Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లా నర్సింహులు అక్టోబర్ 2, 1926 లో వరంగల్ జిల్లాలోని జనగామ తాలుకా కడివెండి గ్రామంలో జన్మించాడు. నిజాం వ్యతిరేక పోరాటంలో ఈ కడివెండి గ్రామానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రజలను బానిసత్వానికి గురి చేసి నిలువునా దోచుకుంటున్న భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం ప్రభుత్వానికి ప్రతికూలంగా సాయుధపోరాటాన్ని లేవదీసిన సాయుధ పోరాట కేంద్ర స్థానం ఈ కడివెండి గ్రామం. అలనాడు విసునూరు దేశ్ ముఖ్ ఆగడాలను భరించలేక ప్రాణాలు పోయినా సరేనని లెక్క చేయకుండా ఎదురుతిరిగిన ఈ గ్రామమే తెలంగాణ స్వాతంత్య్ర సాధనకు మూల స్థానమైంది. అటువంటి వీరులు పుట్టిన నేలమీద మరో వీరుడు ప్రభవించాడు. అతనే నల్లా నర్సింహులు. నర్సింహులు ఈ గ్రామంలోనే విసునూరు దేశముఖు కుమారులతో కలిసి ఆరవ తరగతి చదివాడు. ఏడవ తరగతి ఉర్దూ మీడియంలో అభ్యసించాడు.
నిజాం వ్యతిరేక పోరాటం
హైదరాబాదు సంస్థానం భారత సమాఖ్యలో విలీనమై తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చేవరకు జరిగిన ప్రతీ ప్రజాపోరాటంలో ఇతను పాల్గొన్నాడు. ప్రజల వైపు నిలబడి తన అభిప్రాయాన్ని, నిజాం వ్యతిరేక భావజాలాన్ని ప్రజ్వలింపజేశాడు. స్థానికంగా తీవ్ర దోపిడీకి గురి చేస్తున్న విసునూరు దేశ్ ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి, అతని తల్లి జానమ్మ ల చేతిలో అనేక కష్టాలు పడ్డాడు. నిజాం ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఉద్యమంలో పాల్గొని అనేక మార్లు జైలుకు వెళ్ళాడు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు ఇక్కడ రెండు వ్యూహాలు ఉన్నాయి. ఒకటి: హైదరాబాదు సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం జరిగింది. రెండు, హైదరాబాదు రాష్ట్రం దేశంలో విలీనం అయ్యాక భూ సేకరణకు కోసం జరిగింది. మొదటి దానికి వర్గ దక్పథం ఉన్నా అది స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం. రెండో దానికి కూడా వర్గ దక్పథం ఉంది. కాని అది స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం కాదు. ఇది కేవలం అక్రమంగా భూస్వాములచే దోచుకోబడ్డ భూమిని ప్రజలు తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం చేసిన పోరాటం. మొదటి దాన్ని నిజాం వ్యతిరేక స్వాతంత్య్ర పోరాటమని, రెండో దానిని భూస్వామ్య వ్యతిరేక తెలంగాణ రైతాంగ పోరాటమని అన్నారు. అయితే నల్లా నర్సింహులు ఈ రెండు పోరాటాలలో పాల్గొన్నాడు. ఎన్నో సార్లు జైలుకు వెళ్ళాడు. ఉరిశిక్ష నుండి కూడా బయటపడ్డాడు. ఇతని పోరాట తెగువను, స్వాతంత్ర కాంక్షను చూసి భారత సైన్యమే ఇతనికి 'తెలంగాణ టైగర్' అనే బిరుదును ప్రసాదం చేసింది.
ఆంధ్ర మహాసభలో పాల్గొన్నాడు. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన 11 వ ఆంధ్రమహాసభకు వెళ్లి సభ్యత్వ ఫారాలు తీసుకొని వారి ఊరిలో సంఘాన్ని స్థాపించాడు. నర్సింహులు వారి గ్రామ యువకులకు పోరాటం గురించి వెల్లడిస్తూ వారిలో ఉత్తేజ, ఉద్వేగ భావాలను నింపుతూ స్వప్రాంతం పట్ల ప్రేమ భావాన్ని తట్టి లేపేవాడు. ఇది నచ్చని ఆ ఊరి దొరసాని పోలీసులకు చెప్పి అరెస్టు చేయించింది. దాంతో పోలీసులు సంఘం నుండి సభ్యత్వాన్ని విరమించుకోవాలని బెదిరించి పంపారు. ఇలా పలుమార్లు ఉద్యమాలలో పాల్గొన్న కారణంగా అరెస్టు చేసి హైదరాబాదు జైలుకు పంపారు. అక్కడి నుండి నిజాం ప్రభుత్వ ఆదేశంతో మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. కాని అక్కడ జైలు నుండి నర్సింహులు పరారయ్యాడు.
గెరిల్లా పోరాటం ఒక యుద్ద కళ. ఇందులో ఆడి గెలవాలంటే దానికి నైపుణ్యం తప్పనిసరి. కనుక ఆనాడు కష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ గెరిల్లా పోరాటానికి సంబంధించి శిక్షణా తరగతులు ఇచ్చేవారు. అందులో భీమిరెడ్డి నరసింహారెడ్డి, దాయం రాజిరెడ్డిలతో నల్లా నర్సింహులు పాల్గొన్నాడు. వీటికి పుచ్చలపల్లి సుందరయ్య కూడా హాజరై పోరాట కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపేవాడు.
నర్సింహులు నిజాం ప్రభుత్వానికి తీవ్ర నిరసనను తెలుపుతూ ఉద్యమంలో పాల్గొంటూ సాహిత్యం, పత్రికలు చదివేవాడు. ఇతన్ని 'ఎర్రసైన్యం' అనే పుస్తకం ఉత్తేజితున్ని చేసింది. 1947 జూన్ లో షోలాపూర్ వెళ్ళాడు. అక్కడ ఉన్న చేనేత కార్మికుల సమస్యలు విని తెలంగాణలోని మానవ విపత్కర పరిస్థితులను వారికి వెల్లడించాడు.
నల్లా నర్సిములుకు ఉన్న ఉద్యమ ఆవేశాన్ని, జనగామ పరిస్థితుల్ని పరిశీలించిన డా. జయసూర్య ఇతనికి ''జనగామ సింహం'' అనే బిరుదును ప్రకటించాడు. ఇలా నర్సింహులు తన సంక్లిష్ట జీవిత స్థితిగతులను, ఉద్యమ కోణాలను, ఆయన పడిన వేదనాభరిత సన్నివేశాలను భావితరాలకు ఆత్మకథ రూపంలో అందించి నవంబర్ 5, 1993 లో కన్ను మూశాడు.
- ఘనపురం సుదర్శన్, 9000470542