Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక నిత్యనూతనమైన ప్రకృతి ఒడిలోకి వెళ్ళాలని, తనివితీరా ఆ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, మా పిల్లలకి పంచాలని ఎప్పటి నుంచో ఒక కోరిక.
దసరా సెలవులు రావడంతో, బెంగళూరు వెళ్ళాం. అక్కడి నుంచి ''కూర్గ్''కు దానిని ''మడకిరి'' అని కూడా పిలుస్తారు. రెండు వందల ఆరవై ఐదు కిలోమీటర్ల దూరం, దాదాపు ఆరు గంటల ప్రయాణం. ఉదయం ఎనిమిది గంటలకు, టిఫిన్ చేసి బయలు దేరాం. మధ్యాహ్నాం మూడు గంటలకు అక్కడకు చేరుకున్నాం. దారిలో భోజనం చేశాము.
వెళ్ళేదారి, పట్టణం నుంచి పల్లెకు వెళ్తున్నట్టు చుట్టూ పొలాలు, మధ్య మధ్యలో అరటి తోటలు, చెరకు తోటలు, బోర్ల నుంచి ఉబికి వస్తున్న నీళ్ళు చూడడానికి చాలా ఆహ్లాదంగా వున్నాయి. మధ్యలో ఆగి, పిల్లలు ఆ పొలం దగ్గర పిల్లకాలువలో ప్రవహిస్తున్న నీళ్ళలో ఎగిరి గంతులేస్తూ, ఒకరికొకరకు బట్టలు తడుపుకుంటూ, ఆడుకుంటూ నవ్వుతున్నారు. అది ముగించు కుని, కొంచె ముందుకు వెళ్ళగానే, ''పెన్నానది'' ఉరకలేస్తుంది. ఆ గలగల సవ్వడికి మనసు పులకరించపోయింది.
''కూర్గ్''లో, దసరా హడావుడి మామూలుగా లేదు. అటు ప్రకృతి ఇటు జన ప్రవాహం, ''అతిథి గృహాలన్నీ'' వారితో నిండిపోయాయి. పిల్లలు, వారికి కావాల్సిన ఆట వస్తువులు అడిగి కొనుకున్నారు.
ఆ రోజు సాయంత్రం, తిరిగి వస్తుండగా, ఏదో వెలితి. ఇంకా ఈ ప్రయాణంలో ఏదో కోల్పోయినట్టుగా, ఆ చెట్టూ, చేమలు, పక్షుల కిలకిలలు,సెలయేరు గలగలలు, పిల్లగాలి స్వాగతాలు మమ్మల్ని వదలి వెళ్ళొద్దంటున్నాయి. సనసన్నగా చీకటి ఆవరిస్తోంది. సూర్యుడు గూటికి చేరువలో వున్నాడు. జాబిల్లి ఎప్పుడూ వద్దామా, అని నింగి నుంచి తొంగి చూస్తున్నట్టుగా వుంది.
ఆఖరి ప్రయత్నంగా, మళ్ళీ ప్రయత్నించాం. ఈ అడవిలో ఆ రోజు గడపడానికి చెట్ల మీద మంచెలు, అక్కడక్కడా చిన్న కుటీరాలు, ఇప్పుడే మొదలవుతున్న పెంకుటిళ్ళ నమూనాలు కనిపిస్తున్నాయి, సమీపానికి దూరంగా. ఆ ప్రయత్నంలో భాగంగా, ఒక దుకాణం దగ్గర ఆగాం. మావారు ఆ దుకాణ యజమానితో మాట్లాడుతుండగా, నన్ను ఒక కళాఖండం బాగా ఆకర్షించింది. కాఫీ కాండాన్ని (ూ్వఎ) ఆకర్షణీయమైన, పూల కూజాగా మలిచిన తీరు, అద్భుతమనిపించింది. ఇంతలో వచ్చిన పని మరచి, కాఫీ మొక్కలను పండించే విధానం, వాటి జీవితకాలం తెలుసుకొని ఆశ్చర్యపోయాను. కాఫీ మొక్కలు రెండు రకాలట. మొదటి రకం జీవిత కాలం ఎనెభై ఏండ్లు కాగా, 2వ రకం వంద ఏండ్లు అని చెప్పారు. మొక్క పెట్టిన నాలుగు నుంచి ఐదు ఏండ్ల తర్వాత పంట మొదలవుతుందట. ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తుందట.
ఈ లోపు, మావారు దుకాణ యజమానితో మాట్లాడుతూ నన్ను అక్కడికి రమ్మని సైగచేశారు. ఇక్కడికి దగ్గరలో ఈ రోజే ప్రారంభించిన అతిథిగృహం వుందని మావారికి చెప్పారట. చూద్దామా అన్నారు.
అప్పటికి, చీకటి తన రాజ్యాన్ని పూర్తిగా విస్తరించింది. అమ్మో! ఈ చీకట్లో, ఆ అడవి లోపల ఈ రాత్రి, తిరిగి మళ్ళీ వస్తామా? సూర్యోదయం చూస్తామా? అనే భయం ఒకవైపు, అయినా, ఎప్పుడూ సమాజంలో చూసే ఘర్షణలు - సంఘర్షణలు,''డబ్బు'' ఆడించే, ఆటలకన్నా, వనవాస-సహవాసం, అంత కష్టమా అనిపించింది. సరే, ఆ నిశిరాత్రి, ఆ అరణ్యం ఎట్లా ఉంటుందనే ఆత్రుత, మన కోసమే ఈ అవకాశం వచ్చిందా అనే ఆనందం, ''ధైర్యే సాహసే లకీë'' అనుకుని, వెళ్దాం అన్నాను. కానీ, ఆ చీకట్లో, అడవిని చూడాలన్ని ఉన్నా, చిన్నప్పటి సినిమాల్లో చూసిన, ఆ సీన్లు గుర్తుకు వచ్చినా మళ్ళీ అడుగు ముందుకు వేసి, బయలు దేరాము.
ఆ షాపు యజమాని, ఆ ఇంటి మేనేజరును పిలిపించాడు. అతను ముందు వెళ్తున్నాడు మాకు దారి చూపిస్తూ. ఆందోళన, ఆత్రుత, అయోమయం, ఆనందం ఆసాంతం నన్ను ఆవరించాయి.
ఆ అడవిలో మా కారు వెలుతురికి, పాము మెలికల్లా ఉంది. ఆ దారి ప్రతి మలుపులో, ఏమన్నా అడవి జంతువు ఎదురొస్తుందా? ఇంకా ఏవో భయాలు.
ఎంత అందమైన ప్రకృతి. దేవుడు ఇచ్చిన వరం మనకు ఈ ప్రకృతి ఇరువైపులా, ఆకుపచ్చని చెట్లు, ఊగుతూ స్వాగతం పలుకుతున్నాయి. పక్షులు, చెట్ల కొమ్మల మీద ఊయల ఊగుతూ నిద్రపోతున్నాయి. అప్పుడే, వచ్చామా అనిపించింది, ఆ ఇల్లు చేరగానే, భయాలన్నీ తుర్రుమన్నాయి.
కొత్తగా నిర్మించిన,అందమైన ఇంద్రభవనం ఆ పెంకుటిల్లు. మా తోనే, వారి ''అతిథిగృహ ప్రవేశం'' జరిగింది. మొదట చుట్టూ చూశాను, అన్ని వైపుల నుండి ప్రకృతి ఇక్కడే వుండు అంటున్నట్టుగా సైగ చేస్తుంది. ఆ యజమానిని కలిసి, మాట్లాడాక, మాకు ఒక నమ్మకం వచ్చింది.
మాకు కేటాయించిన, గదిలోకి వెళ్ళాం. అంతా బాగుంది. వరండాలోకి వచ్చి, ఆకాశం వైపు, ఆ చెట్ల వైపు చూశాను. ఆ ప్రకృతి అందాన్ని వర్ణించలేం. ''వెన్నెల'' అడవిలో దేవకన్యలా విహరిస్తుంది. చెట్లు, ఆ గాలికి నాట్యమాడుతున్నాయి. నిశబ్దం, మనసుని మైమరిపిస్తుంది.
ఒక్కసారి, ఇల్లు గుర్తుకు వచ్చింది. అక్కడ మనుషులు,''డబ్బు - రాజకీయాలు'' ఈ రెండింటి చుట్టూ తిరుగుతూ, స్వార్థం - కక్షలు, కోపాలు, నిత్యం ఆందోళనలు అనే అగ్ని గుండం నుంచి ఒక్కసారిగా వెన్నలాంటి వెన్నెలలో హాయిగా వుంది. ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది.
స్వచ్ఛమైన గాలి, స్వార్థంలేని వెన్నెల, తల ఎత్తి చూస్తే తప్ప పూర్తిగా కనిపించని ఆకాశం, అంతగా దుప్పటిలాగా కప్పేసిన చెట్ల అందం, వాటి తోడుగా అల్లుకున్న లతలు, చీకట్లో వెన్నెలకి మెరుస్తున్నాయి, మా రాకకు మురుస్తున్నట్టుగా వున్నాయి.
ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయని తెలుసు. అలాగే 'మనసు' కూడా చల్లగా ఉంటుందని అప్పుడే తెలిసింది. ఇంతలో వారు కాఫీ పంపించారు. ఆ అరణ్యంలో కాఫీ చాలా బాగుంది. అక్కడే పండించిన, కాఫీ మొక్కల నుంచి తీసింది కదా.
కృత్రిమంగా మనిషి ఎన్ని సృష్టించినా, ప్రకృతిని మించి ఏదీ సృష్టించలేం. ''ఎక్కడి నుంచి మనిషి వచ్చాడో, అక్కడే ప్రశాంతంగా ఉండగలడు'' అని అన్నాను, మా వారితో.
'అవును మనిషి సృష్టి మనిషినే బాధిస్తుంది, వేధిస్తుంది జీవచ్ఛవంలా చేస్తున్నా మారడం లేదు మనిషి'' అన్నారు మా వారు. ఈ లోపు వారు భోజనం సిద్ధం చేశారు.
భోజనం కూడా ఎప్పుడూ, చేయనట్టూ, ఇవ్వాలే తింటున్న కొత్తగా, చాలా రుచిగా అనిపించింది. ఇలాంటి రోజు కోసం ఎన్ని రోజులు, ఎదురు చూసినా పర్వాలేదనిపించింది. జీవితంలో ప్రతి ఒక్కరూ, ఒక్కరోజు అయినా, ప్రకృతిలో గడపాలి. అలసిపోయిన శరీరం, ఆనందంతో ''పరవశించిన'' మనసుకు, ఆ రాత్రి పూర్తి నిద్ర నిద్దామని కళ్ళు మూసుకున్నా, ఆలాపనగా.
పక్షులు పిలుస్తున్నాయి, చల్లగాలి నిద్ర పొమ్మంటుంది. చెట్ల నుంచి ప్రతి ఆకును, కొమ్మని తుమ్మెదలని, ప్రతి కీటకాన్ని తట్టి లేపుతున్నట్టుగా ఉంది సూర్యోదయం. కోయిల కిలకిలలు, చిలుకల సరిగమలు, తుమ్మెదల ఝంకారాల నడుమ, ఎర్ర మందారం, ప్రకృతి శిగ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉంది ఆ ఆద్యుతుని రాక చూస్తూ ఉండిపోయాం కొన్ని క్షణాలు.
అక్కడి వారు చెప్పారు, ఇక్కడే ఒక సేలయేరు ఉందని వెంటనే బయలుదేరాం వారితో పాటు. ఏటవాలుగా ఉంది ఆ దారి. అక్కడి నుంచి కిందకి, నెమ్మదిగా కదిలాం. మళ్ళీ ఏదో భయం, ఏమైనా జంతువులు వెంటపడతాయా! జంతువుల అరుపులు వినిపిస్తాయా! అని. కానీ, మాతో వున్న గైడ్ అన్నాడు, ఇక్కడ క్రూర మృగాలు లేవని, కేవలం ఏనుగులు, జింకలు, నక్కలు, దుప్పిలు, తోడేళ్ళు ఇంకా చాలా ఉంటాయని. ఇది అభయారణ్యం కాదు, ఇక్కడి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అడవిగా మార్చారని. అక్కడి వాళ్ళు ఆ భూమిని ''ఎస్టేట్లు'' అని పిలుస్తారట. ఇక్కడి ప్రతి చిన్న మొక్క, ఆయుర్వేద పరంగా చాలా ఉపయోగపడుతుందని. అప్పటికే, సేలయేరు స్వాగతాలు గల గలా రమ్మని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. ఆ సందడి చూస్తుంటే, చిన్న పిల్లల కేరింతల సవ్వడిలా అనిపిస్తుంది. ఆ నీళ్ళు వేగంతో, ఎగిరెగిరి దూకుతున్నాయి చిన్న రాళ్ళమీదకి, దాడి చేస్తున్నట్టుగా. జలకాలాడుతున్నాయి చేపలు రాకుమార్తెల్లాగా. పక్షులు గుసగుస లాడుతున్నాయి అలిగినట్లుగా. సెలయేరుకు దూరంగా, నెమలి నాట్యమాడుతుంది, తుమ్మెదల తుంబర నాదానికి, అనుగుణంగా.
ఆహా, రెండు కళ్ళు సరిపోవడం లేదు. చెవుల్లో అమృతధార కురిసినట్టుగా ఉంది. ఆ సవ్వడికి
పైన ఆకాశం, నీలిరంగు చీరతో, తెల్లని వెండి పూల డిజైనులో ఉంటే, కింద నేలమ్మ - గంగమ్మ కలిసి ఆడుకుంటున్నాయి. ఈ రెండింటికి, సాక్షులుగా చెట్లు తలూపుతున్నాయి. నేను, నా మొబైల్లో ఆ అందాలను బంధిస్తూ, హఠాత్తుగా నా పాదాల వైపుక చూశాను. నా రెండు పాదాల మీద ఏవో పురుగులు, పట్టుకున్నాయి. కానీ, స్పర్శ తెలియలేదు. ఉలిక్కిపడి అరిచాను. మా వారు వచ్చి, వాటిని తీస్తుంటే, వదట్లేవు. గట్టిగా, బలవంతంగా, పికితేగానీ రాలేదు. కొద్దిసేపటికి రక్తం పొంగు కుంటూ వచ్చింది. నేను చాలా భయపడ్డా. ఆ గైడ్ చెప్పాడు, అవి చెడు రక్తాన్ని పీల్చే, జలగలని (ూఱ్షష్ట్రవర) అని, అవి వర్షాకాలంలో మాత్రమే మట్టి నుంచి బయటకు వస్తాయనీ, వాటి వల్ల ఏ హానీ జరగదని. అక్కడి ప్రజలు చర్మ సంబంధిత రోగాలకు, ఇంకా నయం కానీ రోగాలకు వాటితో చికిత్స చేస్తారని చెప్పాడు. కొద్ది నిముషాలకి, రక్తం ఆగింది. అలా ముగిసింది, సేలయేరు గల గల ఆహ్లాద యాత్ర.
తిరిగి, మా గదికి వచ్చాము. వంట బాధ లేదు. వాళ్ళే అక్కడి, ప్రత్యేక వంటకం ''పుట్టు'' (ఒక టిఫిన్) తెచ్చారు. శనగల కూరతో చాలా బాగుంది. కొద్ది సేపు చదరంగం ఆడాము. తర్వాత, తిరుగు ప్రయాణం మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది.
చాలా భారంగా మొదలయ్యింది. ఇంకా ఇక్కడే, గడిపితే బాగుండు, మళ్ళీ ఎప్పుడు వస్తామో, అని మనసు, చేయాల్సిన పనులు, తీర్చాల్సిన బాధ్యతలను మెదడు గుర్తుకు చేస్తూ, నన్ను బలవంతంగా ముందుకు కదిలించాయి.
''సమాజం - మనిషి'' ఈ రెండే కాకుండా, ''ప్రకృతి - మనిషి'' మమేకమైతే, ''ఆందోళన- ఆవేశం'' తగ్గి, ''ఆరోగ్యం - ఆనందం - ఆయుష్షు'' పెరుగుతాయి.
- మాద నాగాంజలి, 9640098344