Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫార్ములా రేసు.ట్రాక్‌పై మెరుపు వేగంతో దూసుకెళ్లే కార్లను ఇప్పటివరకు టెలివిజన్ తెరలపైనే వీక్షించిన హైదరాబాద్ వాసులు.. తొలిసారి ప్రత్యక్ష్యంగా ఆస్వాదించబోతున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ రూపంలో ఫార్ములా 4 రేసు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్లో భాగంగా నేడు హుస్సేన్ సాగర్ తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై ఫార్ములా కార్లు దూసుకెళ్లనున్నాయి. నవంబర్ 19, 20న స్ట్రీట్ సర్క్యూట్ పోటీలు హైదరాబాద్‌లో జరుగనున్నాయి.
- హైదరాబాద్‌లో నేడు ఫార్ములా 4 రేసు
- ఇండియన్ రేసింగ్ లీగ్ 2022
- మధ్యాహ్నాం 3.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-హైదరాబాద్
ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్‌కు సర్వం సిద్ధం. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్‌పై నేడు ఆరు జట్ల డ్రైవర్లు స్ట్రీట్ సర్క్యూట్లో పోటీ పడనున్నారు. రెండు దశల్లో, నాలుగు అంచెల్లో జరుగనున్న ఇండియన్ రేసింగ్ లీగ్ రెండో అంచె నేడు హైదరాబాద్‌లో జరుగనుంది. రెండో అంచె పోటీలు మద్రాస్ మోటార్ రేసు ట్రాక్‌పై నవంబర్ 25-27న జరుగనున్నాయి. రెండో దశలో తొలి అంచె పోటీలు మద్రాస్ మోటార్ రేసు ట్రాక్ (చెన్నై)పై డిసెంబర్ 2-4న నిర్వహించనుండగా, చాంపియన్స్ రేసుకు హైదరాబాద్ డిసెంబర్ 10-11న వేదిక కానుంది.
6 జట్లు, 24 మంది డ్రైవర్లు :
ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్లో ఆరు జట్లు పోటీపడుతున్నాయి. ఎక్స్1 రేసింగ్ లీగ్ తరహాలోనే ఇండియన్ రేసింగ్ లీగ్‌లో సైతం అన్ని ప్రాంఛైజీలు భారతీయ నగరాలకు చెందినవే. ప్రతి జట్టులో నలుగురు ఎఫ్4 స్థాయి డ్రైవర్లు ఉంటారు. నలుగురులో కచ్చితంగా ఓ మహిళా డ్రైవర్ ఉండాలి. బెంగళూర్ స్పీడ్‌స్టర్స్, చెన్నై టర్బో రైడర్స్, గోవా ఏసెస్, గాడ్స్పీడ్ కోచి, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్, స్పీడ్ డెమాన్స్ ఢిల్లీలు ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్ చాంపియన్‌షిప్ కోసం పోటీపడుతున్నాయి. తాజా స్ట్రీట్ సర్క్యూట్లో తొలి రోజు ఒక కారులో ఒక డ్రైవర్ ఉండనున్నాడు. ఆదివారం జరిగే పోటీల్లో ఒకే కారులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు.
రేసులో భారతీయత :
ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్‌ను ప్రతిభాన్వేషణ, ఫార్ములా 1 లైసెన్స్ అర్హత టోర్నీగా సైతం భావించవచ్చు. అంతర్జాతీయా ఆటోమోబైల్ సమాఖ్య అధికారికంగా గుర్తింపు లభించిన తొలి ఇదే కావటం విశేషం. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన డ్రైవర్‌కు 12 ఫార్ములా 1 పాయింట్లు లభిస్తాయి. వాయిదా పడిన ది ఫార్ములా రీజినల్ ఇండియన్ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిస్తే 18 ఫార్ములా 1 పాయింట్లు లభిస్తాయి. ఫార్ములా 1 లైసెన్స్ పొందేందుకు 40 సూపర్ లైసెన్స్ పాయింట్లు అవసరం అవుతాయి. దీంతో ఇండియన్ రేసింగ్ లీగ్‌లో నిలకడగా రాణిస్తే ఫార్ములా 1 లైసెన్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈవెంట్ నిర్వాహకులు రానున్న రెండేండ్లలో ఫార్ములా 2 రేసర్లను తయారు చేయటంపై దృష్టి నిలిపింది. ఇక ఆరు జట్లలోని 24 మంది డ్రైవర్లలో ఏకంగా 12 మంది డ్రైవర్లు భారతీయులే కావటం గమనార్హం. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టుకు తెలుగు తేజం అనింధిత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
గంటకు 240 కిమీ వేగం :
ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో వాడుతున్న కార్లు ఫార్ములా 3 ప్రమాణాలతో కూడినవి. ఇటలీ కంపెనీ వోల్ఫ్ తయారు చేసింది. ది వోల్ఫ్ జిబి08 థండర్ కార్లు 1100 సిసి సామర్థ్యంతో గంటకు 240 కిమి గరిష్ట వేగం అందుకోగలవు. కారు బరువు 380 కిలోలు కాగా, నాలుగు మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు ఉంటుంది.
ఫార్ములా ఈకు ట్రయల్! :
ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న హైదరాబాద్ ఫార్ములా ఈ రేసుకు సన్నాహాక రేసుగా పరిగణించవచ్చు. ఫార్ములా ఈ రేసులో వాడే కార్లు పూర్తిగా ఎలక్ట్రిక్ బ్యాటరీలతో నడిచేవి కాగా.. తాజా స్ట్రీట్ సర్క్యూట్లో రెగ్యులర్ ఫార్ములా సిరీస్ రేసుల్లో వినియోగించే ఇంధనంతో నడిచే వాహనాలు కావటం గమనార్హం.
2.7 కిమీ సర్క్యూట్ :
ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్, ట్యాంక్‌బండ్ చుట్టూ 2.7 కిమీ మేరకు ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఎఫ్ఐఏ, ఎఫ్ఈ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు ట్రాక్‌ను నూతనంగా తీర్చిదిద్దారు. ఈ ట్రాక్ ప్రపంచ శ్రేణి ఫార్ములా రేసుకు అనుగుణంగా ఉండటంతో పాటు వీక్షకుల భద్రతకు సైతం భరోసా కల్పించేలా ఉంటుంది. మరో నాలుగేండ్ల పాటు హైదరాబాద్ ఈ రేసుకు ఆతిథ్యం ఇవ్వనుండటంతో..రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనులు జరిపించారు.
జట్ల వివరాలు :
బెంగళూర్ స్పీడ్‌స్టర్స్ : బియాంక (ఫిలిప్సిన్స్), అన్షుల్ గాంధీ, రిశోన్ రాజీవ్ (భారత్), ఒలీవర్ వెబ్ (ఇంగ్లాండ్).
చెన్నై టర్బో రైడర్స్ : పార్థ్ గోర్పాడె, విష్ణు ప్రసాద్ (భారత్), నికోలె హర్డా (కెనడా), జాన్ లాంకస్టర్ (ఇంగ్లాండ్).
గోవా ఏసెస్ : సోహిల్ షా, ఆమిత్ సయద్ (భారత్), హైమన్ (దక్షిణాఫ్రికా), గాబ్రియెల జిలకోవా (చెక్ రిపబ్లిక్).
గాడ్స్పీడ్ కోచి : రుహాన్ అల్వా, నిఖిల్ బోహ్రా (భారత్), జోర్డాన్ అల్బర్ట్ (ఇంగ్లాండ్), ఫబియనె (లిచిటెన్షియన్)
హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ : అనింధిత్ రెడ్డి, అఖిల్ రవీంద్ర (భారత్), లోలా లవిన్ఫోసె (ఫ్రాన్స్), నీల్ జానీ (స్విట్జర్లాండ్)
స్పీడ్డెమాన్స్ ఢిల్లీ : ఆకాశ్ గౌడ, షహన్ అలీ మోసిన్ (భారత్), మార్టిన్ (ఫ్రాన్స్), మిచ్ గిల్బర్ట్ (ఆస్ట్రేలియా)