Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు వచన కవిత్వ రంగంలో నానీల కవితా రూపం ఒక ట్రెండ్‌ను సృష్టించింది. 1997లోప్రముఖ కవి ఆచార్య ఎన్.గోపి అపూర్వ సృజనే 'నానీలు'. ఈ నానీలు తెలుగు పాఠకుల్లో పటిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అందుకు దాని నిర్మాణ వైచిత్రి; అక్షర నియతి; వస్తు వైవిధ్యంతో యింకా ఎంతో మంది ఆ ప్రక్రియను అందిపుచ్చుకొని 'నానీలు' రాయడం గొప్ప విషయం.. కొట్టి రామారావు; దుగ్గిరాల సోమేశ్వరరావు లాంటి వయోధిక కవులు 'నానీలు' సృజించారు.
సోమేపల్లి తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల, చేను చెక్కిన శిల్పాలు వంటి చక్కటి నానీల సంపుటాలను గతంలోనే వెలువరించి పాఠక ఆదరణ పొందారు. పల్లెల మట్టి పరిమళాల (ప్రతి నానీల్లో) సుగంధం మనల్ని తాకుతుంది. మచ్చుకు కొన్ని నానీలు చూద్దాం!
'భూమికి వంగిన / హరివిల్లు కాదు - నాట్లు వేసే కూలి తల్లి' (పేజీ. 36) అంటారు. నీటిలో అందునా బురదలో వంగి సాయంత్రం దాకా పొలంలో నాట్లు వేసే స్త్రీల కష్టం ఎంతో గొప్పది, విలువైనది.
'బారులు తీరినట్టు - పచ్చని చెట్టు - పేరంటంలో - ముత్తైదువుల్లా' (పేజీ. 32) అంలారు ఓ నానీలో. నీటి పొలం గట్లపైన ... గ్రామాల్లో రోడ్లు పైన అనేక చెట్లు వుంటాయి. పచ్చదనం ఆక్సిజన్ అందిస్తాయి. నేడు అన్నదాత పరిస్థితిని 22 అక్షరాల్లో అద్భుతంగా చెప్పారు కవి. (పేజీ. 26లో)
'అన్నదాతకి - అజీర్తి అధికంగా పెడుతోంది - నీటి బువ్వ' అంటారు. అలాగే మరో నానీలో 'నల్లని నేలపై / రంగుల చీర / రాలిన పూలే / కొత్త డిజైన్లు' అంటూ ఎంతో అందం, ఆనందం ఇచ్చే పూల చెట్లు, రాలిన పూలపై చక్కటి నానీ అందించారు. (పేజీ. 21)
రైతుకు జోడెద్దులకు ఉన్న అనుబంధంపై (పేజీ. 13) రాస్తూ ఇలా అన్నారు. 'ఒంటరి ప్రయాణం - ఎలా అవుతుంది? జోడెద్దులూ - గణగణ గంటలూ' అంటారు. 'ఆకలి డొక్కకు - ముద్ద కరువు - విలాసాల విస్తరికి - దుబారా దరువు' అనడంతో ఆకలి భారతదేశ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మానవ కుటుంబచ్ఛాయలోని అంశాలు... ఎలక్ట్రానిక్ పరికరాలపై నేతలపై రాసిన ఈ నానీలు భవానీ ముందుమాటల్లో అన్నట్లు గూళ్ళలో గాక జనం నోళ్ళలో తప్పక పదికాలాలు నిలుస్తాయి.
నాగలికి నా నమస్కారం
కవి : సోమేపల్లి వెంకట సుబ్బయ్య
పేజీలు : 48, వెల : రూ.60/-
ప్రతులకు : సోమేపల్లి వెంకట సుబ్బయ్య,
16-8-451, ఫస్ట్ ఫ్లోర్, శ్రీనివాస నిలయం,
విజయపురి కాలనీ, 'ఓ' లైన్ (కట్ రోడ్),
జేకేసీ కాలేజీ రోడ్, గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ - 522006.
- తంగిరాల చక్రవర్తి , 9393804472