Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీసరగుట్టకు సమీపంలో యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో యావపూర్ గ్రామ పంచాయతి పరిధిలోని మధిర గ్రామం కాశిపేటలో చిన్నరాతిగుట్ట మీద కొత్తరాతిచిత్రాలతావు వెలుగుచూసింది. సభ్యులు వేముగంటి మురళీకష్ణ, బీవీ భద్రగిరీశ్, శ్రీరామోజు హరగోపాల్, అహౌబిలం కరుణాకర్, మహమ్మద్ నజీర్, డా.మండల స్వామి, కొరివి గోపాల్, భాస్కర్, భూయజమాని శ్యాంసుందర్ రెడ్డిలతో కూడిన కొత్తతెలంగాణ చరిత్రబందం కొత్త రాతి చిత్రాల తావును (Painted Rock Shelter) గుర్తించింది. 30అడుగుల ఎత్తున్న చిన్నరాతిగుట్టమీది పడిగెరాయి లోపలివైపు వేసిన ఎరుపురంగు రాతిచిత్రాలు ఎన్నోవున్నాయి. అక్కడున్న గుహను వేంకటేశ్వరుని గుడిగా ప్రజలు కొలుస్తున్నారు. వాళ్ళు చేసిన జాజు, సున్నం అలంకరణలతో చాలావరకు రాతిచిత్రాలు మరుగునపడిపోయాయి. నాలుగు అడివిదున్నలు, ఇద్దరు పురుషులు, మరొకచోట గుర్రాన్నిపోలిన జంతువొకటి అగుపిస్తున్నాయి. 4 దున్నల వెనక నిల్చున్న మనిషి బొమ్మ ఎక్స్ గీతలతో చిత్రించబడివుంది. ఇటువంటి చిత్రాలు హస్తలాపూర్, అక్షరాలలొద్ది వంటి తావుల్లో కనిపించాయి. దున్నలకు దగ్గరగా గీయబడిన మరొక మనిషి చిత్రం రేగొండ రాతిచిత్రాల తావులోని ఆయుధంతో నిల్చున్న మనిషి తొక్కుడుబొమ్మ (Petroglyph) వలె వుంది. ఈ రాతిచిత్రాలతావున్న గుట్ట అంచుల్లో చరిత్ర బందానికి సూక్ష్మరాతిపరికరాలు లభించాయి. సమీపంలో చెదరని కైరన్ సిస్తు సమాధులు, ఒక మెన్హర్ ఉన్నాయి. ఈ రాతి చిత్రాలతావును మహమ్మద్ నజీర్, కొరివి గోపాల్ తొలుత గుర్తించారు.
లభించిన సూక్ష్మరాతి పనిముట్లు, రాతిచిత్రాల శైలి, రాతిచిత్రాలలోని వస్తువులు అడివిదున్నలు ఆధారంగా ఈ చిత్రితశిలాశ్రయంలోని చిత్రాలు సూక్ష్మరాతియుగానికి చెందినవని చెప్పవచ్చు. పురుషులలో ఆయుధంతో నిల్చున్న మనిషిబొమ్మ చారిత్రకకాలానికి చెందినది.
డా.ఈమని శివనాగిరెడ్డి, చరిత్రకారులు కొత్త రాతిచిత్రాల తావును కనుగొన్నందుకు చరిత్ర బందాన్ని అభినందించారు. త్వరలో తెలంగాణాలో రాతి చిత్రాల తావులు వందకు చేరుకుంటాయని ఆకాంక్షించారు.
విషయ వివరణ, వ్యాఖ్య :
శ్రీరామోజు హరగోపాల్, 9949498698
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం
విషయ నిపుణులు :
బండి మురళీధర్ రెడ్డి, 7093378522, రాతి చిత్రాల నిపుణులు, కొత్తతెలంగాణ చరిత్రబృందం సలహాదారులు