Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనూహ్యంగా వరుణుడు రంగ ప్రవేశం. భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం అంతరాయంతో సాగలేదు. మ్యాచ్ రోజు వర్షం సూచనలులు ఉన్పప్పటకీ, మ్యాచ్ సమయంలో వాతావరణం మెరుగ్గా ఉంటుందని అంచనా వేశారు. కానీ వరుణుడు మ్యాచ్ సమయంలోనూ విజృంభించటంతో టాస్ పడకుండానే వెల్లింగ్టన్ తొలి టీ20 రద్దుగా ముగిసింది. 20 నెలల తర్వాత జరుగుతున్న టీ20 కావటంతో అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నా, నిరాశ తప్పలేదు.
- టాస్ పడకుండానే తొలి టీ20 రద్దు
- వర్షం అంతరాయంతో సాగని ఆట
నవతెలంగాణ-వెల్లింగ్టన్
టీ20 ప్రపంచకప్‌లో వరుణ గండం నుంచి తప్పించుకోగలిగిన టీమ్ ఇండియా.. న్యూజిలాండ్ పర్యటనలో ఆరంభంలోనే వర్షం ప్రభావం బారిన పడింది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించాడు. ఎడతెరపి లేకుండా వర్షం కురవటంతో కనీసం టాస్ పడకుండానే తొలి టీ20 రద్దు అయ్యింది. 5 ఓవర్ల ఆట కటాఫ్ సమయానికి 45 నిమిషాల ముందే.. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మూడు మ్యాచుల సిరీస్ కాస్త రెండు మ్యాచుల ఉత్కంఠకు తెరతీయనుంది. రెండో టీ20 పోరు ఆదివారం మౌంట్ మౌంగానురులో జరుగనుంది.
అనూహ్యంగా వర్షం : తొలి టీ20 మ్యాచ్‌కు నిజానికి వర్షం ముప్పు లేదనే అనుకున్నారు. వెల్లింగ్టన్లో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కానీ వర్షం మధ్యాహ్నాం వేళల్లోనే ఉండనుంది.. సాయంత్రానికి వర్షం ఉండదని సమాచారం. కానీ అటువంటిదేమీ జరుగలేదు. వర్షం సాయంత్రంతో పాటు రాత్రి కూడా విరామం లేకుండా కురిసింది. కనీసం టాస్ వేసేందుకు సైతం వరుణుడు బ్రేక్ ఇవ్వలేదు. వర్షంతో ఇరు జట్ల క్రికెటర్లు ఇండోర్స్కు పరిమితం అయ్యారు. న్యూజిలాండ్ క్రికెటర్లు ఫుట్‌బాల్ ఆడుతూ సమయాన్ని గడుపగా.. భారత క్రికెటర్లు కొత్తగా రగ్బీ ప్రయత్నించారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోనే నిష్క్రమించిన భారత్, న్యూజిలాండ్‌లు.. వెల్టింగ్టన్ ధనాధన్‌తో ఆ పరాజయం నుంచి దూరం జరిగేందుకు చూశాయి. కానీ వరుణుడు ఆ అవకాశం దూరం చేశాడు. దీంతో ఇరు జట్లు వరల్డ్‌కప్ సెమీఫైనల్ పరాజయం అనంతరం ఆడనున్న మ్యాచ్ మౌంట్ మౌంగానురుకు మారింది. సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్య సారథ్యంలో భారత్ యువ జట్టును బరిలోకి నిలిపింది. మార్టిన్ గప్టిల్, ట్రెంట్ బౌల్ట్‌ను వదిలేసిన న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను కొత్త సవాల్‌గా తీసుకుని ఆడేందుకు సిద్ధమవుతోంది.
ఇక జీవితంలో ఆడను!
గాయం నుంచి కోలుకుని జాతీయ జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్ విజయం అనంతరం సుందర్ గాయంతో మైదానం బయటే ఎక్కువగా గడిపాడు. పూర్తి ఫిట్నెస్ సాధించిన వాషింగ్టన్ రీ ఎంట్రీకి ఎదురుచూస్తున్నాడు. 'ఆరు సంవత్సరాల క్రితం విచిత్రమైన ప్రమాదం జరిగింది. ఫుట్‌బాల్ ఆడుతుండగా చీలమం గాయమైంది. ఆ గాయంతో క్రికెట్‌కు దూరమయ్యాను. దీంతో అప్పటి నుంచి జీవితంలో మళ్లీ ఫుట్‌బాల్ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. ఫిట్నెస్ కోసం ఫుట్‌బాల్ మాత్రమే కాదు, ఇంకెన్నో అందుబాటులో ఉన్నాయి. ఎన్సీఏలో ఎక్కువ సమయం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాను. లాంకషైర్‌కు ఆడుతున్న సమయంలో భుజం గాయంపై ఫోకస్ పెట్టాను. బాడీ స్కిల్స్‌పై సైతం ఎంతగానో కష్టపడ్డాను. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇష్టమైన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి' అని వాషింగ్టన్ సుందర్ అన్నాడు.