుకునే శాల్తీ కానేకాదు. మనిద్దరినీ కలవనివ్వదు అని వాపోయింది.. కోడలైన ఓ కూతురు. లాభం లేదు. గ్యాసు లీకుతోనో పెట్రోలు మంటతోనో తగలబడిపోతాను అంది. అంత పని చెయ్యకు అని బతిమాలుకున్నాడు అల్లుడయిన కొడుకు. వారంలోపు వచ్చి నన్ను తీసుకుపోకపోతే నీ మీద ఒట్టే అని ఒట్టు పెట్టుకుంది కోడలు దృఢంగా నిశ్చయించుకుని. ఒట్టు.. ఒట్టు.. ఒట్టు... ఒట్టు పెట్టుకుంది ఇప్పుడెలా అని గింజుకున్నాడు మొగుడు. తల్లితో గట్టిగా వాదించాడు. కోడల్ని తీసుకువచ్చేదే అని ఖరాఖండిగా అనేశాడు. అప్పుడు అత్తయిన తల్లి కోడల్ని తీసుకువస్తే నేను చచ్చినంత ఒట్టే అని ఒట్టు పెట్టుకుంది తల మీద చేయి పెట్టుకుని. ఒట్టు... ఒట్టు... ఒట్టు.. అటు ఓ ఒట్టు ఇటు ఓ ఒట్టు.. ఇద్దరి 'ఒట్టు'ల మధ్య అప్పడమై పోయాడు కొడుకూ మొగుడూ.
ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ముప్పయ్యేళ్ళ సర్వీసు చెయ్యవచ్చు. మేము మాత్రం అయిదేళ్ళేనా అని తెగ బాధపడ్డాడు ఓ రాజకీయ నాయకుడు. మళ్ళీ ఎలెక్షన్లు వచ్చేశాయని తలబాదుకున్నాడు. ఏ జెండా పట్టుకుంటే ఏ పార్టీలో చేరిపోతే మళ్ళీ అయిదేళ్ళు 'ఎంజారు' చెయ్యవచ్చునోనని ఆలోచన్లో పడ్డాడు. పార్టీ ఏదయితేనేం ఎప్పట్లో ఓటర్ని లాలించి, బుజ్జగించి, నమ్మించి మోసం చెయ్యక తప్పదు కదా అనుకున్నాడు.
నాలుగునాళ్ళు కష్టపడితే ఐదేళ్ళు ఏలవచ్చు ఓటర్ని నమ్మిస్తే. ఆ తర్వాత అడ్రసు లేకుండా పోతే సరే అన్నారు నాయకుడ్ని నమ్ముకుని మందు ముక్కా లోటు లేకుండా బతికేస్తున్న అనుచరులు. ప్రచారంలో భాగంగా దండం పెట్టే చేతులు దించకుండా ఇల్లిల్లూ తిరుగుతున్న నాయకుడికి ఓ మొండి ఓటరు తగల్నే తగిలాడు. పోయిన ఎన్నికల్లో చెప్పినవి ఏమేం చేశారని ప్రశ్నించాడు. గతం గత:. ఈ సారి ఇచ్చిన హామీలన్నీ తీర్చి తీరుతానన్నాడు నాయకుడు. తలమీద చేయి పెట్టుకుని 'ఒట్టు' అన్నాడు. ఒట్టు... ఒట్టు.. ఒట్టు ప్రతిసారీ ఇలాగే అదిపొడిచేస్తాం ఇది పొడిచేస్తాం అని పంగనామాలు పెడ్తారు అని కోప్పడ్డాడు ఓటరు. ఓటరు గడ్డం పుచ్చుకుని ఈసారి నన్ను నమ్మండి 'ఒట్టు' అని గట్టిగా నమ్మబలికాడు నాయకుడు.
సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో, కట్టు కథల్లో ఒట్టు నిలబడతయేమో కాని రియల్ లైఫ్లో అన్ని ఒట్లూ ఉత్తుత్తివే, నమ్మించి గొంతు కోసేవే. గట్టు మీద ఆరేయబడేవే!!!
-చింతపట్ల సుదర్శన్, 9299809212