Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వల్ప స్కోర్ల మెల్బోర్న్ మెగా వార్ థ్రిల్లర్‌లో మేటి జట్టునే విజయం వరించింది. 1992 అనూహ్య విజయ చరిత్ర తరహాలో 2022లో అనిశ్చితి ప్రదర్శనతో కప్పుపై కన్నేసిన పాకిస్థాన్‌ను చిత్తు చేసింది ఇంగ్లాండ్. వైట్‌బాల్ ఫార్మాట్లో ధనాధన్ దూకుడు మంత్రం పఠించిన ఇంగ్లాండ్ 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.
ఛేదనలో బెన్ స్టోక్స్ (52 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. మెగా మ్యాచుల్లో మెరుపు ప్రదర్శనల జోరు కొనసాగించాడు స్టోక్స్. బట్లర్ (26), బ్రూక్ (20), మోయిన్ (19) రాణించగా ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. శామ్ కరణ్ (3/12) విజృంభిణతో తొలుత పాకిస్థాన్ 137 పరుగులకే పరిమితమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలువటం ఇంగ్లాండ్‌కు ఇది రెండోసారి కావటం విశేషం.
- టీ20 ప్రపంచకప్ బట్లర్‌సేన వశం
- ఫైనల్లో పాకిస్థాన్‌పై మెరుపు విజయం
- ఛేదనలో బెన్ స్టోక్స్ అజేయ అర్థ సెంచరీ
నవతెలంగాణ-మెల్బోర్న్
ఇంగ్లాండ్ సాధించింది. చారిత్రక అనుకూలతతో పాకిస్థాన్ కప్పు కోసం పోటీపడినా.. దూకుడు ఏమాత్రం తగ్గని ఇంగ్లాండ్ జట్టునే విజయం వరించింది. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌గా ఇంగ్లాండ్ అవతరించింది. ఆదివారం మెల్బోర్న్లో పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 2010లో తొలిసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందుకున్న ఇంగ్లాండ్.. తాజాగా పాక్‌ను చిత్తు చేసి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది. 138 పరుగుల సవాల్‌తో కూడిన ఛేదనలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (52 నాటౌట్, 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మిడిల్ ఆర్డర్లో కీలక భాగస్వామ్యాలు నిర్మించిన బెన్ స్టోక్స్.. హ్యారీ బ్రూక్ (20), మోయిన్ అలీ (19) సహా జోశ్ బట్లర్ (26, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలిపాడు. బెన్ స్టోక్స్ రాణించటంతో మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పేసర్ శామ్ కరణ్ (3/12), క్రిస్ జోర్డాన్ (2/27) నిప్పులు చెరుగగా, స్పిన్నర్ ఆదిల్ రషీద్ (2/22) మాయ చేశాడు. బాబర్ ఆజాం (32, 28 బంతుల్లో 2 ఫోర్లు), షాన్ మసూద్ (38, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), షాదాబ్ ఖాన్ (20, 14 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కరణ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ పొట్టి ప్రపంచకప్ విజేతగా అవతరించగా, పాకిస్థాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
స్టోక్స్ హీరోచితం : లక్ష్యం 138 పరుగులు. మెల్బోర్న్ మైదానంలో ప్రమాదకర పాక్ పేసర్లను ఎదుర్కొన్నప్పుడు ఈ లక్ష్యం అంత చిన్నదేమీ కాదు. ఈ సంగతి ఇంగ్లాండ్‌కు బాగా తెలుసు. అయినా, ఆ జట్టు దూకుడు మంత్రం వీడలేదు. కెప్టెన్ జోశ్ బట్లర్ (26, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఎదురుదాడికి నాయకత్వం వహించాడు. షహీన్ షాకు బౌండరీతో స్వాగతం పలికిన బట్లర్. నషీం షా, హరీశ్ రవూఫ్లకు అదే రీతిలో బదులిచ్చాడు. నషీం ఓవర్లో ఫైన్ లెగ్‌లో సిక్సర్‌తో అదరగొట్టాడు. తొలి ఓవర్లోనే అలెక్స్ హేల్స్ (1)ను షహీన్ షా అఫ్రిది అవుట్ చేసినా.. బట్లర్ వెనక్కి తగ్గలేదు. రెండు బౌండరీలతో జోరందుకున్న ఫిల్ సాల్ట్ (10)ను రవూఫ్ సాగనంపాడు. బట్లర్ కోసం స్లిప్స్‌లో పన్నాగం పన్నిన పాక్.. ఎట్టకేలకు ఇంగ్లాండ్ సారథి వికెట్ల వెనకాల దొరకబుచ్చుకుంది. దీంతో పవర్‌ప్లేలోనే ఇంగ్లాండ్ టాప్-3 వికెట్లు కోల్పోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోరు 49/3.
ఈ పరిస్థితుల్లో బెన్ స్టోక్స్ (52 నాటౌట్) గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. తొలుత హ్యారీ బ్రూక్ (20)తో కలిసి స్టోక్స్ విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. పాకిస్థాన్ బౌలర్లు విజృంభిస్తున్న తరుణంలో ఈ జోడీ జాగ్రత్తగా ఆడింది. ఎడాపెడా షాట్లకు వెళ్లకుండా సంయమనంతో పరుగులు సాధించింది. బ్రూక్ నిష్క్రమణతో స్టోక్స్‌కు మోయిన్ అలీ (19) తోడయ్యాడు. ఈ జోడీ ఇంగ్లాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చింది. ఒత్తిడి పెరుగుతున్న దశలో మూడు బౌండరీలు బాదిన మోయిన్ అలీ.. సమకరణాలను సవరించాడు. షహీన్ షా అఫ్రిది గాయంతో మైదానం వీడగా.. ఆ ఓవర్లో చివరి ఐదు బంతులు సంధించిన ఇఫ్తీకార్ అహ్మద్‌ను స్టోక్స్ విడిచిపెట్టలేదు. ఓ ఫోర్, సిక్సర్‌తో విలువైన పరుగులు పిండుకున్నాడు. ఆరు పరుగులు అవసరమైన దశలో మోయిన్ అలీ అవుటైనా.. లియాం లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) జతగా స్టోక్స్ లాంఛనం ముగించాడు. మహ్మద్ వసీంపై ఓ బౌండరీతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్.. ఆ తర్వాత సింగిల్‌తో ఇంగ్లాండ్‌కు వరల్డ్‌కప్‌ను కట్టబెట్టాడు. 19 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 138 పరుగులు సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో హరీశ్ రవూఫ్ (2/23), షాదాబ్ ఖాన్ (1/20), షహీన్ షా అఫ్రిది (1/13) రాణించారు.
కరణ్, రషీద్ జోరు! : టైటిల్ పోరులో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్.. తొలుత పాకిస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించింది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై పాక్ ఓపెనర్లు శుభారంభం చేశారు. మహ్మద్ రిజ్వాన్ (15, 14 బంతుల్లో 1 సిక్స్), బాబర్ ఆజాం (32, 28 బంతుల్లో 2 ఫోర్లు) తొలి వికెట్‌కు 29 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనింగ్ జోడీని శామ్ కరణ్ వీడదీశాడు. రిజ్వాన్‌ను బౌల్డ్ చేసిన కరణ్ ఇంగ్లాండ్‌కు బ్రేక్ సాధించాడు. పవర్‌ప్లే అనంతరం పాకిస్థాన్ 39/1తో మెరుగైన స్థితిలో నిలిచింది. మహ్మద్ హరీశ్ (8)ను అవుట్ చేసిన రషీద్ పాక్‌పై ఒత్తిడి పెంచాడు. కానీ బాబర్‌తో కలిసి షాన్ మసూద్ (38, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ జోడీ చివరి ఓవర్లలో ఎదురుదాడికి గట్టి పునాది వేసింది. కానీ ఆదిల్ రషీద్ మ్యాజిక్‌తో బాబర్‌ను రిటర్న్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు. అప్పటికి పాక్ స్కోరు 84/3. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓ ఎండ్‌లో షాన్ మసూద్ నిలిచినా.. మరో ఎండ్‌లో సహకారం అందించే బ్యాటర్ కరువయ్యాడు. షాదాబ్ ఖాన్ (20, 14 బంతుల్లో 2 ఫోర్లు) కాసేపు మెప్పించాడు. ఇఫ్తీకార్ అహ్మద్ (0), మహ్మద్ నవాజ్ (5)లు తేలిపోయారు. చివరి ఐదు ఓవర్లలో 31 పరుగులే చేసిన పాక్ ఏకంగా 4 వికెట్లు చేజార్చుకుంది. కరణ్ మూడు వికెట్ల ప్రదర్శనతకు రషీద్ రెండు వికెట్ల మాయజాలం తోడైంది. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 137 పరుగులే చేసింది. క్రిస్ జోర్డాన్ సైతం రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ (బి) శామ్ కరణ్ 15, బాబర్ ఆజాం (సి,బి) ఆదిల్ రషీద్ 32, మహ్మద్ హరీశ్ (సి) బెన్ స్టోక్స్ (బి) ఆదిల్ రషీద్ 8, షాన్ మసూద్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శామ్ కరణ్ 38, ఇఫ్తీకార్ అహ్మద్ (సి) జోశ్ బట్లర్ (బి) బెన్ స్టోక్స్ 0, షాదాబ్ ఖాన్ (సి) క్రిస్ వోక్స్ (బి) క్రిస్ జోర్డాన్ 20, మహ్మద్ నవాజ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శామ్ కరణ్ 5, మహ్మద్ వసీం (సి) లివింగ్‌స్టోన్ (బి) క్రిస్ జోర్డాన్ 4, షహీన్ షా అఫ్రిది నాటౌట్ 1, హరీశ్ రవూఫ్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు :9, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137.
వికెట్ల పతనం : 1-29, 2-45, 3-84, 4-85, 5-121, 6-123, 7-129, 8-131.
బౌలింగ్ : బెన్ స్టోక్స్ 4-0-32-1, క్రిస్ వోక్స్ 3-0-26-0, శామ్ కరణ్ 4-0-12-3, ఆదిల్ రషీద్ 4-1-22-3, క్రిస్ జోర్డాన్ 4-0-27-2, లియాం లివింగ్‌స్టోన్ 1-0-16-0.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జోశ్ బట్లర్ (సి) మహ్మద్ రిజ్వాన్ (బి) హరీశ్ రవూఫ్ 26, అలెక్స్ హేల్స్ (బి) షహీన్ షా అఫ్రిది 1, ఫిల్ సాల్ట్ (సి) ఇఫ్తీకార్ అహ్మద్ (బి) హరీశ్ రవూఫ్ 10, బెన్ స్టోక్స్ నాటౌట్ 52, హ్యారీ బ్రూక్ (సి) షహీన్ షా అఫ్రిది (బి) షాదాబ్ ఖాన్ 20, మోయిన్ అలీ (బి) మహ్మద్ వసీం 19, లియాం లివింగ్‌స్టోన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (19 ఓవర్లలో 5 వికెట్లకు) 138.
వికెట్ల పతనం : 1-7, 2-32, 3-45, 4-84, 5-132.
బౌలింగ్ : షహీన్ షా అఫ్రిది 2.1-0-13-1, నషీం షా 4-0-30-0, హరీశ్ రవూఫ్ 4-0-23-2, షాదాబ్ ఖాన్ 4-0-20-1, మహ్మద్ వసీం 4-0-38-1, ఇఫ్తీకార్ అహ్మద్ 0.5-0-13-0.