Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనలిస్ట్లు సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నారు. మరో టీ20 ప్రపంచకప్‌కు రెండేండ్ల గడువు ఉన్నప్పటికీ ఇటు భారత్, అటు న్యూజిలాండ్‌లు సత్తా ఉన్న క్రికెటర్ల కోసం అన్వేషిస్తున్నాయి. 2024 రోడ్‌మ్యాప్ దిశగా మెరుగైన బృందాన్ని సమకూర్చుకోవటంతో పాటు ప్రపంచకప్ పరాభవం నుంచి బయటపడేందుకు విజయ ఆస్వాదన కోసం ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 నేడు.
- వరల్డ్‌కప్ సెమీఫైనలిస్ట్‌ల సరికొత్త సవాల్
- భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 నేడు
- మధ్యాహ్నాం 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో..
నవతెలంగాణ-వెల్లింగ్టన్
2022 టీ20 ప్రపంచకప్ ముగిసింది. సెమీఫైనల్లో పరాజయాలు చవిచూసిన భారత్, న్యూజిలాండ్‌లు అట్నుంచి నేరుగా వెల్లింగ్టన్కు చేరుకున్నాయి. ఆధునిక క్రికెట్లో ఐసీసీ ఈవెంట్లకు, ద్వైపాక్షిక సిరీస్‌లకు పెద్దగా విరామం ఉండటం లేదు. ఇటీవల ప్రతి ద్వైపాక్షిక సిరీస్‌ను ఐసీసీ ఈవెంట్ కోణంలోనే చూశారు. ఇప్పుడు ఈ సిరీస్‌ను సైతం అదే కోణంలో చూడాల్సి ఉంటుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ పొట్టి సిరీస్‌ను చూడవచ్చు. 2023 వన్డే వరల్డ్‌కప్ వేదిక భారత్. 2024 టీ20 ప్రపంచకప్ వేదిక వెస్టిండీస్, యుఎస్ఏ. న్యూజిలాండ్ పరిస్థితులు ఈ రెండు ఐసీసీ ఈవెంట్లకు భిన్నంగా ఉంటుంది. దీంతో ఈ సిరీస్‌లో ఇరు జట్ల ప్రణాళికలు, వ్యూహాత్మక ఎత్తుగడలు, ప్లాన్ అమలు పరిచే తీరుపై ప్రధానంగా ఫోకస్ కనిపించనుంది.
హార్దిక్ నాయకత్వంలో.. : ప్రపంచకప్ ఓటమి నుంచి బయటపడేందుకు న్యూజిలాండ్‌పై సిరీస్ విజయాన్ని ఆశిస్తోంది టీమ్ ఇండియా. నాయకుడిగా హార్దిక్ పాండ్య ఫిలాసఫీపై టీమ్ ఇండియా ఆశలు పెంచుకుంది. 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సమయానికి హార్దిక్ పాండ్యకు పూర్తి స్థాయి పగ్గాలు అప్పగించేందుకు అడుగులు పడుతున్నాయి. భారత జట్టు మేనేజ్మెంట్తో పాటు హార్దిక్ పాండ్యకు సైతం కివీస్‌తో టీ20 సిరీస్ సరికొత్త సవాల్ విసరనుంది. కెప్టెన్‌గా పాండ్య ఏ మేరకు జట్టును నడిపిస్తాడనేది ఆసక్తికరం. ఇక యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ టీ20 ప్రణాళికల్లో భాగం కానున్నాడు!. స్పీడ్, పేస్ కలిగిన బౌలర్లను జట్టులోకి తీసుకునేందుకు.. సెలక్టర్లు ఆలోచన చేస్తున్నారు. వేగంగా బంతులు వేయటంలో అంచనాలను అందుకుంటున్న మాలిక్.. పరుగుల కట్టడిలో విఫలమవుతున్నాడు. వెల్లింగ్టన్ టీ20లో తుది జట్టులో చోటు కోసం సీనియర్లతో పోటీపడుతున్న మాలిక్.. అవకాశం దక్కితే పరుగుల నియంత్రణ, వికెట్ల వేటలో సరికొత్త పంథాలో వెళ్తాడేమో చూడాలి. ఇక బ్యాటింగ్ లైపన్లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు అత్యంత విధ్వంసకారులు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బౌలర్లపై పైచేయి కోసం తపించే బ్యాటింగ్ లైనప్ నూతన ఉత్తేజాన్ని అందిస్తోంది. రిషబ్ పంత్, హర్దిక్ పాండ్యలు సైతం ధనాధన్ ఆటలో ముందుంటారు. దీంతో ఈ లైనప్ కాస్త ఆసక్తికరంగా మారింది. గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ విరామం అనంతరం బరిలోకి దిగనున్నాడు. ప్రపంచకప్‌లో బెంచ్‌కే పరిమితమైన చాహల్.. సుందర్‌తో కలిసి స్పిన్ మాయ చేయనున్నాడు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లతో కలిసి ఉమ్రాన్ మాలిక్ పేస్ బాధ్యతలు పంచుకునే వీలుంది.
కెప్టెన్ కేన్‌పై ఫోకస్ : న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టులో పెద్దగా మార్పులు లేవు. ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లను కొందరిని దూరం చేసింది. ఆ స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు కల్పిస్తోంది. మార్టిన్ గప్టిల్‌ను బెంచ్‌కు పరిమితం చేసి ఫిన్ అలెనకు వరల్డ్‌కప్‌కు అవకాశం కల్పించింది. ఆసీస్‌పై మెరిసినా.. ఆ తర్వాతి మ్యాచుల్లో నిలకడ చూపించలేదు. పేసర్ ట్రెంట్ బౌల్ట్ వార్షిక కాంట్రాక్టు తిరస్కరించాడు. దీంతో అతడి స్థానంలో ఆడం మిల్నె నేడు ఆడటం దాదాపుగా ఖాయం. ఇక కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ వరుసగా ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశకు తీసుకెళ్తున్నాడు. అయినా, వ్యక్తిగతంగా అతడి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. పొట్టి ఫార్మాట్లో విలియమ్సన్ ఆట మరీ తీసికట్టుగా తయారైంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం విలియమ్సన్‌ను వద్దనుకుంది. దీంతో స్వదేశంలో, ఐపీఎల్లో నిరూపించే సమయం కేన్‌కు ఆసన్నమైంది. ఐపీఎల్ మినీ వేలానికి ముందు కేన్ విలియమ్సన్కు ఇప్పుడు మరో దారి లేదు. భారత్‌తో సిరీస్‌లో మెరుగైన స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయటమే అతడి లక్ష్యం. గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, డెవాన్ కాన్వేలు భారత్‌తో సిరీస్‌లో కీలకం కానున్నారు. టిమ్ సౌథీ, లాకీ ఫెర్గుసన్, ఆడం మిల్నెలు పేసర్లుగా.. ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్‌లు స్పిన్నర్లుగా జట్టులో నిలువనున్నారు.
పిచ్ రిపోర్టు : న్యూజిలాండ్ పిచ్‌లు అనగానే భారీ స్కోర్లు గుర్తొస్తాయి. కానీ వెల్లింగ్టన్ స్టేడియం అలా కాదు. ఇక్కడ టీ20ల్లో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 162. గత 20 నెలలుగా ఇక్కడ పొట్టి ఫార్మాట్ క్రికెట్ జరుగలేదు. నేడు వెల్లింగ్టన్లో వర్షం సూచనలు ఉన్నాయి. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7.30కి జరుగుతుంది. ఆ సమయానికి వర్షం కురిసే అవకాశాలు లేవు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, యుజ్వెంద్ర చాహల్.
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ఇశ్ సోధి, ఆడం మిల్నె, లాకీ ఫెర్గుసన్.
' డ్రెస్సింగ్‌రూమ్‌లో హార్దిక్ పాండ్య ఆదర్శంగా కనిపిస్తున్నాడు. మైదానంలో అతడు జట్టును నడిపించే తీరు సైతం అమోఘం. హార్దిక్ ఆటగాళ్ల కెప్టెన్. ఆటగాళ్లు అందరూ అతడిని సంప్రదిస్తారు, అందరిలో నమ్మకాన్ని నింపాడు. కెప్టెన్‌గా హార్దిక్‌లో నాకు నచ్చిన అంశం సైతం అదే. టీ20ల్లో ఆట శైలి ఒకటే. దూకుడుగా ఆడుతూనే.. పరిస్థితులను అర్థం చేసుకుంటూ రాణించాలి'
- వీవీఎస్ లక్ష్మణ్, తాత్కాలిక చీఫ్ కోచ్