Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిపా ప్రపంచకప్ రెండు సార్లు చాంపియన్, ప్రపంచ ఫుట్‌బాల్ అగ్ర జట్టు ఓవైపు. వరల్డ్ నం.53, ఫిఫా ప్రపంచకప్‌లో ఆడుతున్న పసికూనల్లో ఒకటి మరో జట్టు. లియోనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలికేందుకు టైటిలే లక్ష్యంగా ఖతార్‌కు చేరుకున్న అర్జెంటీనాకు పసికూన సౌదీ అరేబియా దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం నమోదు చేసిన సౌదీ అరేబియా.. 2-1తో అగ్ర జట్టు అర్జెంటీనాపై సంచలన విజయం నమోదు చేసింది. ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించిన తొలి ఐరాపయేతర జట్టుగా సౌదీ అరేబియా చరిత్ర సృష్టించింది.
- సౌదీ అరేబియా చేతిలో పరాజయం
- 1-2తో భంగపడిన మాజీ చాంపియన్
- ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలోనే సంచలనం
నవతెలంగాణ-లుసైల్ :
ఫిఫా 2022 ప్రపంచకప్. గ్రూప్-సి ఆరంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో అర్జెంటీనా ఢ. సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ చివరి వరల్డ్‌కప్‌గా భావిస్తోన్న ఈ టోర్నీలో.. అతడి విన్యాసాలు చూసేందుకు అభిమానులు టీవీలకు అతుక్కుపోయారు. టోర్నీలోనే అత్యంత బలమైన ఎటాకింగ్ బృందాన్ని కలిగిన అర్జెంటీనా అంచనాలను తగినట్టుగానే ఆరంభ పది నిమిషాల్లోనే హల్చల్ చేసింది. ఆఫ్‌సైడ్ రూల్ అడ్డురాకపోతే తొలి పది నిమిషాల్లోనే అర్జెంటీనా గోల్స్ వర్షం కురిపించేది. 4-0తో ఎదురులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లేది. కానీ సౌదీ అరేబియా ఆలోచనలు భిన్నంగా సాగాయి. ద్వితీయార్థం ఆరంభ పది నిమిషాల్లో సంచలన ప్రదర్శన చేసిన సౌదీ అరేబియా.. రెండు గోల్స్ నమోదు చేసి అర్జెంటీనాను నైరాశ్యంలోకి నెట్టేసింది. 1-2తో పరాజయం పాలైన అర్జెంటీనా ప్రపంచకప్ చరిత్రలో అత్యంత అనూహ్య పరాజయం చవిచూడగా.. సౌదీ అరేబియా విజయంతో ఆ దేశ అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. అర్జెంటీనా తరఫున సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ (పదో నిమిషం) పెనాల్టీ కిక్‌తో గోల్ కొట్టగా.. సౌదీ అరేబియా తరఫున అల్ షెహరి (48వ నిమిషం), అల్ దవాసరి (51వ నిమిషం) గోల్స్ కొట్టారు. గ్రూప్-సి తదుపరి మ్యాచుల్లో శనివారం మెక్సికోతో అర్జెంటీనా, పోలాండ్‌తో సౌదీ అరేబియా తలపడనున్నాయి.
అతిపెద్ద సంచలనం : ఫిఫా ప్రపంచకప్ కోసం ఖతార్‌కు చేరుకునే ముందు అర్జెంటీనా ప్రదర్శన పూర్వ వైభవాన్ని తలపించింది. ఐదు మ్యాచుల్లో ఏకంగా 16 గోల్స్ కొట్టిన అర్జెంటీనా.. ప్రత్యర్థికి ఒక్క గోల్‌నూ కోల్పోలేదు. 2019 కోపా అమెరికా కప్ ఫైనల్లో బ్రెజిల్ చేతిలో ఓటమి చెందిన అనంతరం అర్జెంటీనా మళ్లీ పరాజయం చవిచూడలేదు. దీంతో ఖతార్‌లో కప్పు కోసమే అర్జెంటీనా అడుగుపెట్టినట్టు భావించారు. లియోనల్ మెస్సీ చివరి ప్రపంచకప్ రూపంలో భావోద్వేగం సైతం ఆ జట్టుకు తోడైంది. మ్యాచ్ ప్రథమార్థం అర్జెంటీనా ఆధీనంలో నడిచింది. ఆరంభంలోనే సౌదీ అరేబియా గోల్ పోస్ట్‌పై భీకర దాడులు చేసిన అర్జెంటీనా మూడు గోల్స్ చేసినా ఆఫ్‌సైడ్ రూల్‌తో ఫలితం లేకుండా పోయింది. పదో నిమిషంలో లియోనల్ మెస్సీ ఫ్రీ కిక్కు పెనాల్టీ లభించింది. వీఏఆర్ సమీక్షతో రిఫరీ పెనాల్టీ అందించగా.. లియోనల్ మెస్సీ వరుసగా ఐదో ప్రపంచకప్‌లో గోల్ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంతిని అధిక శాతం నియంత్రణలో నిలుపుకున్న అర్జెంటీనా ప్రథమార్థం ముగిసేసరికి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
ద్వితీయార్థం ఆరంభంలో సౌదీ అరేబియా.. అర్జెంటీనాతో సాకర్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. అర్జెంటీనా డిఫెండర్లు సైతం ఎదురుదాడి చేస్తూ సౌదీ అరేబియా గోల్ పోస్ట్ వైపు దూసుకెళ్లగా.. చిక్కిన అవకాశంతో అల్ బ్రికన్ నుంచి వచ్చిన పాస్‌ను అందుకున్న అల్ షెహరి లో గోల్‌తో అదరగొట్టాడు. అల్ షెహరి మెరుపు గోల్‌తో స్కోర్లు సమం అయ్యాయి. సౌదీ అరేబియా సంచలన మోత అక్కడితో ఆగలేదు. 53వ నిమిషంలో అల్ దవసరి మరో గోల్‌తో అర్జెంటీనాను నైరాశ్యంలోకి నెట్టాడు. ఆ తర్వాత ఓ వైపు గోల్‌పోస్ట్‌ను గట్టిగా కాపాడుకున్న సౌదీ అరేబియా.. మరోవైపు ఎదురుదాడి సైతం కొనసాగించింది. బలమైన ఎటాకింగ్ కలిగిన అర్జెంటీనా అదనపు సమయంలో సైతం గోల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1-2తో అర్జెంటీనా ఓటమితో ఫిఫా ప్రపంచకప్ వేటను ఆరంభించింది. సౌదీ అరేబియాకు ప్రపంచకప్‌లోనే కాదు ఆ జట్టు చరిత్రలోనే అదే అతిపెద్ద విజయం కావటం గమనార్హం. ఇక ఈ ఓటమి నుంచి అర్జెంటీనా అభిమానులు ఊరట పొందే అంశం.. 42 ఏండ్ల క్రితం ఆ జట్టు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు సైతం గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. ఇక ప్రపంచకప్‌లో అర్జెంటీనాను ఓడించిన జట్లు (2014 జర్మనీ, 2018 ఫ్రాన్స్) విజేతలు నిలిచాయి.
డెన్మార్క్, ట్యూనిషియా పోరు డ్రా
ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్-డి ఆరంభ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మంగళవారం సాయంత్రం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో డెన్మార్క్, ట్యూనిషియాలు గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. 62 శాతం బంతిని నియంత్రణలో ఉంచుకున్న డెన్మార్క్ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై 11 సార్లు దాడి చేసింది. ఇక ట్యూనిషియా ఏకంగా 13 సార్లు గోల్ కోసం ప్రయత్నించింది. 90 నిమిషాల పూర్తి ఆట అనంతరం అదనపు సమయంలో నూ గోల్ చేయటంలో ఇరు జట్లు విజయవం తం కాలేదు. దీంతో ట్యూనిషియా, డెన్మార్క్‌లు చెరో పాయింట్‌తో సంతృప్తి చెందాయి.