Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నమిలికొండ అజయ్‌కుమార్,
9490099140
నువ్వు.. నేను..ప్రేమ.. ఇవన్నీ రెండక్షరాలే కానీ వీటిశక్తి విశ్వవ్యాపితం.. ప్రేమకు వయసుతో సంబంధం ఉండదు. మనసుతోనే అనుబంధం. కులం, మత బేధాలు చూడనిది ప్రేమ.. పేద, ధనిక అంతరాలు లేనిది ప్రేమ.. నిర్వచనలేని అద్వితీయమైన అనుభూతే ప్రేమ. తరతరాలకు చెదిరిపోని తీయని మకరందాన్నిచ్చేదీ ప్రేమ.. అమృతతుల్యమైన ప్రేమను ఆస్వాదిస్తేనే తెలుస్తుంది. షాజహాన్ ముంతాజ్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి, సలీం అనార్కలి ఇలా వారి స్ఫూర్తినింపే ప్రేమ చరిత్రలో అమరమైన ప్రేమగాథలెన్నో. వారెవరో ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ హృదయపు సవ్వడిలో పెనవేసుకున్న బంధాలు మన మధ్యలోనే ఎన్నో ఉన్నాయి. కోపం, విద్వేషం, అసూయ, అసహనం ఇలా మనిషితత్వం రోజు రోజుకూ విస్తరిస్తున్న సమాజంలో వాటన్నింటినీ జయించేందుకు కావాల్సిన ఆయుధం ప్రేమ. సృష్టిలో మరణం లేనిది ఏదైనా ఉందంటే అది ప్రేమ.. మారుతున్న కాలంలో ప్రేమలోని మధు రిమలు ఆస్వాదించడం తగ్గిపోతున్నాయి. అభిప్రాయాలు, వ్యక్తపరిచే ధోరణులు మారుతూ వస్తున్నాయి. ప్రేమను కనుమరుగు చేసే మతఛాందస వాదనలూ కనిపిస్త్తున్నాయి. కానీ స్వచ్ఛమైన ప్రేమకు ఇవేమీ అడ్డంకి కావని నిరూపిస్తోంది ప్రేమలోకం. ఫిబ్రవరి 14 'ప్రేమికుల దినోత్సవం'ను పురస్కరించుకుని ఆదివారం అనుబంధం 'సోపతి' స్పెషల్ స్టోరీ..
మకరందం తుమ్మెదను ఆకర్షిస్తుంది. పడిలేచే సముద్ర కెరటం తీరం తాకాలనే ఉబలాటంతో ఆటు పోట్లకు గురవుతుంది. చిగురించే మొక్క భానుడి కాంతి కిరణాలకు ఆకర్షితమవుతుంది. చంద్రుని చూసిన కలు వలూ, సూర్యుని చూసిన తామరలు వికసిస్తాయి. స్త్రీ పురుషుల్లో, ప్రేయసి, ప్రియునిలో ప్రేమ అనే అయస్కాంత శక్తి ఆకర్షింపజేస్తుంది. ఈ ఆకర్షణలో కులం, మతం, దేశం, ధనం, ప్రాంతం, వయస్సు తేడాలు, హోదాలు కూల్చివేయబడతాయి. హద్దులు, సరిహద్దులు చెరిపివేస్తాయి. టీనేజ్ ప్రేమలు.. అందరికీ అనుభవైకవేద్యమే.. (ప్రేమ, ఆకర్షణలకు తేడాలు తెల్సుకోవాలి) పురాణాలు ప్రామాణికత ప్రశ్నార్థకమే అయినా అలనాటి రామా యణ కథా నాయకుని రాముని ముత్తాత అజమహారాజు తన భార్య శవంపై బడి సహగమనం (ప్రతి సహ గమనం) చేసాడు(ట)? ఇక తారచంద్రల (ప్రణయం... చరిత్ర కథల్లో సారంగధర కథలెన్నో.. 'సలీం అనార్కలీ' ప్రేమ ఎప్పటికీ అజరామరమే. ప్రేమ గురించి చెప్పేంత కాలం లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్ లాంటి కథలకు కొదవలేదు.. కానీ అలనాటి ప్రేమికుల వలే నేటితరం మనసును అర్థం చేసుకోవడానికి, ప్రేమలో నిమగమవడానికి ఆలోచిస్తున్నది. దానికి కారణం ఒక్కటే మార్కెట్ శక్తుల మాయజాలం. ప్రేమ కూడా అంగడి సరుకుగా మారుతోంది. డబ్బు, హోదాను చూసి పుట్టుకొచ్చే ప్రేమలు స్వచ్ఛమైన ప్రేమను నిర్వీర్యం చేస్తున్నాయి.
చరిత్రలో 'వాలంటైన్'డే..
క్రీ.శ.3వ శతాబ్దంలో అంటే క్రీ.శ.269 సం||లో రోమ్‌లో వాలెంటైన్ అనే మతగురువు ఉండేవాడు. ఆయన రోమ్ చక్రవర్తియైన పొరుగు దేశాలతో యుద్ధాలు చేసేవాడు. అపరిమిత రాజ్య విస్తరణా కాంక్షాపరుడైన క్లాడిమస్ తరచు పొరుగు దేశాలతో యుద్ధాలు చేసే వాడు. బ్రహ్మచారులే (వివాహం కాని వారు) సైనికులుగా రాణించగలరని భావిం చాడు రాజు. యువకులు ఎవ్వరూ వివాహం చేసకోరాదని 'ఫత్వా' జారి చేశాడు. ఈ నిర్ణయం సరికాదు- తప్పు అని మత గురువైన ''వాలెంటైన్'' వ్యతిరే కించాడు. రాజు నిర్ణ యాన్ని ధిక్కరించి ప్రేమి కుల వివా హాలు (సైనికుల) జరిపిం చాడు. ప్రేమను బతి కించాడు. మత గురువైన వాలెంటైన్ తన శాసనాన్ని ఉల్లం ఘించాడని భావించిన రాజు క్లాడియస్ అతనికి మరణశిక్ష విధిం చాడు. ఇదో కథ ప్రచారంలో వుంది. దీనికి కొనసాగింపుగా మరో కథ కూడా చెప్పుకుంటారు. కథలు ఏమైనా స్వేచ్ఛ ధిక్కార స్వరాలే యువతకు ఆదర్శం కావాలి. ఉరిశిక్ష పడి జైలు శిక్ష అనుభవిస్తున్న వాలెంటైన్‌కు జైలర్ కుమార్తె అయిన ఆస్టిరియన్తో పరిచయం కలుగుతుంది. మత గురువుపై సైతం ప్రేమలో పడేలా నాటి పరిస్థితులు మారాయి. క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలుకు ముందు తన ప్రేమను ఓ గ్రీటింగ్ కార్డు తయారు చేసి ''నీ వాలెంటైన్'' అని సంతకం చేశా డనే కథ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది.అందమైన, ఆనందమైన జీవితం ప్రేమికుల హక్కు అని చెప్పాడు. ప్రేమను, ప్రేమికుల్ని కలపడానికి ప్రాణాలు ఫణంగాపెట్టిన వాలెంటైన్‌కు ఘన నివాళిగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవం 'వాలెంటైన్ డే' ఫిబ్రవరి 14న జరుపుతున్నారు. ముఖ్యం గా 17వ శతాబ్దం నుంచి ఈ వాలెంటైన్ డే పై మోజు ఆసక్తి పెరిగింది.
జగమంతా ప్రేమ...
ప్రేమంటే శరీరాన్ని కోరుకో వడమే కాదు అలాగైతే ఆది వ్యామోహం. నిజమైన ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకుని అభిప్రా యాలు పంచుకోవడం. అలాంటి ప్రేమలు మన మధ్య బోలెడున్నాయి. కానీ చిన్నచిన్న విభేదాలతో అంతరాలు పెరిగి బంధాలు దూరమవుతున్నాయి. ఆఫీస్‌లో ప్రేమ, పక్కింటిలో ప్రేమ, బస్టాప్ దగ్గర ప్రేమ, క్లాస్‌రూంలో ప్రేమ, ఇంట్లో ప్రేమ, బయటా ప్రేమ. ప్రేమలేనిది ఎక్కడీ సాటివారిని ప్రేమించడంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకుంటే సర్వజనీనమవుతుంది. నిజమైన ప్రేమలో ధనం, హోదా, కీర్తి, అధికారంలో ఉండవు. నిలబడవు. ఒక ఆదర్శమైన దాంపత్య జీవనంలోకి పురుషుడు, స్త్రీ ప్రవేశించి దేశభక్తి యుతమైన పౌరుల్ని తీర్చిదిద్దాలి. సంసార మధురిమలు.. విలువలు నేర్పాలి. ఆదర్శాలతో జీవనం సాగించాలి. ఆమెకు తన భర్తే సర్వస్వం.. కానీ ఆమె అంటే ఇంకొకరికి ప్రాణం ఇది కూడా ఒకరకమైన ప్రేమ. ఇదంతా వన్‌సైడ్‌గానే ఉంటుంది. కానీ అందులోనూ ప్రేమకోణం దాగుంది. కానీ ఎందుకూ, ఏమిటీ ఇది తప్పు కదా! అంటే ప్రేమలో సమాధానాలు దొరకవు. ఇందులో మంచిగా ఆలోచిస్తే మనకు మంచే కనిపిస్తుంది. తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయికి పరిస్థితులు అనుకూలించక వేరే ఎవరితో పెండ్లయితే ఆ కాపురం కలకాలం బాగుండాలని కోరుకోవడం కూడా ఒకరకమైన ప్రేమ. ప్రేమించినప్పుడే కాదు పెండ్లి తర్వాత కూడా అదే ప్రేమను కొనసాగించడంలోనే నిజమైన ప్రేమ దాగి ఉంది. ప్రేమలో ఎన్నో సందేశాలు, అనుభవాలు, అనురాగాలు ఉన్నా స్వచ్ఛమైన ప్రేమకు దారిలేనివి, దొరకనవి కూడా అక్కడ క్కడ చాలానే ఉన్నాయి. ఫేస్బుక్ ప్రేమ, వాట్సాప్ ప్రేమ, సెల్ ఫోన్ ప్రేమతో కాలక్షేపం చేయడం ఈ కాలంలో పెరిగిపోయింది. కానీ ఇందులోనూ వాస్తవమైన ప్రేమల్ని గుర్తించగలగాలి. అప్పుడు జగమంతా ప్రేమమయం అవుతుంది.
ప్రేమ స్థానంలో ద్వేషం!
ప్రేమికుల రోజు అనగానే హిందూ మత ఛాందస శక్తులు పార్క్‌ల వెంట, ప్రేమికుల వెంటపడి దౌర్జ న్యంగా పెళ్ళిళ్ళు చేయడం, దాడులు చేయడం, వేధింపులు, సాధింపులు దేశంలో చూస్తూనే ఉంటాం. ఇది బాధా కరం. భారతదేశంలో ప్రేమికుల రోజు దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ విదేశీ సంస్కతి పేరుతో చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ మన దేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యా మ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ దినోత్సవాలు నిర్వహిస్తున్నారు. 2012లో ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాత-పిత పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న 'బ్లాక్ డే'గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.
సృష్టి ఉన్నంతకాలం ప్రేమ..
దేశంలో కుల దురహంకార హత్యలు, ప్రేమికులపై దాడులు దేశంలో అనేక చోట్ల నిత్యకృత్యమ య్యాయి.ఇది విషాదం. ప్రేమించ లేదనే ఆగ్రహంతో మహిళలపై దాడులూ అనేకమే జరుగుతున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి లైంగిక దాడులు చేసే ఘటనలు చోటుచేసు కుంటున్నాయి. అపరిపక్వత, ప్రేమపై అవగాహన లేమి ఈఉన్మాదానికి కారణాలు. ఈ వ్యవస్థ మనుషుల్ని మనసు లేని మార్కెట్ మయం చేసినా.. సృష్టి ఉన్నంత కాలం 'ప్రేమ' స్త్రీ పురుషుల మధ్య అనురాగం చిగురిస్తూనే వుంటుంది. ఇది సహ జాతంగా జరుగుతుంది. పేరుమాళ్ల ప్రణరు- అమృతలాంటి ప్రేమలు మనమధ్య పుట్టుకు రావడం మనం హర్షించాలి, ఆహ్వానించాలి. ప్రణరు కులదురహంకార హత్యకు గురైనప్పుడు అమృత గర్భిణి. ఆతను చనిపోయినా తన భర్త పంచిన ప్రేమా నురాగాలతో కొడుకును పెంచుకుంటున్న ఆమె ఈతరం ప్రేమకు గొప్ప స్ఫూర్తి. అలాంటివాళ్లు దేశంలో వెలుగులోకి రానివారు కూడా ఎంతోమంది ఉన్నారు. నేటి యువత తమ ప్రేమను ప్రపోజల్స్‌ను.. వ్యక్తం చేస్తూ, కొత్త దారులు తొక్కుతున్నారు. 'ప్రేమే సృష్టికి మూలం...ప్రేమే జగతికి మార్గం' అంటూ.. నవలోకం నిర్మించే దిశగా ప్రయాణిస్తున్నారు ప్రేమికులంతా.. మూఢాచారాన్ని మనువాద సంస్కృతిని, కుల మతాన్ని, పెత్తందారీ భూస్వామ్య సంస్కృతిని యువత మనిషిని మార్కెట్ సరుకుగా, వినిమయం సంస్కృతికి నెట్టే ప్రపంచీకరణ విషపు ఫలాలు రెండు వేల ఏండ్ల నుంచి మరింత ఎక్కువయ్యాయి. స్త్రీని భోగ వస్తువుగా అంగడి సరుకుగా మార్చే సామ్రాజ్యవాద దుష్ట సంస్కృతిపై యువత పోరాడాలి. కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించాలి. స్వకుల వివాహాల కంటే వర్ణాంతర వివాహాలే మిన్న అంటూ ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులు నిరంతరం కృషి చేస్తున్నాయి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఉపాధి- రక్షణకు కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే సృష్టిలో ప్రేమ వర్థిల్లుతుంది..
ప్రేమ సూక్తులు..
- నిజమైన ప్రేమకు అర్థం, మనం మనపై చూపించుకునే అభిమానం అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.
- మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు. కానీ అది తప్పు, ఎందుకంటే నేను నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
- నీవు మాట్లాడితే వినాలని ఉంది. కానీ నీవు మాట్లాడే క్షణం నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.
- మగవాడి నిజమైన సామర్థ్యం అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.
- ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే, ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.
- ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.
- ప్రేమతో కూడిన ఒక కౌగిలింత వంద మాటలతో సమానం.
- ప్రేమించటం అంటే ప్రేమను ఇవ్వటం, తిరిగి ఆశించటం కాదు.