Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టైటిల్ ఫేవరేట్, అగ్రజట్టు ఇంగ్లాండ్ ఫిఫా ప్రపంచకప్ రేసు ఘనంగా మొదలెట్టింది. గ్రూప్-బి ఆరంభ మ్యాచ్‌లో ఇరాన్‌తో తలపడిన త్రీ లయన్స్ 90 నిమిషాల ఆటలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఇరాన్‌పై 6-2తో ఏకపక్ష విజయం నమోదు చేసిన ఇంగ్లాండ్ ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది.
- ఇరాన్‌పై 6-2తో ఘన విజయం
- ఫిఫా ప్రపంచకప్ 2022
దోహా (ఖతార్) : ఇంగ్లాండ్ అదరగొట్టింది. ఫిఫా ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది. 2022 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-బిలో ఇరాన్‌పై ఇంగ్లాండ్ భారీ విజయం నమోదు చేసింది. 6-2తో నాలుగు గోల్స్ వ్యత్యాసంతో గెలుపొందింది. ఇరాన్‌తో మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లాండ్.. ఇరాన్‌ను చిత్తుగా ఓడించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెల్లింగ్‌హామ్, బుకాయో సకా, రహీమ్ స్టెర్లింగ్, మార్కస్ రష్‌ఫోర్డ్, జేక్ గ్రీలిశ్లు గోల్స్ కొట్టారు. ఇరాన్ నుంచి మెహెది తరేమి రెండు గోల్స్‌తో ఊరట అందించాడు.
ఆది నుంచీ దూకుడు : ఇంగ్లాండ్ ఆది నుంచి దూకుడు చూపించింది. ఇరాన్ గోల్ పోస్ట్‌పై ఏకంగా 13 సార్లు దాడి చేసిన ఇంగ్లాండ్ ఆ జట్టును ఉక్కిరి బిక్కిరి చేసింది. బంతిని 79 శాతం ఆధీనంలో నిలుపుకున్న త్రీ లయన్స్.. మెరుపు పాస్‌లతో ఇరాన్‌ను తికమక పెట్టింది. ఆట 35వ నిమిషంలో జ్యూడ్ బెల్లింగ్‌హామ్ గోల్‌తో ఇంగ్లాండ్‌కు తొలి గోల్ అందించాడు. నిమిషాల వ్యవధిలోనే బుకాయో సకా (43వ నిమిషం) ఇరాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. ప్రథమార్థం చివరి క్షణాల్లో రహీం స్టెర్లింగ్ సైతం గోల్ నమోదు చేయటంతో ఇంగ్లాండ్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫిఫా ప్రపంచకప్‌లో పదో మ్యాచ్ ఆడుతున్న రహీం తొలి గోల్ నమోదు చేశాడు. ద్వితీయార్థంలో ఇరాన్ గోల్ ఖాతా తెరిచింది. మెహెది తరేమి 65వ నిమిషంలో గోల్ కొట్టాడు. 62వ నిమిషంలో బుకాయో సకా, 71వ నిమిషంలో మార్కస్ రష్‌ఫోర్డ్, 90వ నిమిషంలో జేక్ గ్రీలిశ్లు గోల్స్ మోత మోగించారు. అదనపు సమయంలో లభించిన వీఏఆర్ పెనాల్టీతో ఇరాన్ ఓటమి అంతరం తగ్గించుకుంది. మెహెది తరేమి మరో గోల్‌తో మెరిశాడు. ఇరాన్ ఓటమిని 2-6కు మెరుగుపర్చాడు.