Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తతెలంగాణ చరిత్రబందం సభ్యులు వేముగంటి మురళీకష్ణ, డా.మండల స్వామి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పెదకొండూరు వరదరాజస్వామి ఆలయం ప్రాంగణంలో కొత్త కాకతీయ శాసనాన్ని గుర్తించారు. ఈ శాసనం గుర్తించడంలో కొండూరు గ్రామసర్పంచ్ కాయితి రమేష్ గౌడ్, ఎంపిటీసి బద్దం కొండల్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ జక్కిడి కొండల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ గుండెబోయిన ఇస్తారి యాదవ్, ఉపాధ్యాయుడు పాలకూర వెంకటేశ్ గౌడ్ సహకరించారు.
112 పంక్తులున్న ఈ శాసనలిపి, భాష తెలుగు. లిపి ఆధారంగా ఈ శాసనం 13,14వ శతాబ్దాలకు చెందింది. ఈ శాసనం (పేర్కొన్న శక సం. భాగం విరిగిపోయి వుంది) విరోధికత్ శ్రావణ శుద్ధ ద్వాదశి బుధవారం వేసినట్టు, ప్రతాపరుద్రుని పాలనాకాలం ఆధారంగా ఇండియన్ ఎఫిమెరిస్ ప్రకారం శాసనం 1311 జూలై 28 అని అర్థమవుతున్నది. కాకతీయ ప్రతాపరుద్రదేవుని పాలనా కాలంలో అతని లెంక మాదయ (భార్య) మల్లు బాలమ్మ పెదకొండూరులో వరద రాజస్వామి తిరుప్రతిష్ట చేసి, చేసిన దాన వివరాలు ఈ శాసనంలో పేర్కొన బడ్డాయి. మల్లు బాలమ్మ, మాదయ లెంక లు పెదకొండూరు వరదరాజ స్వామి అంగరంగభోగాలకు, అముడుపడి (ఆహార నైవేద్యం)కి ధారాపూర్వకంగా కొండూరి చెరువు దగ్గర ఇరుకార్తెలు పండే జలచేను (నీర్నేల, తరిభూమి)ను, క్రయలబ్ధం చేసిన(కొన్న) భూములను, ఇంతవరకు సర్వమాన్యంగా పెక్కండ్రు (వస్తుమార్పిడ వ్యాపారసంస్థ) ఇచ్చిన ఆదాయం, 20 పొంకలు (పొనికెలు, ఎడ్లబండ్లల్లో వేసే గూడు వంటిది) పత్తి కొన్న వారు మాడలెక్కన, తమలపాకుల మోపు కొన్నవారు, ధాన్యాల అమ్మకం చేసినవారు మాడ, మానెడు ధాన్యం, అష్టాదశప్రజలు, మహాజనాలు గుడిలో రంగభోగానికి తమ వ్రిత్తుల(పారంపర్య దాన మాన్యాలు) నుంచి 1 మర్తురు(ఒకటిన్నర ఎకరం) తరిపొలము, చిన్నము (చిన్నబంగారు నాణెం), మెట్టపొలమున్న వారు 1పుట్టి ధాన్యం, చిన్నము నాణెం, పెరికలు, కోమట్లు, అద్దుగులు, సానెవారు, కరణాలు, తలారులు, బంట్లు మాడలు ఇవ్వాలని శాసనంలో ఉంది.
ఈ శాసనం కాకతీయుల నాటి సామాజిక, ఆర్థిక సంస్థలను వివరించింది. గ్రామం గుడి నిర్మాణం చేసినపుడు ఊరుమ్మడిగా తమ ఆదాయాల నుంచి దేవాలయ నిర్వహణకు తమ వంతుగా ఇవ్వాల్సిన పన్నులను పేర్కొన్నది శాసనం. ఈ శాసనంలో కాకతీయపాలకులు రుద్రదేవుడు, అతని తమ్ముడు మహదేవుడు, తనకూతురు రుద్రమదేవి, ఆమె కూతురు కొడుకు ప్రతాపరుద్రుని వరకు పేర్కొన్నప్పటికి వంశనామం 'కాకతీయ' పేర్కొనలేదు. ఇది మా చరిత్ర బందానికి కొత్తగా లభించిన కొత్త కాకతీయ శాసనం.
పెదకొండూరులో శాసనాలున్న రెండు వీరగల్లులు, రెండు ఆత్మాహుతి వీరగల్లులు, ఒక సతిశిల వీరగల్లులను సభ్యులు గుర్తించారు. పెదకొండూరులోని వరదరాజస్వామి దేవాలయం ఏక కూటాలయం. గర్భగుడి, అంతరాళం, అర్థమంటపం, ముఖ మంటపాలతో, ఇటుకలతో కట్టిన విమానంతో ఉండేది. ఆ గుడి పునఃనిర్మాణం కొరకు విప్పిపెట్టారు. అక్కడి ప్రాచీన శివాలయంలో కాకతీయశైలి లింగవేది, శివలింగం ఉన్నాయి. ద్వారబంధాలకు రెండువైపుల కలశాలున్నాయి. గుడి ద్వారానికి లలాటబింబంగా మూలాధారబంధనాసనంతో గజలక్ష్మి శిల్పం ఉంది. చాళుక్యశైలిలో ఒక సప్తమాతకాఫలకం ఆ ప్రాంగణంలో ఉంది. చాళుక్యపూర్వశైలిలో చెక్కిన మహిషాసురమర్దిని శిల్పం ప్రత్యేకమైనది.
సభ్యులు పెదకొండూరు పాటిగడ్డమీద సాతవాహనుల కాలం నాటి ఎరుపుపూత కుండపెంకులు సేకరించారు. లభించిన పురా వస్తు, శిల్ప, దేవాలయాల ఆధారంగా పెదకొండూరు సాతవాహనుల నుంచి కాకతీయులదాక చారిత్రకంగా విలసిల్లిన గ్రామమనిపిస్తుంది.
క్షేత్రపరిశోధన, శాసనప్రతి సేకరణ :
వేముగంటి మురళీకష్ణ-9676598465,
మండల స్వామి-9182365250,
కొత్తతెలంగాణ చరిత్రబందం
శాసన పరిష్కరణ, చరిత్రరచన :
శ్రీరామోజు హరగోపాల్, 9949498698,
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం