Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్యంలో చందోబద్ధ పద్యాలు - శ్లోకాలు, గేయకావ్యాలు, బాగా ప్రాచుర్యం పొంది, ఖ్యాతి వహించుతున్న కాలంలో శ్రీశ్రీ తొలిసారిగా ఆ మార్గానికి భిన్నంగా 'వచనం' రాసి మెప్పించాడు. ఆయన స్ఫూర్తితో వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా 'తెలుగు నాట' ప్రవేశపెట్టిన ఘనత కుందుర్తి ఆంజనేయులుదే... గుంటూరు జిల్లా కాటూవారి పాలెంలో 1922 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. 1937 నాటికి శ్రీశ్రీ ప్రభావంతో కవిత్వం రాయడం ఆరంభించాడు. బెజవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికం చేసాడు. 1944 నాటికి 'నయాగరా' కవితా సంకలనం తెచ్చారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి మువ్వురూ కలిసి ఈ సంకలనం తేవడమేగాక కమ్యూనిస్ట్ భావాలతో సాహితీ సృజన చేసారు. 'నయాగరా' కవులుగా గుర్తింపు పొందారు. తెలుగునాట వెలసిన గొప్ప సాహితీ సాంస్కృతికోద్యమ సంస్థల్లో 'నవ్యకళాపరిషత్' ఒకటి. ఆ సంస్థను కుందుర్తి నరసరావుపేటలో స్థాపించారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. యువకవుల్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1958లో ఫ్రీవర్స్ఫ్రంట్ స్థాపించారు. నేటికీ ఆ సంస్థ అవార్డులు ప్రదానం చేస్తోంది. కుందుర్తి అనంతరం శీలా వీర్రాజు ఈ సంస్థ నిర్వహణ చేపట్టారు. కె.సత్యమూర్తి పాత్ర కూడా చెప్పాల్సి వుంటుంది. కుందుర్తి ప్రేరణతో ఆయన మరణానంతరం 'రంజని' సంస్థ కూడా ఏటా కవితా - సాహిత్య పోటీలు నిర్వహణ చేస్తోంది.
వేకువ వెలుగులు గేయాలు, ఆశ, ఆచార్లుగారమ్మాయి, శిక్ష, గేయనాటికలు రాసారు. 'కుందుర్తి' అక్షర సృజనకు భార్య సుందరమ్మ సహకారం విశిష్టమైంది. సమాచారశాఖలో కుందుర్తి అనువాదకుడిగా పని చేసి 1977లో పదవీ విరమణ చేసారు. ఎందరో కవులకు పీఠికలు రాసారు. వ్యాసాలు రాసారు. పల్లె పట్టణాల్లో వాన ఎలా వుంటుందో అద్భుతంగా కవిత్వీకరించిన కుందుర్తి రచనల్లో విశిష్టమైనవి. హంస ఎగిరిపోయింది నాలోని వాదాలు, యుగేయుగే, నగరంలో వాన, తెలంగాణ, దండియాత్ర, నా ప్రేయసీ, సౌప్తికం, రసధుని, అమావాస్య, ఆషా, తీరా నేను కాస్త ఎగిరిపోయాక. మేఘమాల, ఇది నా జెండా, బతుకుమాట. లాంటి గొప్ప రచనలు చేసిన వచన కవితా పితామహుని శత జయంతి సంవత్సరంలోనూ ఆయన సాహిత్యం సమకాలీనత, నేటి సామాజిక పరిస్థితులకు ఎంతో (రెలవెన్స్) దగ్గరగా వుంది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 1970, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 1977, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డ్ 1969 లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన కుందుర్తి 1982 అక్టోబర్ 25న క(పె)న్ను మూసారు. ఆయన పేరిట నెలకొల్పిన రంజని కుందుర్తి అవార్డ్ - ఫ్రీవర్స్ ఫ్రంట్ (ఆయన నెలకొల్పిన) అవార్డ్స్ తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట అవార్డ్స్గా ఖ్యాతినొందాయి. కవిత్వాన్ని సామాన్యుడి దగ్గరకు చేర్చి 'కుందుర్తి'కి కళా సాహిత్య నీరాజనాలు..
- తంగిరాల చక్రవర్తి , 9393804472